భారతదేశంలో అత్యంత వేడి ప్రాంతం రాజస్థాన్‌. అలాంటి చోట మొక్కల్ని పెంచడం హాబీగా తీసుకోవడం, పూర్తిస్థాయిలో తోట నిర్వహించడం అంటే పెద్ద సవాలే. కానీ.. ఈ ఛాలెంజ్‌ లో బర్మర్‌ నివాసి 40 ఏళ్ల ఆనంద్‌ మహేశ్వరి విజయం సాధించారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ప్రపంచం అంతా లాక్‌ డౌన్‌ లోకి వెళ్లినప్పుడు ఆనంద్‌ మహేశ్వరి తన టెర్రస్‌ పై 150 రకాలకు చెందిన 1000 మొక్కల్ని పెంచుతూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుతున్నారు. తమ టెర్రస్‌ పై వాడేసిన క్యాన్లు, కంటెయినర్లు, ఖాళీ పాలసంచులు, పెట్టెల్లో సహజ విధానంలో మొక్కల్ని పెంచుతున్నారు. అందుకు కారణం కూడా ఆనంద్‌ వివరిస్తున్నారు. కోవిడ్‌ సమయంలో స్వచ్ఛమైన గాలి పీల్చడం, సహజసిద్ధంగా పండించిన ఆహార పదార్థాలు తినాల్సిన ఆవశ్యకత తనకు బాగా అర్థమైందన్నారు. ఆ సందర్భంగా తాను హాబీగా ప్రారంభించిన తోట పెంపకం ఇప్పుడు పార్ట్‌ టైం జాబ్‌ లా మారిందని ఆనంద్‌ మహేశ్వరి ఆనందంగా చెప్పారు.వృత్తిరీత్యా ఆనంద్‌ రెడీమేడ్‌ దుస్తుల డీలర్‌.  గార్డెనింగ్‌ అంటే ఆనంద్‌ కు చిన్నప్పటి నుంచీ ఆసక్తి. తండ్రికి ఉద్యోగ రీత్యా తరచూ ట్రాన్స్‌ ఫర్లు అవుతుండడంతో ఆనంద్‌ కోరిక పూర్తిగా నెరవేరే అవకావం ఉండేది కాదు. తండ్రికి బదిలీ అయినప్పుడల్లా ఆనంద్‌ తాను పెంచుతున్న మొక్కల్ని చుట్టుపక్కల వారికి ఉచితంగా ఇచ్చేవారు. ఆనంద్‌ కు ఎనిమిదేళ్ల వయస్సులో ఆయన కుటుంబం బర్మర్‌ లో స్థిరపడింది. దీంతో ఆనంద్‌ తమ టెర్రస్‌ పై బంతి, గులాబీ, తులసి మొక్కలతో ఓ చిన్న తోట పెంచడం ప్రారంభించారు. ఇటీవలి కాలంలో ఆనంద్‌ తన మిద్దెతోటను బాగా విస్తరించారు. ప్రస్తుతం తమ 800 చదరపు గజాల టెర్రస్ పై రకరకాల మొక్కలు పెంచుతున్నారు. మొక్కల పెంపకంలో ఆనంద్‌ కు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ, అనుభవం కానీ లేవు. అయినప్పటికీ నర్సరీల్లో దొరికే కొన్ని మొక్కల్ని తెచ్చి తమ మిద్దెపై పెంచడం ప్రారంభించారు.వేడి వాతావరణంలో మొక్కల పెంపకం అంత సులువు కాదు. అందుకే ఆనంద్‌ నాటిన కొన్ని మొక్కలు త్వరగానే చనిపోయేవి. మామూలుగా ప్రతిచోటా దొరికే సిమెంట్‌ కుండీల్లో మొక్కలు నాటితే.. ఏడాదిన్నరకు మించి బతికేవి కాదు. దీంతో వృథాగా పడి ఉన్న పెట్టెలు, పాల సంచుల్లో పెంచాలనే ఆలోచన ఆనంద్‌ లో వచ్చింది. తనకు కలిగిన ఈ ఆలోచన సక్సెస్‌ అయిందని ఆనంద్‌ సంతోషంగా చెప్పారు. ఆ విజయానందంలో ఇప్పుడు మొక్కలకు తమ ఇంటిలో మిగిలిన పదార్థాలనే ఎరువుగా తయారు చేసి మొక్కలకు వాడడం ప్రారంభించారు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా మొక్కల్ని పెంచడంలో ఆనంద్‌ ది అందెవేసిన చెయ్యి అయింది.

