వెరైటీ పంటల సాగు చేయాలనుకునే ఔత్సాహిక రైతులకు చెన్నై చిక్కుడు సాగు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. దీనికి వినియోగదారుల నుంచి ఎక్కువ డిమాండ్‌ కూడా ఉంది. ఈ చిక్కుడుకు చెన్నైలో ఎక్కువ వినియోగం ఉంటుంది కనుక దీనికి చెన్నై చిక్కుడు అనే పేరు వచ్చింది.

చెన్నై చిక్కుడు విత్తు నాటిన 45 నుంచి 50 రోజుల్లోనే పంట కోతకు వస్తుంది. ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఐదు నెలల పాటు పంట దిగుబడి ఉంటుంది. ఎకరం నేలలో ప్రతి కోతకు టన్ను దిగుబడి వస్తుంది. ఎకరా చెన్నైచిక్కుడు సాగుకు 50 నుంచి 60 వేలు నికర ఖర్చు ఉంటుంది. వీటితో పాటు రవాణా, కూలీలు, మందులు సహా అన్నీ కలుపుకుని రెండు లక్షల ఖర్చు అనుకున్నా ఎకరాకు టన్నుకు రూ.7 లక్షల నికర లాభం ఉంటుంది. టన్ను చెన్నై చిక్కుడుకు తక్కువలో తక్కువ అంటే టన్నుకు 30 వేలు ధర వచ్చినా ఐదు నెలల్లో రూ.9 లక్షల ఆదాయం ఉంటుంది. చెన్నైచిక్కుడు సాగుకు చేసే ఖర్చు మొదటి రెండు కోతల్లోనే వచ్చేస్తుంది. ఆపైన వచ్చే దిగుబడి అంతా కాసుల లాభం కురిపిస్తుంది.సత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామంలో రైతు నరేష్‌ చెన్నై చిక్కుడు సాగుతో ఆనందంగా ఉన్నాడు. చెన్నై చిక్కుడుతో పాటుగా కోళ్ల ఫారం కూడా నరేష్‌ నిర్వహిస్తున్నాడు. బీకాం కంప్యూటర్స్‌ డిగ్రీ చేసిన నరేష్‌ ఉద్యోగం కంటే వ్యవసాయం మీదే తనకు ఆసక్తి ఎక్కువ అంటున్నాడు. ఉన్నత చదువులు చదివి, వ్యవసాయం పట్ల ఇంటరెస్ట్‌ ఉన్న యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కొత్తకొత్తగా వ్యవసాయం చేయడం, కొత్త పంటలు సాగుచేయడం తనకు ఇష్టం అన్నాడు. అందుకే ఉన్నత చదువుల కన్నా, ఉద్యోగం కన్నా వ్యవసాయం అంటే తనకు ఇష్టం అని నరేష్‌ చెబుతున్నాడు.కదిరి ప్రాంతంలో కొందరు రైతులు చెన్నై చిక్కుడు పంట సాగుచేస్తుంటే.. తాను స్వయంగా వెళ్లి సాగు విధానాలు పరిశీలించానని, ఆ రైతుల అనుభవాలు తెలుసుకున్నానన్నాడు. చెన్నై చిక్కుడుకు ఉన్న డిమాండ్‌ గురించి తెలుసుకున్నానని నరేష్‌ చెప్పాడు. లాభసాటి పంట కనుకే తాను చెన్నైచిక్కుడు సాగు చేస్తున్నానన్నాడు. చెన్నై చిక్కుడు ఐదు నెలల పాటు మంచి దిగుబడి ఇస్తుందని అన్నాడు. ధర కొంచెం ఎక్కువ తక్కువ అయినా రైతుకు నష్టం రాదని నరేష్‌ ధీమాగా చెప్పాడు. నల్లరేగడి, ఎర్రమట్టిలో కూడా చెన్నైచిక్కుడు సాగుకు అనుకూలం అన్నాడా. చెన్నై మండివాళ్లే చిక్కుడు విత్తనం సరఫరా చేస్తారని, పంట ఎక్కడ వేసినా వారే వచ్చి మార్కెట్‌ ధరకు తీసుకుంటారన్నాడు. పంట కొనుగోలు చేసినప్పుడు విత్తనాల ధర తగ్గించుకుని మన డబ్బులు మనకు ఇస్తారని అన్నాడు. ఒకరి కంటే ఎక్కువ మంది రైతులు చెన్నై చిక్కుడు సాగుచేస్తే.. మండివాళ్లు మరింత ఎక్కువ ఆసక్తితో కొనుగోలుకు వస్తారన్నాడు. తమ గ్రామం నుంచి చెన్నైకి చిక్కుడు తీసుకెళ్లేందుకు కిలోకు నాలుగు రూపాయలు రవానా చార్జి అవుతుందన్నాడు. ఈ రకం చిక్కుడు 80 శాతం చెన్నై వెళ్తుందని, 20 శాతం పంట బెంగళూరు, ఇతర నగరాల్లో వినియోగం అవుతుందన్నాడు.