రైతు కుటుంబంలో పుట్టిన రాజ్‌కుమార్ చౌధరికి చిన్నప్పటి నుంచీ వ్యవసాయం అంటే మక్కువ.. అందులోనూ సహజ వ్యవసాయ విధానాలు, దేశీయ వరి పంటలంటే మరింత ఎక్కువ ఆసక్తి. దాంతో ఇంటర్‌ విద్య పూర్తయ్యాక వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకున్నాడు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌లో ప్రవేశానికి అర్హత సాధించాడు. అయితే.. తన కుటుంబం ఆర్థిక స్తోమత రాజ్‌కుమార్‌కు తమ జిల్లా దాటి బయటి కాలేజీలో చదివేందుకు చాలలేదు. వ్యవసాయశాస్త్రం చదివే అవకాశం లేకపోవడంతో రాజ్‌కుమార్‌ కల చెదిరిపోయింది. దాంతో మధ్యప్రదేశ్‌ రాష్ట్రం పరస్‌వాడలోని రాణి దుర్గావతి ప్రభుత్వ కళాళాలలో బీఏ చదివాడు. దాంతో పాటు కంప్యూటర్‌ విద్య కూడా నేర్చుకున్నాడు.బీఏ చదివినా, కంప్యూటర్ విద్య నేర్చుకున్నా వ్యవసాయం పట్ల తనకున్న అభిరుచితో తన చుట్టుపక్కల వారి నుంచి, తన కుటుంబ పెద్దల నుంచి, ప్రొఫెషనల్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ యాక్షన్‌ (ప్రధాన్‌)లోని వృత్తి సంబంధ నిపుణుల నుంచి, వ్యవసాయ సదస్సులు, సమావేశాలకు హాజరై సాగు విధానాల గురించి రాజ్‌కుమార్‌ తెలుసుకుంటూనే ఉన్నాడు. వ్యవసాయ విద్య చదువుకోవడానికి అడ్డుపడిన ఆర్థిక సమస్యలు రాజ్‌కుమార్‌ను అందుకు సంబంధించిన విషయాలు తెలుసుకోకుండా మాత్రం ఆపలేకపోయాయి.గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతులకు అండగా నిలిచే పౌర సంస్థ ‘ప్రధాన్‌’ సెల్ఫ్‌ హెల్స్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడానికి 2011లో రాజ్‌కుమార్‌ గ్రామం లోట్‌మర వచ్చింది. ఆ సంస్థ డేటా ఎంట్రీ చేయడానికి రాజ్‌కుమార్‌ను పనిలోకి తీసుకుంది. ఆ సంస్థ నిర్వహించే సమావేశాలు వల్ల రాజ్‌కుమార్‌కు వ్యవసాయం గురించి మరింత ఎక్కువగా తెలుసుకునే వీలు లభించింది. దేశీయ వరి విత్తనాల సేకరణతో కలిగే లాభాల గురించి ప్రధాన్‌ సంస్థ ప్రతినిధి చందన్‌ భయ్యా 2013లో ఓ సమావేశంలో చెప్పిన మాటలు రాజ్‌కుమార్‌కు ఓ మంచి టర్నింగ్ పాయింట్‌ అయింది. దేశీయ వరి విత్తనాలకు తక్కువ నీటి అవసరం ఉంటుందరి చందన్‌ చెప్పిన మాట రాజ్‌కుమార్‌ను బాగా ఆకట్టుకుంది. దాంతో పాటు దేశీయ వరి విత్తనాలు చీడ పీడలను తట్టుకుంటాయని ఆయన చెప్పిన విషయం రాజ్‌కుమార్‌ను మరింతగా ఆకర్షించింది. దేశీయ వరి విత్తనాలకు