నీరు ఎంతో విలువైనది. ప్రాణికోటికి అది జీవనాధారం. నీరు లేకుండా మన జీవితాలను ఊహించగలమా? కాబట్టి నీటిని సాధ్యమైనంత వరకు కాపాడుకోవాల్సిందే. సాధారణంగా ఎండాకాలంలో భగభగమని మండే సూర్యుడి వేడిమికి నీరు ఆవిరి అయిపోతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా సాగునీటి చెరువుల నుండి పెద్ద యెత్తున బాష్పీభవనం జరుగుతూ ఉంటుంది. వేసవి కాలంలో నీరు ఇలా ఆవిరి కాకుండా నివారించడం ఒక పెద్ద సవాలు. సాధారణంగా కొలనులు లేదా సాగునీటి చెరువులు బాష్పీభవనం కారణంగా రోజుకు ¼ నుండి ½ అంగుళాల మేరకు నీటిని కోల్పోతాయని ఒక అంచనా. అంటే వారానికి సుమారు 2 నుండి 4 అంగుళాల వరకు నీరు చెరువుల నుండి ఆవిరి అయిపోతూ ఉంటుంది. అంటే ఒక సాధారణ విస్తీర్ణం గల చెరువు నుండి మనం సంవత్సరానికి 25,000 నుండి 50,000 గ్యాలన్ల వరకు నీటిని కోల్పోతామన్నమాట. మరి అలా నీరు ఆవిరి కాకుండా ఆపడమెలా? దీనికి హైదరాబాద్‌కు చెందిన అనుభజ్ఞుడైన రైతు ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు (పై ఫోటో) ఒక మంచి పరిష్కార మార్గం చూపుతున్నారు. నీటిపై నూనె తట్టు కనుక పేరుకుంటే నీటి ఆవిరి గణనీయంగా తగ్గిపోతుంది. ఇదే రాజు సూచిస్తున్న టెక్నిక్. నిజానికిది పాతదే. మన పూర్వికులకు తరతరాలుగా ఈ టెక్నిక్ తెలుసు. అయినా వ్యవసాయ చెరువుల నీటి ఆవిరి నష్టాలను నివారించేందుకు మాత్రం ఎవరూ దీనిని గతంలో ఇలా ఉపయోగించలేదు.
ముందుగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ఈ పద్ధతిని వ్యవసాయ చెరువులకు లేదా కుంటలకు (farm ponds) మాత్రమే ఉపయోగించాలి. సాధారణ మంచినీటి చెరువుల కోసం కాదు. ఇలా నీటి నష్టాన్ని తగ్గించడం ద్వారా, మనం సాగు నీటిపై వెచ్చించే వ్యయాన్ని నియంత్రించవచ్చు. లేకపోతే మనం ఎక్కువ నీటితో పాటు ఎక్కువ ఇంధనాన్నో, విద్యుత్తునో ఉపయోగించవలసి వస్తుంది.
సుబ్రహ్మణ్యం రాజు ఈ టెక్నిక్‌ను ఉపయోగించి రెండు ప్రయోగాలు చేపట్టారు. ఒకటి జింగూర్తి గ్రామంలోని ఏకలవ్య సేంద్రీయ పాలిటెక్నిక్ పాఠశాలలో కాగా మరొకటి కృషి విజ్ఞాన్ కేంద్రంలోనిది. రాజు గారు అభివృద్ధి చేసిన ఈ విధానం మంచి ఫలితాలను ఇచ్చింది. వ్యవసాయ అవసరాల కోసం ప్రత్యేకంగా వ్యవసాయ చెరువులలో నీటి బాష్పీభవన నష్టాలను తగ్గించడమే రాజు ప్రయోగాల లక్ష్యం. పర్యావరణ అనుకూలమైన పదార్థాలతో మనం తేలికగా నీటి బాష్పీభవన (ఆవిరి) నష్టాలను 70% వరకు తగ్గించగలమని రాజు చెబుతారు.
ఈ పద్ధతిలో ఉపయోగించే వంటనూనెలు రైతులకు సులభంగానే లభిస్తాయి. వాటిని ఏ బ్రాండెడ్ లేదా వాణిజ్య ఉత్పత్తుల నుండి కొనుగోలు చేయవలసిన అవసరం లేదు. అవి దాదాపు ప్రతిచోటా అందుబాటులోనే ఉంటాయి. లేదా వాటిని రైతులు సొంతంగా సేకరించి ఉపయోగించుకోవచ్చు కూడా. ఏదేమైనా నీటి ఆవిరిని అరికట్టేందుకు ఎంచుకోవలసిన పదార్థాలు తినదగినవై (edible oils) ఉండాలి. అలాగే నీటి కంటే తక్కువ సాంద్రత కలిగి ఉండాలి. నీటితో పోల్చినప్పుడు అధిక బాష్పీభవన స్థాయి కలిగి ఉండాలి. ఇందుకు అవసరమైన పదార్థం ఏదైనా ఒక వంట నూనె. ఒకసారి ఉపయోగించిన నూనెలను కూడా వాడుకోవచ్చు. దీంతో ఖర్చు కూడా తగ్గుతుంది.

