ప్రకృతిసిద్ధ వ్యవసాయ విధానంలో ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్న విధానం హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌. తక్కువ నేలలో అధిక పంటలు పండించడం ఈ విధానంలో ప్రధానమైనదే అయినా.. ఇప్పుడది ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో మరింతగా ప్రాచుర్యం పొందుతోంది. నిజానికి చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ లాంటి మెట్రో నగరాల్లోని ఆరోగ్యాభిలాషులను ఇప్పుడిప్పుడే మరింతగా ఆకట్టుకుంటోంది.ఇలాంటి అవకాశాన్నే అందిపుచ్చుకున్నాడు తిరుపతికి చెందిన 23 ఏళ్ల అగ్రికల్చరల్‌ బీఎస్సీ చేసిన యువ ‘ఫార్మ్‌ ప్రెన్యూర్‌’ సందీప్‌ కన్నన్‌. మన సమాజానికి పోషకాలతో కూడిన, పరిశుభ్రమైన, రసాయనాలతో కూడిన పురుగుమందులు అస్సలు లేకుండా ఆకుకూరలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నాడు. ఒక పక్కన హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌లో కష్టపడుతూనే మరో పక్కన పోటీ పరీక్షలకు కూడా సమాయత్తం అవుతున్నాడు. తమిళనాడు అగ్రికల్చర్‌ యూనివర్శిటీ నుంచి కన్నన్‌ ఏజీ బీఎస్సీ పూర్తిచేశాడు. డిగ్రీ పూర్తిచేసిన తర్వాత తిరుపతి సమీప తనపల్లెలోని తమ అర ఎకరం వ్యవసాయ పొలంలో ‘వ్యవసాయి భూమి’ పేరిట అర్బన్‌ ఫార్మ్‌ను ప్రారంభించాడు. పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు పండిస్తున్నాడు.సందీప్‌ కన్నన్‌ తన వ్యవసాయ క్షేత్రంలో పాలకూర, ఎర్ర ఉసిరి, కాలే తులసి, బ్రొకోలీ, పాక్‌చోయ్‌ (చైనా క్యాబేజి) లాంటి ఆకు కూరలు, కూరగాయలు విరివిగా పండిస్తున్నాడు. పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ విధానంలో పండించే పంటల్ని ఇతర విధానాల్లో పండించే పంటల్ని పోల్చితే పోషకాలు అత్యధికంగా ఉంటాయని, పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయని సందీప్ కన్నన్‌ పేర్కొన్నాడు. పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ విధానంలో పంటలు పండించడానికి ఖర్చు చాలా తక్కువ అవుతుందన్నాడు. పోలీహౌస్‌లో సమ శీతోష్ణస్థితి విధానంలో వ్యవసాయం చేయడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవసరమైనంత న్యూట్రిషన్‌ కూడా అందుతుందన్నాడు. సాంప్రదాయ పద్ధతిలో చేసే వ్యవసాయం కన్నా హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌లో పంట దిగుబడి అధికంగా వస్తుందని అనుభవపూర్వకంగా చెప్పాడు. ఈ విధానంలో వ్యవసాయం చేసే రైతులకు లాభాలు బాగా వస్తాయన్నాడు. అదే సమయంలో వినియోగదారులకు ఆరోగ్యంతో పాటు ఆనందం కూడా కలుగుతుందని తెలిపాడు సందీప్‌ కన్నన్‌. పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ విధానంలో నెట్‌ కప్పుల్లో విత్తిన విత్తనాలు కేవలం 45 నుంచి 60 రోజుల్లోనే పంట చేతికి వచ్చేస్తుందని సందీప్‌ కన్నన్‌ వెల్లడించాడు.హైడ్రోపోనిక్స్ ఫార్మింగ్‌లో సమశీతోష్ణ వాతావరణ కారణంగాను, మట్టి, నేల అవసరం లేదు కాబట్టి క్రిమికీటకాల బెడద చాలా తక్కువ అని సందీప్‌ కన్నన్‌ చెప్పాడు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి తిరుపతి నగర ప్రజలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారని కన్నన్‌ పేర్కొన్నాడు. తాము పండిస్తున్న పంటలు సూపర్‌ మార్కెట్లలో అందుబాటులో ఉంటాయని, దాంతో పాటుగా తిరుపతి నగరంలో డోర్ డెలివరీ విధానం కూడా అమలు చేస్తున్నామన్నాడు.చివరికి సందీప్‌ కన్నన్‌ చేస్తున్న పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ అనేక మంది రైతులు, వ్యవసాయ విద్యార్థులకు ఓ చక్కని అవగాహన కేంద్రంగా కూడా ఉంది. తమ ఫాంకు వచ్చే ప్రతి ఒక్కరికీ తాను చేస్తున్న వ్యవసాయ విధానాలను సందీప్ కన్నన్‌ ఎంతో శ్రద్ధగా, వారికి అర్థమయ్యే రీతిలో వివరిస్తుంటాడు. తద్వారా వారిలో వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొదిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారిని తమ పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ క్షేత్రాన్ని సందర్శించేందుకు పోత్రహిస్తున్నాడు.

రైతన్నలూ, వ్యవసాయశాస్త్ర విద్యార్థులూ మనం కూడా చూసొద్దామా సందీప్‌ కన్నన్‌ పోలీహౌస్‌ హైడ్రోపోనిక్స్‌ ఫార్మింగ్‌ క్షేత్రాన్ని..!

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here