క్లోవ్‌ బీన్స్‌ అంటే లవంగం చిక్కుడు. ఇది చాలా మొండి జాతి మొక్క. చీడపీడలు, తెగుళ్లు అసలే రావు. విత్తనం నాటిన 65 నుంచి 70 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎలాంటి పురుగు మందులు, ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. పందిరి వేస్తే.. దాని మీదకు వెళ్తుంది. పందిరి లేకపోయినా నేల మీద కూడా సులువుగానే పాకుతుంది. లవంగం చిక్కుడు కాయలు కిలో 100 రూపాయల ధర పలుకుతుంది. ఇప్పటికే అనేక మంది టెర్రస్‌ గార్డెన్‌ రైతులు దీన్ని సాగు చేస్తున్నారు. టెర్రస్‌ గార్డెన్‌లో సాగుచేసే వారి ఇంటి అవసరాలకు సరిపోతుంది. లవంగం చిక్కడు పూర్తిగా సహజసిద్ధ పంట కాబట్టి ఎవరైనా దీన్ని తేలకపాటి నేలల్లో పెద్దమొత్తంలో కూడా వాణిజ్య విధానంలో పండించుకోవచ్చు. క్లోవ్‌ బీన్స్‌ గ్రీన్‌ మొక్క ఏడాది పొడవునా పెరుగుతుంది. కాకపోతే ఇది సీజనల్‌గా మాత్రమే పంట దిగుబడి ఇస్తుంది. జూన్‌, జులైలో విత్తనం నాటుకుంటే సెప్టెంబర్‌ నుంచి మూడు నెలల పాటు పంట ఇస్తుంది.చాలా అరుదైన లవంగం చిక్కుడును గ్రేవీ కూరగా వండుకోవచ్చు. లేదా వేపుడుగా కూడా తయారు చేసుకోవచ్చు. లవంగం చిక్కుడులో పీచుపదార్థం, విటమిన్‌ సీ, పొటాషియం, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. క్లోవ్‌ బీన్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పెద్ద మొత్తంలో లభిస్తాయి. క్లోవ్‌ బీన్స్‌ను ఎండబెట్టి పౌడర్‌గా చేసుకుని వాడితే జ్వరాన్ని తగ్గిస్తందని అనుభవజ్ఞులు, నిపుణులు చెబుతున్నారు. క్లోవ్‌ బీన్స్‌ మొక్క చాలా మొండిది. ఈ మొక్క రసాన్ని ఇతర మొక్కలపై చల్లితే వాటికి బగ్స్‌ బెడద ఉండదు. మనుషుల్లోని బ్లడ్‌ షుగర్ స్థాయిలను లవంగం చిక్కుడు నియంత్రిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.లవంగం చిక్కుడు చాలా పురాతనమైన పంటే. కాకపోతే సోషల్ మీడియా బాగా ప్రాచుర్యం పొందడంతో దీని గురించి ఇప్పుడిప్పుడే పలువురికి తెస్లోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాశిలో ప్రతినిత్యం లవంగం చిక్కుడు దొరుకుతుందని కొందరు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన యువరైతు ప్రగడ రాంబాబు లవంగం చిక్కుడు పంటను నాలుగు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. ఔత్సాహికంగా పలు రకాల కూరగాయలను ఆర్గానిక్‌ విధానంలో పండించి, స్వయంగా మార్కెటింగ్‌ చేస్తున్నారు రాంబాబు. వెరైటీ పంటలు పండించే ఆదర్శ రైతు రాంబాబు ఇటేవలే రైతునేస్తం అవార్డు పొందారు. రాజమండ్రి సమీపంలోని రాజానగరం మండలం నరేంద్రపురంలో రాంబాబు ఆర్గానిక్ విధానంలో పలు రకాల కూరగాయలు సాగుచేస్తున్నారు.హైదరాబాద్‌లో ఆర్గానిక్‌ విత్తనాలు సరఫరా చేసే రైతు నుంచి ఒక్కో క్లోవ్‌ బీన్స్‌ విత్తనం రూపాయికి కొన్నట్లు రాంబాబు తెలిపారు.  