నీటి ఆవిరిని నివారించే సూత్రం

వంట నూనెలు (edible oils) నీటి సాంద్రత (1) కన్నా తక్కువ సాంద్రత కలిగి ఉంటాయి. (0.92). కాబట్టి, తైలం ఎల్లప్పుడూ నీటిపై తేలుతుంది. ఆలాగే సులభంగా కరిగిపోదు కూడా. వంట నూనెల బాష్పీభవన స్థాయి (120 సి) నీటి బాష్పీభవన స్థాయి (5 సి) కంటే చాలా ఎక్కువ. అనేక పారామితుల కారణంగా బాష్పీభవన స్థాయి మారుతూ ఉంటుంది. నూనెలు నీటిపై తేలియాడుతూ పలుచని తట్టును తయారు చేస్తాయి. అవి సూర్యకిరణాల వేడిమిని ప్రతిఫలిస్తాయి. కాబట్టి రేడియేషన్ తక్కువగా ఉంటుంది. దీంతో సహజంగా బాష్పీభవనం లేదా ఆవిరి శాతం తక్కువగా ఉంటుంది. వాడేవి వంటనూనెలే కావడం వల్ల సాగు చేసే పంటలకు కూడా నష్టం ఉండదు.
సాధారణంగా ఎండ ఎక్కువగా కాసే రోజుల్లోను, వడగాలులు వీచే రోజుల్లోను బాష్పీభవన (నీటి ఆవిరి) నష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని అరికట్టేందుకు వంటనూనెను నీటిపైన అక్కడక్కడా నేరుగా వేయాలి. ఆ తర్వాత ఆ నూనె తనంతట అదే నీటిపై విస్తరిస్తుంది.
బాష్పీభవనంలో గాలి కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఎత్తైన చెట్ల తోటల పెంపకం, నీడ ఉండేలా చేసుకోవడం ద్వారా బాష్పీభవన నష్టాలను మరింత తగ్గించవచ్చని సుబ్రహ్మణ్యం రాజు వివరిస్తారు.

ఖర్చు కూడా తక్కువే!

ఒకసారి వాడిన వంట నూనె లీటరుకు 50 రూపాయలకే దొరుకుతుంది. అలా చౌకగానే ఈ పద్ధతిని అవలంబించవచ్చు. వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలోని నీటి కుంటలో మొదటిసారి 25 లీటర్లను ఉపయోగించాలి. ఆ తరువాత నెలకు 13 లీటర్లు సరిపోతాయి. “సాధారణంగా మార్చి నుండి ఆగస్టు వరకు 30 నుండి 45 సెంటీగ్రేడ్ దాకా ఉష్ణోగ్రత రికార్డ్ అవుతుంది. కాబట్టి ఈ సమయంలో నీరు ఆవిరి కాకుండా కాపాడుకోవాలి. ముఖ్యంగా ఏప్రిల్, మే, జూన్ నెలలు ఎక్కువ టెంపరేచర్ కలిగి ఉంటాయి. మార్చి, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి, నా అనుభవం ప్రకారం సగటున రోజుకు 5 మి.మీ నుండి 15 మి.మీల నీటి బాష్పీభవనం జరుగుతూ ఉంటుంది” అని సుబ్రహ్మణ్యం రాజు చెప్పారు. అంటే రోజుకు సగటున 1 సెం.మీ నుండి 10 మి.మీ దాకా నీరు ఆవిరైపోతుందన్నమాట.
రాజు లెక్కల ప్రకారం 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని చెరువులో ఈ నూనె టెక్నిక్ ద్వారా రైతు రోజుకు 10,000 లీటర్ల చొప్పున ఆరు నెలల్లో 18,00,000 లీటర్ల దాకా నీటిని ఆదా చేయవచ్చు. ఇదంతా కేవలం రూ. 4500 రూపాయల పెట్టుబడితో సాధ్యమౌతుంది. ఈ టెక్నిక్ ద్వారా జరిగే నీటి ఆదా విలువ మనం వెచ్చించే కొద్దిపాటి మొత్తం కన్నా చాలా రెట్లు ఎక్కువ.
‘గో ఆధారిత ప్రకృతి వ్యావసాయదారుల సంఘం’ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎం.ఎస్.సుబ్రహ్మణ్యం రాజు గతంలో భూసార పునరుద్ధరణకు సంబంధించి అనేక ప్రయోగాలు చేపట్టి పలు ఆవిష్కరణలు చేశారు. బాష్పీభవనాన్ని (ఆవిరి) నివారించడానికి రైతులు సరళమైన పద్ధతులను అవలంబించాలని రాజు అభిప్రాయపడుతున్నారు. పబ్లిక్ సెమినార్లు, సోషల్ మీడియా, సంప్రదాయ మాధ్యమాల ద్వారా తన నీటి ఆవిరి నివారణ టెక్నిక్ గురించి రైతులకు మరింత అవగాహన కల్పించాలని ఆయన యోచిస్తున్నారు. గత ఏడాదికాలంగా రాజు వేలాది మంది రైతులకు ఈ టెక్నిక్ గురించి తెలియజేశారు. అనేక విశిష్ట వ్యవసాయ పద్ధతులకు సంబంధించి సుబ్రహ్మణ్యం రాజు నిస్స్వార్థంగా తన విజ్ఞానాన్ని రైతన్నలకు అందించడం అభినందనీయం.

మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాను సంప్రదించవచ్చు.
Sri M.S.Subrahmanyam Raju
Phone: 7659855588
+91 9700 105 205

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here