చెన్నైచిక్కుడు సాగు కోసం పొలాన్ని బాగా దుక్కి దున్ని తమ కోళ్ల ఫారం నుంచి వచ్చే ఎరువునే వేస్తున్నామని నరేష్‌ చెప్పాడు. రెండు మూడు రోజులు కోళ్ల ఫారం ఎరువును బాగా కలిపి, డ్రిప్‌ పైపులు పరుస్తామన్నాడు. ఎకరా నేలకు 8 కిలోల చెన్నై చిక్కుడు విత్తనాలు పడతాయన్నాడు. చెన్నై చిక్కుడులో రెండు మూడు వెరైటీలు ఉన్నా.. మంచి దిగుబడి వచ్చే ‘అంకుర్‌ గోల్డ్‌’ రకం చిక్కుడు తాను సాగు చేస్తున్నానన్నాడు. ఈ విత్తనాలు కిలోకు రూ. 600 ధర ఉంటుందన్నాడు. కదిరిలో కూడా చెన్నై చిక్కుడు విత్తనాలు దొరుకుతాయని తెలిపాడు. అంకుర్ గోల్డ్‌ చిక్కుడు 45 నుంచి 50 రోజుల్లో తొలి కాపు కోతకు వస్తుందని నరేష్‌ వెల్లడించాడు.చెన్నై చిక్కుడు విత్తనాలను నాలుగు అడుగుల దూరంలో పెడుతున్నారని నరేష్‌ చెప్పాడు. అయితే.. స్థలాన్ని ఎక్కువ వేస్ట్ కాకూడదని తాను మూడు అడుగుల దూరంలో పెట్టానన్నాడు. విత్తనాల వరుసల మధ్య అడుగు దూరం ఉండాలన్నాడు. ఎర్రనేల కన్నా నల్లరేగడి మట్టిలో అయితే.. ఇది మరింత అధికంగా దిగుబడి వస్తుందని నరేష్‌ వెల్లడించాడు. నేలలో విత్తు నాటిన నాలుగు రోజులకే మొలక వస్తుందన్నాడు. విత్తు నాటిన పది రోజుల వరకు పొలంలో ఏమీ చేయకుండా అలాగే విడిచిపెట్టాలని చెప్పాడు. పది రోజుల తర్వాత మొక్కలకు పురుగుల బెడద రాకుండా ఇసుకలో కలిపి ఎకరాకు మూడు ప్యాకెట్ల గుళికలు చల్లుతామన్నాడు. ముప్పై రోజుల తర్వాత మొక్కలకు 19:19:19 ఎరువు, సల్ఫేట్‌ ను డ్రిప్‌ ద్వారా అందిస్తామన్నాడు. అలా తాము ఐదు రోజులకోసారి డ్రిప్‌ మందులు వేస్తున్నట్లు నరేష్‌ వెల్లడించాడు.పంట కటింగ్‌ కు కటింగ్‌ కు మధ్య ఒకసారి మాత్రమే డ్రిప్‌ మందులు వేస్తామని నరేష్‌ తెలిపాడు. చెన్నై చిక్కుడు పంటకు మందులు ఎలా వేయాలో, ఏమేమి వేయాలో సీడ్‌ అమ్మిన దుకాణదారుల నుంచి, వ్యవసాయ శాస్త్రవేత్తల నుంచి కూడా సూచనలు, సలహాలు తీసుకోవచ్చన్నాడు. మొక్కల్ని అప్పుడప్పుడు ఫొటో తీసి పంపిస్తే.. ఏదైనా వ్యాధి ఉంటే ఎలాంటి మందు వాడాలో వారు సూచిస్తారన్నాడు. నాలుగు వేల రూపాయల ధర ఉండే ఆయిల్‌ క్యాన్‌ మందు కొడితే.. చెన్నైచిక్కుడు మొక్కలకు ఎక్కువ కొమ్మలు వస్తాయని, దాంతో మరింత ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని నరేష్‌ వివరించాడు. చెన్నై చిక్కుడుకు డిసీజ్‌లు అంతగా రావన్నాడు. ఆకు పురుగు బెడద ఒక్కటే ఉంటుందని, రన్‌, బైలెట్‌ పురుగు మందులు కలిపి పంటకు ఒక్కసారి స్ప్రే చేస్తే ఆకు పురుగు బెడదే ఉండదని వెల్లడించాడు.