ముందుగా తాను ఒక సెంట్లలో మాత్రమే క్లోవ్‌ బీన్స్‌ విత్తనాలు నాటినట్లు చెప్పారు. అయితే.. దాని సీజన్‌ ఏమిటనే తెలియక మే నెలలోనే నాటినట్లు చెప్పారు. లవంగం చిక్కుడు విత్తనం గుండ్రంగా మందుబిళ్ల సైజులో ఉంటుంది. క్లోవ్‌ బీన్స్ తీగ మామూలుగానే ఎదిగిందని, కానీ శీతాకాలంలో అంటే సెప్టెంబర్‌ ఆఖరి వారంలో మాత్రమే కాయ కోతకు వచ్చిందని చెప్పారు. కొన్ని క్లోవ్‌ బీన్స్‌ను విత్తనాలకు విడిచిపెట్టి మరుసటి ఏడాది 10 సెంట్లలో మళ్లీ మే నెల మొదటిలో విత్తనాలు నాటినట్లు చెప్పారు. ఆ సంవత్సరం కూడా సెప్టెంబర్‌లోనే కాయ వచ్చిందని, దాంతో ఇది సీజనల్ పంట అని తనకు అర్థమైందన్నారు. సెప్టెంబర్‌ ఆఖరి వారంలో మొదలైన లవంగం చిక్కుడు డిసెంబర్‌, జనవరి నెలల వరకు అంటే నాలుగు నుంచి ఐదు నెలల పాటు కాస్తూనే ఉంటుందన్నారు.లవంగం చిక్కుడు చాలా మొండిజాతి. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం ఉండదని రాంబాబు చెప్పారు. చుట్టుపక్కల ఉండే ఇతర మొక్కలకు చీడపీడలు, తెగుళ్లు వచ్చినా క్లోవ్‌ బీన్స్‌కు ఏమాత్రం ఇబ్బంది ఉండదన్నారు. పురుగు రాదు, దోమ రాదు, తెగుళ్లు లేవు. దానంతట అదే ఎదుగుతుంది. దానంతట అదే కాస్తుంది. దానంతట అదే రాలిపోతుంది. దానంతట అదే మళ్లీ మొలుస్తుంది. కాస్త ఏదైనా ఆధారం ఇస్తే.. పైకి ఎగబాకుతుంది. లేదంటే నేల మీదే చక్కగా ఎదుగుతుంది. లవంగం చిక్కుడు సాగుకు జీరో మెయింటెనెన్స్‌ అన్నారు. ఎరువలు వేయక్కర్లేదు. కషాయాలు కూడా వాడాల్సిన పనిలేదు. రసం పీల్చే పురుగు కూడా దీని జోలికి రాదని రాంబాబు చెప్పారు. క్లోవ్‌ బీన్స్‌లో పోషకాల శాతం కూడా ఎక్కువే అని తనకు చెప్పిన అనుభవజ్ఞులు తెలిపారని రాంబాబు అన్నారు.క్లోవ్‌ బీన్స్‌ విత్తనాలను సాలుకు సాలుకు నాలుగు అడుగులు, విత్తనానికి విత్తనానికి మధ్య మూడు అడుగుల దూరంలో తాను పెట్టానన్నారు రాంబాబు. ఇది తీగజాతి కాబట్టి అంత దూరంలో విత్తు నాటినా మొత్తం ఆ ప్రదేశం అంతా విస్తరిస్తుందని చెప్పారు. లవంగం చిక్కుడును విక్రయించే విధానంలో 40 సెంట్లలో సాగు చేసినప్పుడు ప్రతి రోజు 30 నుంచి 40 కిలోల వరకు దిగుబడి వచ్చిందన్నారు. అలా నాలుగు నుంచి ఐదు నెలల పాటు పంట దిగుబది తీసినట్లు చెప్పారు. ఇతర కూరగాలతో పాటు తాను రాజమండ్రి నుంచి రాజానగరం వరకు ఉన్న కొన్ని గేటెడ్‌ కమ్యూనిటీలలో 700 నుంచి 800 మంది కస్టమర్లకు తామే స్వయంగా విక్రయిస్తామన్నారు. ముందుగా తమ పంటల తోటలోకి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి కొన్ని ఫ్యామిలీలు విహారం కోసం వచ్చి కొనుక్కునే వారన్నారు. అలా క్లోవ్‌ బీన్స్ ఒకసారి వినియోగించిన పలువురు కస్టమర్లు రిపీటెడ్‌గా తీసుకునే వారిని గుర్తించి, వారందరికీ ఒక వాట్సాప్‌ గ్రూప్ చేసినట్లు చెప్పారు. వారు తమకు కావలసిన కాయగూరలతో పాటు క్లోవ్‌ బీన్స్‌ కూడా ఆర్డర్ పెడుతుంటే తామే వారి వద్దకు జీరో మెయింటెనెన్స్‌, పొల్యూషన్ ఉండని బ్యాటరీ వాహనంలో తీసుకెళ్లి సరఫరా చేస్తున్నామన్నారు.