టెర్రస్‌ మీద గార్డెనింగ్‌ అంటే మనం సాధారణంగా ఏమనుకుంటాం? ఏవో కొన్ని పూలమొక్కలు, కొన్ని కాయగూరల మొక్కలు, మరి కొన్ని పాదులు, ఇంకొన్ని చిన్న చిన్న పండ్ల జాతులు పెంచుతారు అనుకుంటాం. అయితే.. కేరళ రాష్ట్రం కోచిలో నివాసం ఉంటున్న జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ పుథంపరంబిల్‌ మాత్రం అందుకు కాస్త వెరైటీగా ఆలోచించారు. తమ మిద్దె మీద ఏకంగా మామిడితోటనే పెంచుతున్నారు. అందులో 50 రకాల మామిడిచెట్లు పెంచుతున్నారు. సహజసిద్ధ సేంద్రీయ సాగు విధానంలో ఆయన వాటి నుంచి మంచి ఫలాలు, లాభాలు అందుకుంటున్నారు.

జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ మిద్దె మీది మామిళ్లలో ఆయన వద్ద మాత్రమే లభ్యమయ్యే ఓ ప్రత్యేక మామిడి రకం ఉంది. దానికి ‘పాట్రీసియా’ అని పేరు పెట్టారు జోసెఫ్ ఫ్రాన్సిస్‌. ఈ పాట్రీసియా మామిడి రకాన్ని జోసెఫ్‌ 22 ఏళ్ల క్రితం స్వయంగా రూపొందించారల. రెండు స్థానిక మామిడి మొక్కలను అంటుకట్టడం ద్వారా జోసెఫ్‌ ఈ పాట్రీసియా వెరైటీని రూపొందించారు. పాట్రీసియా రకం మామిడి పండ్లు మార్కెట్లో ఎక్కడా లభించవు. కేవలం తన టెర్రస్‌ మీద మాత్రమే ఈ మామిడి పంట పండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతో తియ్యదనంతో ఉండే పాట్రీసియా మామిడి పండులో పీచుపదార్థాలు ఉండవు. దాని లోపలి టెంక అంటే విత్తనం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ మామిడి పండ్లను కేవలం అతిథుల కోసం, తమ కుటుంబ సభ్యులకు మాత్రమే వినియోగిస్తామని జోసెఫ్ వెల్లడించారు.జోసెఫ్ ఫ్రాన్సిస్‌ టెర్రస్‌ మీద పెంచే మామిడి చెట్లలను మామూలు చెట్ల వలే కాకుండా కేవలం 4 అడుగుల ఎత్తు మాత్రమే పెంచుతారు. జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ మిద్దెపై పెంచుతున్న మామిడిచెట్లను ముందుగా ముందమ్‌వేలిలోని తమ 5 సెంట్ల ఇంటి స్థలంలో పెంచేవారు. ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకున్న తర్వాత ఆ మొక్కల్ని తమ ఇంటి టెర్రస్‌పై సేంద్రీయ విధానంలో పెంచడం ప్రారంభించారు.జోసెఫ్ ఇటీవలి కాలంలో 150 పాట్రీసియా మామిడి మొక్కలతో నర్సరీ పెంచుతున్నారు. వాటిని కావాలన్న వారికి ఖరీదుకు విక్రయిస్తున్నారు.

జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ తొలుత తన జీవితాన్ని రిఃఫ్రిజిరేటర్ల టెక్నీషియన్‌గా ప్రారంభించారు. కానీ. ఆయనకు చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం. వ్యవసాయం చేయడం జోసెఫ్‌కు ఓ అభిరుచి. ఈ అభిరుచితోనే జోసెఫ్‌ తమ పొలంలో పెరుగుతున్న ‘కల్లుకెట్టి’ మామిడి మొక్కకు అంటు కట్టి కొత్తగా పాట్రీసియా రకం మొక్కను అభివృద్ది చేశారు. అలా ఆయన అంటుకట్టిన పాట్రీసియా మామిడి చెట్టు కొద్ది సంవత్సరాల తర్వాత అద్భుతమైన, మంచి రుచిగా, చక్కని వాసనతో, రసంతో నిండిన మామిడి కాయలు కాసింది. పాట్రీసియా అనేది జోసెఫ్‌ భార్య పేరు. అంతకు ముందు ఓ రాణి పేరు కూడా పాట్రీసియానే అని చెప్పారు. స్వచ్ఛతతో కూడి, ఎంతో తియ్యగా ఉండే పాట్రీసియా రకాన్ని రూపొందించిన జోసెఫ్‌ కృషికి గుర్తింపుగా కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రశంసాపత్రం ప్రదానం చేసి గౌరవించింది.జోసెఫ్ ఫ్రాన్సిస్‌ తన టెర్రస్‌ మీద మామిడి చెట్లను సేంద్రీయ విధానంలో పెంచుతున్న పద్ధతులు ఏంటో తెలుసుకుందాం.. కొబ్బరి పొట్టు, దేశీ ఆవు పేడ, ఎర్రమట్టితో కలిపిన మిశ్రమాన్ని తమ మామిడి చెట్ల పెంపకానికి జోసెఫ్‌ వాడతారు. బలంగా ఉండే ప్లాస్టిక్‌ డ్రమ్ముల్లో ఆ మిశ్రమాన్ని నింపి దానిలో మామిడి మొక్కలు నాటుతారు. అలా వేసిన మామిడి మొక్కలు ఎదుగుతుండగా వాటిని క్రమపద్ధతిలో కత్తిరిస్తుంటారు. వాటిని నాలుగు అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెంచుతారు. అయితే.. టెర్రస్‌పై పెంచే మామిడి చెట్లు ఎంత ఎంత్తు పెరగనివ్వాలనేది ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చన్నారు. మామిడి మొక్కల మొదలు వద్ద ఉండే సేంద్రీయ మిశ్రమ పై భాగాన్ని వారానికి ఒకసారి కదుపుతూ ఉంటారు. కొబ్బరిపొట్టు మిశ్రమాన్ని కదుపుతూ ఉండడం వల్ల డ్రమ్ము అడుగు భాగం ఎప్పుడూ తేమగా ఉంటుందని జోసెఫ్ వివరించారు. నత్రజని, భాస్వరం, పొటాషియం కలిపి తయారుచేసిన ద్రావణాన్ని వారానికి ఒకసారి మామిడి చెట్లపై పిచికారి చేయాలన్నారు. అలా పిచికారి చేసిన మామిడి చెట్ల నుంచి మరింత ఎక్కువ మామిడి దిగుబడి వస్తుందని వివరించారు. మామిడికాయలు మరో వారం పది రోజుల్లో పక్వానికి వస్తాయనగా న్యూస్‌ పేపర్‌ను వాటికి చుట్టాలని జోసెఫ్‌ తెలిపారు.

