ఏదో కాలక్షేపం కోసం, తమ ఇంటి అవసరాల కోసం మిద్దె తోట వ్యవసాయం ప్రారంభించిన బందరు అన్నకు మంచి గుర్తింపు లభించింది. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా ‘రైతునేస్తం’ పురస్కారాన్ని ఇటీవలే అందుకున్నారు. ముందు తన వినియోగం కోసమే మిద్దెతోట ప్రారంభించిన మన బందరు అన్న ఆనక నలుగురికీ ఆదర్శంగా నిలిచారు. మిద్దెతోట పెంపకంలో మెళకువలను పదుగురికీ వివరిస్తూ.. అందరికీ తలలో నాలుక అయ్యారు. మిద్దెతోటలోని మొక్కలకు ఎలాంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ విధానాన్ని అవలంబించారు. ప్రకృతి వ్యవసాయంతో పాటుగా ‘నలుగురికీ ఆరోగ్యం’ కాన్సెప్ట్‌తో పలు ఉచిత వైద్య శిబిరాల నిర్వహణలోనూ పాలు పంచుకుంటున్నారు.వృత్తి చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ అయినా.. ఆయన ప్రవృత్తి మాత్రం ప్రకృతితో మమేకం కావడం. వృత్తిలో ఎంతో బిజీగా ఉన్నా.. ఏ కాస్త సమయం దొరికినా సమాజసేవలోనూ ముందుకు వస్తుంటారు. ఆయనే కృష్ణాజిల్లా బందరులో నివాసం ఉంటున్న మణిరత్నం అన్నా. 17వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయానికి విశేష సేవలందించినవారికి రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక అక్టోబర్ 30న పలువురికి అవార్డులు ప్రదానం చేసింది. ఆ సందర్భంగా మణిరత్నం అన్నా టెర్రస్‌ గార్డెనర్‌గా విస్తరణ విభాగంలో పురస్కారాన్ని అందుకున్నారు.

‘రైతునేస్తం’ పురస్కారం అందుకోవడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని మణిరత్నం అన్నా అన్నారు. అందులోనూ భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం మరింత సంతోషాన్నిచ్చిందన్నారు. దాంతో పాటుగా ఈ అవార్డు తనలో మరింత బాధ్యతను పెంచిందన్నారు.‘మా ఇంటి మీద మిద్దెతోట ప్రారంభించిన తర్వాత.. ఇంట్లో ఉన్న తడి చెత్తను కంపోస్ట్ చేసుకొని ఆవుపేడ తెచ్చి మట్టిలో కలిపిన తర్వాత మొక్కలు నాటి వాడిని. నాలుగు ఆకుకూరలు పెంచుకోవాలనే ఉద్దేశంతో మిద్దెతోటని ప్రారంభించాను. మిద్దెతోట ప్రారంభించిన మొదటి రోజుల్లో నేను యూట్యూబ్ ద్వారా ప్రకృతి వ్యవసాయం మరింతగా అవగాహన పెంచుకున్నాను. ఆ సందర్భంలోనే నాకు రైతునేస్తం వ్యవసాయ మాసపత్రిక గురించి తెలిసింది. ప్రతి ఆదివారం వివిధ అంశాల మీద రైతులకు, వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న వారికి రైతునేస్తం సంస్థ ఉచితంగా శిక్షణ ఇస్తుంది. ఆ విషయం తెలిసి నేను రెండు మూడు వారాల పాటు గుంటూరు జిల్లాలోని కొర్నేపాడులో రైతునేస్తం శిక్షణ తీసుకున్నాను. ఆ శిక్షణలో జీవామృతం, ఘన జీవామృతం, దశపర్ణి కషాయం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటి మరికొన్ని ఎరువులు, సహజసిద్ధమైన పురుగుమందులు ఎలా తయారు చేయాలి అనే విషయం తెలుసుకున్నాను’ అని మణిరత్నం అన్నా వివరించారు.మణిరత్నం అన్నా CA పరీక్షల్లో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కానీ.. ఫైనల్ రెండో గ్రూప్ 5, 10 మార్కులతో ఫెయిల్ అవుతూ ఉండేవారట. అలా ఐదుసార్లు మణిరత్నం ఫెయిలయ్యారట. అప్పుడు తనకు మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయిందట. పరిష్కార మార్గం ఎక్కడ దొరుకుతుందా అని మణిరత్నం వెతికారు. ఆ క్రమంలోనే తనకు మిద్దెతోట మంచి స్నేహితుడు అయిందని చెప్పారు. ఆ కారణంగా ప్రకృతికి దగ్గరయ్యారు. అందుకే తనకు CA-, పర్యావరణం రెండు కళ్లు అని మణిరత్నం అన్నా సగర్వంగా చెప్పుకుంటారు.రైతు నేస్తంలో శిక్షణ తీసుకున్న తర్వాత మణిరత్నం తన మిద్దెతోటలో మూడేళ్ల నుండి జీవామృతం, దశపర్ణి కషాయం, నీమాస్త్రం మాత్రమే ఉపయోగించి పళ్లు, కూరగాయలు, కొన్ని పూలమొక్కలు పెంచుతున్నారు. ఆ విషయం నలుగురికీ తెలియాలనే ఉద్దేశంతో జీవామృతం తయారుచేసి కొన్ని రోజుల పాటు తమ బంధువులు, బృందావనం మిత్రులకు మణిరత్నం అందజేశారు. అలా తమ ఊరిలో మిద్దెతోటలో అనేక మంది వివిధ రకాల మొక్కలు పెంచేవారని చెప్పారు. అలా తమ ఊరిలో మిద్దెతోట సాగు చేస్తున్న సుమారు 400 నుంచి 500 కుటుంబాలు ఉన్నాయని మణిరత్నం వెల్లడించారు.

