హిందీ, చరిత్ర అంశాల్లో డబుల్ ఎంఏ పూర్తిచేసిన రజనీష్‌ లాంబా ఆర్గానిక్‌ వ్యవసాయం చేస్తానంటే.. కుటుంబ సభ్యులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఎందుకంటే రజనీష్‌ తన తండ్రి హరిసింగ్‌ లాంబా మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగం చూసుకుంటారని వారంతా భావించారు. అయితే.. రజనీష్‌ ప్రణాళికలు వేరేలా ఉన్నాయి. తన తాత హర్దేవ్‌ సింగ్‌ లాంబా మాదిరిగా ఆర్గానిక్‌ వ్యవసాయం వైపు అడుగులు వేశారు రజనీష్‌. ముందుగా నాలుగు ఎకరాలతో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ ప్రారంభించిన రజనీష్‌ ఇప్పుడు కేవలం నాలుగంటే నాలుగు ఆవులతో 18 ఎకరాల్లో రకరకాల పండ్ల చెట్లు, నర్సరీ మొక్కలు పెంచుతున్నారు. పండ్ల చెట్ల నుంచి వచ్చే ఫలసాయం ద్వారా, మొక్కల నర్సరీ ద్వారా ఏటా లక్షలాది రూపాయల ఆదాయం కళ్ల జూస్తున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చు తక్కువ, పంట దిగుబడులకు దర ఎక్కువ ఉండడంలో రజనీష్‌ కు లాభాల పంట పండుతోంది. ఆర్గానిక్‌ సాగులో సక్సెస్‌ అయిన రజనీష్‌ ఏటికేడాది అనేక మంది ఔత్సాహిక రైతులకు ఆర్గానిక్‌ వ్యవసాయంలో, పంట ఉత్పత్తులను మార్కెట్‌లో విక్రయించడంలో మెళకువలపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. తద్వారా ఆర్గానిక్‌ వ్యవసాయ విధానం విస్తరించేందుకు కృషిచేస్తున్నారు.రజనీష్‌ తాతగారు హర్దేవ్‌ సింగ్‌ లాంబా రాజస్థాన్‌ లోని ఝుంఝును జిల్లాలోని స్వగ్రామం చెలాసిలో రసాయనాలతో పంటలు పండించే విధానం రాకముందు ప్రకృతి విధానంలో వ్యవసాయం చేసేవారు. తమ వ్యవసాయ క్షేత్రంలో ఆయన గోధుమ, శెనగ, సజ్జ, ఆవాలు తదితర పంటలు సాగుచేసేవారు. రజనీష్‌ చిన్న వయస్సులోనే వ్యవసాయపనుల్లో తన తాతగారికి సహాయం చేసేవారు. దాంతో సహజంగానే రజనీష్‌కు వ్యవసాయం పట్ల ఆసక్తి కలిగింది. అలా కలిగిన ఆసక్తి వల్లే రజనీష్‌ డబుల్‌ ఎంఏ పూర్తిచేసిన తర్వాత ఆర్గానిక్‌ వ్యవసాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తొలుత 4 ఎకరాలతో ఆర్గానిక్‌ సాగు ప్రారంభించి రజనీష్‌ ఇప్పుడు దాన్ని 18 ఎకరాలకు పెంచారు. ఈ 18 ఎకరాల్లో దానిమ్మ, కినూ, నిమ్మ, బత్తాయి తదితర పంటలు పండిస్తున్నారు. ఈ 18 ఎకరాలకు అవసరమైన సేంద్రీయ ఎరువు, క్రిమిసంహారకాలను కేవలం 4 దేశీ ఆవుల సాయంతో సహజసిద్ధంగా తయారు చేసుకుంటున్నారు.ఆర్గానిక్‌ విధానంలో రజనీష్‌ పండిస్తున్న పండ్లకు వినియోగదారుల నుంచి చక్కని డిమాండ్‌ ఉండడంతో బిగ్‌ బాస్కెట్‌, ఆర్గానిక్‌ కిచెన్‌ లాంటి సంస్థలు సాధారణ పండ్ల కన్నా 20 శాతం అధికధర ఇచ్చి మరీ కొనుగోలు చేస్తున్నాయని సంతోషంగా చెప్పారు. 2002లో చదువులు పూర్తిచేసిన రజనీష్‌ అప్పటి వరకు తమ పొలంలో పండించే ధాన్యాలు, చిక్కుడు లాంటి కూరగాయల జాతులకు బదులుగా హార్టీకల్చర్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఆ క్రమంలో 2004లో ఆయన వేడి వాతావరణాన్ని, పాక్షిక ఉష్ణ వాతావరణాన్ని తట్టుకోగల 600 బేల్‌ పండు మొక్కలు నాటారు. ఆ తర్వాతి ఏడాది రకానికి 150 చొప్పున కినూ, బత్తాయి మొక్కలు వేశారు. ఈ రెండు రకాల పండ్ల మొక్కల నుంచి నాలుగో ఏడాది నుంచే ఫలసాయం మొదలైందన్నారు. వాటి ద్వారా రజనీష్‌కు మంచి లాభాలే వచ్చాయట. ఆ తర్వాత రజనీస్‌ సిందూరి రకానికి చెందిన 600 దానిమ్మ మొక్కలు, 250 నిమ్మ మొక్కలు నాటుకున్నారు. రజనీష్‌ తన తాతగారి అనంతరం ‘హర్దేవ్‌ బేగ్‌ నర్సరీ- ఉద్యాన్‌’ పేరు పెట్టుకున్న వ్యవసాయ క్షేత్రంలో 3 వేల దానిమ్మ, కినూ, బత్తాయి, నిమ్మ, బేల్‌ పండ్ల చెట్లను పెంచుతున్నారు.