‘పూర్వ కాలం నుంచీ మనది వ్యవసాయ దేశం. ఎక్కువ శాతం ప్రజలు వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పుడు దేశంలో వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోంది. సమాజంలో వచ్చిన ఆధునిక మార్పుల వల్ల వ్యవసాయాన్ని పలువురు రైతులు వదిలిపెట్టేస్తున్నారు.’ ఇలాంటి మాటలు మనం వింటుంటాం. అయితే.. వ్యవసాయం నిర్లక్ష్యానికి గురవుతోందనే మాటలో పూర్తి నిజం లేదు. స్థానిక పరిస్థితుల కారణంగా అతి కొద్ది మంది రైతులు వ్యవసాయం కాదని ఇతర పనులు చేసుకుని బ్రతకాలని భావిస్తూ ఉండొచ్చు.  కానీ.. కొత్త కొత్త ఔత్సాహిక రైతులు గ్రామాలకు ఇప్పుడిప్పుడే క్యూ కడుతుండడం గమనార్హం. అది కూడా ప్రకృతి వ్యవసాయం చేసేందుకు పట్టణాలు, నగరాలను వదిలిపెట్టి, లక్షల్లో తీసుకుంటున్న జీతాలు కాదనుకుంటున్న పెద్ద పెద్ద ఉద్యోగులు ఇప్పుడు పల్లెబాట పడుతున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు ఆధునిక సాంకేతికతను జోడించి అత్యధిక దిగుబడులు, చక్కని లాభాలు సాధిస్తున్నారు.ఇలాంటి ఆధునిక విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతు గురించి తెలుసుకుందాం. ఎవరా రైతు? అతి తక్కువ ఖర్చుతో అత్యధిక పంట దిగుబడులు సాధించడంలో ఎలా సక్సెస్‌ అయ్యాడు? అనే విషయం చెప్పుకుందాం. ఆ రైతు ఈశాన్య రాష్ట్రం మేఘాలయకు చెందినవాడు. మేఘాలయలో నల్ల మిరియాల పంటను ఏ విధంగా పండించాడో.. తద్వారా లక్షలాది రూపాయల ఆదాయం ఎలా సంపాదిస్తున్నాడో ఆ వివరాలు చూద్దాం. సృజనాత్మకమైన ఆలోచనలతో ఆ రైతు వ్యవసాయంలో సాధించిన విజయాల కారణంగా దేశ అత్యున్నత పురస్కారాల్లో పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్నాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత రైతు పేరు నానాడో బి. మారక్‌. ఈ రైతు వయసు 61 ఏళ్లు. ఐదు ఎకరాల్లో నల్ల మిరియాలు పండిస్తున్నాడు. మేఘాలయ ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రం. ఔషధ పంటలు, సుగంధ ద్రవ్యాల పంటలకు మేఘాలయ ప్రసిద్ధి. వ్యవసాయంలో ఎన్నెన్నో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేస్తూనే ఉంది మేఘాలయ. అయితే.. నానాడో ప్రత్యేకత ఏమిటంటే.. తన పొలంలో కేవలం ఆర్గానిక్‌ ఎరువులు మాత్రమే వినియోగించడం. గారో కొండల్లో మొట్టమొదటి రైతుగా నానాడో గుర్తింపు పొందాడు.నానాదర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత అత్తవారింటి నుంచి నానాడో ఐదెకరాల భూమి సంపాదించాడు. ఆ పొలంలో నానాడో 34 వేల నల్ల మిరియాల చెట్లు పెంచాడు. ప్రత్యేకత ఉన్న రకం ‘కిరా ముండా’ మిరియాల చెట్లను నానాడో పెంచాడు. ఈ పంట వేసేందుకు నానాడో తొలుత కేవలం 10 వేల రూపాయలు మాత్రం ఖర్చు చేశాడట. ఆ పది వేలతో పది వేల నల్ల మిరియాల మొక్కలు నాటాడట. చేతికి వస్తున్న ఆదాయంతో