ప్రకృతి వ్యవసాయం అంటే ఆయనకు మక్కువ ఎక్కువ. తమ మూడంతస్థుల భవంతినే ఓ మొక్కల తోటగా మార్చేశాడు. హైడ్రోపోనిక్‌ విధానంలో తన భవనంలో ఏకంగా 10 వేల మొక్కల్ని పెంచుతున్నాడు. ప్రకృతి విధానంలో తాను చేస్తున్న తోట భవంతిలో పండించే పంటల ద్వారా ప్రతి ఏటా 70 నుంచ 80 లక్షల రూపాయల వరకూ ఆదాయం రాబట్టుకుంటున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన రామ్‌వీర్‌ సింగ్‌ సాధించిన ఘనతేంటో తెలుసుకుందాం.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రామ్‌వీర్‌ సింగ్‌ ముందు చాలాకాలం విద్యా విభాగంలో పనిచేశాడు. ఆ తర్వాత ఓ మీడియా సంస్థలో జర్నలిస్టుగా కూడా విధులు నిర్వర్తించాడు. అయినా ఏదో అసంతృప్తి రామ్‌వీర్ సింగ్‌లో ఉండేది. వ్యవసాయ నేపథ్యం రామ్‌వీర్‌ సింగ్‌ ఆ తర్వాత  వ్యవసాయం చేయాలనే తపనతో తన పుట్టిన ఊరు తిరిగి వచ్చేశాడు. వ్యవసాయంపై మక్కువతో ముందుగా ఆయన ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ప్రారంభించాడు. ఆర్గానిక్ పద్ధతిలో విజయాలు సాధించిన తర్వాత రామ్‌వీర్‌ పూర్తిగా హైడ్రోపోనిక్‌ పద్ధతిలో కూరగాయలు పండించడం మొదలెట్టాడు. అందులోనూ లాభాల పంట పండిస్తున్న రామ్‌వీర్‌ తన మూడంతస్థుల సొంత భవనాన్ని పూర్తిగా హైడ్రోపోనిక్‌ పంటలతో నింపేశాడు. అలా తన భవనంలో 10 వేల మొక్కలు నాటి పెంచాడు. దాంతో పాటుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో అనేక మంది ఇళ్లల్లో కూడా హైడ్రోపోనిక్‌ పంటలు పండించేలా అవగాహన, శిక్షణ ఇచ్చాడు. దీంతో రామ్‌వీర్‌ సింగ్ ఇక ఆదాయాన్ని, లాభాల్ని ఇబ్బడి ముబ్బడిగా సంపాదిస్తున్నాడు. ఏటా సుమారు 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు రామ్‌వీర్‌కు ఆదాయం వస్తోంది.ఆర్గానిక్‌ వ్యవసాయం అంటే తాను ఎల్లడూ ఎంతగోనో ఇష్టపడతానని 43 ఏళ్ల రామ్‌వీర్‌ సింగ్ చెప్పాడు. తమ కుటుంబం మొత్తం వ్యవసాయంలోనే ఉన్నారని, తమకు సరిపడినంత భూమి కూడా ఉందన్నాడు. అయితే.. గతంలో తమ కుటుంబం మొత్తం సాంప్రదాయ వ్యవసాయం చేసేవారన్నాడు. సాంప్రదాయ వ్యవసాయంలో వచ్చే ఆదాయంతోనే తమ కుటుంబ అవసరాలు తీర్చుకునేవారం అని చెప్పాడు.