పొలంలో తయారయ్యే ఎరువులు, జీవన ఎరువుల్నే వినియోగించడం వల్ల ఖర్చు కూడా బాగా తగ్గిపోతుందనే విషయం కూడా రాజ్‌కుమార్‌కు బాగా ఆకట్టుకుంది. పైగా దేశీయ వరి విత్తనాలు హైబ్రీడ్‌ విత్తనాల మాదిరిగా ప్రతి ఏటా మార్కెట్‌ నుంచి భారీ ధరలతో దేశీయ వరి విత్తనాలు కొనాల్సిన అగత్యం ఉండదు. ఎందుకంటే తదుపరి వ్యవసాయ సీజన్‌కు కూడా దేశీయ వరివిత్తనాలను రైతులే నిల్వ చేసుకోవచ్చు.ఏక సాగు విధానం, అధిక దిగుబడులంటూ దేశాన్ని హరిత విప్లవం ముంచెత్తడంతో లక్షా 10 వేల దేశీయ వరి రకాలు కనుమరుగైపోయాయని రాజ్‌కుమార్‌ తన అధ్యయనం ద్వారా తెలుసుకున్నాడు. ప్రధాన్‌ సంస్థ ఇచ్చిన స్ఫూర్తితో రాజ్‌కుమార్‌ దేశీయ వరి విత్తనాలను ముందుగా తమ కుటుంబలోని సాంప్రదాయ వరి పంట పండించే వారి నుంచి సేకరించడం మొదలెట్టాడు. రాజ్‌కుమార్ తమ అమ్మమ్మగారి ఊరికి వెళ్లి తాత నుంచి రెండు రకాల దేశీయ వరి విత్తనాలు సేకరించాడు. ఆ తర్వాత తమ గ్రామానికి చుట్టుపక్కల ఎక్కడ ఏ రైతు వద్ద దేశీ వరి విత్తనాలు దొరుకుతాయన్నా వెంటనే అక్కడికి వెళ్లి వాటిని తెచ్చుకునేవాడు. అలా దేశీ విత్తనాలు సేకరించడం ప్రారంభించిన తొలి ఏడాది రాజ్‌కుమార్‌ పిలి లుచాయ్‌, జానకి, యురాయ్‌ బూటా, గుర్ముతియా, కాకేరి, చిప్‌డా, సథియా, పండ్రి, పిసో, జీరా శంకర్‌, కాలీ మూచా, బడ్ర్‌ఫూల్‌, జొరై 13 రకాల ప్రత్యేకమైన వరి విత్తనాలు సంపాదించాడు. దేశీ వరి విత్తనాల పట్ల రాజ్‌కుమార్‌కు ఉన్న అభిరుచిని గుర్తించిన ప్రధాన్ సంస్థ ఎక్కడ విత్తనాలు సేకరించేందుకు సమావేశం నిర్వహించినా తప్పకుండా ఆహ్వానించేది. అలా రాజ్‌కుమార్ ఒడిశా, చండీగఢ్ సహా అనేక రాష్ట్రాల్లో జరిగిన దేశీ వరి విత్తన సేకరణ సమావేశాలకు హాజరయ్యాడు. ప్రధాన్ సంస్థ ఇచ్చిన శిక్షణ తనను విత్తన సంరక్షకుడిగా మార్చివేసిందని రాజ్‌కుమార్ చెప్పాడు. దేశీ వరి విత్తనాల సేకరణ కోసం రాజ్‌కుమార్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లేటప్పుడు ఎక్కడ ఏ దేశీ కూరగాయల విత్తనాలు లభించినా సేకరించి తెచ్చి జాగ్రత్త చేసేవాడు. అలా రాజ్‌కుమార్‌ ఇప్పుడు రెండు ఎకరాల పొలంలో 115 రకాల దేశీ వరి విత్తనాలను పండిస్తున్నాడు. అలా పండించిన దేశీ వరి విత్తనాలను ఉత్సాహం చూపిన ఇతర రైతులకు కూడా ఇస్తున్నాడు. దేశీయ వరి విత్తనాల విజ్ఞానాన్ని అనుసరిస్తూనే రాజ్‌కుమార్‌ తనను