కొద్దిగా అల్లం రసం సేవిస్తే అజీర్ణం సమస్య తగ్గుతుంది. గ్యాస్‌, కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి పలు సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. వికారం, వాంతులు తగ్గిపోతాయి. అల్లంలో విటమిన్ సీ, జింక్‌, కెరోటినాయిడ్స్‌, ఐరన్‌, ఫాస్పరస్‌, కాపర్‌, మాంగనీస్, ఫైబర్‌, ప్రొటీన్లు ఉంటాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అల్లాన్ని పూర్వకాలం నుంచీ ప్రపంచ వ్యాప్తంగా ఔషధంగా, మసాలా దినుసుగా వినియోగిస్తున్నారు.అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. దానివల్ల మన శరీరంలోని అధిక ఆక్సీకరణ ఒత్తిడి వల్ల కలిగే రుగ్మతల నివారణకు అల్లం చాలా చక్కగా పనిచేస్తుంది. మన నాడీ వ్యవస్థ కణాలపై అల్లం బాగా పనిచేస్తుంది. అల్లం కండరాల నొప్పులను నివారిస్తుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. రక్తంలోని చక్కెర శాతాన్ని అల్లం తగ్గిస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్తుల్లో ఇన్సులిన్‌ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కీళ్లు, ఆర్థరైటిస్‌ నొప్పి తగ్గించేందుకు అ్లలం ఉపయోగపడుతుంది.  అల్లంలో ఉండే జింజెరోల్‌ దగ్గు, జలుబు, గొంతు నొప్పిల నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. మన బరువును తగ్గిస్తుంది. వృద్ధాప్యం కారణంగా వచ్చే పలు బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, జ్ఞాపకశక్తి, బలహీనతలను తగ్గించే చికిత్సలో అల్లాన్ని ఉపయోగిస్తారు. అల్లం బహుముఖ మసాలా. వంటల రుచిని పెంచుతుంది. నిత్యం మనం ఆహారంలో వినియోగించే అల్లం సాగును ఇంటిలోనే ఈజీగా ఎలా సాగుచేసుకోవచ్చో చూద్దాం.అల్లం సాగును ఇంటిలో పెంచుకునే ముందు ముందుగా తెలుసుకోవాల్సి విషయం ఉంది. అదేమంటే.. సాధారణంగా చాలా మంది అల్లం గడ్డను సాయిల్‌ మిక్స్‌లో పెడుతుంటారు. అలా పెట్టడం వల్ల అది కుళ్లిపోతుంది. అందుకే అల్లం సహా దుంపజాతి మొక్కలకు ఇసుకతో కూడిన మట్టినే వినియోగించాలి. గట్టిగా మారిపోయే మట్టి లేదా మరీ మెత్తగా ఉండే సాయిల్‌ మిక్స్‌లో పెట్టిన అల్లం దుంప కుళ్లిపోతుంది. మనం పంట సాగు చేయాలనుకునే అల్లం దుంపను ముందుగా ఒక కంటైనర్‌లో పెట్టుకుని, దానికి మొక్కలు వచ్చిన తర్వాత మంచి సాయిల్‌ మిక్స్‌ పెట్టిన వేరే కంటైనర్‌లోకి మార్చుకుంటే అల్లం ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది.ముందుగా ఒక చిన్న కంటైనర్ తీసుకుని దాని అడుగుభాగంలో రంధ్రాలు చేసుకోవాలి. కంటైనర్‌కు రంధ్రాలు లేకపోతే నీళ్లు ఎక్కువ నిల్వ ఉండి దాంట్లో పెట్టుకునే దుంపలు కానీ, కొమ్మలు గానీ మొక్కలు గానీ ఏదైనా సరే కుళ్లిపోతాయి. రంధ్రలు చేసిన కంటైనర్‌ లోపల పెంకు ముక్కలు కానీ, రాళ్లుకానీ అడ్డుపెట్టాలి. వాటిపైన రఫ్‌గా ఉండేది కాకుండా కాస్త మెత్తగా ఉండే ఇసుక వేసుకోవాలి. ఆ ఇసుకలో కణుపులు పెకి ఉండేలా అల్లం ముక్కలు