జనారణ్యం మధ్యలో జనం మెచ్చిన అడవి. అది కూడా ఓ ఇంటి మిద్దెపైన. ఆ మిద్దెపై తోటలో గులాబీ, బంతి, దాలియా లాంటి అందమైన పుష్ప జాతులు, నిమ్మ, దానిమ్మ, సపోటా చెట్లు, ఔషధ మొక్కలు, కూరగాయలు, ఇతర తీగజాతి మొక్కలు. ఇలాంటి మొత్తం 700 రకాల మొక్కలతో ఆ మిద్దెపై మినీ అడవి కనుల విందు చేస్తోంది. ఆ మిద్దెపై వెలసిన మినీ అడవిలో పిచ్చుకలు, పావురాలు లాంటి రకరకాల పక్షులు గూళ్లు కట్టుకుని ఆవాసం చేసుకున్నాయి. పక్షుల కిలకిలా రావాలకు ఆ మినీ మిద్దె అడవి నెలవుగా మారింది.

మినీ అడవి మధ్యలో వెదురుగడలతో ఓ చిన్న పొదరిల్లు కూడా ఉంది. పొదరింట్లో కూర్చొని చల్లటి గాలి పీలుస్తూ.. పక్షుల కిలకిలా రావాలు వింటూ సేద దీరేందుకు వీలుగా ఉంది. తద్వారా ఎంతో ఆహ్లాదం, ఆనందం కలుగుతోంది. మెట్రోపాలిటన్ నగర జీవన పర్యావరణంలో కాలుష్యం, శబ్ద కాలుష్యం సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి చోట పరిసరాలు పచ్చదనంతోనూ, మరింత మెరుగైన జీవనానికి ఓ రోల్‌ మోడల్‌గా ఉంది ఆ ప్రాంతం.ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి అద్భుత ఆవిష్కరణ ఎక్కడ? అనుకుంటున్నారా? మరెక్కడో కాదు.. మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలోనే.. ద్వారక ప్రాంతంలోని ఓ 1000 చదరపు అడుగుల టెర్రాస్‌పై ఔత్సాహిక మహిళ రష్మీ శుక్లా ఇలాంటి అందమైన ఆవిష్కణ చేసి చూపించారు.

ఈ ఆవిష్కరణను రష్మీ శుక్లా ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తి నేచురల్‌ ఫార్మింగ్‌ విధానంలోనే చేయడం విశేషం. వీలైనంత సహజసిద్ధ వాతావరణంలో ఆమె తన మిద్దెతోటను పెంచుతున్నారు. ‘మా తోట పెంపకానికి అస్సలు రసాయనాలేవీ వాడకూడదని ముందుగా నేను నిర్ణయించుకున్నాను. కీటకాలు, పక్షులు తమకు భద్రత ఉందని, ఆరోగ్యానికి భంగం కలగదనే చోట ఆవాసం ఏర్పాటు చేసుకుంటాయి. కీటకాలు, పక్షులు వచ్చేందుకు సహజసిద్ధమైన విధానంలో, జాగ్రత్తగా మన తోటను నిర్వహించాలి. అప్పుడే పర్యావరణ సమతుల్యత కూడా ఏర్పడుతుంది’ అంటారు రష్మీ శుక్లా.ఇక తోట నిర్వహణలో మొక్కలు, చెట్లు, తీగజాతి, పూలమొక్కలకు పోషకాలు అందించేందుకు రష్మీ శుక్లా సహజసిద్ధంగా తయారు చేసిన ఆర్గానిక్ కంపోస్టునే వాడుతున్నారు. ఈ ఆర్గానిక్ కంపోస్ట్‌ అంతా ఆమె తానే తమ ఇంటి ఆవరణలో స్వయంగా తయారు చేసకుంటారు. ఇంటి ఆవరణలో రాలిన ఆకులు, వంటింట్లో మిగిలిన పదార్థాలతో ఆర్గానిక్‌ కంపోస్ట్‌ తయారు చేసుకుంటారట రష్మీ శుక్లా. కొబ్బరి పొట్టు, ఆవుపేడ కలిపి భూమిలో వేసి పాట్‌ మిక్స్‌ను ఆమె తమ మిద్దె తోటలోని మొక్కల పెంపకానికి సిద్ధం చేసుకుంటారు.ఇంకో విశేషం ఏమిటంటే.. తోటలోని ఆకులను కీటకాలు ఆశించకుండా ఉండేందుకు లీటరు నీటిలో 10 మిల్లీ లీటర్ల పాలు కలిపి పిచికారి చేస్తానని రష్మీ చెబుతున్నారు. దాంతో పాటు పాలను పిచికారి చేయడం ద్వారా మొక్కలకు కావలసిన కాల్షియం కూడా అందుతుందని అంటున్నారు. పాలు పిచికారి చేయడం వల్ల ఆకులపై ప్రొటీన్‌ నిల్వ ఉంటుందని, దాంతో పాటే ఉన్న ఆకును తిన్న కీటకాలకు సరిగా జీర్ణం కాదని, దాంతో కీటకాల వల్ల నష్టం జరగదని ఆమె విశ్లేషిస్తున్నారు.పూలమొక్కల్లోని మకరందాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన తేనెటీగల ద్వారా పండ్ల మొక్కలకు పరపరాగ సంపర్కం (పాలినేషన్) జరుగుతుందని, తద్వారా మరింత ఎక్కువగా పండ్ల దిగుబడి వస్తుందని చెప్పారు రష్మీ. అలాగే.. లెమన్‌ గడ్డి, పుదీనా మొక్కలు వెదజల్లే వాసన వల్ల కీటకాలు తోటలోకి రావని అన్నారు. పొద్దుతిరుగుడు పువ్వులు చిలకల్ని ఆకర్షించడం తాను స్వయంగాగా చూశానని రష్మీ వెల్లడించారు. తమ తోటలో పికిలిపిట్టలు (నైటింగేల్స్‌) చేసే కిలకిలారావాలు తనకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు. వాటితో పాటుగా పావురాలు, చిన్న చిన్న టైలర్‌ పక్షులు తమ మిద్దె తోటలో ఏర్పాటు చేసుకున్న గూళ్లు కనువిందు చేస్తున్నాయన్నారు.ప్రకృతి ప్రసాదించిన ఆనందాల నుంచే రష్మీ తన చుట్టూ ఓ అందమైన పచ్చని స్వర్గాన్ని నిర్మించుకున్నారు. బీహార్‌లోని పాట్నా నుంచి ఇంటి ఇల్లాలుగా ఢిల్లీలో అడుగుపెట్టిన రష్మీ శుక్లా తన చుట్టుపక్కల వాతావరణం అంతా పర్యావరణ సమతుల్యతతో ఉండాలని కోరుకుంటారు.

చూశారుగా ఫ్రెండ్స్‌.. మనం కూడా మన పరిసరాల్లో పర్యావరణ హితమైన ప్రకృతి సేద్యం చేద్దామా..! ఆరోగ్యకరమైన, ఆనందమయమైన జీవితాన్ని అనుభవిద్దామా మరి..!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here