బొగ్గు కోటలో ఆర్గానిక్ తోట.. చెప్పుకోడానికి ఈ మాట ఎంతగా బాగున్నప్పటికీ దీని వెనుక ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆలోచన ఉంది. కుటుంబం కథ ఉంది. అతని మిత్రుల శ్రమ కూడా ఎంతో ఉంది. వారి శ్రమ ఫలితమే బొగ్గు గనులతో నిండి ఉన్న ధన్ బాద్ ప్రాంతం ఆర్గానిక్ పండ్ల తోటలతో నిండి ఉంది. పచ్చని పంటలకు ఆలవాలంగా మారింది.

ధన్‌బాద్‌ గ్రామ యువకుడు రవి నిషద్‌ ఇప్పుడు మన ఆర్గానిక్‌ ఫార్మింగ్ హీరో. జార్ఖండ్ రాష్ట్రంలో ధన్‌బాద్ ఉంది. ఊరంతా బొగ్గు గనులతో నిండి ఉంటుంది. ప్రతినిత్యమూ బొగ్గు తవ్వకం, రవాణాతో ఊరు ఊరంతా నల్లగా మారిపోయి ఉండేది. ఊరిలో పంటలు కూడా సరిగా పండేవి కాదు. ధన్‌బాద్‌ను జార్ఖండ్‌ రాష్ట్ర బొగ్గు రాజధాని అనే పేరుంది. గ్రామస్థులు బొగ్గు కారణంగా శ్వాస సంబంధ వ్యాధులతో సతమతం అయ్యేవారు. బొగ్గు ద్వారా వెలువడే కాలుష్యం పంటల మీద బాగా ప్రభావం చూపించింది. దీంతో ధన్‌బాద్ రైతుల ఆర్థిక పరిస్థితులు కూడా క్రమంగా దిగజారిపోయాయి. దీంతో ధన్‌బాద్ యువ రైతుల్లో ఎక్కువ శాతం మంది రకరకాల కూలిపనులు చేసుకుని బతికేందుకు పట్టణాలు, నగరాలకు వలస వెళ్లిపోయారు.ధన్‌బాద్‌కే చెందిన రవి నిషద్‌ 2014లో ఓ ఐటీ సంస్థలో ఉద్యోగం రావడంతో ఢిల్లీ వెళ్లాడు. రవి తల్లి కూడా శ్వాసకోశ సంబంధ అనారోగ్యంతో బాధపడేది. చివరికి ఆమె అదే అనారోగ్యంతోనే కన్నుమూసింది. అంతకు ముందు తల్లిని చూసుకునేందుకు రవి నిషద్‌ రైల్లో ఢిల్లీ నుంచి ధన్‌బాద్‌కు తరచుగా వస్తుండేవాడు. అలా రైలు ప్రయాణం చేసినప్పుడల్లా మార్గంలో కనిపించే పచ్చని పొలాలను కళ్లారా చూసి సంబరపడేవాడు. ఈ మాదిరిగా తమ ఊరు ఎందుకు మారకూడదు? ఆ మార్గంలో తాను ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అని తనను ప్రశ్నించుకున్నాడు రవి నిషద్‌.

తల్లి మరణంతో కాస్త కుంగుబాటుకు కూడా గురైన రవి మంచి జీతం వస్తున్న ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి ధన్‌బాద్‌ తిరిగివచ్చేశాడు. తాను పుట్టిన ఊరి కోసం ఏదైనా చేయాలని సంకల్పించుకున్నాడు. తల్లి జ్ఞాపకార్థం తన గ్రామంలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమం చేపట్టాడు. పలు పబ్లిక్‌ ప్రదేశాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా ప్రారంభించాడు. అందుకోసం ‘సమర్పణ్‌ సేవా సమితి’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. తన అభిప్రాయాలతో కలిసివచ్చే మరికొందరిని తనతో చేర్చుకుని మొక్కలు నాటడం మొదలెట్టాడు. రవి నిషద్‌ కృషితో ధన్‌బాద్‌లో పర్యావరణంలో చక్కని మార్పు వచ్చింది. స్థానికుల ప్రశంసలూ అందుకున్నాడు.