రైతునేస్తం సంస్థ కొద్ది రోజు క్రితం ఓ ఫోన్‌కాల్‌ వచ్చిందని, ఓ పేపర్ పంపుతాం. దానిలోని ప్రశ్నలకు మీరు సమాధానాలు రాసి మాకు పంపించండి అని చెప్పారట. వారు అడిగిన విధంగా ఆ పేపర్‌ను పూర్తిచేసి పంపించారట. అయితే.. తనకు వాటి గురించి ఎలాంటి ఇతర వివరాలు తెలియదని, అది ఒక సర్వే అనుకున్నారట. ఒకరోజు ఉదయం రైతునేస్తం ఫౌండర్ యడ్లపల్లి వెంకటేశ్వర రావు నుండి మణిరత్నం అన్నాకు మెసేజ్ వచ్చింది. ‘మీరు పద్మశ్రీ ఐవీ సుబ్బారావు రైతునేస్తం అవార్డుకి ఎన్నికయ్యారని, అవార్డు తీసుకోడానికి విజయవాడలోని స్వర్ణ భారత్ ట్రస్ట్‌కి రావాలి’ ఆ మేసేజ్ సారాంశం. అవార్డును భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి చేతులమీదుగా అందుకోబోతున్నారని ఆ మేసేజ్‌లో ఉందని చెప్పారు. ‘ఆ మేసేజ్ చూసిన తర్వాత నాకు నోట మాట రాలేదు. నేను మిద్దెతోట పని చేసుకుంటూ ప్రకృతికి దగ్గరగా ఉంటూ, నా వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూ నలుగురికీ పర్యావరణం గురించి, ప్రకృతి గురించి ఏదో నాలుగు మాటలు ఫేస్‌బుక్ ద్వారా వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది నేను ఏ అవార్డునో, ఏ పదవినో ఆశించి చేసింది కాదు’ అని మణిరత్నం పేర్కొన్నారు.తన లాంటి ఔత్సాహికుల కృషిని గుర్తించి రైతునేస్తం ఫౌండేషన్ అవార్డు ఇచ్చినందుకు యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు మణిరత్నం అన్నా. ‘ఈ అవార్డు నేను చేసే పని మరింత పెంచింది. మా బాధ్యతను మరింత పెంచింది’ అన్నారు. తనకు మరింత సంతోషం కలిగించిన అంశం ఉందట.. అదేంటంటే మిద్దెతోట మిత్రులు హైదరాబాద్‌లో ఉండే శాంతి ధీరజ్‌కు, యూట్యూబ్ స్టార్ మ్యాడ్ గార్డెనర్ మాధవికి కూడా అవార్డు రావడం అని మణిరత్నం హర్షం వ్యక్తం చేశారు. మిద్దెతోట మిత్రులకే కాకుండా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, అగ్రికల్చర్ జర్నలిస్టులు, ఔత్సాహికులకు రైతునేస్తం అవార్డులు అందజేయడం ఆనందం కలిగించిందన్నారు మణిరత్నం.‘రైతునేస్తం’ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ రంగానికి జీవితాంతం సేవలందించిన ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త స్వర్గీయ పద్మశ్రీ డా.ఐ.వి. సుబ్బారావు పేరిట రైతునేస్తం పురస్కారాలు అందిస్తోందీ సంస్థ. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, విస్తరణ అధికారులు, అగ్రి జర్నలిస్టులను రైతునేస్తం సంస్థ అవార్డులతో సత్కరిస్తోంది.

You can join Mani’s FB group Bandar Brundavanam here.

Or contact on mobile number: +918885382341

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here