యూనివర్శిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ నుంచి యానిమల్‌ బయోటెక్నాలజీలో ఎమ్మెస్సీ చేశాడు. దేశంలో ప్రసిద్ధి చెందిన మందుల తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ మంచి జీతంతో ఉద్యోగం చేశాడు. అయినప్పటికీ ఈ జీవితంతో హైదరాబాద్‌లో నివసిస్తున్న 32 ఏళ్ల బొంగురం నాగరాజుకు ఏమాత్రం సంతృప్తి లేకపోయింది. రసాయనాలు వినియోగించి పండించిన పంట ఉత్పత్తులతో తయారైన ఆహారం తింటున్న నగర ప్రజలను చూసిన నాగరాజులో ఏదో తెలియని బాధ కలిగింది. దాంతో ఏమి చేస్తే బాగుంటుందనే దీర్ఘాలోచనలో పడిపోయాడు. చివరికి నాగరాజు ఓ దృఢ నిర్ణయానికి వచ్చాడు. నెలనెలా వేల రూపాయల జీతంగా అందుకుంటున్న నాగరాజు ఉద్యోగం వదిలేయాలని డిసైడ్‌ అయ్యాడు. తెలంగాణలోని తన స్వగ్రామం హబ్సిపూర్‌ వెళ్లిపోయి, కొత్త కొత్త పంటల సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. హబ్సిపూర్‌ గ్రామస్థులు అంతకు ముందు ఎప్పుడూ చేయని  సాంప్రదాయేతర విధానంలో రకరకాల పంటలు పండించడం ప్రారంభించాడు. కృత్రిమంగా తయారైన రసాయన ఎరువులు, పురుగు మందుల వైపు కన్నెత్తి కూడా నాగరాజు చూడలేదు. ఆవు పేడ, వేప నూనె మాత్రమే వినియోగిస్తూ పూర్తి సేంద్రీయ పద్ధతిలో పంటలు పండించాడు. వినియోగదారులకు మంచి ఆరోగ్యాన్నిచ్చే సేంద్రీయ సాగులో బొంగురం నాగరాజు చేస్తున్న కృషిని గుర్తించిన గాంధీ గ్లోబల్‌ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ పరిషత్‌ సంస్థ 2021లో ‘పుడమిపుత్ర’ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది.సేంద్రీయ వ్యవసాయంలో ఇతర రైతులకు అవగాహన కల్పించేందుకు మన యువ రైతు బొంగురం నాగరాజు ఎంతో కృషి చేస్తున్నాడు. వాలంటరీ ఆర్గనైజేషన్‌ ‘గ్రామ భారతి’, ‘సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌’, ‘దక్కన్‌ ముద్ర’ సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. వ్యవసాయాన్ని మరీ ముఖ్యంగా సహజసిద్ధ వ్యవసాయం చేయాలనుకునే ఎందరో ఔత్సాహిక యువకులకు నాగరాజు చక్కని ప్రేరణగా నిలుస్తున్నాడని వ్యవసాయ విస్తరణాధికారి మహేశ్‌ సంతోషంగా చెబుతున్నారు. అంటే సహజ పంటల సాగులో నాగరాజు ఎంత ఆసక్తిగా, మరెంత నిబద్ధతతో కృషి చేస్తున్నాడో మహేశ్‌ మాటల్లోనే వెల్లడవుతోంది.

నిజానికి భారత్‌ బయోటెక్‌ లాంటి మంచి సంస్థలో ఉద్యోగం వదిలేసి, సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకున్న నాగరాజు నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఆయన తల్లిదండ్రులు, అత్త మామలు ఆందోళ చెందారట. అయినప్పటికీ.. అతని సతీమణి మాత్రం నాగరాజుకు అన్ని విధాలా పూర్తి మద్దతు అందించారట. ఆమె కూడా హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో చేస్తున్న టీచర్‌ ఉద్యోగం వదిలిపెట్టేసి భర్తకు చేదోడువాదోడుగా నిలిచారు. నాగరాజు దంపతులు నాలుగున్నర ఎకరాల్లో ప్రత్యేకమైన స్వదేశీ వరి పంటలు మణిపూర్‌ బ్లాక్‌ రైస్‌, కుజి పాటలి, దసుమతి, రత్నచోడి, కాలాబట్టి, తెలంగాణ సోనా, కుగి పటాలియా, బర్మా బ్లాక్‌ రకాల పంటలు పండిస్తున్నారు. ప్రత్యేకమైన ఈ స్వదేశీ వరి పంటలతో పాటు నాగరాజు దంపతులు పలు రకాల కూరగాయలు, పండ్లు తమ పొలంలో ఏకకాలంలో పండిస్తున్నారు. అరుదైన గొర్రె జాతులు, కోళ్లను కూడా వారు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. కూరగాయలు, పండ్లు, గొర్రెలు, కోళ్ల పెంపకం ద్వారా భవిష్యత్తులో అత్యధిక లాభాలు వస్తాయని నాగరాజు ధీమాగా చెప్పాడు. హబ్సిపూర్‌లోని ఇతర రైతులకు తాను పండించే ప్రత్యేకమైన స్వదేశీ వరిధాన్యం విత్తనాలు అందజేస్తున్నాడు నాగరాజు. అంతే కాకుండా వారికి చక్కని సూచనలు, సలహాలు ఇచ్చి వారిని ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నాడు.ఏదో పంటలు పండించాలి, రసాయనాలు, పురుగు మందులు వాడేసి అయినా అధిక ఉత్పత్తులు సాధించాలని ఆలోచించే వేలాది మంది మన రైతుల కన్నా తాను సహజసిద్ద వ్యవసాయం చేయడంతో పాటు నలుగురినీ ఆ దిశగా ప్రోత్సహిస్తున్న నాగరాజు దంపతులు మనకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here