చెన్నై చిక్కుడు పంటను ఏ కాలంలో అయినా వేసుకోవచ్చని, అయితే.. మార్చి నెలలో పంట వేస్తే మేలని నరేష్‌ సూచించాడు. పొలంలో తాము బెడ్‌ వేయలేదన్నాడు. వర్షం ఎక్కువ కురిసినప్పడు ఎర్రనేలలో ఇబ్బంది ఉండదని, నల్లరేగడిలో అయితే.. నీరు కొద్దిగా నిల్వ ఉన్నా సమస్య ఉండదన్నాడు. నీరు ఎక్కువ నిల్వ ఉంటే కొద్ది ఇబ్బంది వచ్చే అవకాశం ఉందన్నాడు.చెన్నై చిక్కుడు తొలిసారి కటింగ్‌ వచ్చినప్పటి నుంచి ప్రతి ఐదు రోజులకు ఒకసారి చొప్పున ఐదు నెలల దాకా దిగుబడి వస్తూనే ఉంటుందని నరేష్‌ చెప్పాడు. అలా ప్రతిసారీ ఎకరానికి టన్ను దిగుబడి వస్తుందన్నాడు. కొందరు రైతులు ఏడు నెలల దాకా కూడా పంట తీస్తున్నారని చెప్పాడు. అలా నెలకు ఆరు టన్నుల పంట వస్తుందన్నాడు. అయితే.. కాయలు కోసిన ప్రతిసారి మందు స్ప్రే చేసుకోవాలన్నాడు. ఆ మందుకు ఎకరానికి రెండు వేల దాకా ఖర్చు అవుతుందన్నాడు.

టన్నుకు కనీసం 30 నుంచి 40 వేల రూపాయల ధర పలుకుతుందన్నాడు. ఒక్కోసారి ధర 50 నుంచి 60 వేల వరకూ కూడా ధర వచ్చిందన్నాడు. టన్నుకు 30 వేల రూపాయలు వచ్చినా చెన్నై చిక్కుడుతో లాభం ఎక్కువే అన్నాడు. ఒక ఎకరంలో చెన్నై చిక్కుడు సాగుకు 50 నుంచి 60 వేల దాకా ఖర్చు వస్తుందని, పంటలు కోసుకున్న తర్వాత ఏడు లక్షల లాభం కచ్చితంగా ఉంటుందని నరేష్‌ వివరించాడు.క్రాప్ అయిపోయే లోపు ఎకరాకు 30 టన్నుల దాకా దిగుబడి వస్తుందని, తక్కువ రేటు టన్నుకు తక్కువ 30 వేలు ధర వచ్చినా 9 లక్షల రూపాయల ఆదాయం వస్తుందని నరేష్‌ సంతోషంగా చెప్పాడు. చెన్నై చిక్కుడుకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది కనుక రైతుకు నష్టం వచ్చే ఛాన్సే లేదన్నాడు. ఒక ఎకరాలో చెన్నై చిక్కుడు సాగుకు ఖర్చులు పోగా కనీసం రూ. 7 లక్షలు నికర లాభం ఉంటుందన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here