తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. తెల్ల ఉల్లిగడ్డలో క్రోమియం, సల్ఫర్‌ మన రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తెల్ల ఉల్లిగడ్డలను క్రమం తప్పకుండా వాడితే చక్కెర వ్యాధి నియంత్రణలో ఉంటుంది. తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. తెల్ల ఉల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. కళ్లు, చెవి, ముక్కులలో ఇన్ఫెక్షన్‌ ఉంటే తెల్ల ఉల్లిని వాడితే తగ్గుతుంది. తెల్ల ఉల్లిలో విటమిన్ సి, కాల్షియం, ఐరన్‌ ఉంటాయి. తెల్ల ఉల్లిగడ్డ రసం తీసి జుట్టుకు నూనె మాదిరిగా రాసుకుంటే ఆరోగ్యంగా ఉంచుతుంది.  తెల్ల ఉల్లిగడ్డ రసాన్ని తేనెతో కలిపి తాగితే శ్వాసకోస సమస్యలు నయం అవుతాయి. ఉదర వ్యాధులను కూడా తెల్ల ఉల్లి తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అనేక ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. తెల్ల ఉల్లిని తింటే సగం జబ్బులు నయం అవుతాయని నిపుణులు చెప్పారు.

 

తెల్ల ఉల్లిగడ్డ 90 రోజుల పంట. ఆగస్టు 15 నుంచి 20వ తేదీ వరకు తెల్ల ఉల్లిగడ్డ సాగు ప్రారంభిస్తే.. నవంబర్ నెలాఖరు వరకు రెండో పంటగా చేతికి వస్తుంది. అంతకు ముందు మొదటి జూన్‌, జులై నెలల్లో మొక్కజొన్న, పసుపు వేసుకోవచ్చు. తెల్ల ఉల్లి పంట పూర్తయిన తర్వాత ఎర్రజొన్న వేసుకోవచ్చు. ఈ పంట మార్చి వరకు పూర్తయిపోతుంది.జనవరి నెలలోనే రైతులు చాలా సన్నగా ఉండే తెల్ల ఉల్లిగడ్డ విత్తనాలను నారు పోసుకుని, దాన్నుంచి వచ్చిన చిన్న చిన్న తెల్ల ఉల్లిగడ్డలను మూడు నెలల పాటు నిల్వ చేసుకోవాలి. తెల్ల ఉల్లిగడ్డ విత్తనం ఒక్కో ఎకరానికి మూడున్నర కిలోలు పడుతుంది. కిలో తెల్ల ఉల్లిగడ్డ విత్తనం ధర రెండు వేల రూపాయల వరకు ఉంటుంది. తెల్ల ఉల్లి విత్తనం కొనుగోలుకు ఎకరానికి 7 నుంచి 8 వేలు అవుతుంది. నారు పోసి చిన్న గడ్డలు నిల్వ చేయడానికి సుమారు రూ.20 వేలు ఖర్చు వస్తుంది. భూమి దున్నేందుకు, విత్తనం నాటేందుకు కూలీలకు కలిపి మొత్తం మరో రూ.30 వేలు అవుతుంది.ఆగస్టు నెలలో తెల్ల ఉల్లిగడ్డలను పొలంలో రెండు అడుగుల దూరంలో చిన్న చిన్న బోదెలు కొట్టుకుని బోదెలకు అటువైపు ఇటు వైపు అర అడుగు దూరంలో నాటుకోవాలి. 15 రోజులకు ఒకసారి కాల్వల ద్వారా నీరు పారించాలి. తెల్ల ఉల్లి పంటకు నీరు ఎక్కువ, తక్కువ కాకుండా బ్యాలెన్స్‌డ్‌ గా సరఫరా చేయాల్సి ఉంటుంది. నీరు ఎక్కువ అయితే.. తెల్ల ఉల్లిగడ్డలు పచ్చగా మారిపోతాయి. పచ్చగా మారిన తెల్ల ఉల్లికి మార్కెట్‌లో ధర పలకదు.తెల్ల ఉల్లి పంటకు తెగుళ్లు సోకకుండా మధ్య మధ్యలో నాలుగైదు సార్లు స్ప్రేలు కొట్టాల్సి ఉంటుంది. తద్వారా ఉల్లి ఆకు మీద మచ్చలు, తెగుళ్లు రాకుండా చూసుకోకపోతే. పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా తెల్ల ఉల్లి పంటను పరిశీలించుకోవాల్సి ఉంటుంది. తెల్ల ఉల్లి మొక్కల ఆకులు చుట్టుకుపోయి, గడ్డ కుళ్లిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా గమనించుకుని, వ్యవసాయ అధికారులకు సంప్రదిస్తే.. వారు వచ్చి ఏ రకం మందు స్ప్రే చేయాలో చెబుతారు. వారు చెప్పిన మందు స్ప్రే చేస్తే తెగులు పోతుంది. పంట దిగుబడి పెరుగుతుంది.మొదటి పంట మొక్కజొన్న, పసుపు సాగు చేసినప్పుడు పశువుల ఎరువు వేస్తే సరిపోతుంది. తెల్ల ఉల్లి రెండో పంట కాబట్టి కాంప్లెక్స్ ఎరువులు ఎకరానికి ఒకటి లేదా రెండు బస్తాలు వేసుకోవాల్సి ఉంటుంది. ఎకరం తెల్ల ఉల్లి సాగుకు మొత్తానికి రూ.60 వేల వరకు ఖర్చు వస్తుంది. ఉల్లిగడ్డ భూమి నుంచి తీసి, కత్తిరించి, బస్తాల్లో నింపి, మార్కెట్‌కు తీసుకెళ్లీ వరకు మరో 10 నుంచి 12 వేలు ఖర్చవుతుంది.ఎకరం భూమిలో తెల్ల ఉల్లిగడ్డ దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తెల్ల ఉల్లికి కిలో రూ.38 పలికితే రూ.3.80 లక్షల ఆదాయం వస్తుంది. ఖర్చులన్ని పోగా తక్కువలో తక్కువ వేసుకున్న రెండు లక్షల రూపాయలు లాభం చేతికి అందుతుంది. తెల్ల ఉల్లికి మార్కెట్లో హెచ్చు తగ్గులను బట్టి లాభం కాస్త అటూ ఇటూ కావచ్చని ఐదేళ్లుగా తెల్ల ఉల్లి సాగు చేస్తున్న నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలోని అంకాపూర్‌ రైతు వెంకటరెడ్డి చెప్పాడు. గతంలో కిలో 23 రూపాయలు వచ్చిన సందర్భం ఉంది. మరోసారి కిలో రూ.53 కూడా పలికిందని వెంకటరెడ్డి తెలిపాడు. తెల్ల ఉల్లికి ఇరవై రూపాయల కన్నా తక్కువ ధర తగ్గదని అన్నాడు. తెల్ల ఉల్లి సాగులో కష్టం కాస్త ఎక్కువే చేయాల్సి ఉంటుంది. తెగుళ్లు సోకకుండా, నీరు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఎంత జాగ్రత్తగా తెల్ల ఉల్లిని సాగు చేస్తే దిగుబడి కూడా అలాగే ఎక్కువగా వస్తుందని రైతు వెంకటరెడ్డి వెల్లడించాడు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here