ప్రతి ఏటా మరికొన్ని మొక్కలు నాటుతూ వచ్చాడట. అలా ఇప్పటికి నానాడో 34 వేల నల్ల మిరియాల చెట్లు పెంచుతున్నాడు. ఇప్పుడు నల్ల మిరియాల పంట ద్వారా మిలియన్ల ఆదాయం రాబడుతున్నానని నానాడో చెప్పాడు. అంతకు ముందుగా నానాడో పూర్తి స్థాయిలో ఆర్గానిక్‌ విధానంలో నల్ల మిరియాల పంట పండించాలని నానాడో నిర్ణయించుకున్నాడట. రసాయనాలు లేని పంటలైతే ప్రజల నుంచి ఎక్కువ ఆదరణ లభిస్తోందని చెప్పాడు. సహజసిద్ధంగా తాను పండిస్తున్న నల్ల మిరియాలకు దేశీయంగా, అంతర్జాతీయంగా కూడా మంచి డిమాండ్‌ ఉందని నానాడో హర్షంతో వివరించాడు.నానాడో వ్యవసాయం చేసే ప్రాంతంలో అడవులు దట్టంగా ఉన్నాయి. నానాడో వ్యవసాయానికి అడవులు అడ్డం అయ్యాయి. పర్యావరణానికి హాని కలుగుతుంది కనుక చెట్లను నరికి వ్యవసాయం చేయాలని అనుకోలేదు నానాడో. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖల సహాయం తీసుకుని, చెట్లను అలాగే ఉండనిచ్చి, వ్యవసాయం చేసేందుకు ఒక వ్యూహంతో ముందుకు వెళ్లి, విజయం సాధించాడు. ఒక పక్కన ప్రభుత్వానికి తన వంతు సాయం అందిస్తూనే.. మరో పక్కన తమ జిల్లాలోని చిన్న చిన్న రైతులకు ఆర్గానిక్‌ వ్యవసాయంలో సహాయం చేస్తున్నాడు. దీంతో మరి కొందరు రైతులు కూడా సేంద్రీయ వ్యవసాయం చేసేందుకు ఉత్సాహంగా ముందుకు రావడం శుభసూచికం.దేశానికి, వ్యవసాయ రంగానికి నానాడో చేస్తున్న కృషికి తగిన ఫలితం లభించింది. ఆర్గానిక్‌ పంటల్లో నానాడో కష్టాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దేశ 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నానాడోకు దేశ అత్యున్నత పురస్కారాలలో పద్మశ్రీ అందజేసి ప్రశంసించింది. సేంద్రీయ వ్యవసాయం పట్ల తనకు ఉన్న నిబద్ధతకు దక్కిన గౌరవంగా నానాడో సంతోషం వ్యవక్తం చేస్తున్నాడు. నానాడోకు పద్మశ్రీ రావడంతో ఇతర రైతులకు కూడా ప్రోత్సాహం లభించింది. నానాడో 2019లో తన భూమిలో పండించిన నల్ల మిరియాల పంటను అమ్మి 19 లక్షల రూపాయల ఆదాయం సంపాదించాడు. అప్పటి నుంచి నానాడో ఆదాయం ఏటేటా మరింతగా పెరుగుతూనే ఉండడం విశేషం.మిరియాల చెట్ల మధ్య సుమారు 8 అడుగుల దూరం ఉండడం ఎంతో ముఖ్యమని నానాడో చెబుతున్నాడు. మిరియపు కాయల నుంచి గింజలు తీయడం చాలా జాగ్రత్తగా చేయాల్సి పని అంటాడు నానాడో. పచ్చి మిరియపు గింజలను కొంతసేపు నీటిలో నానబెట్టాలట. అవి నానిన తర్వాత ఎండబెట్టాలట. ఈ విధానంలో గింజల్ని తీస్తే మిరియాల రంగు మరింత మెరుగ్గా ఉంటుందని నానాడో వివరించాడు. మిరియపు గింజల్ని ఎంత ఎక్కువగా ఎండబెడితే అంత మంచిదంటాడాయన. సరిగా ఎండకపోతే మిరియపు గింజలు పాడయ్యే అవకాశం ఉందట. ఒక్కో మిరియం చెట్టుకు 10 నుంచి 20 కిలోల ఆవుపేడ లేదా వర్మీ కంపోస్ట్‌ ఎరువు అవసరం వాడాలని అంటాడు నానాడో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here