అగ్రి ఏటీఎం అంటే ఏంటో తెలుసా? అతి తక్కువ భూమిలో పలురకాల పంటలు పండించడం, తద్వారా ప్రతిరోజూ ఆదాయం పొందడం. ఈ విధానంలో మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు రైతు బండారి వెంకేటేష్‌. 20 గుంటలు అంటే అర ఎకరం భూమిలో 16 రకాల ఆకు, కాయగూరలు, దుంపకూరలు పండిస్తున్నారు వెంకటేష్‌. పదిహేను సంవత్సరాలుగా ఇదే విధానంలో పంటలు సాగుచేస్తున్న ఈ ఆదర్శ రైతు ప్రతి రోజూ తక్కువలో తక్కువ వెయ్యి రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నాడు. అత్యధికంగా రోజుకు పదకొండు, పన్నెండు వేల రూపాయలు కూడా గడించిన సందర్భాలు ఉన్నాయని రైతు వెంjటేష్‌ చెప్పారు. జగిత్యాల జిల్లా సారంగపూర్‌ మండలంలోని పెంబట్లలో బండారి వెంకటేష్‌ ‘ఒక నేల వంద పంటలు’ అన్నట్లు విజయవంతంగా సాగు చేస్తున్నాడు. కుటుంబం అంతా ఆనందంగా జీవిస్తోంది.పదో తరగతి చదివిన వెంకటేష్‌ ముందుగా వెల్డింగ్‌ పనిలో శిక్షణ తీసుకుని మూడేళ్ల పాటు సింగపూర్‌లో పనిచేశాడు. తర్వాత సొంత గ్రామానికి తిరిగి వచ్చి తమ కుటుంబానికి ఉన్న ఎనిమిది ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నాడు. రెండున్నర ఎకరాల్లో ఏడాదికి ఒకే పంటగా వరి సాగుచేస్తున్నాడు. రెండో పంటగా మొక్కజొన్న వేస్తామన్నాడు. మూడు ఎకరాల పొలంలో సపోటా చెట్లు పెంచుతున్నారు. సపోటా తోటలో అంతర పంటగా కర్బూజా, బెండ, బీర, మెంతికూర, కాలీఫ్లవర్‌, టమోటా, వంకాయ, క్యారట్‌, బంతిపూలు లాంటివి పండిస్తున్నాడు. మిగిలిన అర ఎకరం భూమిలో మాత్రం 16 రకాల కాయగూరలు, దుంపకూరలు, ఆకుకూరలు పండిస్తున్నారు. ప్రతిరోజూ సాయంత్రాని కల్లా పొలం నుంచి హార్వెస్ట్‌ చేసి తెచ్చుకున్న పంట దిగుబడులను మరుసటి రోజు ఉదయాన్నే జగిత్యాల తీసుకెళ్లి అమ్ముతామని వెంకటేష్‌ వివరించాడు. తమ అన్న, వదిన, తాను తన భార్య పొలం పనులు చేసుకుంటామని, తప్పనిసరి అయితేనే కూలీలను పిలుస్తామన్నాడు. కూరగాయలు, ఆకు కూరల్ని తాము మాత్రమే కట్ ్చేసుకుంటామన్నాడు. విత్తనాలు వేసేటప్పుడు, కర్బూజాకు బెడ్లు, మల్చింగ్‌ వేసే సమయంలో కూలీలను పిలుస్తామన్నాడు.అర ఎకరం భూమిలో బంతి, క్యారట్‌, క్యాబేజి, కాలీఫ్లవర్‌, బెండ, బీర, మెంతి, టమోటా, వంకాయ లాంటి 16 రకాల పంటలు సాగుచేస్తోంది వెంకటేష్‌ కుటుంబం. ఇన్ని రకాల పంటలు సాగు చేయడం వల్ల తమకు ప్రతి రోజూ ఆదాయం వస్తోందన్నాడు. ఒక రకం కూరగాయలకు సరైన ధర లేక పోయినా.. మరో దానికి ఎక్కువ ధర వస్తుందని, తద్వారా ఆదాయం బ్యాలన్స్ అవుతుందనే ఉద్దేశంతో ఇలా పలు రకాల పంటల సాగు విధానం తాను చేస్తున్నట్లు చెప్పాడు. ఎక్కువ పంట దిగుబడి వచ్చిన రోజు సగం హోల్‌సేల్‌గా అమ్మి, మిగతావి జగిత్యాల రైతు మార్కెట్లో తామే విక్రయిస్తామన్నాడు.  