నర్సరీ నుంచి మనం గులాబీ మొక్కలను తెచ్చుకునేటప్పుడు వాటికి చాలా పూలతో కనిపిస్తాయి. అలా ఎక్కువ పూలు ఉన్న గులాబీ మొక్కలను మనం ఎంతో ఇష్టంగా కొనుక్కుని తెచ్చి మన ఇంటి పెరట్లోనో, మిద్దెతోటలోనే నాటుకుంటాం. అయితే.. మనం నాటుకున్న తర్వాత ఆ మొక్కలకు తక్కువగా పూలు పూస్తుంటాయి. మనం కొనుక్కునే సమయంలో ఎక్కువ పూలు ఉన్నాయి కదా.. ఇప్పుడెందుకు తక్కువ పూలే వస్తున్నాయని మదన పడుతుంటాం. ఇందుకు రాయల్ గార్డెన్‌ యజమాని కుమారి ఓ చక్కని పరిష్కార చిట్కా చెప్పారు.  వంటి ఇంటిలో లభించే ఈ పదార్థంతో గులాబీ మొక్కలకు ఎక్కువ పూలు పూసేలా చేసుకోవచ్చంటారామె. ఇందుకు గులాబీ మొక్కలకు ఎక్కువ కొమ్మలు వచ్చేలా చేయడం మొదటి చిట్కా అంటారు.ఈ క్రమంలో గులాబీ మొక్క ఎక్కువ ఎత్తు ఎదిగిపోనివ్వకుండా ఎప్పటికప్పుడు ప్రూనింగ్‌ చేయడం ప్రధానమైన అంశం అని కుమారి వివరించారు. మొక్కకు పూసిన పూలను అలాగే వదిలేయకుండా పువ్వు నుంచి ఒక అంగుళం కిందికి కట్‌చేసుకోవాలన్నారు. అలా కట్‌ చేసిన చోట నుంచి రెండు కొత్త కొమ్మలు వస్తాయి. ఎన్ని పూలను ఈ విధంగా కట్‌ చేసుకుంటే అంతకు రెట్టింపు కొమ్మలు ఆ మొక్కకు కొత్తగా వస్తాయి. తద్వారా పూల దిగుబడి పెరుగుతుంది.గులాబీ మొక్కల్లో కొన్ని ఒక్కొక్క పువ్వు పూసేవి, గుత్తులు గుత్తులుగా పూసేవి ఉంటాయి. మనం మొక్కను ఎంపిక చేసుకునేటప్పుడే ఎక్కువ మొగ్గలు ఉండే మొక్కను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. గులాబీ మొక్కను ఎప్పుడూ పూర్తిస్థాయిలో సూర్యరస్మి ఉండే చోట మాత్రమే పెంచుకుంటే ఫలితం మరింత అధికంగా ఉంటుంది. అలాగే గులాబీ మొక్కకు పోసిన నీళ్లు ఎక్కువ అయితే.. ఆ నీరు బయటికి సక్రమంగా వెళ్లిపోయేలా పెట్టుకోవాలి. అంటే కుండీలో నీరు నిల్వ ఉండకూడదని కుమారి చెప్పారు. కుండీలో పైన ఉండే మట్టి ఎండినప్పుడు మాత్రమే నీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత గులాబీ మొక్కకు ఉండే నల్లటి మచ్చలు, ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు పూర్తిగా తీసేయాలి.గులాబీ మొక్కకు ప్రతి 15 రోజులకు ఒకసారి నీమ్‌ ఆయిల్ కానీ, ఆర్గానిక్‌ విధానంలోతయారు చేసిన పెస్ట్‌ కంట్రోల్‌ రసాయనాలు స్ప్రే చేయాలి. గులాబీ మొక్క మొదట్లో ఎక్కువ నీరు నిల్వ ఉండడం, ఫంగల్ ఇన్ఫెక్షన్‌ వల్ల ఎక్కువగా చనిపోతుంటాయి. గులాబీ మొక్కకు పెస్ట్‌ ఎక్కువ ఉంటే వారానికి ఒకసారి కానీ ఎక్కువ లేదంటే 