ఆర్థిక విషయాల్లో ఎంబీఏ చేశారు ప్రియ నారాయణన్‌. చదివింది అయినప్పటికీ ప్రియ 500 రకాల దేశీ విత్తనాల బ్యాంకు నిర్వహిస్తున్నారు. వాటిలో 100 రకాల వంగ, 60 రకాల కంటే ఎక్కువ మిర్చి, 38 రకాల బెండ, 30 రకాల పాలకూర, 50కి పైగా దుంప రకాల విత్తనాలు ప్రియా రాజ్‌ నారాయణన్ జాగ్రత్తగా నిల్వ చేసి ఉంచారు. 2005లో పెళ్లి అయిన తర్వాత ప్రియ తమిళనాడులోని తిరుపూర్‌ లోని నల్లూరు వెళ్లారు. నల్లూరులో ఆమె భర్త ఓ దుస్తుల సంస్థలో పనిచేస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ప్రియ దిండిగల్‌ జిల్లాలోని పిలతు గ్రామంలోని తన పుట్టింటి ఆహార అవసరాల కోసం ఏనాడూ మార్కెట్‌ నుంచి కూరగాయలు కొనలేదు. అయితే.. పెళ్లయిన తర్వాత తిరుపూర్‌ లో తమ కుటుంబం కోసం కూరగాయలు, ఆకు కూరలు కొన్నప్పుడు వాటి నుంచి రసాయనాల వాసన రావడం గమనించారు. తన కుటుంబానికి ఇలాంటి విషపూరిత కూరగాయలతో భోజనం పెడుతున్నానా అనే అసంతృప్తి  ప్రియలోపేరుకుపోయింది.ఆ తర్వాత తమ పుట్టింటికి వెళ్లినప్పుడు ప్రియ టమోటా, మిర్చి, మరి కొన్ని వంగ రకాల విత్తనాలు తీసుకొచ్చారు. అనంతరం ఆమె తన కిచెన్‌ గార్డెన్‌ లో పెంచేందుకు దేశీ రకాల విత్తనాల కోసం అన్వేషణ మొదలెట్టారు. 2007లో మార్కెట్ నుంచి వంగ, పాలకూర, ఇతర కొన్ని రకాల కూరగాయల విత్తనాలు తీసుకొచ్చారు. వాటిని తాము అద్దె ఇంటిలోనే సహజ పంటల విధానంలో పెంచడం ప్రారంభించింది. దేశీ విత్తనాలతో కూరగాయలు, ఆకు కూరల సాగును పూర్తి స్థాయిలో చేసేందుకు ప్రియ 2020లొ తన ఉద్యోగాన్ని వదిలేశారు. దేశీ లేదా సాంప్రదాయ విత్తనాలను రసాయనాలేవీ వాడకుండా ప్రత్యేకంగా పెంచాలి.దేశీ విత్తనాలకు క్రిమి కీటకాలను తట్టుకునే శక్తి ఉంటుంది. హైబ్రీద్‌ విత్తనాల మాదిరిగా కాకుండా ఇప్పుడు పండిన దేశీ విత్తనాలను వచ్చే సీజన్ వరకు దాచి ఉంచుకోవచ్చు. దేశీ విత్తనాల నుంచి పెరిగే మొక్కలు ఎదుగుదలకు, మనుగడ సాగించడానికి నీటి అవసరం పెద్దగా ఉండదు. సహజసిద్ధంగా సాగుచేసే సాంప్రదాయ పంటల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని, వాటిని తిన్న వారి ఆరోగ్యం మెరుగవుతుందని, పైగా భూమికి, వాతావరణానికి ఎలాంటి హాని ఉండదని ప్రియ తెలిపారు.  దేశీ విత్తనాల ద్వారా పండే పంటల రుచిని, ఆరోగ్యాన్ని గమనించిన ప్రియ ఆయా విత్తనాలను భద్రపరిచే కార్యక్రమం 2007 లోనే ప్రారంభించారు. 2008 నుంచి 2009 వరకు తాను పెళ్లిళ్ల కోసం కేరళలోని త్రిశూర్‌, మల్లాపురం ఇతిర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కంథరి మిర్చి, వెంగేరి వంగ, బెండ, పాలకూర సహా పలు ఇతర రకాల దేశీ విత్తనాలను సేకరించినట్లు ప్రియ గుర్తు చేసుకున్నారు.2008లో ప్రియ కుటుంబం తమ సొంత పట్టణానికి తిరిగివచ్చేశారు. అప్పటి నుంచి ప్రియ దేశీ కూరగాయలను మరింత ఎక్కువ స్థలంలో పెంచడానికి అవకాశం వచ్చింది. 1200 చదరపు గజాల తమ టెర్రస్‌ పై ప్రియ తాను సేకరించిన రకరకాల దీశీ విత్తనాలతో సహజ పంటల సాగు చేస్తున్నారు. ఇక 2009లో ప్రియకు కేరళ నుంచి ఒక ఫ్రెండ్‌ కొన్ని బీన్స్‌, మరికొన్ని వంగ దేశీ విత్తనాలు పంపించారట. వాటిని కూడా ఆమె సాగుచేస్తున్నారు. ఆ పంటల నుంచి విత్తనాలు తయారు చేసిన ప్రియ కొన్నింటిని ఇతరులకు కూడా ఉచితంగా అందజేయడం ప్రారంభించారు. తొలుత తాను పండించిన విత్తనాలను సహజ పంటలంటే ఉత్సాహం ఉన్న తన స్నేహితులకు ప్రియ అందజేసేవారట. ప్రియ ఉచితంగా దేశీ విత్తనాలు పంపిణీ చేస్తున్న విషయం విన్న ఇంకా అనేక మంది ఇతర ఔత్సాహికులు క్రమేపీ ఆమె నుంచి విత్తనాలు తీసుకెళ్లి సహజ పంటల సాగు చేస్తున్నారు. ప్రియ తన వద్ద ఉన్న దేశీ విత్తనాలను పోస్టు ద్వారా తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలతో పాటు అమెరికా, కెనడా, మెక్సికో, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ లాంటి విదేశాల్లోని ఔత్సాహిక రైతులకు కూడా పంపిస్తున్నారు.