తాను ఆప్‌డేట్‌ చేసుకోవడం కోసం వ్యవసాయ సంబంధమైన అనేక సమావేశాల్లో పాల్గొంటున్నాడు. అయితే.. పరస్‌వాడలో రైతులకు శిక్షణ ఇచ్చేందుక జబల్‌పూర్‌ నుంచి వచ్చిన ప్రొఫెసర్‌ బీకే రాయ్‌ను కలుసుకున్నప్పుడు రాజ్‌కుమార్‌కు మరెన్నో విలక్షణమైన వ్యవసాయ విధానాలు అర్థం అయ్యాయంటాడు. బీకే రాయ్‌ను తాను గురు అని గౌరవంగా పిలుచుకుంటానంటాడు.ఎక్కువ శాతం మంది రైతులు హైబ్రీడ్‌ రకాలనే పండిస్తున్న సమయంలో తాను దేశీ వరి విత్తనాలు సేకరిస్తుండడంతో తనను చూసి చాలా మంది వెటకారం చేశారని రాజ్‌కుమార్ గుర్తుచేసుకున్నాడు. ఇప్పుడు రాజ్‌కుమార్‌ చేస్తున్న దేశీయ వరి విత్తనాల సేకరణ, సంరక్షణ, వాటిని ఇతర రైతులకు అందుబాటులో ఉంచుతున్న కృషి కారణంగా తనకు ఇప్పుడు ఎంతో గుర్తింపు వచ్చిందని చెబుతాడు రాజ్‌కుమార్‌. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం నలు మూలల నుంచీ రైతులు తన వద్దకు వచ్చి దేశీయ వరి విత్తనాలు తీసుకెళుతున్నారని సంతోషంగా రాజ్‌కుమార్ అంటున్నాడు. దేశీ వరి విత్తనాలను ముందుగా రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెడతాడట. ఆ తర్వాత వాటిని మట్టి కుండల్లో నింపి దాచి ఉంచుతాడట. మట్టికుండల్లో నిల్వ చేసిన విత్తనాలు పాడైపోవని చెప్పాడు. తాను ఏ ప్రాంత రైతుకు ఏ దేశీ రకం వరి విత్తనాలు ఇచ్చింది, వారి వివరాలను రాసుకుంటాడట. తద్వారా దేశీయ వరి విత్తనాలతో పంటలు పండించే రైతులు ఒకరికొకరు తెలుసకోవడానికి ఓ నెట్‌ వర్క్‌ రూపొందించాడట. రైతులకు దేశీయ వరి విత్తనాలను రాజ్‌కుమార్ ఉచితంగా ఇచ్చినా.. విత్తనాలు కావాలని తన వద్దకు వచ్చే సంస్థలు, యూనివర్శిటీలకు మాత్రం కేజీకి 100 రూపాయలు తీసుకుంటానని చెప్పాడు. ఆ డబ్బులను రాజ్‌కుమార్ తన కుటుంబం అవసరాలకు వాడుకుంటాడట. అలాగే రాజ్‌కుమార్ తన పొలంలో ఎక్కువగా పండిన దేశీ రకాలు కావాలని తన వద్దకే నేరుగా వచ్చే వారికి 1000 నుంచి 1200 కిలోల వరకు కూడా విక్రయిస్తుంటాడట. అయితే.. ఇదంతా కేవలం నోటి మాట ద్వారా మాత్రమే జరిగిపోతుందని, తాను ఎప్పుడూ తన దేశీ వరి విత్తనాలను బజారులో విక్రయించనని చెప్పాడు.

సుమారు పదేళ్లుగా దేశీ వరి విత్తనాలు సేకరిస్తున్న రాజ్‌కుమార్‌ ఎప్పటి మాదిరిగానే పలు రకాల విత్తనాలను ఇప్పటి సేకరిస్తుండడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here