కాస్త ఎదిగిన ఒక రకం మామిడిచెట్టు కొమ్మలకు మరో రకం మామిడి కొమ్మతో అంటుకట్టి ప్రత్యేకమైన మామిడి రకాలను జోసెఫ్‌ రూపొందిస్తున్నారు. అలా అంటు కట్టిన భాగం వరకు వాటికి కొత్తగా వేళ్లు ఏర్పడే వరకు కొబ్బరిపొట్టు, ఆవుపేడ, మట్టి మిశ్రమంతో నింపి ఉంచాలన్నారు. వేళ్లు మొలిచిన తర్వాత అసలు చెట్టు నుంచి అంటును కత్తిరించి, వేరే డ్రమ్ములో నాటుకోవాలని జోసెఫ్‌ వివరించారు. అంటు కట్టిన మామిడి మొక్క నుంచి ఏడాది తిరిగి వచ్చేసరికే కాయలు కాయడం మొదలవుతుందని చెప్పారు. అంటుకట్టిన మామిడి మొక్కలకు కూకటివేరు ఉండదు. కనుక భారీ ఈదురుగాలులు వీచినప్పుడు పడిపోయే అవకాశం ఉందని జోసెఫ్‌ ఫ్రాన్సిస్‌ చెప్పారు. అలాంటి ప్రమాదం వచ్చే అవకాశం ఉన్నప్పుడు అవి పడిపోకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.జోసెఫ్ ఫ్రాన్సిస్‌ టెర్రస్‌ మామిడి తోటలో ఆల్ఫాన్సో, ఇమాంపసంద్‌, మలిక, దసేరి, కొలంబు, కొస్సెరి, సింధూర్‌, సింధూరం లాంటి కొన్ని ప్రత్యేకమైన మామిడిచెట్లను పెంచుతున్నారు. ఒక్కో మామిడి మొక్క నుంచి పలు కొత్త రకాలను అంటుమామిడి మొక్కలు రూపిందించడంలో జోసెఫ్‌ నేర్పు సంపాదించారు. అయితే.. ఒక్కో చెట్టు నుంచి రెండు లేదా మూడు కొత్త వెరైటీలను మాత్రమే రూపొందిస్తే మంచిదని జోసెఫ్‌ సూచించారు. అంతకు మించి కొత్త మొక్కలను అంటు కట్టి రూపొందిస్తే.. తల్లి చెట్టు నుంచి పంట దిగుబడి తగ్గిపోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. జోసెఫ్‌ తన టెర్రస్‌పై పండించే మామిడి పండ్లను విక్రయించరు. కానీ ఆయా రకాల మామిడి అంటు కట్టిన మొక్కల్ని మాత్రం కావాలన్న వారికి అమ్ముతుంటారు. అలా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త రకం ఒక్కో మొక్కను దాని వయస్సు, సైజును బట్టి 15 వందల నుంచి 5 వేల రూపాయల ధరకు విక్రయిస్తారు.మామిడి చెట్లను పెంచడానికి ముందు జోసెఫ్‌ టెర్రస్‌ మీద గులాబీ, మష్రూమ్‌ పంటలు వేశారు. వాటితో పాటు తేనెటీగల్ని, పావురాలను కూడా పెంచారు. ఇలాంటివన్నీ తన అభిరుచి మేరకు, ఆత్మ సంతృప్తి కోసమే చేస్తుంటానని ఆయన వెల్లడించారు. మామిడి మొక్కలకు ఎప్పుడు ఏమి అవసరమో వాటిని నాటిన మూడేళ్ల వరకూ చాలా జాగ్రత్తగా చూసుకుంటానని జోసెఫ్‌ తెలిపారు. అలా వాటిని కన్నబిడ్డల మాదిరిగా సాకడం తనకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. మామిడి మొక్కల పెంపకం కోసం ఈ 65 ఏళ్ల ఔత్సాహిక సేంద్రీయ రైతు రోజుకు కనీసం మూడు గంటల సమయం వెచ్చిస్తున్నారు. తద్వారా ఎంతో సంతోషాన్ని, రాబడిని కూడా పొందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here