ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మరింతగా ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ క్రమంలో తాజాగా ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన రెండు రోజుల క్రితం జరిగిన మంత్రి మండలి సమావేశం ఈ మేరకు ఆమోదించింది. ఏపీ ఆర్గానిక్‌ సర్టిఫికేషన్ అథారిటీకి ఏడాది కాలానికి గ్రాంట్ ఇన్‌ ఎయిడ్‌ కింద కోటిన్నర రూపాయలు కేటాయించాలని ఏపీ కేబినెట్ భేటీ నిర్ణయించింది.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సేంద్రియ ఉత్పత్తులకు మరింతగా ప్రోత్సహం అందించడం కోసం ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ కృషిచేస్తుంది. ఏపీ కేబినెట్‌ నిర్ణయంతో రాష్ట్రంలో తొలిసారిగా ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ అధారిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఆర్గానిక్‌ సర్టిఫికేషన్‌ కోసం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి, తెచ్చుకోవాల్సిన పరిస్ధితి ఉండేది. ఏపీ కేబినెట్‌ తాజా నిర్ణయంతో రాష్ట్రంలోనే ఆర్గానిక్‌ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటు చేస్తుండడంతో దూరాభారం, శ్రమ కూడా తగ్గుతుంది.అంతకు ముందు.. ఈ కేబినెట్ సమావేశాని కంటే ముందు కొద్ది రోజుల క్రితం జరిగిన భేటీలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జ‌గ‌న్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఆయన సూచించారు. పంటల సాగులో రైతులకు అవగాహన కల్పించేలా రూపొందించిన వీడియోలను యాప్‌ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులకు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here