ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక్క గ్రామం అయినా నేచురల్‌ ఫార్మింగ్‌ పద్ధతిలో పంటల సాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేచురల్‌ ఫార్మింగ్‌లో ‘గోధన్‌’ లేదా ఆవు పేడ, గోమూత్రంతో తయారుచేసే జీవామృతం, ఘన జీవామృతాలను వినియోగించాలని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన సూచించారు. రసాయన ఎరువుల కోసం భారీగా డబ్బులు వెచ్చిస్తున్న 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు నేచురల్ ఫార్మింగ్‌తో ఎంతో లాభదాయకం అని అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు ఒక్క ఏడాదిలో అనేక పంటలు సాగు చేయవచ్చన్నారు. తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఇటీవలే నేచురల్‌/ జీరో బడ్జెట్‌ ఫార్మింగ్‌పై జరిగిన సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.దేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతుల నుంచి ఆవుపేడ కొనుగోలు చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ ఆన్ అగ్రికల్చర్‌ కమిటీ చేసిన కీలక సిఫార్సును ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఆవుపేడను కొనడం ద్వారా రోడ్లపై విచ్చలవిడిగా తిరిగి ముప్పుగా మారుతున్న పశువుల సమస్యకు పరిష్కారం లభిస్తుందని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచించింది. గోధన్‌ న్యాయ్‌ యోజన పేరుతో ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే రైతుల నుంచి ఆవుపేడ కొనుగోలు పథకం కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వం గోధన్‌ న్యాయ్‌ యోజన ద్వారా రైతుల నుంచి ఆవుపేడను కిలో రెండు రూపాయల చొప్పున 2020 నుంచీ కొనుగోలు చేస్తోంది. ఆ ఆవుపేడతో వర్మీ కంపోస్ట్‌ ఎరువును తయారు చేస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న గోధన్ న్యాయ్‌ యోజన మాదిరిగానే కేంద్రం కూడా రైతుల నుంచి ఆవుపేడ కొనుగోలు పథకాన్ని జాతీయ స్థాయిలో తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. ఆవుపేడ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆదాయం సమకూరడమే కాకుండా రోడ్లపై తిరిగే పశువుల సమస్య పరిష్కారం అవుతుందని, దేశంలో ఆర్గానిక్‌ వ్యవసాయ సాగు విధానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుకు వ్యవసాయ మంత్రిశాఖ బదులిస్తూ.. దేశ ఈశాన్య ప్రాంతంలో ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన (పీకేవీవై), మిషన్ ఆర్గానిక్‌ వాల్యూ చైన్‌ డెవలప్‌మెంట్‌’ పథకాల ద్వారా ఆవుపేడను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపిందన్నారు. రైతులు పండించే ఆర్గానిక్ పంటలను కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొందని మోదీ చెప్పారు.వనరులు సమృద్ధిగా లేని కారణంగా దేశంలో ఆర్గానిక్/ నేచురల్ ఫార్మింగ్‌ చాలా తక్కువగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో సాగులో ఉన్న 14 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమిలో కేవలం 40 లక్షల హెక్టార్లల్లో మాత్రమే ఆర్గానిక్‌ వ్యవసాయం సాగవుతోందని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఇచ్చిన రాతపూర్వక జవాబులో వెల్లడించింది. అంటే సాగు భూమిలో కేవలం 2.7 శాతంలో మాత్రమే ఆర్గానిక్‌ వ్యవసాయం కొనసాగుతోంది. అందుకే వ్యవసాయ పరిశోధనలు కాగితాలకు మాత్రమే పరిమితం కాకూడదని, ఆ పరిశోధనల దృష్టిని వ్యవసాయ భూములపైకి మరల్చాలని భావిస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. తద్వారా ఎక్కువ మంది రైతులు, మరింత ఎక్కువ భూమిలో ఆర్గానిక్‌ వ్యవసాయం కొనసాగేలా కృషిచేస్తామన్నది ప్రధాని మోదీ హామీ.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here