ఏ రోజుకు ఆ రోజు తాము కూరగాయలు మార్కెట్‌కు తీసుకెళ్లడం వల్ల తాజాగా ఉంటాయని, హోల్‌సేల్‌గా ఇచ్చిన ధరకంటే రెట్టింపు ఆదాయం వస్తుందన్నాడు.  తమ కుటుంబమే శ్రద్ధగా సాగు చేస్తాం కనుక తమకు ప్రభుత్వ ఉద్యోగం మాదిరిగా కచ్చితమైన ఆదాయం ఉంటుందని చెప్పాడు.తమ వ్యవసాయ విధానంలో ప్రతిరోజూ పని ఉంటుందని, అలాగే ప్రతిరోజూ చేతికి డబ్బులు వస్తాయని వెల్లడించాడు. ప్రతిరోజూ తనకు ఆదాయం రావడాన్ని చూసిన తమ ఊరిలో మరో తొమ్మిది మంది రైతులు కూడా తక్కువ భూమిలో పలు పంటలు పండిస్తున్నారని వెంకటేష్ సంతోషంగా చెప్పాడు. పుచ్చకాయల విత్తనాలు తాము ఒకేసారి దిగుబడి వచ్చేలా కాకుండా రెండుసార్లు పెడతామన్నాడు. ఒకసారి పుచ్చ పంట కోసిన తర్వాత అక్కడే మరోసారి పుచ్చ విత్తనాలు నాటుతామన్నాడు. రెండోసారి పంట కోసిన తర్వాత పుచ్చపంటకు వేసిన మల్చింగ్‌ బెడ్లపై వర్షాకాలం పంటగా వెదురు కర్రలు పాతి బీర విత్తనాలు వేస్తామన్నాడు. మే నెలలో బీర విత్తనాలు నాటిటే జూన్‌, జులై నెలల్లో కాపు కాస్తుందని వెల్లడించాడు. బీరపంట పూర్తి కాగానే భూమిని దున్నేసి కాలీఫ్లవర్ వేస్తామన్నాడు.రిలయన్స్‌ దుకాణానికి ప్రతి ఏటా తాము పుచ్చకాయలు, మస్క్‌ మిలన్‌ ఇస్తామని వెంకటేష్‌ తెలిపాడు. తమ గ్రామంలో ఏడుగురు రైతులు ఒక కమిటీగా ఏర్పడ్డామని అన్నాడు. తమ కమిటీతో రత్నదీప్‌ సంస్థ ప్రతిరోజు ఎనిమిది టన్నుల కూరగాయలు, పండ్లు, ఆకు కూరలు తీసుకునేందుకు అగ్రమెంట్ చేసిందన్నాడు.ఎంత జాగ్రత్తగా పంటలు సాగు చేస్తున్నా ఒక్కోసారి నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని రైతులు గ్రహించాలని వెంకటేష్‌ చెప్పాడు. బీర, కాకర పంటలకు ఒక్కోసారి వైరస్ సోకి పంట పాడయ్యే అవకాశం ఉంటుందన్నాడు. మిగతా పంటలు లాభమే కానీ నష్టాలు అంతగా ఉండవని అన్నాడు. తెలంగాణ ప్రభుత్వం తమకు ఇచ్చిన రెండు డ్రిప్‌ యూనిట్ల ద్వారా పంటలకు నీటి సరఫరా అందిస్తున్నట్లు వెంకటేష్‌ చెప్పాడు. అయితే.. పలు పంటలు సాగు చేస్తున్న అర ఎకరంలో మాత్రం నీటి పారిస్తామని అన్నాడు.తమ పొలంలో పండించిన పంటల ద్వారా ఖర్చులన్నీ పోగా ఏడాదికి తన అన్న కుటుంబానికి 50 వేల వరకు తనకు 60 నుంచి 70 వేలు వరకు మిగులుతుందని వెంకటేష్‌ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here