ప్రకృతి విధానంలో సేద్యం చేసే అన్నదాతలకు పంచగవ్య గురించి, దాని ప్రయోజనాల గురించి తెలిసే ఉంటుంది. దేశీ ఆవుపేడ, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమూత్రం మిశ్రమమే పంచగవ్య. అయితే.. ప్రత్యేకంగా తయారుచేసుకునే పంచగవ్య గురించి, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాం. పంచగవ్యకు మరో మూడు నాలుగు పదార్ధాలను కలుపుకుని తయారు చేసుకోవడమే ప్రత్యేక పంచగవ్య. పంచగవ్య మరింత త్వరగా తయారవడానికి, మొక్కలకు మరింత మెరుగైన పోషకాలు అందించడానికి ప్రత్యేక పంచగవ్యను తయారు చేసుకునే విధానం గురించి ఉషా గార్డెన్‌ యజమాని సోదాహరణంగా వివరించారు.మొక్కలకు పూత ప్రారంభమయ్యే సమయంలో ప్రత్యేక పంచగవ్యను స్ప్రే చేసినా, లేదా మొక్క మొదట్టో పోసినా చాలా బలంగా పెరుగుతుంది. చక్కని దిగుబడులు ఇస్తుంది. పూత, పిందెలు రాలిపోకుండా కాపాడుతుంది. ప్రత్యేక పంచగవ్య ఉపయోగించిన మొక్కల నుంచి పండ్లు, పూలు, కూరలు కానీ పెద్ద సైజులో ఉంటాయి. పండ్లు, పూలు నిల్వ ఉండే సామర్ధ్యం బాగా ఉంటుంది. మామూలుగా పండ్లు, పూలు కోసిన రెండు మూడు రోజుల్లో పాడైపోతాయి. కాని ప్రత్యేక పంచగవ్య ఉపయోగించిన మొక్క నుంచి వచ్చే పండ్లు, పూలు ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ప్రత్యేక పంచగవ్య వాడిన మొక్కలు పూలు, పండ్లను ఎక్కువగా పూస్తాయి, కాస్తాయి. అలాగే నిగనిగలాడుతూ ఉంటాయి. కాయలు అధిక బరువుతో దిగుబడి వస్తాయి. ఎక్కువ మొత్తంలో మొక్కలకు ప్రత్యేక పంచగవ్య వినియోగించి సహజసేద్యం చేసిన రైతులు లేదా ఔత్సాహికులు తమ ఉత్పత్తులను విక్రయించాలనుకుంటే తూకంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రత్యేక పంచగవ్య ఉపయోగించిన మొక్కలు చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయి. వాటి నుంచి వచ్చే ఉత్పత్తులు కూడా ఆరోగ్యంగా, రుచిగా ఉంటాయి. మొక్కలు చీడపీడలను తట్టుకునే శక్తిని అంటే ఇమ్యూనిటీని ఎక్కువగా అందిస్తుంది.ప్రత్యేక పంచగవ్య తయారీ విధానం:

మనం ప్రత్యేక పంచగవ్య తయారు చేసుకునే పరిమాణాన్ని బట్టి చక్కగా పొడిగా ఉండే మట్టి పాత్రను వాడుకుంటే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. మట్టి పాత్రలు అందుబాటులో ఉండని వారు పరిశుభ్రంగా, పూర్తిగా పొడిగా ఉండే ప్లాస్టిక్ కంటైనర్‌ను కూడా వినియోగించవచ్చు. ఇటాంటి మట్టి లేదా ప్లాస్టిక్‌ కంటైనర్‌లో కిలో ఫ్రెష్‌ దేశీ ఆవుపేడ వేసుకుని, దానిలో 50 నుండి 100 గ్రాముల మధ్యలో దేశీ ఆవునెయ్యి వేసుకోవాలి. ఈ రెండింటిని శుభ్రంగా ఉన్న ఒక కర్రపుల్లతో కానీ, చెక్కతో కానీ రెండు రోజుల పాటు ఉదయం, సాయంత్రం బాగా కలుపుకోవాలి. ఆ కంటైనర్‌ను పూర్తిగా కప్పుయకుండా కాస్త గాలి తగిలేలా మూత పెట్టుకోవాలి. ఆవుపేడ, ఆవునెయ్యి మిశ్రమానికి కూడా బూజు వస్తుంది. అందుకే గట్టిగా కవర్ చేయకూడదు. గాలి, వెలుతురు తగిలేలా మాత్రమే మూత పెట్టాలి.