ప్రకృతి వ్యవసాయం, ప్రకృతి పంటల సాగు పట్ల ప్రపంచ వ్యాప్తంగా అవగాహన పెరుగుతోంది. మన ఆరోగ్యం చక్కగా ఉండాలంటే.. సహజసిద్ధ విధానంలో పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవాలనే ఆలోచన పలువురిలో వస్తోంది. ఆరోగ్యాన్ని కోరుకునే వారందరూ ప్రకృతి వ్యవసాయమే శ్రేయస్కరమనే భావనకు వస్తున్నారు. దాంతో పాటు ప్రకృతి వ్యవసాయం చేసే ఔత్సాహిక రైతులకు ప్రభుత్వాలు కూడా తోడ్పాటు అందించేందుకు ముందుకు వస్తున్నాయి.

ప్రపంచంలో గ్రీన్‌ రివల్యూషన్‌ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచీ వ్యవసాయ సాగులో విష రసాయనాల వినియోగం బాగా పెరిగిపోయింది. రసాయనాలు వాడిన వ్యవసాయ క్షేత్రాలు భూసారాన్ని కోల్పోయి, నిర్వీర్యం అయిపోతున్నాయి. దీంతో క్రమేపీ రసాయనాలు వాడిన పొలాలు పనికిరాకుండా పోతున్నాయి. రసాయనాలు వాడి పండించిన ఆహార పదార్థాలు తిన్న వారికి వివిధ రకాల క్యాన్సర్లు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్యాభిలాషులైన రైతులంతా తమ తమ పొలాల్లో రసాయనాలకు గుడ్‌ బై చెప్పేసి, సహజసిద్ధ వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ  క్రమంలో ఏపీ వ్యాప్తంగా ఆరు లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తుండడం విశేషం. అలాంటి వారు స్ఫూర్తిగా మరింత ఎక్కువ మంది రైతుల్లో ప్రకృతి వ్యవసాయం పట్ల అవగాహన పెంచేందుకు ఏపీ సర్కార్‌ ముందుకు వచ్చింది. ఆర్బీకేల ద్వారా ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రకృతి వ్యవసాయంపై అంతర్జాతీయ సంస్థలతో కూడా ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. పెట్టుబది ఖర్చు తగ్గించడం, ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని అందుబాటులో ఉంచేదుకు ఏపీ సర్కార్ తన వంతు కృషి చేసేందుకు ముందుకు వచ్చింది. విత్తనం నాటినప్పటి నుంచి రైతు పండించిన పంటను విక్రయించుకునే దాకా ఆర్బీకేలు అండగా నిలుస్తున్నాయి.ఒక పక్కన ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూనే.. మరో పక్కన ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిపైనా దృష్టి సారించాలని రైతులకు సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. ఆర్గానిక్‌ పాల ఉత్పత్తిలో సమగ్ర విధానాలతో ముందుకు వెళ్లాలని రైతులకు సూచించారు. తక్కువ పెట్టుబడితో, సేంద్రీయ ఉత్పత్తుల ద్వారా స్వచ్ఛమైన పాలను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేయాలని, ఆ పరిశోధనల ఫలితాలను రైతులకు అందించే చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశించారు. పాలు, గుడ్లు పెడితే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని, అయితే.. ఆ పాలలో రసాయన అవశేషాల వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటున్న వైనాన్ని చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే చక్కని భవిష్యత్‌ తరాలు నిర్మాణం అవుతాయంటున్నారు. అందుకే పశువుల పెంపకంలో ఉత్తమ పద్ధతులపై రైతులకు నిరంతరం అవగాహన కల్పిస్తూ ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు.

ఆర్గానిక్‌ పాల ఉత్పత్తులు సాధించే క్రమంలో పశువులకు పౌష్టికారం అందించే విషయంలో రైతులకు చక్కని అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ చెబుతున్నారు. పశుపోషణ ద్వారా రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయాలు వచ్చేలా చూడాలని అధికారులను సీఎం పురమాయించారు.ప్రకృతి విధానంలో సహజ వ్యవసాయం చేసేవారికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తోంది. సహజసిద్ధ వ్యవసాయం చేసేందుకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉత్సాహంగా ముందుకొచ్చారు. కాకినాడ జిల్లాలో 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజ వ్యవసాయం చేస్తున్నారు. లక్ష్మీనారాయణ స్ఫూర్తితో మరింత మంది రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి ఔత్సాహికల రైతులకు లక్ష్మీనారాయణ తాను అవలంబిస్తున్న పకృతి వ్యవసాయ విధానలపై చక్కగా అవగాహన కల్పిస్తున్నారు. పదిమందికీ ప్రకృతి వ్యవసాయం అంటే చక్కగా తెలియజేస్తున్నారు. దాని వల్ల ఒనగూరే ఆరోగ్య లాభాలు, తక్కువ సాగు పెట్టుబడితో వ్యవసాయం చేయడం లాంటి పలు అంశాలను వారికి అర్థమయ్యే రీతలో చెబుతున్నారు.

ప్రకృతి వ్యవసాయం పట్ల రైతుల్లో ఆసక్తి, ప్రభుత్వాల సహాయ సహకారాలు, అనుభవజ్ఞులైన రైతులు చేస్తున్న కృషి కారణంగా ప్రతి ఏటా సహజసిద్ధ పంటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here