ఒడిశాలోని కలహండి జిల్లాకు చెందిన చెందిన కృష్ణ నాగ్‌కు ప్రకృతి అంటే, ప్రకృతి విధానంలో పంటలు పండించడమంటే ఎంతో ఇష్టం. కృష్ణ నాగ్‌ హృదయం లబ్‌డబ్‌మనడం కంటే ప్రకృతి, సహజ పంటలంటూ కొట్టుకుంటుంది. అందుకే తన పూర్వీకుల నుంచి వచ్చిన పావు ఎకరంలో దశాబ్దం క్రితం సీజనల్‌ కూరగాయలు, పండ్లు పండించడం ప్రారంభించాడు. అందులో కూరగాయలతో పాటు మామిడి, దానిమ్మ, అరటి పండ్లు లాంటి పంటలు ఆర్గానిక్‌ పద్ధతిలో పండించాడు. దశాబ్దం క్రితం కృష్ణ నాగ్‌ కేవలం పది వేల రూపాయలు మాత్రమే పెట్టుబడిగా పెట్టాడు. ఆ పెట్టుబడితోనే కృష్ణ నాగ్‌ ఇప్పుడు లక్షల రూపాయలు ఆదాయాన్ని కళ్లజూస్తున్నాడు.

దశాబ్దం క్రితం అంటే 1996లో కృష్ణ నాగ్‌ ఓ డ్రైవర్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. తేలిక వాహనాలు, భారీ వాహనాలు నడిపేవాడు. వాహనాలు నడుపుతూనే ఎక్కడ చిన్న చిన్న పూలమొక్కలు, పండ్ల చెట్లు కనిపించినా మైమరచిపోయేవాడు. వాటిని చూస్తూ గంటల తరబడి ఎంతో ఆనందాన్ని అనుభవించేవాడు. దశాబ్దం తర్వాత అంటే 2006లో ప్రకృతి పంటల పండించాలని దృఢంగా నిర్ణయించుకున్నాడు. ‘చెట్ల పెంపకం నా కోరిక’ అని చాలా సింపుల్‌గా కృష్ణ నాగ్‌ చెబుతున్నాడు. ఒక వైపున డ్రైవింగ్‌ డ్యూటీ చేస్తూనే మరో పక్కన తమ పావు ఎకరం పొలంలో 50 మామిడి మొక్కలు నాటి, పెంచడం ప్రారంభించాడు. ఆర్గానిక్‌ పద్ధతిలో పండించే పంటల వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని, పెట్టుబడి కూడా తక్కువ అవుతుందనేది కృష్ణ నాగ్‌ బాగా నమ్మాడు. ఈ క్రమంలో నాలుగేళ్లలో తన మామిడి చెట్ల నుంచి పంట చేతికి వచ్చే వరకూ కృష్ణ నాగ్‌కు బాగా అర్థం అయింది. ఈ నాలుగేళ్లలో మామిడి తోటలో చెట్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో అంతర పంటలుగా టమోటా, పచ్చిమిర్చి మొక్కలు వేశాడు. తన పొలం చుట్టూ కొబ్బరి మొక్కలు కూడా కృష్ణనాగ్‌ వేశాడు.తన కాళ్ల మీద తాను నిలబడాలని, స్థిరమైన ఆదాయం సంపాదించాలనేది తన లక్ష్యం అని చెప్పాడు కృష్ణ నాగ్‌. ఈ క్రమంలోనే పూర్తిస్థాయిలో ఆర్గానిక్‌ వ్యవసాయ రైతుగా ఈ 48 ఏళ్ల కృష్ణ నాగ్‌ మారిపోయాడు. తాను వేసిన మిర్చి పంట ద్వారా తొలిసారిగా 2.6 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని తెలిపాడు. అప్పటి నుంచి తనకు పంట ద్వారా వచ్చిన ఆదాయంతో కృష్ణ నాగ్‌ క్రమంగా వ్యవసాయ భూమిని 11 ఎకరాల వరకు పెంచుకుంటూ వచ్చాడు. ఆ భూమిలో కూరగాయలు, పండ్లు చెట్లను మరింత విరివిగా పెంచడం ప్రారంభించాడు. వాటితో పాటు పౌల్ట్రీ, చేపల పెంపకం కూడా చేపట్టాడు. ఇలా కృష్ణ నాగ్‌ చేస్తున్న పలు రకాల పంటలతో ఇప్పుడు సాలీనీ 18 లక్షల రూపాయలు ఆదాయం సంపాదిస్తున్నాడు. తాను చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయ విధానంతో కృష్ణ నాగ్‌ ఒడిశా వ్యవసాయశాఖ నుంచి ప్రశంసలు పొందాడు. దాంతో పాటు వందలాది మంది రైతులకు ప్రేరణగా నిలిచాడు.

