హైదరాబాద్‌లో నివసించే ఆర్‌. నందకిశోర్‌ రెడ్డి మూడేళ్లు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. ప్రతి రోజూ రోటీన్‌గా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేసే డ్యూటీతో బోర్ ఫీలయ్యాడు. ఉద్యోగంలో ఉన్నప్పుడు నెలనెలా కేవలం 35 వేలు జీతంగా అందుకునేవారు. నందకిశోర్‌రెడ్డిలో ఏదో మూల తెలియని అసంతృప్తి గూడుకట్టుకుపోయింది. జీవితంలో ఏదో పోగొట్టుకున్నట్లు భావించేవారు. 2020 మార్చిలో కోవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన సమయం. నందకిశోర్‌రెడ్డి చుట్టూ ఉన్న అనేక మంది తమ తమ ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ సమయంలో మహబూబ్‌నగర్‌ జిల్లా రైలాపూర్‌ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నందకిశోర్‌రెడ్డి ఒక చక్కని నిర్ణయం తీసుసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే ఆర్గానిక్‌ వ్యవసాయ రైతుగా మారిపోయారు.

నిజానికి నందకిశోర్‌రెడ్డి తన తండ్రి తమ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నప్పుడు తాను అంతగా పట్టించుకునేవారు కాదట. ఎందుకంటే వ్యవసాయం అంతగా లాభదాయకమైన వ్యాపకం అనిపించేది కాదట. కరోనా కల్లోలం కారణంగా అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్‌ ప్రకటించాయి. ప్రతి ఒక్కరూ మార్కెట్లు, దుకాణాల నుంచి ఆహార పదార్ధాలను పెద్ద మొత్తంలో కొనుక్కుని ఇళ్లలో నిల్వ పెట్టుకుంటున్నారు. మనిషి మనుగడ సాగించాలంటే వ్యవసాయం ఎంత ముఖ్యమో ఆ సమయంలో నందకిశోర్‌రెడ్డికి స్పష్టంగా అర్థమైందట. రైతన్నలు పంటలు పండించకపోతే మనుషులు తినేందుకు ఏమీ ఉండదనే సత్యాన్ని గ్రహించారట. టెక్నాలజీలో తనకు ఉన్న అనుభవం ద్వారా వ్యవసాయంలో అధిక లాభాలు సాధించేలా తండ్రికి సాయపడాలని ఆయన నిర్ణయించుకున్నారట.ఈ క్రమంలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పట్ల, అందులో కొత్త కొత్త ఆవిష్కరణలు తేవాలని ఆసక్తి తనకు బలంగా ఏర్పడిందని నందకిశోర్‌రెడ్డి చెప్పారు. ఆ ఆసక్తే తనను పూర్తిస్థాయి వ్యవసాయదారుడిగా మార్చిందంటారాయన. దీంతో నందకిశోర్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తమ సొంతూరికి వెళ్లిపోయానన్నారు. ఇప్పుడు తమ ఊరిలో ఒక ఎకరం పాలీహౌస్‌తో పాటు రెండు ఎకరాల్లో ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తున్నారు నందకిశోర్‌రెడ్డి. అంతవరకు తమ తండ్రి చేస్తున్న సాంప్రదాయ వ్యవసాయ విధానంలో ఏడాది కాలంలో సుమారు 30 టన్నుల ఇంగ్లీస్ దోసకాయ, పాలకూర పండించేవారు. ఇంగ్లీషు దోసకాయ కిలో 28 రూపాయల చొప్పున మొత్తం 24 టన్నులు అమ్మేవారట. ఇక పాలకూర ఏడాది పొడవునా చేస్తే ఆరు టన్నులు వచ్చేదట.

ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా ఇప్పుడు నెలకు 3 నుంచి 3.5 లక్షల రూపాయలు సంపాదిస్తున్నానని నందకిశోర్‌రెడ్డి ఆనందంగా చెబుతున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయానికి పాలిహౌస్‌తో సహా మొత్తం ఖర్చులు 5 లక్షలు అయిందని, ఇప్పుడు తన ఆదాయం కేవలం మూడు నెలల్లో సుమారు 10 లక్షలు వస్తోందని అన్నారు. మిగతా కాలం అంతా కాప్సికమ్‌, పచ్చిమిర్చి, బెండకాయలు సహా ఇంకా పలు రకాల కూరగాయలు పండించి మరింత ఆదాయం రాబడుతున్నారు నందకిశోర్‌రెడ్డి. ఈ పంటల ద్వారా కూడా ఆయన మరింత ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నారు.

ఐటీ ఉద్యోగం నుంచి ఆర్గానిక్‌ వ్యవసాయంలోకి తాను నేరుగా రాలేదన్నారు. ముందుగా తన తండ్రి ద్వారా వ్యవసాయానికి సంబంధించి అనేక మెళకువలు నేర్చుకున్నానని నందకిశోర్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో అనేక విషయాలను తన తండ్రి తనకు బోధించినట్లు తెలిపారు. ఎప్పుడు మొక్కలు వేయాలి, ఎప్పుడు పంట చేతికి వస్తుంది, ఏ కాలంలో ఏ పంటలు వేస్తే మంచిదనే విషయాలు ఆయన నుంచే నేర్చుకున్నానన్నారు. ఇప్పుడు తాను అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను వ్యవసాయ శాస్త్రం చదివిన తన మిత్రుని నేర్చుకున్నానన్నారు నందకిశోర్‌. తాను ఆర్గానిక్ వ్యవసాయం చేయబట్టి రెండేళ్లు పూర్తయిందన్నారు. మట్టిని నమ్ముకుంటే లాభాల పంట పండుతుందని తన అనుభవంలోకి వచ్చిందన్నారు. డ్రిప్‌ ఇరిగేషన్‌, రసాయనాలు వాడకపోవడం, డ్రిప్‌ విధానంలో మొక్కల్ని ఫలదీకరణ అనే అతి ముఖ్యమైన విధానం ద్వారా తాను అధిక ఉత్పత్తులు, అత్యధిక ఆదాయం, ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నట్లు నందకిశోర్‌రెడ్డి వివరించారు.వ్యవసాయం ద్వారా ఆకర్షణీయమైన లాభాలు సాధించాలనుకునే వారికి నందకిశోర్‌రెడ్డి, ఆయన తండ్రి రాజా సాయం చేసేందుకు కృషిచేస్తున్నారు. ‘డీప్‌ రూటెడ్‌.కో’ సంస్థతో కలిసి వారు పనిచేస్తున్నారు. ఫార్మ్‌ టూ హోమ్‌ స్టార్టప్‌ ద్వారా నాణ్యమైన పండ్లు, కూరగాయలను ప్యాక్‌ చేసి నందకిశోర్‌రెడ్డి వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. వ్యసాయంలో ఖర్చులు ఎలా తగ్గించాలి, లాభాలు ఎలా సంపాదించాలి అనే విషయాలపై రైతులకు శిక్షణ కూడా నందకిశోర్‌ ఇస్తున్నారు.

డీప్‌ రూటెడ్‌.కోతో కలిసి పనిచేయడం ప్రారంభించాక తమకు ఆదాయం రెట్టింపు అయిందని నందకిశోర్ వెల్లడించారు. విత్తనాలు నాటే పద్ధతి, డ్రిప్‌ ఫెర్టిగేషన్‌, బ్యాచ్‌ల వారీగా తాము పంటలు పండించడం, నాణ్యమైన పంట ఉత్పత్తులు తీయడం, కూరగాయ పంటల్ని సాకే విధానాల ద్వారా తమకు లాభాలు రెట్టింపు అయ్యాయంటారు నందకిశోర్‌. చిన్న, సన్నకారు రైతులకు మరింతగా వ్యవసాయంలో ప్రోత్సాహం అందించడం, వృథాను అరికట్టడం, డిమాండ్‌- సప్లై విధానంతో రైతులకు లాభాలు వచ్చేలా తమ సంస్థ కృషి చేస్తోందని డీప్‌ రూటెడ్‌.కో వ్యవస్థాపకులు అవినాశ్‌ బీఆర్‌ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here