మట్టిలోంచి వచ్చిందే మానవ దేహం అనే నిజం తెలుసుకుంటే దాన్ని కాపాడుకోగలమని ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని కాపాడుకోకపోతే మనం కూడా ఆ మట్టిలోనే కలిసిపోవాల్సి ఉంటుందంటున్నారు. మట్టిలో కలిసిపోయినప్పుడు మట్టి.. మనం ఒకటే అనే విషయం తెలుస్తుందన్నారు. ఇప్పటికైనా మట్టి విలువను తెలుసుకుని దాన్ని సరిగా కాపాడుకోవాలని జగ్గీ వాసుదేవ్‌ సలహా ఇస్తున్నారు.

మొక్కలు, జంతువుల నుంచి మాత్రమే మనకు ఆర్గానిక్‌ పదార్థాలు లభిస్తాయని జగ్గీ వాసుదేవ్‌ గుర్తుచేశారు. మొక్కలు, జంతువులను వ్యవసాయంలో వినియోగించకపోతే.. వచ్చే 40 లేదా 50 ఏళ్లలోనే వ్యవసాయమే అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిచారు. సహజసిద్ధ వ్యవసాయం చేయకుండా రసాయనాలే వాడతాం అంటే.. భూసారం చచ్చిపోతుందని విషయం పదే పదే ఆయన గుర్తుచేస్తున్నారు. అందుకే ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాన్ని మళ్లీ మనం వెనక్కి తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.మనం చేసే వ్యవసాయంలో పంట దిగుబడి పెద్దగా రాకపోయినా.. ఆ పంటకు సంబంధించిన మిగులు పదార్థాలు భూమి లోపలికి వెళితే నేల జీవవంతం అవుతుందని చెబుతున్నారు. చెట్ల నుంచి వచ్చే ఆకులు, వేర్లు మొదలు ప్రతి దాన్నీ భూమిలో ఉండే జీవులు తింటాయని, అలాంటి జీవులు తినేందుకు ఆహారం లేకపోతే మరణిస్తాయన్నారు. జీవులు చనిపోయిన భూమి నిస్సారం అయిపోతుందని హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉందని జగ్గీ వాసుదేవ్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మన దేశంలోని భూమిలో సేంద్రీయ పదార్థాలు సున్నా పాయింట్ 6 శాతం మాత్రమే ఉన్నాయని జగ్గీ వాసుదేవ్‌ చెప్పారు. భూమి లోపల అంత తక్కువ సేంద్రీయ పదార్థాలు ఉండడం అంటే ఎడారిగా మారిపోతున్నట్లే కదా అంటున్నారు. భూమిలో కనీసం 3 శాతం అయినా సేంద్రీయ పదార్థాలు ఉండాలని చెప్పారు. సేంద్రీయ పదార్థాలు 8 నుంచి 10 శాతానికి భూమిలో పెరిగితే.. నీటి అవసరం 30 శాతానికి తగ్గిపోతుందన్నారు. నేల జీవవంతంగా ఉన్నప్పుడు మాత్రమే నీటి వినియోగం తక్కువగా ఉందంటున్నారు. సేంద్రీయ పదార్థాలు లేని భూమి ఇసుకలా అయిపోతుందని, దాంట్లో నీరు నిల్వ ఉండే అవకాశం ఉండదని చెప్పారు. ఒక్కసారి వర్షం కురిస్తే.. జీవవంతమైన భూమిలో ఆ వర్షపు నీరు 30 నుంచి 40 రోజుల పాటు అలాగే ఉంటుందన్నారు. అలా భూమిలోపల నీరు ఉన్నప్పుడే మొక్కలు, చెట్లు, పంటలు సమృద్ధిగా పెరుగుతాయన్నారు.మట్టిని జీవవంతంగా ఉంచేందుకు ప్రభుత్వం ఒక విధానం తీసుకువస్తే.. రైతులు తప్పకుండా మట్టిని కాపాడుతారని జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని రక్షిస్తే.. ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం విధాన నిర్ణయం ప్రకటిస్తే.. రైతులు భూమిలో ఆర్గానిక్‌ పదార్థాలను తప్పకుండా అభివృద్ధి చేస్తారన్నారు. ఆర్గానిక్‌ విధానంపై కేవలం బోధిస్తే, ఉపన్యాసాలు చెబితే జనం ఆచరించే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటేనే మట్టి రక్షణ సక్రమంగా జరుగుతుందన్నారు. భూమిలో ఆర్గానిక్‌ పదార్థాన్ని ఇంత శాతం పెంచితే.. ఇంత మొత్తంలో డబ్బులు ఇస్తామని ప్రభుత్వం విశ్వాసం కల్పిస్తే.. రైతులు తప్పకుండా ఆ దిశగా కృషి చేస్తాన్నారు. మట్టి శక్తివంతంగా ఉంటే.. రైతుకే కదా ఎక్కువ లాభం అని చెప్పారు.