దేశీ విత్తన బ్యాంకు నిర్వహిస్తున్న ప్రియ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్‌ లాంటి ఇతర రాష్ట్రాలను సందర్శించారు. ఆయా రాష్ట్రాల్లో తన దేశీ విత్తనాల సేకరణ, సాగు విధానాలపై పలువురికి అవగాహన కల్పించారు. వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న ప్రియ స్నేహితులు తాము చూసిన దేశీ రకాల విత్తనాల ఫొటోలు తీసి పంపించడమే కాకుండా, వాటిని సేకరించి తనకు కొరియర్ ద్వారా పంపిస్తుంటారని తెలిపారు. ఆ విత్తనాలను ఎవరి వద్ద తీసుకున్నది?  ఆ విత్తనాల చరిత్ర.. ఆ విత్తనాలను తనకు ఇచ్చినవారు ఎన్నేళ్లుగా స్వచ్ఛంగా  మెయింటెయిన్ చేస్తున్నారు? అనే విషయాలను తెలుసుకుంటారు. రెండు రకాల మొక్కల్ని దగ్గరగా పెంచితే.. కీటకాల ద్వారా ఒకదానికి ఒకటి సులువుగా పరపరాగ సంపర్కం చెందుతాయని ప్రియ వివరించారు. ఒకే రకమైన మొక్కల్ని దగ్గర దగ్గరగా తాను పెంచనని, ఒకవేళ దగ్గరగా పెంచాల్సి వస్తే.. క్రాస్‌ బ్రీడింగ్ జరగకుండా ఉండేందుకు వాటి పువ్వులను కవర్లతో కప్పి ఉంచుతానని వివరించారు. అంతే కాదు.. ఒకే సీజన్‌ లో అన్ని రకాల దేశీ మొక్కల్ని సాగుచేయనని ప్రియ చెప్పారు. టమోటా, వంగ విత్తనాలను నిల్వ చేయడం కోసం పండిన కాయలను ఎండబెతానని తెలిపారు. తర్వాత విత్తనాలను కాయల నుంచి వేరు చేసి, వాటిని శుభ్రం చేసి, 10 నుంచి 15 రోజుల పాటు నీడలోనే ఆరబెడతారామె. తొలి రోజుల్లో విత్తనాలను క్రిమి కీటకాల నుంచి రక్షించడానికి బూడిదలో కలిపి ఉంచేవారు. అయితే.. ప్రియ మాత్రం తాను తయారు చేసిన దేశీ విత్తనాలను జిప్‌ లాక్‌ సంచుల్లో ఉంచి, ఆ విత్తనాల పేర్లు, ప్యాకింగ్‌ చేసిన తేదీ, ఇతర వివరాలతో సంచులపై లేబుళ్లు అతికిస్తానని అన్నారు. అలా జిప్‌ లాక్‌ సంచుల్లో ఉంచిన విత్తనాలను ప్రియ ప్రిజ్‌ డోర్లలో ఉంచుతారట. వాటిని ఫ్రీజ్‌ చేయనని తెలిపారు. అలా చేసిన విత్తనాలు రెండేళ్ల తర్వాత అయినా సరే 97 శాతం వరకు విజయవంతంగా మొలకెత్తుతాయని వెల్లడించారు. అదే హైబ్రీడ్‌ విత్తనాలైతే.. మరుసటి ఏడాదికి కూడా పనికిరావని అన్నారు.దేశీ విత్తనాలను తాను ఎలా తయారు చేస్తున్నదీ, ఎలా నిల్వ చేస్తున్నదీ ఔత్సాహిక రైతులకు అవగాహన కల్పించేందుకు క్రమం తప్పకుండా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. అలా తాను శిక్షణ ఇచ్చిన అనేక మంది రైతులు దేశీ విత్తనాలతో తమ సొంత అవసరాలకు పంటలు సాగుచేస్తున్నారని, మరి కొందరైతే.. తమ వినియోగించుకోగా మిగిలిన సహజ కూరగాయలు, ఆకు కూరల్ని విక్రయిస్తుంటారని తెలిపారు. వాస్తవాతనికి దేశీ విత్తనాలు సహజ పంటల విధానంలో అయితేనే బాగా ఎదుగుతాయని ప్రియ తెలిపారు. ఆర్గానిక్‌ సాగు విధానంలో  ల్యాబ్‌ లలో రూపొందించిన సింథటిక్‌ ఎరువులను వినియోగిస్తారని, అయితే.. సహజ పంటల సాగులో అయితే.. దేశీ ఆవు పేడ తప్ప ఇంకేమీ వాడకూడదన్నారు.

సహజ పర్యావరణ వ్యవస్థను పెంపొందించే సహజ పంటల సాగు పట్ల మొగ్గుచూపే రైతులకు తన ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుందని ప్రియ వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here