ఉత్తరప్రదేశ్‌ లోని మీర్జాపూర్‌ జిల్లా శిఖర్‌ గ్రామానికి చెందిన సోదరులు ముఖేష్‌ పాండే, చంద్రమౌళి పాండే సహజ పంటల సాగును ఓ ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. రైతు ఉత్పత్తుల ఆర్గనైజేషన్‌ (FPO) ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ ఏర్పాటు చేసి వందలాది మంది పురుష రైతులు, వారి కంటే అధిక సంఖ్యలో మహిళా రైతులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆర్గానిక్‌ పంటల సాగులో 1500 మందికి పైగా అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చారు. ఇంకా వందల మందికి శిక్షణ కొనసాగిస్తున్నారు. ఆర్గానిక్‌ పంటలు సాగు చేయాలని ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు వర్మీ కంపోస్ట్‌ తయారీలో ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ ద్వారా చక్కని శిక్షణ ఇస్తున్నారు. దాంతో పాటు ఆర్గానిక్ పంటల సాగులో రైతులకు కావాల్సిన సాంకేతిక సేవలు, మార్కెటింగ్‌ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

పాండే సోదరుల కృషి కారణంగా వారి సొంతూరు శిఖర్‌ గ్రామానికి చుట్టుపక్కల అనేక మంది రైతులు, మహిళా రైతులు తమ కష్టాల నుంచి బయటపడ్డారు. తమకు కొద్దిపాటి పోలాల్లో కూడా ఆర్గానిక్‌ పంటలు సాగుచేస్తూ ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తున్నారు. రైతులకు శిక్షణ ఇవ్వడంతో పాటు పాండే సోదరులు వారి ఆర్గానిక్ సాగుకు కావాల్సిన పరికరాల కొనుగోలు విషయంలో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మార్కెట్లో వారి కింట పంట ఉత్పత్తులకు లభించే రేటు కన్నా ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ ద్వారా 5 రూపాయలు అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. అలా తమ సంస్థ ద్వారా కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా మార్కెట్లలో విక్రయిస్తున్నారు. నవ చేతన ఆగ్రో సెంటర్‌లో ఎక్కువ ఆదాయం లభిస్తుండడంతో రైతుల ఆనందానికి పట్టపగ్గాలు ఉండడం లేదు. ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ చేస్తున్న సేవలకు గుర్తింపుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా ఉత్తమ ఫార్మర్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌పీఓ) అవార్డును పాండే సోదరులు అందుకున్నారు. ఆర్గానిక్‌ రైతుల అవసరాల కోసం ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ కొనుగోలు చేసే వ్యవసాయ పరికరాలు, యంత్రాలకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటుతో పాటు సబ్సిడీలు కూడా అందజేస్తుండడం విశేషం.ముఖేశ్‌ పాండే తొలి రోజుల్లో ‘ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌’ తరఫున గుజరాత్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ట్రైనింగ్ కన్సల్టెంట్‌గా పనిచేసేవారు. దాని ద్వారా ముఖేశ్ నెలకు లక్ష రూపాయల సంపాదించేవారు. అయితే.. తమ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే కోరికతో మంచి జీతం వచ్చే జాబ్‌ను పాండే వదిలిపెట్టేశారు. ముఖేశ్‌ పాండే సోదరుడు చంద్రమౌళి పాండే వారణాసిలో సొంత వ్యాపారం చేసుకునేవారు. అయితే.. వర్మీ కంపోస్ట్‌ వ్యాపార నిర్వహణలో తన సోదరుడు ముఖేశ్ పాండేకి తన సహాయం అవసరమని భావించారు. అంతకు ముందు తాను చేసిన వ్యాపారం ద్వారా రోజుకు 2 లక్షల రూపాయల దాకా ఆదాయం వచ్చేదని చంద్రమౌళి పాండే చెప్పారు. కానీ.. వర్మీకంపోస్ట్‌ వ్యాపారంలో ప్రాధాన్యతను గుర్తించిన వెంటనే మరో ఆలోచన చేయకుండా తన సోదరుడు ముఖేశ్‌ పాండేతో కలిశానన్నారు.