తాను ఆర్గానిక్‌ వ్యవసాయం ద్వారా తనకు తొలిసారిగా చేతికి అందిన ఎక్కువ ఆదాయంతో ఎంతో సంతోషం కలిగిందని కృష్ణ నాగ్‌ వెల్లడించాడు. ఆర్గానిక్‌ పంటల్లో మరింత మెరుగైన కృషి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హార్టీకల్చర్‌ మిషన్‌ ద్వారా శిక్షణ కూడా పొందినట్లు తెలిపాడు. ఆర్గానిక్‌ వ్యవసాయం చేసేందుకు ఆ శిక్షణా కాలంలో తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు ఎలా పండించాలనే అంశంపై ఎన్నో సాంకేతిక అంశాలు తెలుసుకున్నట్లు చెప్పాడు. రసాయనాలు వాడి పెంచిన పైర్ల కంటే ఆర్గానిక్‌ విధానంలో చేసిన పైర్లు ఎంతో బాగా ఎదిగాయని అన్నాడు. అలా ఆర్గానిక్‌ పద్దతిలో కృష్ణ నాగ్‌ పండించిన కూరగాయలు, మామిడి, అరటి, దానిమ్మ, కొబ్బరి పండ్లు, కాయలకు మంచి డిమాండ్‌తో పాటు ఆదాయమూ పెరిగినట్లు వెల్లడించాడు. అలా పెరిగిన ఆదాయాన్ని ఏటా కొంచెం కొంచెం భూమి చొప్పున కొని తన పావు ఎకరం పొలాన్ని 11 ఎకరాలకు పెంచినట్లు సంతోషంగా చెప్పాడు.

అయితే.. కృష్ణ నాగ్‌ పొలాన్ని పెంచుకోవడం అంత సులువుగా ఏమీ జరగలేదట. తమ ప్రాంతంలోని భూమి గట్టిగా ఉండి, వరి మాత్రమే పండించేందుకు అనువైనదన్నాడు. అలాంటి పొలంలో ఆర్గానిక్‌ పద్ధతిలో పంటలు పండించడాన్ని చూసి తమ తాత, తండ్రి కూడా తనను పిచ్చోడిలా చూశారని గుర్తుచేసుకున్నాడు. పల్లంగా ఉండే తమ భూమిలో కూరగాయలు పండించేందుకు అస్సలు పనికిరాదని చెప్పారన్నాడు. దాంతో బయటి నుంచి మట్టి తీసుకువచ్చి తమ పొలాన్ని మరికొంత ఎత్తు చేశానన్నాడు. పల్లంగా ఉండే తమ పొలంలో అలా మార్పులు చేయడంతో తననో పిచ్చోడు అని భావించారని కృష్ణ నాగ్‌ తెలిపాడు.ప్రకృతి పంటలకు వేసేందుకు ఆర్గానిక్‌ ఎరువు తయారు చేసేందుకు తాను, తన భార్య కూడా ఆవు పేడ కొనేందుకు తమ ప్రాంతంలో ప్రతి రైతు వద్దకు వెళ్లేవారమని కృష్ణ నాగ్‌ గుర్తుచేసుకున్నాడు. గట్టి నేలను ఆర్గానిక్‌ పద్ధతుల్లో సారవంతంగా మార్చడం, ఆ నేల నుంచి మెరుగైన దిగుబడి సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని కృష్ణ వివరించాడు. ఇప్పటికీ తాము ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలిపాడు. తమ ప్రాంతానికి చుట్టు పక్కల 30 కిలో మీటర్ల పరిధిలో తిరిగి ఆవుపేడ సేకరిస్తున్నామన్నాడు.