ఆర్గానిక్‌ పండ్ల సాగు దిగుబడులతో రజనీష్‌ ఆదాయం ఏడాది ఏడాదికీ పెరుగుతూను ఉంది. ఇంలా ఆదాయం పెరగడానికి రజనీష్‌ మూడు కారణాలు చెబుతున్నారు. వాటిలో మొదటిది ఆర్గానిక్ ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు అధికంగా ఉండడం, రెండోది సాగు కోసం వాడే సేంద్రీయ ఎరువులు, క్రిమిసంహారకాల లాంటి వాటికి ఖర్చు చాలా తక్కువ అవడం, మూడోది పండ్ల మొక్కలకు సేంద్రీయ ఎరువులు వినియోగించడంతో నేలతో సారం అంతకంతకూ మెరుగుపడి పంట దిగుబడులు అధికంగా వస్తుండడం అని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇతర రైతులు సాగుచేసే ఒక్కో బత్తాయి చెట్టు నుంచి నాటిన రోజు నుంచి ఐదేళ్ల తర్వాత 60 కిలోల పంట వస్తుంది. తర్వాత అది 100 కిలోల వరకు పెరుగుతుంది. కానీ.. రజనీష్ ఆర్గానిక్‌ సాగులో ఒక్కో బత్తాయి చెట్టు 125 కిలోల దాకా పంట దిగుబడి వస్తోంది. ఇతర రైతుల సాగులో ఒక్కో దానిమ్మ పండు సుమారు 350 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంటే.. రజనీష్‌ పండించే ఒక్కో దానిమ్మ పండు 400 నుంచి 800 గ్రాముల వరకు బరువు ఉంటుంది. పైగా మార్కెట్‌లో లభించే ఇతర దానిమ్మ పండ్లకన్నా రజనీష్‌ పండించిన దానిమ్మ పంటకు 25 శాతం కన్నా ఎక్కువ దర పలుకుతోంది. ఆర్గానిక్‌ విధానంలో ఒక పక్కన పంట సాగు పెట్టుబడి తక్కువగా ఉండడం, మరో పక్కన ఉత్పత్తి, ధర ఎక్కువగా వస్తుండడంతో లాభాలు బాగా వస్తున్నాయి. 2017లో 4 ఎకరాల్లో 1,000 బత్తాయి, 2 వేల నిమ్మ మొక్కలు నాటారు. వాటి నుంచి గత ఏడాది పంట దిగుబడి వచ్చింది. తద్వారా రజనీష్‌కు 8 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఇక ఈ సంవత్సరం నుంచి మరింత అధిక దిగుబడి వస్తుందని రజనీష్‌ సంతోషంగా చెబుతున్నారు.నాలుగు దేశీ ఆవుల నుంచి లభించే పదార్థాతోనే ఆర్గానిక్‌ ఎరువులు, మందులు, హెర్బల్‌ స్ర్పేలు ఎలా తయారు చేయాలో తన తాతగారు నేర్పించారని రజనీష్‌ తెలిపారు. ఆర్గానిక్‌ పంటల సాగు చేస్తానని రజనీష్‌ అన్నప్పుడు కొద్దిగా అనుమానాలు వ్యక్తం చేసిన ఆయన తండ్రి హరిసింగ్ లాంబా, సోదరుడు విక్రాంత్‌ సింగ్ లాంబా కూడా ఇప్పుడు తనతో కలిసి పనిచేస్తున్నారని ఆనందంగా చెప్పారు. సహజసిద్ధంగా ద్రవ జీవామృతం, వర్మీ కంపోస్ట్‌, ఇతర ఎరువులను ఆవు పేడ, గోమూత్రం, వేప ఆకులు, దత్తూర ఆకులతో తామే స్వయంగా తయారు చేసుకుంటామని రజనీష్‌ అన్నారు. నీటిని, విద్యుత్‌ను ఆదా చేయడం కోసం తమ అన్ని వ్యవసాయ క్షేత్రాల్లోనూ డ్రిప్ ఇరిగేషన్‌ విధానం వినియోగిస్తున్నట్లు రజనీష్‌ వెల్లడించారు. దానిమ్మ, నిమ్మ మొక్కల మధ్య 10 అడుగుల దూరం ఉండేలా, బత్తాయి, బేల్ మొక్కల మధ్య 20 అడుగుల దూరం ఉండేలా రజనీష్‌ నాటుకుంటారు. అందుకే తాను డ్రిప్‌ ఇరిగేషన్‌ విధానం తీసుకున్నానంటారు.

ఇక రజనీష్‌ తన నర్సరీలో పెంచుతున్న పండ్ల మొక్కలకు భారీ డిమాండ్ ఉంది. వాటిలో బత్తాయి మొక్కలకైతే మరింత ఎక్కువ గిరాకీ ఉందంటారు. రజనీష్‌ నర్సరీలో పెంచుతున్న మొక్కల నుంచి కూడా మరింత అధికంగా ఆదాయం సంపాదిస్తున్నారు. ఆర్గానిక్‌ వ్యవసాయంలో మంచి ప్రావీణ్యం సంపాదించిన రజనీష్‌ దేశంలో ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకు రావడంలో భాగంగా మరింత ఎక్కువ మంది రైతులకు తర్ఫీదు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here