2009లో తన మిత్రుడి బంధువుకు క్యాన్సర్ సోకిందని రామ్‌వీర్‌ గుర్తుచేసుకున్నాడు. ఆ బంధువు ఎలాంటి మత్తు పదార్థాలు వినియోగించకపోయినా క్యాన్సర్ బారిన పడడం తనకు ఆశ్చర్యం, ఆందోళన కలిగించాయని తెలిపాడు. రసాయనాలు వాడిన పండ్లు, కూరగాయలు వినియోగించడం వల్ల ఆ బంధువుకు క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. తెలిసో తెలియకో రసాయనాలు వినియోగించిన ఆహార పదార్థాలనే వాడుతున్న తాము కూడా క్యాన్సర్‌ బారిన పడే అవకాశాలు ఉన్నాయని రామ్‌వీర్‌ సింగ్ భావించాడు. ఇలాంటి అనారోగ్యాల నుంచి తాము, తమ వారు రక్షించుకోవాలంటే రసాయన రహిత ఆర్గానిక్‌ ఫార్మింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత రామ్‌వీర్ సింగ్‌ తన సొంతూరికి తిరిగి వచ్చేశాడు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం ప్రారంభించాడు. తమ వ్యవసాయ భూమిలో ప్రకృతి పంటల విధానంలో పండ్లు, కూరగాయలు, ధాన్యం పంటలు పండించాడు. ఆ పంటలనే రామ్‌వీర్‌ సింగ్, ఆయన కుటుంబం ప్రతిరోజు తమ ఆహారంగా వినియోగించేది. రామ్‌వీర్‌ సింగ్‌ కుటుంబం మొత్తం ఆర్గానిక్‌ పంటల్నే ఆహారంగా తీసుకోవడంతో ఎంతో ఆరోగ్యాన్ని, సంతృప్తిని పొందింది.

ఆ తరువాత రామ్‌వీర్‌సింగ్ కుటుంబం ఆర్గానిక్‌ పంటల్ని సొంత వినియోగానికి మాత్రమే కాకుండా వ్యాపారం స్థాయిలో పండించారు. క్రమేపీ రామ్‌వీర్‌సింగ్‌ విజయవంతుడైన ఆర్గానిక్ రైతుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆర్గానిక్‌ పంటల కోసం తాము చేసిన ఖర్చు కంటే ఎక్కువ ఆదాయం రావడంలేదని పలువురు రైతులు చెప్పారని రామ్‌వీర్‌సింగ్ గుర్తుచేసుకున్నాడు. మరికొందరైతే తమకు తక్కువ భూమి ఉన్నందున అధికంగా పంటలు పండించే అవకాశం లేకపోతోందని అన్నారని తెలిపాడు. వారు ఒకే సమయంలో ఎక్కువ రకాల పంటలు పండించలేకపోతున్నారన్నాడు. ఎందుకంటే అప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఆదాయం తక్కువ ఉండేది. ఈ సమస్యను అధిగమించేందుకు, తక్కువ నేలలో ఎక్కువ పంటలు ఎలా పండించాలనే అంశంపై రామ్‌వీర్ సింగ్‌ పరిశోధన ప్రారంభించాడు. ఆ క్రమంలో తక్కువ నేల మీద పరంజాలు పెట్టి ఎక్కువ రకాల పంటలు పండించ వచ్చనే ఆలోచన రామ్‌వీర్‌ సింగ్‌కు వచ్చింది. దేశంలో అక్కడక్కడా కొందరు రైతులు ఈ విధానం అనుసరిస్తున్నా గ్రామాల్లోని రైతులకు అంతగా తెలియదు.కొన్ని పంటలు భూమి లోపల పండుతాయి. మరికొన్ని భూమి పైన వస్తాయి. మరి కొన్ని పంటల్ని పరంజాల్లో అంచెలంచెలుగా కొందరు రైతులు పండిస్తున్నారు. వరదలు, నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోయే ప్రాంతాల్లో పరంజాల్లో పంటల విధానం బాగా ఉపయోగపడుతోంది. ఒడిశా సహా పలు రాష్ట్రాల్లోని రైతుల కోసం రామ్‌వీర్ సింగ్‌ పరంజా పంటల విధానాన్ని ఏర్పాటు చేశాడు. వారికి . బాగా లాభాలు వచ్చేలా చేశాడు.

