జీరో బడ్జెట్‌ నేచురల్ ఫార్మింగ్‌ (ZBNF) విధానాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి, సేంద్రీయ విప్లవ పితామహుడు సుభాష్‌ పాలేకర్‌ చెప్పిన మాటలతో యనమల జగదీశ్‌ రెడ్డిలో ఎంతో స్ఫూర్తి పొందారు. సుభాష్‌ పాలేకర్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో 2012లో ప్రకృతిసాగు పద్ధతులపై నిర్వహించిన సదస్సులో యనమల జగదీశ్‌ రెడ్డి పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం విధానాల గురించి పాలేకర్‌ చెప్పిన మాటలతో జగదీశ్‌ రెడ్డి ఎంతో స్ఫూర్తి పొందారు. అప్పటి నుంచీ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. తన 20 ఎకరాల్లో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ధాన్యం, మామిడి, చిరుధాన్యాలు తదితర సేంద్రీయ పంటలు జగదీశ్‌రెడ్డి పండిస్తున్నారు. ప్రకృతి పంటలతో పాటు ఆర్గానిక్‌ బెల్లం, చెక్క గానుగ ద్వారా వేరుసెనగ నూనెను తయారు చేస్తున్నారు. సహజసిద్ధ పంటల సాగులో దేశ వ్యాప్తంగా మరో 200 మందికి పైగా రైతులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపల్లెకు చెందిన యనమల జగదీశ్‌రెడ్డి (46) వ్యవసాయం పట్ల మక్కువతో చదువుకు స్వస్తి చెప్పారు. తొలుత రసాయనాలతో కూడిన సాగు చేశారు. తద్వారా 2010లో జగదీశ్‌రెడ్డి బాగా నష్టాలను చవిచూశారు. సుభాష్ పాలేకర్‌ తిరుపతి సదస్సులో చెప్పిన ప్రకృతి సాగు పద్ధతులపై ఆసక్తి పెంచుకున్నారు. అప్పటి నుంచీ జగదీశ్‌రెడ్డి సహజ పంటలే పండిస్తున్నారు. తద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. జగదీశ్‌ రెడ్డి ప్రకృతి సాగులో చేస్తున్న కృషికి గుర్తింపుగా పలు అవార్డులు కూడా అందుకున్నారు. జగదీశ్‌రెడ్డి తండ్రి కృష్ణమూర్తి రెడ్డి కూడా వ్యవసాయదారుడే.

జగదీశ్‌రెడ్డి తన పంటల సాగు కోసం దేశీ ఆవుపేడ, గోమూత్రం, పచ్చి ఆకుల ఎరువు, జీవ తెగులు నియంత్రణ పద్దతులు అనుసరిస్తున్నారు. జీవామృతం, నవపత్ర కషాయం వినియోగిస్తున్నారు. పంట నేలపై ఆచ్ఛాదన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇవన్నీ వినియోగిస్తూ.. తన వ్యవసాయ భూమిని సారవంతమైన నేలగా తయారు చేయడానికి జగదీశ్‌ రెడ్డికి సంత్సరానికి పైగా సమయం పట్టింది. అలా సారవంతంగా మార్చుకున్న భూమిలో జగదీశ్‌రెడ్డి దెహుస్కడ్‌ ఇంద్రాయని, కుల్లాకర్‌ అరిసి, నవారా లాంటి దేశీయ వరి ధాన్యాలు పండిస్తున్నారు. ఆ ధాన్యాలను కిలో 100 నుంచి 150 రూపాయల వరకు అమ్ముతున్నారు. ప్రకృతిసాగు విధానంలో పండించిన పంటలకు డిమాండ్‌తో పాటు ధర కూడా ఎక్కువే. దీంతో జగదీశ్‌రెడ్డి సేంద్రీయ వరిధాన్యం పంట దిగుబడులకు లాభాలు కూడా ఎక్కువగానే కళ్ల జూస్తున్నారు.‘పురుగు మందులు, విషాల నుంచి భూమిని రక్షించాలని నేను కోరుకుంటాను. ఈ విషయంలో దేశ వ్యాప్తంగా అనేక శిక్షణా శిబిరాలు నిర్వహించి, సేంద్రీయ వ్యవసాయం వైపు అనేక మంది రైతులు ఆకర్షితులయ్యేలా చేయగలిగాను. చాలా మంది రైతుల్ని, ఇతరులను కూడా జీరో బడ్జెట్‌ నేచురల్ ఫార్మింగ్‌ వైపు మళ్లించాను. నా సూచనలు, సలహాలతో మా గ్రామంలోని పలువురు రైతులతో పాటుగా దేశంలోని 200కి పైగా రైతులు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు’ అని జగదీశ్‌రెడ్డి సగర్వంగా చెబుతున్నారు.