పెట్టుకోవాలి. అల్లం ముక్కలు కంటైనర్ ఇసుకలో పెట్టుకున్న తర్వాత కంటైనర్ పై నుంచి కింది వరకు వచ్చేలా ఫుల్‌గా నీరు పెట్టాలి. ఆ తర్వాత రోజూ ఎక్కువగా నీరు పోయకుండా వారానికి ఒకసారి కంటైనర్‌లో నీరు చిలకరిస్తే సరిపోతుంది. అల్లం కణుపుల నుంచి 15 నుంచి 20 రోజుల్లో మొక్కలు వచ్చేస్తాయని రాయల్ గార్డెన్‌ కుమారి వివరించారు. ఇదే విధంగా మనం పసుపు, చామదుంపలు కూడా పెట్టుకుంటే దుంపలు బాగా వస్తాయి.ఇసుక కంటైనర్‌లో మొక్కలు వచ్చిన తర్వాత మొక్కలతో సహా అల్లం దుంపను దాన్ని నుంచి తీసి లోతు తక్కువ వెడల్పు ఎక్కువగా ఉండే మరో కంటైనర్‌లోకి మార్చుకోవాలని కుమారి తెలిపారు. ఈ పెద్ద కంటైనర్‌కు కూడా అడుగున ఎక్కువ రంధ్రాలు చేయాలి. పెద్ద కంటైనర్‌లో కూడా పెంకులతో గానీ, రాళ్లతో కానీ రంధ్రాలకు అడ్డు పెట్టాలి. దీంట్లో ఇసుక శాతం ఎక్కువ ఉండేలా సాయిల్‌ మిక్స్‌ తయారు చేసుకుని కంటైనర్‌లో వేసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్‌లో 50 శాతం తోట మట్టిని అంటే గార్డెన్‌ సాయిల్‌, 10 శాతం ఇసుక, 40 శాతం కంపోస్ట్‌ వేసి, దానికి కొంచెం వేపపిండి వేసి బాగా కలిపి కంటైనర్‌లో వేయాలని కుమారి వివరించారు.పశువుల ఎరువు వాడినట్లైతే దాన్ని ఆరు నెలలు పాతబడిన ఎరువు వేసుకుంటే ఫలితంగా మరింత ఎక్కువగా ఉంటుంది. వేపపిండి కలిపితే.. మట్టి నుంచి కానీ, కంపోస్ట్‌ నుంచి కానీ అల్లం మొక్కకు, దుంపకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా నివారిస్తుంది. తద్వారా పంట దిగుబడి మరింత అధికంగా ఉంటుంది. ఇవన్నీ కలిపిన సాయిల్ మిక్స్‌ నిల్వ చేసే కొద్దీ మరింత సారవంతంగా తయారవుతుందన్నారు. ఈ సాయిల్ మిక్స్ వాడిన ఏ మొక్క అయినా చాలా బలంగా పెరుగుతుంది. ఇలా అల్లాన్ని మన ఇంటిలోనే ఈజీగా పెంచుకోవచ్చని రాయల్ గార్డెన్ కుమారి వివరించారు.మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్‌లో అల్లం మొక్కలను దాని మొదలు దుంపను మిక్స్‌ లోపల ఉండేలా కొంచెం దూర దూరంగా నాటుకోవాలి. ఈ కంటైనర్‌లో కూడా పై నుంచి కిందికి వచ్చేసేలా నీరు ఫుల్‌గా పోయాలి. ఆ తర్వాత మొక్కల మొదట్లోని మట్టి ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే వారానికోసారి గాని పదిరోజులకు ఒకసారి గానీ పైన నీరు చల్లుకోవాలి. అల్లం మొక్కలతో ఉన్న కంటైనర్‌ను పూర్తిగా సూర్యరశ్మి తగిలే చోట ఉంచాలి. బాల్కనీలో గాని, నీడపట్టున గాని వాటిని పెట్టినట్లయితే.. గ్రోత్‌ ఎక్కువగా ఉండదు. ఆరు నుంచి 9 నెలల మధ్యలో అల్లంగా గడ్డలు బాగా ఎదిగి పంట చాలా అధికంగా దిగుబడి వస్తుందని కుమారి వెల్లడించారు. అల్లం మొక్కలు పైన ఎండిపోయినప్పుడు పంట హార్వెస్ట్‌కు వచ్చిందని మనం గ్రహించాలన్నారు. లేదా మనం పెద్ద కంటైనర్‌లో మొక్కలు నాటిన మొదలు ఆరు నుంచి 9 నెలల వరకు మొక్కల్సి పెంచుకుంటే మంచి పంట చేతికి వస్తుంది

 

 

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here