రన్నింగ్‌ బనానా, పరుగెట్టే వెదురు… కొత్తగా ఉంది కదా?!.. కానీ ఇది నిజంగా నిజం! కర్ణాటక రాష్ట్రం మైసూరుకు మైసూరుకు 16 కిలోమీటర్ల దూరంలోని కలలవాడి గ్రామంలో ప్రకృతి పిపాసి, మొక్కల పెంపకంలో సవ్యసాచి ఏపీ చంద్రశేఖర్‌ ఇలాంటి జాతులతో ఒక సస్య సామ్రాజ్యం నిర్మించారు. ఇంద్రప్రస్థ పేరుతో 13 ఎకరాల్లో కళాత్మకమైన హరిత నందనవనాన్ని సృష్టించారు. మట్టితోనే జీవం, మట్టితోనే జీవనం ఉందని నమ్మిన సిద్ధాంతి. ఉద్యోగం కంటే వృత్తి గొప్పదని నిరూపించిన సత్యక్రాంతి. ప్రతి మొక్కలోనూ విశిష్ట గుణాన్ని గుర్తించిన జ్ఞాని. 40 ఏళ్లుగా వనమే ప్రపంచంగా, సేద్యమే శ్వాసగా ఆయన జీవిస్తున్నారు. కళాత్మక సస్య సామ్రాజ్యాన్ని నిర్మించారాయన. వన శిల్ప సౌందర్యానికి ఏపీ చంద్రశేఖర్‌ సృష్టించిన సహజ వనం గురించి తెలుసుకుందాం.ఏపీ చంద్రశేఖర్‌ 40 ఏళ్ల క్రితం మెకానికల్‌ ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం అంటూ వెంపర్లాడకుండా నేరుగా వనారణ్యం సృష్టించేందుకు నడుం బిగించారు. ప్రకృతి ధర్మాన్ని చక్కగా ఆకళింపు చేసుకున్న ఈ వనవాసి వనసాగుకు శ్రీకారం చుట్టారు. తమ క్షేత్రంలో ప్రతి 30 అడుగులకు ఒక దేశవాళీ కొబ్బరిమొక్క నాటారు చంద్రశేఖర్‌. కొబ్బరి మొక్కల మధ్య ఖాళీ లేని విధంగా వివిధ రకాల ఫల, పుష్పజాతుల మొక్కలుపెట్టారు. ఇప్పుడు చంద్రశేఖర్‌ సృష్టించిన ప్రకృతి వనారణ్యం 4 వేలకు పైగా వైవిధ్యమైన జాతులతో పచ్చదనంతో నిండిపోయింది. అరుదైన పువ్వులు, పొదలు, తీగలు, పండ్ల మొక్కలు చంద్రశేఖర్‌ సహజ వనంలో కనువిందు చేస్తున్నాయి. చంద్రశేఖర్‌ వనం మొక్కలకే కాకుండా వివిధ రకాల జీవరాశులకు పెన్నిధిలా మారింది.ఏపీ చంద్రశేఖర్‌ ప్రకృతి వనంలో 100 రకాల మామిడి, 200 రకాల టమాట, 50 రకాల వెదురు, 40కి పైగా ఆకుకూరలు, 20 రకాల నేరేడు.. ఇలా ఎన్నెన్నో విలక్షణమైన మొక్కలు, వింత వింథ ఫలాలు సహజసిద్ధంగా కనువిందు చేస్తున్నాయి. గోముఖ ఆకారంలో ఆకర్షణగా ఉండే వంకాయ, దానంతట అదే కదిలి పెరిగే అరటి, ఏడాది కాలంలో పరుగెట్టినట్లు వనమంతా విస్తరించే వెదురు మొక్కలు, చూయింగ్ గమ్‌ ఫ్రూట్‌ లాంటి పలు విశేషమైన .జాతుల మొక్కలు చంద్రశేఖర్‌ వనంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గోముఖ వంకాయలు తినేందుకు ఉపయోగపడవు. కానీ వాటిని అలంకారానికి వినియోగించుకోవచ్చు.సృష్టిలో పనికిరాని మొక్క అనేది ఏదీ ఉండదనేది ఏపీ చంద్రశేఖర్‌ ప్రగాఢమైన నమ్మకం. వినియోగించుకునే విధానం తెలిస్తే.. ప్రతీదీ ప్రయోజనమే అంటారాయన. మనం పిచ్చిమొక్కలు అనుకునే ఎన్నో మొక్కల ఆకులను ఈ హరిత పుత్రుడు ఆకుకూరలుగా వినియోగిస్తున్నారు. ఎంతో ఖరీదైన అనేక పంటలకు చంద్రశేఖర్‌ వద్ద ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు ఉన్నాయి. తన