ఈ మహిళా రైతు కుటుంబం ఏళ్ల తరబడి పేదరికంలో మగ్గిపోయింది. కుటుంబం రోజువారీ ఖర్చులకు కూడా వారి ఆదాయం సరిపోయేది కాదు. నెల మొత్తం రెక్కలు ముక్కలు చేసుకున్నా వెయ్యి రూపాయల నుంచి 1,500లకు మించి కళ్లచూసే అవకాశం ఉండేది కాదు. ఈ కష్టాలు, కన్నీళ్లు ఆ మహిళా రైతు ఆర్గానిక్‌ వ్యవసాయం ప్రారంభించక ముందు పరిస్థితి. ప్రకృతి సాగు పద్ధతిలో దానిమ్మ పంట పండించిన తర్వాత ఇన్నేళ్లలో ఆమె కుటుంబం ఏనాడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోలేదు. పైగా పదేళ్ల తర్వాత తమకు వస్తున్న పంట ఆదాయంతో ఆ మహిళా రైతు మిలియనీర్‌గా మారింది. ఆ మహిళా రైతు కథే ఇప్పుడు తెలుసుకుందాం.

రాజస్థాన్‌లోని సికర్‌ జిల్లాకు చెందిన సంతోష్‌దేవి ఖేదర్‌ మహిళా రైతు. ఎన్నో ఏళ్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న తర్వాత తమకు ఉన్న 1.25 ఎకరాల్లో ఆర్గానిక్‌ విధానంలో దానిమ్మ తోటను పెంచింది. 2008లో సంతోష్‌దేవి ప్రకృతి విధానంలో దానిమ్మ సాగు ప్రారంభించింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత దానిమ్మ పంట చేతికి వచ్చింది. ఆ పంట ద్వారా ఆ కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం పేదరికం నుంచి బయటపడింది. ‘ఇప్పుడు మా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్దమొత్తంలో డబ్బులు మేం ఏనాడూ కళ్ల చూసింది లేదు. ఆర్గానిక్‌ వ్యవసాయంతో వచ్చే ఆదాయంతో ఇప్పుడు మేం ఎంతో ఆనందంగా ఉన్నాం’ అని సంతోష్‌దేవి సంతోషంగా చెప్పింది. ఆర్గానిక్‌ పద్ధతిలో దానిమ్మ పంట వేయక ముందు నెల వచ్చేసరికి వెయ్యో.. పదిహేను వందలో మాత్రమే చేతికి వచ్చేవి. ఇప్పుడు ఈ ఎడారి రాష్ట్రంలో మాకు పంట వచ్చేసరికి 3 లక్షల రూపాయలు కళ్ల చూస్తున్నాం అని సంతోష్‌దేవి ఆనందంగా చెప్పింది.నాలుగు పదుల వయసున్న సంతోష్‌దేవి బేరి గ్రామంలోని తమ పొలంలో దానిమ్మ పంటతోనే సరిపెట్టుకోలేదు. నిమ్మ, బత్తాయి, యాపిల్‌, జామ, బొప్పాయి పంటలు కూడా పండిస్తూ ఏడాదికి 25 లక్షల రూపాయల ఆదాయం కళ్లజూస్తోంది. సంతోషిదేవి చేస్తున్న ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని చూసేందుకు ఆమె సొంత రాష్ట్రం రాజస్థాన్‌ నుంచే కాకుండా మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, పంజాబ్‌, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల నుంచి ఔత్సాహిక రైతులు ఆసక్తిగా తరలివస్తుంటారు. ఆర్గానిక్‌ వ్యవసాయానికి సంతోష్‌దేవి క్షేత్రం ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందింది. అయితే.. సంతోష్‌దేవికి ఇంత పేరు అంత ఈజీగా మాత్రం రాలేదు. ఏళ్ల తరబడి సంతోష్‌దేవి కుటుంబం చేసిన కష్టం ఇప్పుడు ఫలితాల పంట పండిస్తోంది.

తొలిరోజుల్లో తమకు ఆర్గానిక్ వ్యవసాయంలో సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాలేదని సంతోష్‌దేవి వెల్లడించింది. అయినప్పటికీ తాము ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో ప్రయోగాలు చేశామని, పంటలు సరిగా రాక విఫలమయ్యామని పేర్కొంది. ఆ సమయంలో రసాయన ఎరువులు వాడమని కొందరు అధికారులు సలహా ఇచ్చారని, అయితే అలా చేయడానికి తమకు ఏమాత్రం ఇష్టంలేదని తెలిపింది. తమ కుటుంబాల్లోని పెద్దల సలహా తీసుకున్నానని, సహజసిద్ధమైన, ఆర్గానిక్‌ ఎరువులను ఎలా తయారు చేయాలో వారు నేర్పించారని సంతోష్‌దేవి వెల్లడించింది. వారి సలహాలు, సూచనలతో తాను, తన భర్త కలిసి సేంద్రీయ ఎరువులను సొంతంగా తయారు చేసుకుని మొక్కలకు ఉపయోగించినట్లు తెలిపింది. అదే తమకు ఫలితాలు ఇచ్చిందని ఆనందంగా చెప్పింది.