అయితే.. ఇక్కడితోనే ఆగిపోకూడదని, తన గ్రామానికి మరింత ఎక్కువగా ఏదైనా చేయాలని భావించాడు రవి నిషద్‌. అది సామాజికంగా, ఆర్థికంగా పెద్ద మొత్తంలో ప్రయోజనం కలిగించేలా, ప్రత్యేకమైనదిగా చేయాలనే తన ఆలోచనను గ్రూపు సభ్యులతో పంచుకున్నాడు. రవి ప్రతిపాదనను గ్రూపు సభ్యులు కూడా సెభాష్ అన్నారు.ధన్‌బాద్‌లోని పలువురు యువ రైతులు తమ భూముల్ని అయినకాడికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుని పట్టణాలు, నగరాల్లో తాపీ పనివాళ్లుగాను, కూలీలుగాను నైపుణ్యంలేని కార్మికులుగా వలస బతుకులు వెళ్లదీస్తుండడం రవి నిషద్‌ను ఎంతగానో కలిచివేసింది. పొలాల్ని అమ్ముకోవడంతో ధన్‌బాద్‌లో వ్యవసాయ కలాపాలు తగ్గిపోయి పంటలు కూడా తక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో రవి నిషద్‌ ఓ ఆలోచన చేశాడు. తన ఊరి రైతు సమాజం బాగు కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలోనే రవి నిషద్‌ 2016లో ఐటీ ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తన చిన్ననాటి మిత్రులను కలుపుకున్నాడు. రంజిత్‌కుమార్‌, అమిత్‌ మిశ్రాతో కలిసి RPA పేరుతో వ్యవసాయోత్పత్తుల సంస్థను ప్రారంభించాడు. తద్వారా తమ ఊరి రైతులకు మెరుగైన జీవితం అందించేందుకు యత్నాలు మొదలెట్టాడు. ఈ సంస్థ ఉద్దేశం వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని నిరుత్సాహపర్చడం.. వ్యవసాయంలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా చేయడం. రవి నిషద్‌ ప్రయత్నం ఫలించింది. గ్రామంలో ఆర్గానిక్‌ పంటలు పండించడం పెరిగింది. దాంతో రైతుల ఆదాయం పెరగడమూ ఎక్కువైంది. వ్యవసాయం చేయకుండా వదిలిన మరి కొందరు రైతులు కూడా ఆర్గానిక్‌ ఫార్మింగ్ వైపు అడుగులు వేశారు.