ఆవు పేడ, గోమూత్రం, బెల్లం, పచ్చ, నల్ల పప్పుల పిండి, అడవి మట్టి మిశ్రమంతో జగదీశ్‌రెడ్డి సేంద్రీయ ఎరువులను తయారు చేస్తారు. అలా తయారు చేసిన 200 లీటర్ల మిశ్రమ ద్రావణం ఎకరంలో ప్రకృతి పంటల సాగుకు సరిపోతుందని ఆయన చెబుతున్నారు. ఇక పురుగులు, కీటకాలను నియంత్రించడానికి నీమాస్త్రం (వేపాకులు, గోమూత్రం, ఆవు పేడ, నీరు) వినియోగిస్తున్నారు. ఇక జీవామృతాన్ని రెండు రోజులు పులియబెట్టి వాడితే పంటలను కీటకాల బారిన పడకుండా రక్షించుకోవచ్చని అంటారు. భూమిపై ఆచ్ఛాదన చేస్తే.. వానపాములు తయారై నేలను మరింత ఎక్కువ ఆరోగ్యంగా ఉంచుతాయన్నారు. తాను చేస్తున్న సహజ వ్యవసాయ సాగు విధానాల గురించి తన ఆరేళ్ల కొడుకుకి కూడా జగదీశ్‌రెడ్డి వివరంగా చెబుతున్నారట. తన కొడుకు భవిష్యత్తులో తన అడుగుజాడల్లోనే నడిచి, భవిష్యత్తులో నేచురల్ ఫార్మింగ్‌లో విజయాలు సాధించాలని ఆయన కోరుకుంటున్నారు.

జగదీశ్‌రెడ్డి 2012 నుంచి 12 ఎకరాల్లో బంగినపల్లి, ఆల్ఫాన్సో, మల్లిక, మాల్గోవా, నీలం లాంటి మామిడిపండ్ల రకాలు విరివిగా పండిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా సహజసిద్ధంగా పెరిగి, పండిన కారణంగా వాటికి వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంటున్నదని చెప్పారు. జగదీశ్‌రెడ్డికి ఒక్కో ఎకరం నుంచి 4.2 టన్నుల వరకు పంట దిగుబడి వస్తోందని, మొత్తం 12 ఎకరాల్లో కలిపి సుమారు 50 టన్నుల మామిడి పంట చేతికి వస్తోందని తెలిపారు. జగదీశ్‌రెడ్డి వాట్సాప్ గ్రూప్‌ కు ఆయన పండించిన సహజ వ్యవసాయ పంటల కోసం వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయన్నారు. తమ పంట ఉత్పత్తులకు వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ వస్తుండడంతో బియ్యం, బెల్లం, కారం, చిరుధాన్యాలు, ఇతర ఉత్పత్తులకు ‘ప్రాణహిత’ అనే పేరుతో సొంతంగా బ్రాండ్‌ పెట్టాలని జగదీశ్‌రెడ్డ యోచిస్తున్నారట.నేచురల్ పార్మింగ్‌లో యనమల జగదీశ్‌రెడ్డి చేస్తున్న వినూత్న విధానాల కారణంగా ఆయనను అనేక అవార్డులు వరించాయి. ఢిల్లీలోని ‘ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌’ ద్వారా జగదీశ్‌రెడ్డి ’ఇన్నోవేటివ్‌ ఫార్మర్‌’ అవార్డు అందుకున్నారు. జగదీశ్‌రెడ్డి సేంద్రీయ వ్యవసాయంలో సాధిస్తున్న విజయాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘ఆదర్శ రైతు’ అవార్డు ప్రదానం చేసింది. ఢిల్లీకి చెందిన నేషనల్‌ న్యూట్రిషన్‌ అండ్ హెల్త్‌ సైన్సెస్‌ నుంచి ఎన్‌ఎన్‌హెచ్‌ఎస్‌ అవార్డు లభించింది. జైపూర్‌లోని మెడికల్‌ అండ్‌ హెల్త్ అసోసియేషన్‌ ‘గ్లోబల్ అవుట్‌ రీచ్‌ హెల్త్‌ కేర్‌’ అవార్డు అందజేసింది. ఇంకా ఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి ‘ఐఏఆర్‌ఐ’ ఫెలో ఫార్మర్‌ అవార్డు కూడా జగదీశ్‌రెడ్డి అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here