లవంగం చిక్కుడు కాయలతో కూర వండుకుని తిన్న వినియోగదారులు చాలా బాగుందని చెప్పారని రాంబాబు చెప్పారు. ఎక్కువ మంది వినియోగదారులు ఇదే కాయగూరను ఇష్టపడుతున్నారని, ఇప్పుడు వారికి సరిపడినంతగా తాను సరఫరా చేయలేకపోతున్నట్లు చెప్పారు. అంటే లవంగం చిక్కుడుకు అంత డిమాండ్ ఉందని రాంబాబు చెప్పకనే చెప్పారు. లవంగం చిక్కుడు తెంపిన తర్వాత వారం రోజుల వరకు ఏమాత్రం పాడవకుండా నిల్వ ఉంటుంది. మామూలు రూం టెంపరేచర్‌లో ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం ఉండదు. కాకపోతే తీగ నుంచి కోసినప్పుడు లవంగం చిక్కుడు కాయ నుంచి పాలు కారతాయి. అయితే.. దాని వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదన్నారు. లవంగం చిక్కుడు తిన్నప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవన్నారు. క్లోవ్‌ బీన్స్‌ పంటను వినియోగదారులకు అలవాటు చేయడం కోసం తొలుత రైతు బజార్లకు కూడా ఇచ్చానన్నారు. దీని లుక్‌ చూసి వినియోగదారులు చాలా ఇష్టంగా తీసుకున్నారని చెప్పారు. క్లోవ్‌ బీన్స్ కాయపైన తొక్క తీసేస్తే దాంట్లో మూడు నుంచి నాలుగు చిక్కుడు గింజల్లానే తెల్లవి ఉంటాయన్నారు. వాటిని కూరగా వండుకోవచ్చన్నారు. క్లోవ్‌ బీన్స్ పూత విచ్చుకున్నప్పుడు చూడడానికి చాలా అందంగా కనిపిస్తుందన్నారు. క్లోవ్ బీన్స్ విత్తనాలు 100 నాటితే 60 నుంచి 70 మొక్కలు వచ్చాయని రాంబాబు చెప్పారు. క్లోవ్‌ బీన్స్ కాయలు కిలోకు 60 నుంచి 70 కాయలు తూగుతాయన్నారు. లవంగం చిక్కుడు కోసుకోవడం చాలా సులువే. బెండకాయను కోసినట్లే దీన్ని కూడా తీగ నంచి గిల్లుకోవచ్చు.

 

లవంగం చిక్కుడు కొత్త పంటేమీ కాదని, పూర్వకాలం నుంచి అక్కడక్కడా సాగు చేస్తున్నారని రాంబాబు చెప్పారు. కొత్తగా ఈ పంట సాగు చేయాలనుకునే వారికి ఎక్కువ మొత్తంలో తాను ఇప్పటికిప్పుడు సరఫరా చేయలేను కానీ, మిద్దెతోటల్లో పెంచుకునే వారికి ఇవ్వగలనన్నారు. క్లోవ్‌ బీన్స్ సాగుపై యూట్యూబ్‌లో కూడా చాలా వీడియోలు ఉన్నాయని, రైతువారీ విధానంలో పండించేది మాత్రం తక్కువ అని రాంబాబు చెప్పారు. నాలుగైదు రకాల కూరగాయలు సాగుచేసేవారు క్లోవ్‌ బీన్స్‌ను కూడా 10 సెంట్ల వరకు సాగుచేసుకోవచ్చని రాంబాబు తెలిపారు. ఇది మొండి జాతి కాబట్టి ఎలాంటి కష్టమూ, ఇబ్బందీ ఈ పంటతో రైతుకు ఉండదని తన అనుభవంతో చెప్పారు. చూడడానికి బాగా ఉంటుంది. సొంతంగా అమ్ముకునే వారికైతే మరింత లాభదాయకంగా ఉంటుందని రాంబాబు అన్నారు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here