ఆర్గానిక్‌ విధానంలో మరింత మెరుగైన మెళకువలు తెలుసుకునేందుకు కృష్ణ నాగ్‌ గుజరాత్‌, మహారాష్ట్ర, తమిళనాడు, చత్తీస్‌గఢ్‌ తదితర రాష్ట్రాల్లో పర్యటించాడు. అలా 2009-10లో ‌కృష్ణ నాగ్‌ డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం గురించి తెలుసుకున్నాడు. దాంతో నీటిని ఆదా చేసేందుకు తన పొలంలో డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానాన్ని ఏర్పాటు చేశాడు. తన పొలంలో రెండు చెరువులు తవ్వించాడు. అందులో 1,000 చేపల్ని పెంచడంతో పాటుగా చెరువుపైన పౌల్ట్రీని ఏర్పాటు చేశాడు. కోళ్లు మేత తిని.. అవి వేసిన రెట్ట చెరువుల్లో పడేలా ఏర్పాట్లు చేశాడు. చేపలు, కోడిగుడ్లు, కోడి మాంసం అమ్మడం ద్వారా కృష్ణ నాగ్‌ మరింత అధిక ఆదాయం సంపాదిస్తున్నాడు. పొలంలో పోలీహౌస్‌, కూరగాయల గ్రేడింగ్‌ పరికరాలు, డ్రైయింగ్‌ మెషిన్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఇలా కృష్ణ నాగ్‌ చేస్తున్న ఆర్గానిక్‌ విధానం వల్ల ఒక పంట తర్వాత మరో పంట ద్వారా సంవత్సరం పొడవునా డబ్బులు వస్తూనే ఉన్నాయని చెప్పాడు.

కృష్ణ నాగ్‌ వేసిన ఒక్కో మొక్క నుంచి ఏడాదిలో 30 కిలోల టమాటాలు, మిర్చి మొక్క నుంచి 7 కిలోలు, తమ పొలంలోని 50 మామిడి చెట్ల నుంచి 2 నుంచి 3 వేల మామిడి కాయలు దిగుబడి వస్తున్నట్లు వివరించాడు. ఆర్గానిక్‌ పద్ధతిలో తాము చేస్తున్న పుచ్చ పాదులు ఒక్కో కాయ 12 కిలోల బరువుతో పెద్ద సైజులో పంట వస్తోందన్నాడు. అలా ఒక్కో ఎకరం పంట ద్వారా ఇప్పుడు 6 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని, అందులో 4 లక్షలు లాభాన్ని కళ్లజూస్తున్నట్లు తెలిపాడు. పంట ద్వారా వస్తున్న లాభాలతో పాటుగా తాను పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషి కారణంగా ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కూడా అదనంగా అందుతున్నాయని వెల్లడించాడు.

ఆర్గానిక్‌ పంటలతో కృష్ణ నాగ్‌ సాధించిన విజయాలను చూసి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు చుట్టుపక్కల రైతుల నుంచి ఎన్నెన్నో ప్రశంసలు అందుకుంటున్నాడు. దేశం నలుమూలల నుంచి అనేక మంది రైతులు కృష్ణ నాగ్‌ ఆర్గానిక్‌ వ్యవసాయ పద్ధతులు తెలుసుకునేందుకు సందర్శిస్తున్నారు. వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి పలువురు రైతులు భయపడుతుంటారని కృష్ణ నాగ్‌ తెలిపాడు. అయితే.. ఒకసారి లేదా ఇంకోసారి విఫలం చెందవచ్చు గానీ.. సరైన మార్గంలో మనం శ్రమిస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ప్రతి ఒక్క రైతూ గ్రహించాలంటాడు. ముందుగా వ్యతిరేక ఆలోచనలను తీసేసి, విజయాలు ఎలా సాధించాలనే దానిపై దృష్టి పెట్టాలని కృష్ణ నాగ్‌ చెబుతున్నాడు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here