సంతోష్‌దేవి క్షేత్రంలో పండిన ఒక్కో దానిమ్మకాయ సుమారు 500 నుంచి 700 గ్రాముల బరువు ఉంటుందని సంతోష్‌దేవి చెప్పింది. అదే ఇతరులు పండించిన దానిమ్మ కాయలైతే కేవలం 300 నుంచి 400 గ్రాములే ఉంటాయని తెలిపింది. ఆర్గానిక్‌ విధానంలో తాము పండించిన దానిమ్మకాయలు మంచి రుచిగా, తియ్యగా ఉంటయని, దాంతో మార్కెట్‌లోనూ, వినియోగదారుల నుంచి కూడా చక్కని డిమాండ్‌ ఉందని సంతోష్‌దేవి సంతోషంగా చెప్పింది. త్వరలోనే ఖాతాదారులతో ఓ గ్రూపును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.తమ పొలంలో పండిన పంటల ద్వారా వచ్చే ఆదాయంలో 2016 నుంచీ తమ అవసరాలకు సరిపడినంత ఉంచుకుని మిగతా మొత్తాన్ని బత్తాయి, నిమ్మ, యాపిల్‌ పంటలపై ఖర్చు చేస్తున్నట్లు సంతోష్‌దేవి వివరించింది. తాము పండిస్తున్న యాపిల్‌ పండ్లు రాజస్థాన్‌లో పండేవి కాదని, హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక రైతు స్వయంగా పండించిన విత్తనం తీసుకొచ్చి పెంచుతున్నామని సంతోష్‌దేవి వెల్లడించింది. తాము పండించే యాపిల్స్‌కు మార్కెట్‌లో కిలోకు 200, బత్తాయికి 50, నిమ్మకాయలు కిలో 70 రూపాయలు ధర పలుకుతున్నట్లు ఆమె తెలిపింది. మామాలుగా మార్కెట్‌లో దొరికే పండ్ల కన్నా తమ పండ్లకే అధిక ధర వస్తోందని చెప్పింది.

ఒక పంట సీజన్‌లో తాము సుమారు 50 కిలోల దానిమ్మ, 40 కేజీల బత్తాయి, నిమ్మ, యాపిల్‌ పంటలు 30 కిలోల చొప్పున పండిస్తున్నామని సంతోష్‌దేవి పేర్కొంది. ఆర్గానిక్‌ బత్తాయి పంటను సంతోష్‌దేవి విజయవంతంగా పండిస్తోంది. సంతోష్‌దేవి ఇప్పుడు భారతదేశంలోని మిలియనీర్‌ రైతుల జాబితాలో స్థానం సంపాదించింది.

భర్త డ్యూటీకి, పిల్లలు స్కూలుకు వెళ్లిపోయిన తర్వాత ప్రతిరోజు సంతోష్‌దేవి పొలంపనులు చూసుకునేది. పొలంలో కలుపు తీత, ఆర్గానిక్‌ ఎరువుల తయారీ లాంటి పనులు స్వయంగా చేసేది. అలా తాను ప్రతిరోజూ 12 నుంచి 14 గంటల పాటు నడుం విరిగేలా పనిచేసినట్లు గుర్తుకు తెచ్చుకుంది. వేప ఆకు, ఆవుపేడ, స్థానికంగా దొరికే పిచ్చిమొక్కలతో స్వయంగా ఘన జీవామృతం తయారుచేసేది. ఇక ఆపుపేడ, గోమూత్రం, మినప్పప్పు, బెల్లం, మట్టిని కలిపి రావిచెట్టు నీడలో ద్రవ జీవామృతం రూపొందించేది.ఆర్గానిక్‌ పంటలపై జనంలో అవగాహన పెరిగిన తర్వాత ఆర్గానిక్‌ పద్ధతిలో పెంచిన మొక్కలు తమకూ కావాలని సంతోష్‌దేవిని అనేక మంది రైతులు తన శేఖావాటి క్రిషి ఫార్మ్‌ నర్సరీకి వస్తున్నారని ఆమె వెల్లడించింది. ఆర్గానిక్‌ పంటల విధానంలో సంతోష్‌దేవి కృషికి గుర్తింపుగా 2016లో జైపూర్‌లో జరిగిన అగ్రిటెక్‌ మీట్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డు కూడా అందుకుంది. ఇంకా అనేక అవార్డులు కూడా సంతోష్‌దేవిని వరించాయి.

ఆర్గానిక్‌ ఫార్మింగ్‌లో సంతోష్‌దేవి తయారుచేసే ఘన జీవామృతం, ద్రవ జీవామృతం తయారీలో అవగాహన కోసం శేఖావాటి ఫాం వద్దకు ప్రతి రోజూ కనీసం 15 నుంచి 20 మంది రైతులు వస్తుంటారు. వారికి సంతోష్‌దేవి, ఆమె భర్త, కొడుకు రాహుల్‌ ఎంతో ఓపికగా, అర్థమయ్యే విధంగా వివరిస్తుంటారు. ఘన, ద్రవ జీవామృతాల తయారీ, మొక్కల్ని ఎలా నాటాలి తదితర వ్యవసాయ విధానాలపై సంతోష్‌దేవి కుటుంబం ప్రతిరోజూ రెండు గంటల సమయాన్ని కేటాయిస్తోంది. అతిథిదేవో భవ అంటూ అలా వచ్చిన వారికి సంతోష్‌దేవి కమ్మటి భోజనం వండిపెట్టి సంతోషపెడుతుంది. మొక్కల ఆవశ్యకతను అందరికీ అర్థమయ్యేలా చేసేందుకు తన కుమార్తె వివాహం సందర్భంగా ఒక్కో అతిథికి ఒక మొక్క చొప్పున 551 మొక్కలను బహుమతిగా అందజేసింది. పెళ్లిలో కట్నం ఇచ్చే బదులు తల్లిదండ్రులు తమ పిల్లలకు మొక్కలు అందజేస్తే అనంతర కాలంలో అవి వారికి ప్రయోజనకరంగాను, మంచి పర్యావరణం ఏర్పడడానికి దోహదం చేస్తాయని సంతోష్‌దేవి సందేశం ఇచ్చింది.

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here