తోటలో పెరిగే కొన్ని రకాల ఆకులు, తీగలను వెల్లుల్లికి బదులుగా వినియోగిస్తారు. మినప పప్పు బదులుగా కొన్ని రకాల పూలు, ఆకులతో దోసెలు వేస్తారు. టమాటాలకు బదులుగా బ్లడ్‌ బెర్రీతో రసం, సాంబారు తయారు చేస్తారు. ఆల్ఫా ఆకులతో ఆకుకూర పప్పు వండుతారు. నేరేడు, పులకేశి ఆకులతో కూర వండుతారు. బహూనియా ఆకులతో చట్నీ, సబస్టెన్‌ ఫ్లమ్‌ పండుతో పచ్చళ్లు, మందార పూలతో జామ్‌, జ్యూస్ తయారు చేస్తారు. జెల్ ఫ్లవర్ ఆకులతో జుట్టుకు కండిషనర్‌ రూపొందిస్తారు. సుబాబుల్‌ ఆకులను మరికొన్ని ఆకులతో కలిపి వంట చేస్తారు. సుగంధ భరితమైన చందనం ఆకుల్లో పీచు పదార్థం లేదని, వాటిని నేరుగా తినవచ్చని అనుభవపూర్వకంగా చంద్రశేఖర్‌ చెబుతారు. చందనం ఆకులను దంచి, రసం తీసి పాయసం చేసుకోవచ్చని అంటారు. మిగిలిన పిప్పితో బెల్లం కలిపి స్వీట్‌ తయారు చేయొచ్చని చెబుతారు. సాంబారులో చందనం ఆకులు ఎక్కువ వేస్తే ఆ మేరకు మనం వాడే బియ్యం మోతాదె తగ్గుతుందంటారు. శ్రీగంధం బెరడుతో ఎర్రరంగుతో పాటు రోగాలకు మందు తయారు చేయొచ్చంటారు. పైకస్‌ హాలీ, మామిడి, కొబ్బరి ఆకులను ఆవులకు ఆహారంగా వేస్తారు. పైకస్ పాండా చెట్టు ఆకులను పశువులకు మేతగా వాడడమే కాకుండా దాని బెరడును మరిగిస్తే వచ్చే ఎర్రరంగుతో ఆహారానికి రంగుగా కూడా వినియోగిస్తారు. కనకచంపకం ఆకులను కొబ్బరినూనెతో కలిపి పరిమళ భరితమైన సెంట్ తయారు చేస్తున్నారు.ఏపీ చంద్రశేఖర్‌ తోటలోని అరుదైన మొక్కల్లో రన్నింగ్ బనానా చాలా ప్రత్యేకమైన వాటిలో ఒకటి. దాన్ని ఒక చోట నాటితే.. దానంతట అదే మరోచోటకి పాకి అక్కడ సహజంగా మొలిచి క్షేత్రం అంతా విస్తరిస్తుంది. ఈ రకం అరటిగెల మామూలు గెలల్లా కాకుండా ఆకాశం వైపు వేస్తుంది. దీని కాయలు తినలేం.. కానీ పువ్వు, కాడ తినొచ్చని చంద్రశేఖర్‌ చెబుతారు. అదే మాదిరిగా రన్నింగ్ బాంబూ కూగా చంద్రశేఖర్‌ ప్రకృతి వనంలో ప్రత్యేకమైనదే. ఒక రన్నింగ్ బాంబూ నాటితే మూడేళ్లలో ఎకరం నేలపై అది విస్తరిస్తుంది.చంద్రశేఖర్ సహజవనంలో లభించే ప్రతి దానికి వాల్యూ యాడెడ్‌, ఉప ఉత్పత్తుల తయారీ మరో ప్రత్యేకత. ఈ హరిత మిత్రుడు వనం నుంచి ప్రతి నిత్యం ఏదో ఒక పంట, లేదా పండు లభిస్తూనే ఉంటాయి. వాటిని యధాతథంగా కాకుండా ప్రతి పంటకు విలువ జోడించి, లేదా రకరకాల ఉప ఉత్పత్తులుగా రూపొందించి విక్రయిస్తారు. తన క్షేత్రం నుంచి లభించే ఆకులు, పూలు, పండ్లతో జామ్‌లు, జ్యూసులు, సబ్బులు, కొబ్బరి నూనె, పచ్చళ్లు, పౌడర్లు, చర్మ సంరక్షణ చూర్ణాలు లాంటి 250 రకాల ఉప ఉత్పత్తులు తయారుచేసి అమ్ముతారు. చంద్రశేఖర్‌ తయారు చేసే ఉత్పత్తులకు రుచి, నాణ్యత బాగుండడంతో వాటి కోసం నగరాల నుంచి కూడా కొనుగోలు దారులు విశేష సంఖ్యలో వస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here