తర్వాత పరిశుభ్రంగా, పొడిగా ఉండే మరో కంటైనర్‌లో ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన లీటరు గోమూత్రం వేసుకోవాలి. ఈ గోమూత్రం ఏడాది పాటు కూడా నిల్వ చేసుకున్నదైతే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ గోమూత్రానికి కొద్దిగా తేనె కలుపుకోవాలి. ఆపైన 50 నుంచి 100 గ్రాముల సెనగపిండి వేసి, బాగా కలపాలి. ప్రత్యేక పంచగవ్యలో తయారయ్యే మైక్రోబ్స్‌ బాగా ఎదగడానికి ఆహారంగా సెనగపిండి ఉపయోగపడుతుంది. పాత గోమూత్రం, తేనె, సెనగపిండి మిశ్రమానికి 50 నుంచి 100 గ్రాముల తరిగిన పాత బెల్లం కూడా బాగా కలపాలి. మైక్రోబ్స్‌ మరింత ఎక్కువగా ఎదిగేందుకు బెల్లం కూడా ఆహారంగా ఉపయోగపడుతుంది. ఇలా తయారైన మిశ్రమానికి సుమారు ఒక లీటర్ తాటికల్లు, లేదా చెరుకు రసం, లేదా కొబ్బరి నీళ్లు వేసుకోవాలి. ఈ మూడింటిలో ఏది కలిపినా గోమూత్రం మిశ్రమం మరింత త్వరగా ఫెర్మంటేషన్‌ అవుతుంది. తాటికల్లు అయితే మరింత తొందరగా ఫెర్మంటేషన్ అవుతుంది.పైన చెప్పిన మిశ్రమానికి నాలుగు నుంచి ఆరు బాగా మిగల ముగ్గిన అరటిపండ్లను మెత్తగా నలిపి ద్రావణంలో వేసుకోవాలి. మిగల ముగ్గిన అరటిపండులో, దేశీ ఆవుపేడలో మైక్రోబ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అరటిపళ్లు, ఆవుపేడలో ఉన్న మైక్రోబ్స్‌ కల్లు వల్ల మరింత బాగా జరరేట్‌ అవుతాయి. ఈ మైక్రోబ్స్‌కి ఆహారంగా సెనగపిండి, బెల్లం ఉపయోగపడతాయి. మొక్కల ఎదుగుదలకు మైక్రోబ్స్ బాగా ఉపయోగపడతాయి. ఈ మిశ్రమానికి పావు లీటరు దేశీ ఆవుపాలు, మరో పావులీటరు దేశీ ఆవు పెరుగు కూడా కలపాలి. వీటి మిశ్రమాన్ని రెండు రోజుల పాటు చెక్కతో కానీ, కర్రపుల్లతో కానీ ఉదయం, సాయంత్రం బాగా కలపాలి.రెండు రోజుల తర్వాత పేడ, ఆవు నెయ్యి మిశ్రమాన్ని, గోమూత్రంతో తయారు చేసిన మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం 15 నుంచి 20 రోజుల్లోనే మొక్కలకు వినియోగించేందుకు రెడీ అవుతుంది. ఈ ప్రత్యేక పంచగవ్యకు నీళ్లు తగలకుండా చూసుకుంటే ఆరు నుంచి 8 నెలల పాటు వినియోగించుకునేందుకు పనికొస్తుందని ఉష వివరించారు. ప్రత్యేక పంచగవ్యను క్రమం తప్పకుండా స్ప్రే చేసినా, మొదళ్లలో పోసినా మొక్కలు చక్కగా నిగనిగలాడుతూ, పచ్చగా ఏపుగా ఎదుగుతాయి. మొక్కలకు ఎన్‌పీకే సమృద్ధిగా అందుతుంది.మామూలు పంచగవ్య తయారవడానికి నెల రోజుల సమయం పడుతుంది. ప్రత్యేక పంచగవ్య అయితే.. 15 నుంచి 20 రోజుల్లోనే వినియోగించేందుకు రెడీ అయిపోతుంది. ప్రత్యేక పంచగవ్యను మరింత ఎక్కువ మోతాదులో తయారు చేయాలంటే పైన చెప్పుకున్న పదార్థాలను దామాషా ప్రకారం పెంచుకుని కలుపుకోవాలి. సిద్ధం అయిన ప్రత్యేక పంచగవ్యను ఒకటి నుండి 5 మిల్లీలీటర్లను లీటర్‌ నీటిలో కలిపి స్ప్రే చేసుకోవచ్చు. అలాగే మొక్క సైజును బట్టి 5 నుంచి 10 మిల్లీ లీటర్ల ప్రత్యేక పంచగవ్యను కలుపుకుని మొక్క మొదట్లో పోసుకోవచ్చు. ఈ ప్రత్యేక పంచగవ్యను క్రమం తప్పకుండా మొక్కలకు వాడితే చక్కని ఫలితాలు వస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here