15 రోజులకోసారి గాని లీటర్ నీటిలో పసుపుపొడి గానీ, దాల్చినచెక్క పొడి గాని మార్కెట్‌లో లభించే సాఫ్ ఫంగిసైడ్‌ పౌడర్‌ గానీ కలి స్ప్రే చేయాలి. గులాబీ మొక్క మొదలు కాండం వద్ద ఆకులు కానీ, చెత్త కానీ, కలుపు మొక్కలు కానీ లేకుండా చూసుకోవడం చాల ముఖ్యమైన విషయం. ఎందుకంటే గులాబీ మొక్క మొదట్లో ఉండే చెత్తా చెదారం వ్లలే ఫెస్ట్‌ సోకుతుందనేది గ్రహించాలి.ఇప్పుడు గులాబీ మొక్కకు ఎక్కువ పూలు రావడానికి మంచి ఎరువు.. అది కూడా మన వంట ఇంటిలోనే లభించే పదార్థంతో తయారు చేసి వేసే విధానం చూద్దాం. పూల మొక్కలకు నైట్రోజన్‌, ఫాస్పరస్‌, పొటాష్‌, అనేక మినరల్స్‌ అధికంగా ఉండే ఎర్ర కందిపప్పు అంటే మైసూర్ దాల్‌ను మిక్సీలో మెత్తని పౌడర్‌లా చేసుకోవాలి. ఉడకబెట్టిన కోడిగుడ్ల పెంకులు, వాడేసిన టీ పౌడర్‌ను రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి ఆ రెండింటినీ పౌడర్‌గా చేసుకోవాలి. ఈ రెండింటి మిశ్రమానికి ఎర్కకందిపప్పు పౌడర్ కలిపి మొక్కలకు వేసుకుంటే మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ కోడిగుడ్డు పెంకులు, టీపౌడర్ లేకపోయినా ఎర్ర కందిపప్పు పౌడర్ అయినా వినియోగించవచ్చు. లేదా వాడినది కాకుండా తాజా టీపొడిని అయినా వాడవచ్చు. ఇలా చేస్తే గులాబీ మొక్కల నుంచి చక్కని పువ్వులను గుత్తులు గుత్తులుగా పూయించవచ్చని కుమారి వివరించారు. ఈ మూడింటి మిశ్రమాన్ని మొక్క చుట్టూ ఉండే మట్టిని బాగా కలిపి చేసి వేయాల్సి ఉంటుంది. మొక్కకు కాస్త దూరంలో వేసి మట్టితో కప్పాలి. ఆపైన ఒకసారి నీరు ఇవ్వాలి. ఈ మిశ్రమాన్ని గులాబీ మొక్కలకే కాకుండా మరే ఇతర పూలమొక్కలకు వాడినా మంచి దిగుబడి ఇస్తాయి. ఏ ఎరువైనా శీతాకాలంలో మొక్కలకు ఉదయం 7 గంటల తర్వాత వేసుకోవాలి. ఇలా చేస్తే శీతాకాలంలో మొక్కలకు ఫంగస్‌ వచ్చే అవకాశం ఉండదు.ఏ పూలమొక్క అయినా తక్కువ పూయడానికి లేదా అస్సలు పూయకపోవడానికి ప్రధాన కారణం నీరు ఎక్కువ ఇవ్వడం అంటారు కుమారి. మొక్కకు మొగ్గలు వచ్చినా నీళ్లు ఎక్కువైతే రాలిపోతాయి. మొగ్గల సమయంలో మొక్కకు ఎంత తక్కువ నీళ్లు ఇస్తే అంత మంచింది. పూలమొక్కలకే కాకుండా కూరగాయలు, పండ్ల మొక్కలకు కూడా నీళ్లు ఎక్కువ ఇవ్వకూడదు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ మొక్క అయినా నిండుంగా కొమ్మలతో పూలు, పండ్లు, కాయగూరలు మనకు ఎక్కువగా ఇస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here