పాండే సోదరులు మీర్జాపూర్‌లో కేవలం రెండు వర్మీ కంపోస్ట్‌ బెడ్స్‌తో 2017లో తమ కార్యకలాపాలు ప్రారంభించారు. అయితే.. అప్పట్లో వర్మీకంపోస్ట్‌ వ్యాపారంలో వారు పెద్ద సవాళ్లే ఎదుర్కొన్నారు. రైతులను ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ వైపు మళ్లించడం, వారికి సహజ పంటలపై అవగాహన కల్పించడం, నేచురల్‌ ఫార్మింగ్‌ ద్వారా వచ్చే ప్రయోజనాలను అర్థం అయ్యేలా చెప్పడం చాలా కఠినమైన పనే అని ముఖేశ్‌ పాండే చెప్పారు. ఆర్గానిక్ ఫార్మింగ్‌పై వీధి నాటకాల ప్రదర్శనతో అవగాహన కల్పించడంలో విజయం సాధించామని, అప్పటి నుంచి తమ వర్మీకంపోస్ట్‌ వ్యాపారం క్రమేపీ వృద్ధి చెందిందని ఆయన వెల్లడించారు. మరో పెద్ద అవాంతరం ఏంటంటే.. వర్మీ కంపోస్ట్‌కు ముడిపదార్థంగా ఆవు పేడను ఉపయోగించడం ఏంటనే అనుమానం ప్రజల్లో నాటుకుపోయి ఉండడం అన్నారు. వర్మీకంపోస్ట్‌ గురించి చెబుతున్నప్పుడు గ్రామాల్లోని రైతులు తమను చిన్నచూపు చూసేవారని ముఖేశ్‌ పాండే గుర్తుచేశారు.ఎట్టకేలకు పాండే సోదరుల గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో రైతులు ఒక్కొక్కరుగా సహజ పంటల సాగు వైపు మళ్లడం ప్రారంభించారు. ఆ సమయంలోనే పాండే సోదరులు ఆర్గానిక్ రైతులకు తోడ్పాటు అందించేందుకు ‘నవ చేతన ఆగ్రో సెంటర్‌’ పేరుతతో ఫార్మ్‌ ప్రొడ్యూసర్‌ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు. పాండే సోదరులు ఇప్పుడు తమ గ్రామం శిఖర్‌లో వెయ్యికి పైగా వర్మీకంపోస్ట్‌ బెడ్స్‌ను నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారం రెండు నుంచి వెయ్యి బెడ్స్‌కు విస్తరించడం విశేషం. ఆర్గానిక్ ఫెర్టిలైజర్ పేరుతో ప్రస్తుతం పాండే సోదరులు తమ వర్మీ కంపోస్ట్‌ను మధ్యప్రదేశ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, అసోం, చండీగఢ్‌, జమ్ము సహా మొత్తం 12 రాష్ట్రాల్లో భారీ ఎత్తున విక్రయిస్తున్నారు. తద్వారా ఇబ్బడిముబ్బడిగా లాభాలు కూడా సంపాదిస్తున్నారు. పాండే సోదరుల వర్మీ కంపోస్ట్‌ వ్యాపారం 2020-21 సంవత్సరంలో కోటిన్నర రూపాయలకు మించిపోయింది. అయితే తమకు అంతకన్నా ఎక్కువ సంతోషం కలిగించిన విషయం 1,560 మంది రైతులు ఆర్గానిక్‌ ఫార్మింగ్‌కు మారడం అని పాండే సోదరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ 1,560 మందిలో 60 శాతానికి పైగా మహిళా రైతులే ఉండడం మరింత ఆనందాన్ని కలిగిస్తోందని చంద్రమౌళి పాండు అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here