హైడ్రోపోనిక్‌ పంటల ఆలోచనా విధానాన్ని రామ్‌వీర్‌ సింగ్‌ దుబాయ్‌ నుంచి నేర్చుకున్నాడు. 2016లో రామ్‌వీర్ సింగ్‌ దుబాయ్ వెళ్లినప్పుడు అక్కడి రైతులు చేస్తున్న హైడ్రోపోనిక్‌ పంటల్ని తొలిసారిగా అతి దగ్గరగా చూశాడు. హైడ్రోపోనిక్‌ పంటలతో దుబాయ్‌ రైతులు మంచి లాభాలు కూడా సాధిస్తున్నట్లు రామ్‌వీర్‌ సింగ్ తెలుసుకున్నాడు. హైడ్రోపోనిక్ పంటల విధానం రామ్‌వీర్‌సింగ్‌కు ఎంతగానో నచ్చేసింది. కొద్దిరోజులు దుబాయ్‌ ఉన్న రామ్‌వీర్‌ హైడ్రోపోనిక్ పంటల సాగుపై అవగాహన కోసం అక్కడి రైతుల నుంచి శిక్షణ తీసుకున్నాడు.

హైడ్రోపోనిక్‌ విధానంపై అలా శిక్షణ తీసుకున్న రామ్‌వీర్‌ సింగ్ మన దేశానికి తిరిగి వచ్చిన తర్వాత తమ మూడంతస్థుల ఇంటిని పచ్చని హైడ్రోపోనిక్‌ పంటల తోటగా మార్చేశాడు. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి అన్ని రకాల పండ్లు, కూరగాయల మొక్కల్ని పెంచాడు. అలా హైడ్రోపోనిక్‌ విధానంలో సాగు ప్రారంభించిన రామ్‌వీర్‌సింగ్‌కు కొద్ది సమయంలోనే పంట ఉత్పత్తుల ద్వారా లాభాలు రావడం మొదలయ్యాయి. అలా వచ్చిన ఆదాయం ద్వారా సాగు దిగుబడి కూడా ఊహించని విధంగా పెరిగింది. ఇక వెనక్కి తిరిగి చూడకుండా రామ్‌సింగ్‌ హైడ్రోపోనిక్ సాగు విధానాన్ని వ్యాపార స్థాయికి తీసుకెళ్లాలని ప్రణాళిక వేసుకున్నాడు. తాను పండించిన హైడ్రోపోనిక్‌ పంటలకు మార్కెట్లో వినియోగదారుల నుంచి చక్కని స్పందన లభించింది.ఆర్గానిక్‌ వ్యవసాయ విధానాన్ని వీలైనంత ఎక్కువ శాతం మందికి అలవాటు చేయాలనేది తన ఆశయం అని రామ్‌వీర్‌సింగ్‌ వెల్లడించాడు. మరింత ఎక్కువ మంది ఉనం ఆర్గానిక్‌ పంటల ఉత్పత్తుల్నే వినిగించేలా చేయాలనేది తన అభిమతం అన్నాడు. ఈ క్రమంలోనే రామ్‌వీర్‌ సింగ్‌ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కూడా పలువురు రైతులకు హైడ్రోపోనిక్‌ సాగు విధానంపై అవగాహన కల్పించాడు. అనేక మందికి హైడ్రోపోనిక్‌ పంటల సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేశాడు. ఈ విధానంలో పలువురు రైతులు సొంత వినియోగానికి, వ్యాపార దృష్టితో కూడా ఆర్గానిక్‌ పంటలు పండిస్తున్నారని, తద్వారా మంచి మంచి లాభాలు కూడా పొందుతున్నారని రామ్‌సింగ్‌ సగర్వంగా చెప్పాడు.

