రాజకీయాల్లో ఉండే వారంటేనే ఎప్పుడూ బిజీగా ఉంటారని అనుకుంటాం. అందులోనూ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అస్సలు తీరిక ఉండదు కదా అని భావిస్తాం. అయితే.. నిత్యం సమస్యలతో వచ్చే నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అవసరం వచ్చినా అనేక మంది పుష్పశ్రీవాణి వద్దకు వస్తూనే ఉండేవారు. వారందరి సమస్యలకు మంత్రిగా పరిష్కారాలు చూపిస్తూ, అవసరమైతే అధికారులకు సూచలిస్తూ ఆమె అనుక్షణం బిజీగా ఉండేవారు. ఒక పక్కన చిన్న కూతురు, మరో పక్కన కుటుంబ బాధ్యతలు, ఇంకో పక్కన రాజకీయాలతో ఎప్పుడూ ఎంతో బిజీగా ఉండే పుష్పశ్రీవాణి ఖాళీ సమయంలో ఏం చేసేవారనే ప్రశ్న ఎవరిలోనైనా ఉదయిస్తే.. ఆమె తన ఫేస్‌ బుక్‌ లో షేర్ చేసిన వీడియో ద్వారా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.ఈ ఆధునిక సమాజంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే లక్షలాది మంది సహజసిద్ధ పంటలు, రసాయనాలు లేని పంట ఉత్పత్తుల పట్ల ఆసక్తి పెంచుకుంటున్నారు. మన దేశంలోను, విదేశాల్లో కూడా ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకున్నా ఆరోగ్యం, ప్రకృతి పంటల గురించి మాట్లాడుకునే సందర్భాలు తరచూ వస్తున్నాయి. ఆరోగ్యాభిలాషులంతా సహజసిద్ధంగా పండే పంట ఉత్పత్తులను వినియోగించడం అంటే ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు. అలాంటి సహజ పంటల్ని ఇష్టపడే రాజకీయ నేతలు కూడా అనేక మంది ఉంటున్నారు. వారిలో తాజా మాజీ డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమశాఖ మంత్రిగా విధులు నిర్వర్తించిన పుష్పశ్రీవాణి కూడా ఒకరు.పుష్పశ్రీవాణి డిప్యూటీ సీఎంగానే కాకుండా గిరిజన సంక్షేమ శాఖను కూడా బాధ్యతగా నిర్వర్తించేవారు. అలాగని ఆమె కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. కుటుంబ ఆరోగ్యం పట్ల ఆమె ఎంతో శ్రద్ధ వహించేవారు. ఆ క్రమంలోనే ఆమె ఏ మాత్రం ఖాళీ సమయం దొరికినా తమ సొంత పెరటి తోటలో ఎలాంటి రసాయనాలు వినియోగించని ప్రకృతి వ్యవసాయం చేసేవారు. తమ తోటలో ఎన్నో రకాల పండ్లు, ఆకు కూరలు, కాయగూరలు, దుంపకూరలు సేంద్రీయ విధానంలో పెంచుతుంటారు.సీఎం జగన్‌ కొత్త కేబినెట్‌లో స్థానం లభించకపోవడంతో పుష్పశ్రీవాణి ఇప్పుడు సహజసిద్ధ పంటల పెంపకంపై మరింత శ్రద్ధపెట్టారు. ఆ క్రమంలోనే ఆమె తాజాగా తమ తోటలో కోతకు వచ్చిన పలు రకాల దుంపకూరలు, ఆకు కూరలు, పండ్లను కోస్తూ.. వాటి గురించి వివరిస్తూ ఒక వీడియోను సోషల్ మీడియా ఫేస్‌ బుక్‌ లో పెట్టారు. ఈ వీడియోలో ఆమె ముందుగా.. ఆరోగ్యమే మహాభాగ్యం. సరదాగా తమ ఇంటి పెరట్లో ఎటువంటి ఎరువులు వాడకుండా.. సహజసిద్ధంగా పండించిన కూరగాయలు, ఆకు కూరలు, పండ్లు పండించినట్లు వివరించారు. మనం స్వయంగా చేసిన సాగులో పంట చేతికి వచ్చి.. ఆ ఫలాలను చేతులారా కోస్తున్నప్పుడు కలిగే ఆ ఆనందమే మరో స్థాయిలో ఉందని సంతోషంగా చెబుతున్నారు.పుష్ప శ్రీవాణి పెరటి తోటలో పెరిగిన ఒక్కొక్క కాయగూర, దుంపకూర, ఆకు కూరను సేకరిస్తూ ఎంతో ఆనందంతో వాటి గురించి వివరించి చెప్పడం విశేషం. తమ తోటలో చేతికి వచ్చిన ఎర్ర ముల్లంగి, రౌండ్‌ ముల్లంగి దుంపలను భూమి నుంచి బయటికి తీసి, చూపిస్తూ మరీ వాటి వివరాలు తెలిపారు. ముల్లంగి తింటే చాలా ఆరోగ్యం అని, అందులోనూ సహజసిద్ధంగా పండించినవైతే రుచిగా, మరింత ఆరోగ్యంగా కూడా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఆకు కూరలు కొత్తిమీర, తోటకూర కూడా పుష్పశ్రీవాణి విరివిగా పండిస్తున్నారు. పుష్పశ్రీవాణి పెరటి తోటలో వంగ, కొన్ని వరసల్లో క్యాబేజి, క్యాలీఫ్లవర్‌ పంటలు కూడా ఎంతో శ్రద్ధగా పెంచుతున్నారు. నూలుకోలు దుంపలు కూడా పండిస్తున్నారు. తయారైన నూలుకోలు దుంపలను భూమి నుంచి మొక్కతో సహా బయటికి తీసి చూపిస్తూ.. అవి చాలా రుచిగా ఉంటాయని చెబుతున్నారు. పుష్పశ్రీవాణి గార్డెన్‌లో నిమ్మకాయలు కూడా సహజసిద్ధ విధానంలోనే పండిస్తున్నారు. మంచి పసుపు రంగులోకి మారిన నిమ్మకాయల్ని ఆమె కోసి చూపించారు. తమ పెరట్లో పెంచి, కోతకు వచ్చిన ఆకు, కాయగూరలు, దుంపకూరలు, నిమ్మకాయలను ఓ వెదురుబుట్టలో సేకరిస్తూ ఆనందంగా అందరికీ తన వీడియో ద్వారా ప్రదర్శించారు.

తమ పెరట్లో సహజసిద్ధంగా పండించిన పంట ఉత్పత్తులపై ఇప్పుడు వీడియో తీసి సోషల్ మీడియాలో అయితే పెట్టారు కానీ.. ఆ పంటలను పుష్పశ్రీవాణి ఎప్పటి నుంచో సాగు చేస్తుండడం గమనార్హం. సహజ పంటలు పండించడంలో పుష్పశ్రీవాణి ఔత్సాహిక ఆర్గానిక్‌ ఫార్మింగ్ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తారనడంలో సందేహం లేదు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here