ఏపీ మిల్లెట్ మిషన్‌ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్‌ తుది సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పంటల సాగుకు నీరు కోసం బావులు, బోర్ల మీద అధిక భారం పడకుండా చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ కేబినెట్‌ మిల్లెట్‌ మిషన్‌ను ఆమోదించిందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ ముగిసిన తర్వాత పేర్ని నాని మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.

నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆరుతడి పంటలను మిల్లెట్‌ మిషన్‌ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. చిరు ధాన్యాల పంటలు పండించేందుకు నీటి అవసరం తక్కువ ఉంటుందని, విద్యుత్‌ వాడకం కూడా స్వల్పంగా ఉంటుందని మంత్రి పేర్ని చెప్పారు. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర అంశం కూడా మిల్లెట్‌ మిషన్ ద్వారా లభిస్తుందని ఆయన వివరించారు. చిరుధాన్యాల్లో పోషక విలువలు కూడా అత్యధికంగా ఉండడంతో మిల్లెట్‌ పంటలను ప్రోత్సహించాలని ఏపీ కేబినెట్‌ మిల్లెట్ మిషన్‌ తీసుకొస్తోందన్నారు. పోషక విలువలు అధికంగా ఉన్నందున చిరుధాన్యాలు వినియోగించే వారికి ఆరోగ్యం బాగుంటుందని ఏపీ మిల్లెట్ మిషన్‌ని కేబినెట్‌ ఆమోదించినట్లు మంత్రి పేర్ని పేర్కొన్నారు.సేంద్రీయ సాగును ఏపీలోని ప్రతి గ్రామంలోనూ పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సూచించిన మరుసటి రోజే ఇలా మిల్లెట్‌ మిషన్‌ని కేబినెట్‌ ఆమోదించడం విశేషం. సహజ సాగు విధానాలను ప్రయోగశాలలకు, కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయకూడదని, సేంద్రీయ సాగుపై రైతులకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కూడా సీఎం సూచించారు. రాష్ట్ర సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంపై గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ ప్లానెట్‌ సంస్థ ప్రతినిధులతో సీఎం జగన్‌ తాడేపల్లిలోని తన క్యాంపు ఆఫీసులో చర్చలు జరిపారు. సేంద్రీయ పంట ఉత్పత్తులకు మంచి ధర కల్పించి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను ప్రోత్సహించేలా సర్టిఫికేషన్‌ చేయాలన్నారు.సాధారణ సాగు ఉత్పత్తులకు, సహజ సాగు ఉత్పత్తులకు ధరల మధ్య తేడా స్పష్టంగా కనిపించేలా చేయాలన్నారు. రసాయనాలు, కృత్రిమ ఎరువులను వాడి పండించే ఆహార ఉత్పత్తులు కేన్సర్ లాంటి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్న విషయాన్ని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రస్తావించడం గమనార్హం. సహజ సాగు విధానాలు క్షేత్రస్థాయిలో అమలు కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. సహజ సాగు విధానంలో పండించిన పంటల గురించి ఆర్బీకేలు లాంటి వ్యవస్థలను వినియోగించి సమాజంలో చక్కని మార్పు తీసుకురావచ్చన్నారు.

ప్రకృతి సిద్ధ సాగులో ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏపీ సీఎం జగన్‌ తెలిపారు. సహజ సాగులో గ్రాడ్యుయేసన్‌ ప్రవేశపెట్టాలని సూచించినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్బీకేలను సహజసాగు కేంద్రాలుగా మారుస్తామని జగన్‌ తెలిపారు. సహజసాగు విధానాలను ప్రోత్సహించేలా సాంకేతికంగా ఆర్బీకేలను పటిష్టం చేస్తామని అన్నారు. సహజసాగు కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సహజసాగుకు సంబంధించిన ఉపకరణాలను అందుబాటులో ఉంచి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here