https://vimpaorganic.com పేరిట రామ్‌వీర్ సింగ్‌ ఓ సొంత వెబ్‌సైట్‌ను రూపొందించాడు. హైడ్రోపోనిక్‌ పంటలు పండించాలనే కోరిక ఉన్నవారెవరైనా తనను ఈ వెబ్‌సైట్‌ ద్వారా సంప్రదించవచ్చన్నాడు. అలాంటి ఔత్సాహికులకు తాను ముందుగా పూర్తిగా హైడ్రోపోనిక్ పంటల విధానంపై శిక్షణ ఇచ్చి, అవగాహన కల్పిస్తానని తెలిపాడు. ఆ శిక్షణ తీసుకుని, అవగాహన కల్పించుకున్న వారికి వారి స్వస్థలాల్లో హైడ్రోపోనిక్‌ సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తానని రామ్‌వీర్‌సింగ్ చెప్పాడు. అక్కడితో ఆగిపోకుండా ఫోన్‌ ద్వారా, లేదా వీడియో కాల్‌ ద్వారా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తున్నట్లు పేర్కొన్నాడు.

రామ్‌వీర్‌ సింగ్ ప్రస్తుతం తన భవనంలో హైడ్రోపోనిక్‌ విధానంలో పలు రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు పండిస్తున్నాడు. దాంతో పాటుగా తమ పంటల నుంచి ఆర్గానిక్ విధానంలో బెల్లం, గంజి, పిండి లాంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నాడు. వాటిని ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ విధానంలో దేశవ్యాప్తంగా విక్రయిస్తున్నాడు. రామ్‌వీర్‌ సింగ్‌ తన ఉత్పత్తుల తయారీలో వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

హైడ్రోపోనిక్‌ విధానంలో మొక్కల పెంపకానికి భూమి అవసరం లేదు. పైపులు లేదా స్టాండ్‌ల మీదే మొక్కల పెంపకం జరుగుతుంది. నేలకు బదులుగా మొక్కల పెంపకానికి కొబ్బరి పొట్టు వినియోగిస్తారు. కొన్ని సమయాల్లో రాళ్లు కూడా వాడతారు. చాలా తక్కువగా నీరు అవసరం ఉంటుంది. మామూలు వ్యవసాయం కన్నా 70% నీటి వినియోగం తగ్గిపోతుంది. మొక్కలు పెరిగేందుకు నీటి ద్వారానే పోషకాలు అందించవచ్చు. ఆటోమేటిక్ కంట్రోల్‌ విధానంలో స్విచ్‌ నొక్కి ఎండాకాలమైనా మరే కాలమైనా మొక్కలకు నీరు, పోషకాలను అందించే వీలుంది.

హైడ్రోపోనిక్‌ విధానంలో పంటలు పండించాలనుకునే వారు తమకు సమీపంలోని కృషి విజ్ఞాన కేంద్రం నుంచి శిక్షణ తీసుకోవచ్చు. అలాగే అనేక మంది నిపుణులు కూడా శిక్షణ అందిస్తున్నారు. అలాగే.. మార్కెట్లో, ఆన్‌లైన్‌లో అనేక శిక్షణ వీడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. హైడ్రోపోనిక్‌ సాగుకు అవసరమైన పరికరాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇంటి అవసరాల కోసం హైడ్రోపోనిక్‌ సాగు చేయాలంటే 10 వేలు నుంచి 15 వేల రూపాయల పెట్టుబడి సరిపోతుంది. వ్యాపార విధానంలో హైడ్రోపోనిక్‌ సాగు చేయాలనుకునే పరిమితిని బట్టి ఖర్చు చేయాల్సి వస్తుంది. హైడ్రోపోనిక్‌ విధానంలో సాగు చేసే మొక్కలకు సమశీతోష్ణ స్థితి మెయింటెన్‌ చేసేందుకు అవసరమైన పోలీహౌస్‌ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అందుకు ప్రభుత్వం సబ్సిడీ కూడా లభిస్తుంది. పోలీహౌస్‌ నిర్మించేందుకు బ్యాంకు నుంచి లోన్‌ కూడా తీసుకునే సౌకర్యం ఉంటుంది.

మరిన్ని వివరాలు కావాలంటే https://vimpaorganic.com ద్వారా తెలుసుకోవచ్చు.

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here