చెత్తలో పడి ఉండే ఖాళీ పెట్టెలు, సంచుల్ని ఆనంద్‌ సేకరిస్తున్నప్పుడు కుటుంబ సభ్యులు ఆటపట్టించారట. అయితే.. సిమెంట్‌ కుండీల్లో కన్నా వృథా మెటీరియల్‌ లో మొక్కలు బాగా పెరుగుతుండడం చూసిన తర్వాత వారు పూర్తిగా తోడ్పాటు అందించారని చెప్పారు. వాడేసిన పాల సంచులు, స్నాక్‌ ప్యాకెట్లు, డిటర్జెంట్‌ ప్యాకెట్లు, కూల్‌ డ్రింక్‌ సీసాల్లో ఆనంద్‌ మొక్కలు పెంచుతున్నారు. ఆనంద్‌ తమ చుట్టుపక్కల మందుల దుకాణాల నుంచి థర్మాకోల్‌ పెట్టెల్ని తీసుకొచ్చి వాటిలో నారుమొక్కలు పెంచుతారు. ఆనంద్‌ మహేశ్వరి మిద్దెతోటలో మొక్కలు పెంచే విధానాల గురించి తెలిసిన పలువురు యూ ట్యూబర్లు ఆ విషయం ప్రపంచానికి తెలియజేయాలనే ఆసక్తితో ఆయన ఇంటికి వస్తుంటారు.ఆనంద్‌ తన మిద్దె తోటలో ఇప్పుడు ఎక్కువగా పూలు, కాక్టి, సక్యులెంట్స్‌, స్పైడర్ ప్లాంట్స్‌, మనీ ప్లాంట్‌ లాంటి అలంకార మొక్కల్ని, హ్యాంగింగ్‌ మొక్కల్ని పెంచుతున్నారు. వంగ, మిర్చి, బెండ, ఆకు కూరలు, కొత్తిమీర, టమోటా లాంటి ప్రతిరోజు ఇంటిలో వినియోగించే రకాలను కూడా ఆనంద్‌ మహేశ్వరి సహజ విధానంలో పెంచుతున్నారు. అయితే.. ప్రతి గార్డెనింగ్‌ టెక్నిక్ లను యూట్యూబ్‌ వీడియోల ద్వారా నేర్చుకుంటానని ఆనంద్‌  తెలిపారు. కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో అలాంటి వేలాది వీడియోలను తాను క్షుణ్ణంగా పరిశీలించినట్లు చెప్పారు. ఆనంద్‌ తన మిద్దెపై హైడ్రోఫోనిక్‌ ఫాం కూడా నిర్వహిస్తున్నారు. పలు ట్యుటోరియల్‌ వీడియోలు చూసిన తర్వాత తన టెర్రస్‌ గార్డెన్‌ లో డ్రిప్ ఇరిగేషన్‌ విధానం ఏర్పాటు చేశారు.

తోటల పెంపకంలో చిన్న పిల్లల్ని కూడా భాగస్వాములను చేయాలనేది తన లక్ష్యం అంటారు ఆనంద్‌. తోటల పెంపకం, మరీ ముఖ్యంగా సహజ పంటల విధానంలో మొక్కల్ని పెంచాల్సిన అవసరం గురించి భవిష్యత్‌ తరాల్లో అవగాహన పెరగాలంటారాయన. దాంతో పాటు ఇంటి తోటల పెంపకంపై వృద్ధులకు కూడా తాను అవగాహన కలిగించడంలో సహాయపడతానని చెప్పారు. తోటల పెంపకం అంటే చికిత్సాపరమైనదని, తోటల పెంపకం హాబీగా తీసుకునే వారికి మానసిక, శారీరక ఆరోగ్యం ఎంతో మెరుగవుతుందని, తద్వారా వారికి ఎంతో శక్తినిస్తుందని ఆనంద్‌ మహేశ్వరి చెబుతున్నారు. ఇంటి తోటల పెంపకం ద్వారా వృద్ధులకు బోర్‌ కొట్టకుండా ఉంటుందన్నారు. ఉత్సాహం ఉన్న వృద్ధులు ఇంటి తోట పెంచాలనుకుంటే వారికి నారు మొక్కలు ఉచితంగా అందజేసేందుకు కూడా ఆనందర్‌ ముందుకు వచ్చారు.ఆనంద్ మహేశ్వరి కొన్ని నెలలుగా తమ నగరంలోని ఒక స్కూల్‌ లోని పిల్లలకు తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా భవిష్యత్తరాల్లో తోటల పెంపకంపై ఆసక్తి, సహజ పంటలపై అభిరుచి, ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు ఎంతగానో కృషిచేస్తున్నారు. దాంతో పాటు స్కూట్‌ గార్డెన్లలో విద్యార్థులు మొక్కలు పెంచడంలో మెళకువలు నేర్పుతున్నారు. మొక్కల పెంపకంలో కొత్త కొత్త విధానాల్లో ప్రయోగాలు చేయడంలో ఆనంద్‌ ప్రతిరోజూ బిజీగా ఉంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here