దేశంలో అధికారికంగా సుభాష్ పాలేకర్ జీరో బడ్జెట్ వ్యవసాయం ప్రవేశపెట్టినప్పటి నుండి ఇప్పటివరకు ఎనిమిది రాష్ట్రాల్లో సుమారు 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ప్రకృతి సేద్యం క్రిందకు వచ్చింది. ఈ విస్తీర్ణంలో గరిష్ఠంగా 1 లక్ష హెక్టార్లలో ఆంధ్రప్రదేశ్‌లో అగ్రస్థానంలో ఉంది. తరువాత వరుసలో మధ్యప్రదేశ్ (99,000 హెక్టార్లు), ఛత్తీస్‌గఢ్ (85,000 హెక్టార్లు), కేరళ (84,000 హెక్టార్లు), ఒడిశా (24,000 హెక్టార్లు), హిమాచల్ ప్రదేశ్ (12,000 హెక్టార్లు), జార్ఖండ్ (3,400 హెక్టార్లు), తమిళనాడు (2,000 హెక్టార్లు) రాష్ట్రాలు ఉన్నాయి.
ప్రకృతి వ్యవసాయంతో సహా సాంప్రదాయ స్వదేశీ పద్ధతుల ప్రోత్సాహానికి ప్రభుత్వం 2020-21లో పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పికెవివై) క్రింద ఒక ఉప పథకంగా భారతీయ ప్రాకృతిక్ కృషి పద్ధతి (BPKP)ని ప్రవేశపెట్టింది. కాగా, ఇప్పటి వరకు 4.09 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ప్రకృతి వ్యవసాయం కిందకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల్లో ఈ సాగు కోసం మొత్తం రూ. 4587.17 లక్షలు విడుదల అయ్యాయి. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ వివరాలు వెల్లడించారు. BPKP పథకం కింద, క్లస్టర్ ఏర్పాటు, సామర్థ్యం పెంపొందించడం, శిక్షణ పొందిన సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ, ధ్రువీకరణ, విశ్లేషణల కోసం మూడేళ్లపాటు హెక్టారుకు రూ. 12,200 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సింథటిక్ రసాయన ఉత్పాదకాలను ఉపయోగించకుండా నిర్వహించే వ్యవసాయం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. బయోమాస్ మల్చింగ్ విధానాలను, బయోమాస్ రీసైక్లింగ్‌ను ఇది ప్రోత్సహిస్తుంది. ఆవు పేడ, మూత్రం వంటి సహజ ఎరువులను మాత్రమే ఉపయోగించడం ద్వారా ఆర్గానిక్ పద్ధతుల్లో సేద్యం జరిగేలా పర్యవేక్షిస్తుంది. ఏపీలో ఇందుకోసం ప్రత్యేకంగా 2015-16లో Andhra Pradesh ‘Zero-Budget’ Natural Farming (APZBNF) పథకాన్ని ప్రారంభించారు. Rythu Sadhikara Samstha (RySS) ద్వారా దీన్ని నిర్వహిస్తున్నారు. 60 లక్షల మంది రైతులను జెడ్‌బీఎన్ఎఫ్ పరిధిలోకి తీసుకువచ్చి 80 లక్షల హెక్టార్లను ప్రకృతి సాగు క్రిందకు తేవాలన్నది APZBNF లక్ష్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here