పట్టణాలు, నగరాల్లో నివసించే వారు మాత్రమే ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారని జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. అయితే.. పట్టణాలు, నగరాల్లో ఉండే వారు వ్యవసాయం చేసే అవకాశం తక్కువ అన్నారు. ఎరువులు, పురుగు మందుల్ని వాడొద్దని తాను పూర్తిగా చెప్పడం లేదన్నారు. ఒక రైతు తన పొలంలో రసాయన ఎరువులు, పురుగు మందులు వాడుతున్నాడంటే.. దాని అర్థం ఆ నేలలో సారం లేదని గుర్తించాలన్నారు. భూమిలో సారం పెంచుకుంటూ ఉంటే.. ఆ క్రమంలో రసాయనాల వినియోగం తగ్గిపోతుందనే నిజం తెలుసుకోవాలన్నారు. అందుకే ఇప్పటికిప్పుడు రసాయన ఎరువులపై నిషేధం విధించాల్సిన అవసరం లేదన్నారు. రసాయన ఎరువుల వాడకాన్ని ఒక్కసారిగా నిషేధిస్తే.. ఆహార పదార్థాల ఉత్పత్తి 25 శాతానికి తగ్గిపోతుందని చెప్పారు. దీంతో పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారిపోయే ప్రమాదం ఉందన్నారు.రాగి, జొన్న లాంటి చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేవారు బలంగా ఉంటారని, ఆ పంటలు పండించిన భూమి కూడా బలంగా మారుతుందని జగ్గీ వాసుదేవ్‌ చెప్పారు. ఈ సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించిన విషయం ఆయన ప్రస్తావించారు. కేవలం వరి, గోధుమలు మాత్రమే పండించాలనే విధానం భూమికి, మనకు కూడా చాలా నష్టం కలిగిస్తుందన్నారు. చిరుధాన్యాల ఆహారం పేదోళ్లు తినేదనే భావన సరికాదన్నారు. చిరుధాన్యాల ఆహారం తినే విధానం ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ తిరిగి ఆచరణలోకి వస్తోందన్నారు.

మన దేహానికి, జీవానికి మట్టే మూలం అని జగ్గీ వాసుదేవ్‌ అన్నారు. అందుకే కదా ‘మట్టి తల్లి’ అని చెబుతామన్నారు. మనల్ని కన్న తల్లికే తల్లి మట్టి అన్నారు. మనుషులకే కాకుండా అన్ని జంతు జీవాలకూ, చెట్లు చేమలకు ఏ ప్రాణికైనా మట్టి తల్లి అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. మట్టిలోంచే మనం వచ్చామని, అందుకే మన నేలతల్లిని మనం రక్షించుకోవాలని జగ్గీ వాసుదేవ్‌ సలహా ఇస్తున్నారు.నేలతల్లిని సంరక్షించకపోతే మట్టిలో ఉండే జీవులు చనిపోతాయని, తద్వారా క్రమేపీ  మానవుల మనుగడ కూడా ఉండదని జగ్గీ వాసుదేవ్‌ చెప్పారు. ప్రపంచ జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ఈ కాలంలో రసాయన ఎరువులు వాడకపోతే.. అందరికీ ఆహారం అందడం సాధ్యం కాదంటున్న జగ్గీవాసుదేవ్‌.. సహజసిద్ధ వ్యవసాయంతోనే ఆరోగ్యం కలుగుతుందంటున్నారు. భూమి లోపలి జీవులు సహజంగా అందే ఆకులు, ఆవుపేడ ఇలాంటి వాటినే ఆహారంగా తీసుకుంటాయన్నారు. అయితే.. పంటలకు వాడే విష రసాయనాల ధాటికి భూమిలోని జీవులు చనిపోతాయని, దాంతో మనకు మేలు చేసే ఎన్నో జీవులు అంతరించిపోయి, మట్టిలో జీవం తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దాంతో మట్టిలో జీవం తగ్గిపోతుందని చెప్పారు.నేల జీవవంతంగా ఉండాలని జగ్గీ వాసుదేవ్‌ చెబుతున్నారు. మట్టిని మన పెద్దలు మనకు జీవవంతంగా ఇచ్చారని, మన భవిష్యత్‌ తరాలకు కూడా మనం ఆ మట్టిని జీవవంతంగా ఇవ్వాలని జగ్గీ వాసుదేవ్‌ సలహా ఇచ్చారు. సహజ వ్యవసాయ విధానాన్ని వెనక్కి తేవడానికి అతి సహజమైన విధానం కవర్ క్రాప్‌ అంటున్నారీ ఆధ్యాత్మిక గురువు. జగ్గీ వాసుదేవ్‌ సొంతూరు మైసూర్‌. అయితే.. 66 ఏళ్ల ఈ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌ కోయంబత్తూరులో ఆధ్యాత్మిక ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నారు. 30 ఏళ్లుగా పర్యావరణంపై ఉద్యమాలు, ఉపన్యాసాలు చెబుతున్న జగ్గీ వాసుదేవ్‌ ప్రస్తుతం ‘సేవ్‌ సాయిల్‌’ నినాదంతో బైక్‌ మీద ప్రపంచ యాత్ర చేస్తున్నారు. ఇప్పటికే మట్టిని కాపాడతామని 74 దేశాలు సంతకాలు చేశాయని చెప్పారు. గురువుగారి ప్రాణం పోయాక అయినా అందరూ మట్టి రక్షణకు నడుం బిగిస్తారనే ఆశాభావం జగ్గీ వాసుదేవ్‌ వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here