వరి సాగులో ఆదాయం ఆశించినంతమేర రాకపోవడంతో ఇప్పుడు రైతులు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అధిక ఆదాయం రాబట్టుకునేందుకు ఆక్వా కల్చర్‌, ఇతర పంటల పట్ల అన్నదాతలు ఆసక్తి పెంచుకుంటున్నారు. దాంతో దేశంలో వరి సాగు, ధాన్యం దిగుబడి బాగా తగ్గిపోయింది. అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం పండించేవారట అని భవిష్యత్తులో చెప్పుకోవాల్సి వస్తుందేమో. ఎప్పుడూ పచ్చటి వరిచేలతో చిలకాకుపచ్చ చీర కట్టినట్టుండే రాష్ట్రం ఇప్పుడు ఎక్కడ చూసినా చేపల చెరువులు, రొయ్యల చెరువులే దర్శనమిస్తున్నాయి. వరి పంట తగ్గిపోయిన కారణంగా బియ్యం ధరలు ఊహించనంతగా పెరిగిపోయాయి.అయితే.. తక్కువ నేలలో వరి సాగు చేసినా రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు ఎలాంటి టెక్నిక్స్‌ పాటించాలో తెలుసుకుందాం. ముందుగా వరి సాగు చేసే రైతులు కొందరు పొలంలో ఎక్కువ నీరు ఉంచితే ఎక్కువ పిలకలు వస్తాయనే అపోహలో ఉంటారు. వరి కూడా ఒక రకంగా కలుపుమొక్క జాతిది అని రైతులు తెలుసుకోవాలి. నీరు ఎక్కువైతే కలుపుమొక్కలు కుళ్లిపోయినట్లే వరిమొక్కలు కూడా పాడైపోయే అవకాశాలే ఎక్కువ ఉంటాయి. వరిపొలంలో నీటిని తగు మోతాదులో ఉంచితేనే పిలకలు ఎక్కువగా వస్తాయని మనం గ్రహించాలి. నీరు ఎక్కువ పెడితే ఎక్కువ పిలకలు వస్తాయనే అపోహ మాత్రమే అని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.వరి పంట నాటే ముందు అపరాలు, జనుము, జీలుగు, పిల్లిపెసర లాంటివి సాగుచేసి, దుక్కిలో దున్నుకుంటే భూమి బాగా సారవంతం అవుతుంది. తద్వారా సుమారుగా 20 నుంచి 25 నత్రజని, భాస్వరం, పొటాష్‌లు భూమిలో నిల్వ అవుతాయి. తద్వారా వరిదుబ్బు నుంచి పిలకలు అధికంగా వస్తాయి. దాంతో పాటుగా దేశీ ఆవులపేడ, పశువుల ఎరువు, లేదా కోళ్ల పెంటతో తయారు చేసిన సేంద్రీయ ఎరువును వాడినా వరిలో పిలకలు అధికంగా వస్తాయి. ఇలాంటివి వాడడం వల్ల వరిమొక్కకు వేర్లు బాగా అభివృద్ధి చెందుతాయి. తద్వారా పిలకలు కూడా ఎక్కువ వస్తాయి. దరిమిలా ధాన్యం దిగుబడి మనం ఆశించిన దానికన్నా అధికంగా వస్తుంది.వరినాట్లు వేసిన 15 నుంచి 45 రోజుల వరకు పిలకలు ఏర్పడే దశ. యూరియాతో ఆగ్రోమిన్‌ మాక్స్‌ లేదా ఫార్ములా ఫోర్‌ లేదా ఫార్ములా సిక్స్‌ లాంటి సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని కలిపి చల్లుకుంటే వరిలో పిలకలు ఎక్కువగా వస్తాయని వ్యవసాయ నిపుణులు, అనుభవజ్ఞలు చెబుతున్నారు. అలాగే బయోవిటా, సాగరిక లాంటి వాటిని ఇసుకలో కానీ, యూరియాలో కానీ కలిపి చల్లుకుంటే కూడా పిలకలు అధికంగా వస్తాయి. హ్యూమిక్‌ యాసిడ్‌ను స్ప్రే చేయొచ్చు. లేదంటే ఇసుకలో గానీ, యూరియాలో కానీ కలిపి చల్లుకున్నా పిలకలు బాగా వస్తాయి. వరిపొలంలో భూమికి గాలి ఆడేలా అడపా దడపా ఆరబెతుంటే కూడా పిలకలు ఎక్కువ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. బ్రాడ్‌ స్పెక్ట్రమ్‌ ఇన్‌సెక్టిసైడ్‌ క్లోలాంత్రిల్‌ నిలిప్రోల్‌ 18.5 SC మందును వరిపొలంలో చల్లుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మందు స్టొమాక్‌ పాయిజన్‌గా, కాంటాక్ట్‌ పాయిజన్‌గా పనిచేస్తుంది. ఈ మందును పురుగు తాకినా, తిన్నా కూడా ఆహారం తీసుకోకుండా చనిపోతుంది. వరినాటుకు పట్టే బియ్యం పురుగులు లేదా వేరు పురుగులు ఈ మందుతో పూర్తిగా నివారణ అవుతాయి. ఈ పురుగులు లేకపోతేనే వేరు వ్యవస్థ బలంగా ఏర్పడి పిలకలు ఎక్కువగా వస్తాయి.క్లోలాంత్రిల్‌ నిలిప్రోల్‌ మూల రసాయనం ద్రవం అయితే ఎకరానికి 60 ఎంఎల్‌, పౌడర్‌ అయితే.. 100 గ్రాములకు హ్యూమిక్‌ యాసిడ్‌ను 20 నుంచి 25 ఇసుకలో కలిపి వరి నాటిన 15 నుంచి 25 రోజుల లోపు పొలంలో కొద్దిగా నీరు ఉంచి చల్లుకుంటే పిలకలు అధికంగా వచ్చేందుకు తోడ్పడుతుంది. క్లోలాంత్రిల్‌ నిలిప్రోల్‌ 100 ఎంఎల్‌ రూ.350 వరకు ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్‌కు మరో రూ.150 ఖర్చు అవుతుంది. ఈ రెండూ కలిపితే రూ.500 వరకు మాత్రమే ఖర్చవుతుంది. అయితే.. ఈ మిశ్రమం వాడడం వల్ల వచ్చే ప్రయోజనం మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. భూమిలో సేంద్రీయ కర్బనం బలం కూడా ఉంటే ఈ మందు చల్లిన తర్వాత పూర్తి ఫలితం కనిపిస్తుంది. ఒక్కో వరి దుబ్బుకు 100 వరకు పిలకలు వచ్చే అవకాశం ఉటుంది.వరి పొలంలో నీరు ఉండగానే రైతులు సాధారణంగా నత్రజని ఎరువులు వేస్తారు. కానీ.. పొలంలో నీరు లేకుండా చేసి, భూమి తడిగా ఉండేలా చూసుకుని నత్రజని ఎరువులు చల్లుకుని 48 గంటల తర్వాతే నీరు పెట్టుకుంటే మంచిది. తద్వారా ఎరువులను మొక్కల వేళ్లు పూర్తిగా పీల్చుని బలంగా తయారవుతాయి. తద్వారా పిలకలు ఎక్కువగా వస్తాయి.అంతకు ముందు మనం వరిలో అధిక పిలకలు పొందలేకపోవడానికి గల కారణాలను విశ్లేషించుకుని అందుకు ఏంచేయాలో తెలుసుకుంటే మేలు. భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం సరైన మోతాదులో లేకపోవడం ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. చౌడు నేలల్లో వేసే వరి పంటకు కూడా పిలకలు చాలా తక్కువగా వస్తాయి. .జింక్‌ లోపం కూడా పిలకలు ఎక్కువ రాకపోవడానికి ఒక కారణంగా ఉంటుంది. పొలంలో మురుగునీరు నిల్వ ఉంచడం, ఆరుతడి పద్ధతి పాటించకపోవడం కూడా పిలకలు పెరగడానికి ఆస్కారం ఉండదు. దాంతో పాటు ముదిరిపోయిన నారును నాటుకోవడం కూడా మరో కారణం. సరైన సమయంలో ఎరువుల యాజమాన్యం పాటించకపోవడం కూడా పిలకలు ఎక్కవగా రాకపోవడానికి కారణం. వీటితో పాటు మనం ఎంచుకునే విత్తనాన్ని బట్టి కూడా పిలకలు ఎక్కువ, తక్కువ వచ్చేందుకు కారణం అవుతుంది.

ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే.. యాజమాన్య పద్ధతులు పాటిస్తే.. తక్కువ ఖర్చులోనే వరిలో అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులు గ్రహించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here