రైతు వేదికల ద్వారా రైతులకు అందించే శిక్షణ కార్యక్రమాలను సిద్ధం చేసే పనిలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ల ఆపరేషన్‌కు సంబంధించిన ఒక స్వల్పకాలిక ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. పంటల రక్షణ చర్యలను పర్యవేక్షించే డ్రోన్ల ఆపరేషన్ విధానం ఈ కోర్సు పాఠ్యాంశంగా ఉంటుంది. ఇందుకు సంబంధించి జిఎంఆర్ ఏవియేషన్ అకాడమీ (GMR Aviation Academy)తో వ్యవసాయ విశ్వవిద్యాలయం చర్చలు జరుపుతోంది. డ్రోన్ల ఆపరేషన్‌పై సర్టిఫికేట్ కోర్సును ప్రవేశపెట్టినందుకుగాను జీఎంఆర్ అకాడమీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం భావిస్తోంది. ఈ సర్టిఫికేట్ కోర్సులో భాగంగా సిమ్యులేటర్ల సహాయంతో అకాడమీ ప్రాక్టికల్ ట్రైనింగ్ క్లాసులను అందించే అవకాశం ఉంది.
కృత్రిమ మేధ (artificial intelligence-AI), మెషీన్ లెర్నింగ్ (ML) వాడకంతో పాటు వ్యవసాయంలో యాంత్రీకరణను ప్రోత్సహించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పెరుగుతున్న లేబర్ కొరత సమస్యను అధిగమించడమే కాకుండా, ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి కూడా ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల ఉపయోగంపై వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టి సారించింది. వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించేందుకు నిపుణులు అవసరమని భావిస్తున్న విశ్వవిద్యాలయం అందుకుగాను ఒక కోర్సును నిర్వహించాలని సంకల్పించిందని విశ్వవిద్యాలయ వైస్-ఛాన్సలర్ డాక్టర్ వి. ప్రవీణరావు చెప్పారు.
సాగులో డ్రోన్‌లను ఉపయోగించడానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ముఖ్యంగా తెగుళ్లను ముందుగా గుర్తించడంతో పాటు పురుగుమందుల పిచికారీ వంటి నివారణ చర్యలపై విశ్వవిద్యాలయం గత కొన్నేళ్లుగా పరిశోధనలు సాగిస్తోంది.
“వ్యవసాయంలో డ్రోన్ల వాడకానికి సంబంధించి మా పరిశోధనలను ముమ్మరం చేయడానికి ఇటీవల సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్ నుండి అనుమతి పొందాము. వాస్తవానికి, దేశంలోనే అలాంటి ఆమోదం పొందిన విశ్వవిద్యాలయాల్లో PJTSAU మొదటిది” అని ప్రవీణ్ రావు వివరించారు.
ఇప్పటికే వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రధాన క్యాంపస్‌తో పాటు వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు (ఎఆర్ఎస్), కృషి విజ్ఞాన కేంద్రాల (కెవికెలు) వైమానిక మ్యాపింగ్‌ను పూర్తి చేసినట్లు వీసీ తెలిపారు. అలాగే క్యాంపస్‌లోని రైస్ రీసెర్చ్ సెంటర్‌లో వరి పంటపై అవసరమైన ద్రావణాలను పిచికారీ చేయడానికి డ్రోన్లను ఉపయోగించామని ఆయన చెప్పారు. అంతేగాక తాండూర్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో కుంకుమ పువ్వు పంటపై సంప్రదాయ పిచికారీ విధానాలు, డ్రోన్ స్ర్పేయింగ్‌ పద్ధతులను ఉపయోగించి వాటి పనితీరును కూడా అంచనా వేసినట్లు ప్రవీణ్ రావు వివరించారు.
ఇదిలావుండగా, తెలంగాణలోని రైతుల ప్రయోజనాల కోసం డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు సాగడానికి MIT Anna Universityతో వ్యవసాయ విశ్వవిద్యాలయం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. “మొక్కల సంరక్షణ కార్యకలాపాల కోసం ఉపయోగించే డ్రోన్‌లను నిర్వహించడానికి మానవశక్తి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే విశ్వవిద్యాలయంలో అందుకు సంబంధించి ఒక స్వల్పకాలిక కోర్సును ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తున్నాం” ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here