రవి నిషద్‌, అతని మిత్రులు కలిసి భులి గ్రామంలో ముందుగా రెండెకరాల్లో ఆర్గానిక్ ఫార్మింగ్‌ ప్రారంభించారు. పంటలకు ఆవుపేడ, గోమూత్రం, శెసనగపిండి, బెల్లం, వెనిగర్‌, పంట వ్యర్థాలను కలిపి ఆర్గానిక్‌ ఫెర్టిలైజర్‌ జీవామృతాన్ని తయారు చేసి, వినియోగించారు. తర్వాత తేతుల్‌మరి గ్రామంలో 20 ఎకరాల బంజరుభూమి కౌలుకు తీసుకుని ఆర్గానిక్ పంటలు వేశారు. ఆ వ్యవసాయ క్షేత్రంలో బొప్పాయి, జామ, లిచి, దానిమ్మ, సపోటా లాంటి పండ్ల జాతి పంటలు, బంతిపూల సాగు చేశారు. బొగ్గు ప్రభావిత ప్రాంతంలోని బంజరు భూమిలో కూడా ప్రకృతి పంటల్ని ఎంత బాగా సాగుచేయవచ్చో ప్రయోగాత్మకంగా ఇతర రైతులకు RPA సభ్యులు చూపించారు. ఇప్పుడు ఒక్కో ఎకరం ప్రతి రోజూ 100 కిలోల బంతిపూలు దిగుబడి తీస్తున్నారు RPA సంస్థ సభ్యులు. ఆ బంతి పూలను స్థానిక మార్కెట్లలోని పూల వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కౌలుకు తీసుకున్న పొలంలో 2 వేల బొప్పాయి మొక్కలు వేశారు. తద్వారా రోజుకు 50 కిలోల పంట దిగుబడి వస్తోందని రవి నిషద్‌ చెప్పాడు. ఆర్గానిక్ వ్యవసాయ పనులు చేసేందుకు, ఉత్పత్తుల్ని మార్కెట్లో విక్రయించేందుకు 60 మంది రైతులను కూడా RPA సంస్థ నియమించుకుంది. తమ ఆర్గానిక్ ఉత్పత్తులను ధన్‌బాద్ బయటి ప్రాంతాల్లో కూడా అమ్మేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు RPA సంస్థ సోషల్ మీడియాను వినియోగించుకుంటోంది.ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ సంస్థ RPA ఇప్పుడు ప్రకృతిసిద్ధ వ్యవసాయాన్ని 140 ఎకరాలకు విస్తరించింది. నెలకు 50 లక్షల రూపాయల వరకు ఆదాయం సంపాదిస్తోంది. RPA సంస్థ విధానంలో ప్రకృతి పంటలు పండించేందుకు ఇప్పుడు అనేక మంది రైతులు ముందుకు వస్తున్నారు. రవి నిషద్ బృందం 2 వేల మందికి తాము చేస్తున్న ఆర్గానిక్‌ పంటల విధానం గురించి అవగాహన కల్పించారు. వారిలో ఇప్పటికే 400 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించారు. రవి ప్రారంభించిన ఆర్గానిక్ వ్యవసాయ విధానాన్ని అవలంబించడం వల్ల తనకు ఆదాయం గతంలో కంటే రెట్టింపు అయిందని మనేటా గ్రామ రైతు రూపేశ్‌ మహతో ఆనందంగా చెప్పాడు. గతంలో తాను రసాయనాలతో కూరగాయలు పండించేవాడినని, ఈ విధానంలో నష్టాలు కూడా వచ్చేవన్నాడు. రవి నిషద్‌ నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత బంతిపూలు, బొప్పాయి పంటల్ని ప్రకృతి సిద్ధమైన వ్యవసాయ విధానంలో పండిస్తున్నానన్నాడు. రసాయనాలు వాడి పండించిన టమోటాలు కిలో 20 నుంచి 30 రూపాయలు మాత్రమే ధర పలికేదని, ఆర్గానిక్‌ విధానంలో పండిస్తున్న టమోటాలకు 60 రూపాయల ధర తీసుకోవడం ఆనందంగా ఉందన్నాడు.

రవి నిషద్‌, అతని బృందం చేసిన కృషి ఫలితంగా జార్ఖండ్‌ రాష్ట్రం దేశంలో ఆర్గానిక్‌ ఫ్రూట్‌ క్యాపిటల్‌గా పేరు తెచ్చుకుంటోంది. కోవిడ్‌ కష్టకాలంలో ఆర్గానిక్ ఫార్మింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడిందని రవి నిషద్‌ హర్షం వ్యక్తం చేశాడు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి, కోవిడ్ సమయంలో సొంతూళ్లకు తిరిగి వచ్చిన వారిలో అత్యధికశాతం మంది ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసే ఆర్గానిక్‌ వ్యవసాయం వైపు దృష్టి సారించడం ముదావహం అన్నాడు. దేశానికి అత్యధిక ఆదాయం తీసుకొచ్చే ధన్‌బాద్‌ ప్రాంతం ఇప్పుడు ఫ్రూట్ కేపిటల్‌గా మరింతగా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాడు రవి నిషద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here