వన్నూరమ్మ.. ఒంటరి దళిత మహిళ.. ప్రకృతి వ్యవసాయంలో దిట్ట. ఆపై దేశ ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకున్న మన అనంతపురం జిల్లా మహిళా రైతు. పీఎం కిసాన్‌ నిధుల పంపిణీ ద్వారా ఆర్థిక సాయం కోసం ఎంపికైన ఆరుగురు లబ్ధిదారుల్లో వన్నూరమ్మ ఒకరు. ఆ నిధుల విడుదల సందర్భంగా ప్రధానితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వన్నూరమ్మ ఆయనతో ముఖాముఖి మాట్లాడింది. ఆర్గానిక్ వ్యవసాయంలో ఇతర రైతులకు రోల్‌ మోడల్‌ అని ప్రధాని మోదీ ప్రశంసించిన వన్నూరమ్మ గురించి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని దురదకుంట గ్రామం. ఆ గ్రామంలో ప్రకృతి, ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న దళిత మహిళా రైతు వన్నూరమ్మ. పంటల సాగులో ఎలాంటి రసాయనాలూ వినియోగించకుండా ఆర్గానిక్‌ వ్యవసాయ పద్ధతుల్లో వన్నూరమ్మ విజయాలు సాధించింది. వన్నూరమ్మ విజయగాధను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా ఆసక్తిగా అడిగి తెలుసుకోవడం విశేషం. వీడియో కాన్ఫరెన్స్‌లో వన్నూరమ్మ ప్రధాని మోదీతో మాట్లాడుతూ.. గతంలో తాను రసాయనాలు వాడి చేసిన వ్యవసాయం కంటే ఆర్గానిక్‌ పద్ధతిలో పంటలు పండించడం ప్రారంభించిన తర్వాత తన ఆదాయం నాలుగు రెట్లు అయిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు నిస్సారంగా ఉన్న నాలుగు ఎకరాల ఎసైన్డ్‌ భూమి ఇచ్చిందని, అందులో రెండు ఎకరాల్లో కేవలం ఆర్గానిక్‌ పంటలే సాగు చేస్తున్నట్లు పేర్కొంది. ఆ రెండెకరాల్లో ఆర్గానిక్‌ పద్ధతిలో కూరగాయలు, వేరుశెనగ, చిరుధాన్యాలు (మిల్లెట్స్‌)ను ఏడాదికి మూడు పంటలు పండిస్తున్నట్లు వివరించింది. ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేస్తుండడంలో ఇప్పుడు ఆ భూమి సారవంతంగా మారింది.ఆర్గానిక్‌ విధానంలో పంటలు పండించడానికి తాను తొలుత 27 వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టానని చెప్పింది. ఒక ఎకరం క్షేత్రంలో ఆ పెట్టుబడితో ఏటా లక్షా 7 వేలు ఆదాయం సంపాదిస్తున్నానని ప్రధాని మోదీతో వన్నూరమ్మ సంతోషంగా తెలిపింది. తమ ఇరుగుపొరుగున ఉండే మారుమూల గిరిజన గ్రామాలకు వన్నూరమ్మ స్వయంగా వెళ్లి, 170 మంది గిరిజన మహిళలను ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేలా ప్రభావితం చేయడం విశేషం. ఆయా గిరిజన గ్రామాలకు వెళ్లి ఆర్గానిక్‌ వ్యవసాయంలో వారికి స్వయంగా సలహాలు, సూచనలు ఇస్తూ వారిని ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తోంది. తాను తయారు చేసిన జీవామృతం, ఘన జీవామృతం, కషాయాలను గిరిజన మహిళా రైతులకు అందిస్తూ చేదోడువాదోడుగా ఉంటోంది. అతి తక్కువ వర్షపాతంలో దుర్భిక్ష ప్రాంతంగా అనంతపురం జిల్లా ఎలా మారిందో ప్రధానికి వన్నూరమ్మ వివరించింది. వన్నూరమ్మ విజయగాధను విన్న ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. దేశంలోని మహిళా రైతులకు, మరీ ముఖ్యంగా ఆదివాసి మహిళలకు వన్నూరమ్మ ఎంతో స్ఫూర్తిని ఇస్తోందని అభినందించారు.

ఆర్గానిక్‌ వ్యవసాయంలో విజయాలు సాధిస్తున్న వన్నూరమ్మను జిల్లా కలెక్టర్‌ కూడా ఎంతగానో ప్రశంసిస్తున్నారు. ప్రతి రైతూ వన్నూరమ్మ విజయాలను ఆదర్శంగా తీసుకుని ప్రకృతి వ్యవసాయం విధానాలు పాటిస్తే అందరికీ ఆదర్శంగా నిలుస్తారని అంటున్నారు. ప్రతి రైతూ ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తే అనంతపురం జిల్లాయే ‘హరిత స్వర్గం‘ అవుతుందని చెబుతారు కలెక్టర్‌. భర్తను పోగొట్టుకున్న వన్నూరమ్మ ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ఎలా ఎదురీది నిలిచి సక్సెస్ అయిందో కలెక్టర్ వివరించారు. చూశారుగా ఒంటరి దళిత మహిళ వన్నూరమ్మ ఆర్గానిక్‌ వ్యవసాయంలో దేశ ప్రధాని దృష్టినే ఆకర్శించగలిగింది. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే ఛాన్స్‌ కూడా పొందింది. ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్న, చేయాలని ముందుకు వస్తున్న ఔత్సాహిక రైతులకు వన్నూరమ్మ స్ఫూర్తిదాయకం అనడంలో సందేహం లేదు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here