ప్రకృతి పంటల ద్వారా తన చుట్టుపక్కల ఉన్నవారందరికి సహజమైన, నాణ్యమైన, ఆరోగ్యకరమైన జీవితం అందించేదుకు కృషిచేస్తున్నాడు ఈ బీటెక్‌ గ్రాడ్యుయేట్‌. అతని కుటుంబ పోషణ మొత్తం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. పాండిచ్చేరికి 25 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉండేది అతని కుటుంబం. తండ్రి వ్యవసాయదారుడైనా పిల్లల్ని బాగా చదివించి, ప్రయోజకుల్ని చేయాలని పాండిచ్చేరిలో కుటుంబం పెట్టారాయన. కానీ ప్రతిరోజూ ఉదయం ఆ తండ్రి తమ గ్రామానికి వెళ్లి పొలం పనులు నిర్వహించుకుని సాయంత్రానికి తిరిగి పట్టణానికి వచ్చేవారు. తన బిడ్డలు ఉన్నత చదువులు చదివి అమెరికాలాంటి దేశంలో మంచి కార్పొరేట్‌ ఆఫీసులో ఉద్యోగం సంపాదించి, ఆనందంగా జీవించాలని ఆయన ఆశించారు.అయితే.. మన కథలో హీరో దినేష్‌ మాత్రం బీటెక్‌ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం వెంపర్లాడలేదు. మంచి సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఎలా తయారు చేయాలా? అని ఆలోచించాడు. అయితే.. అందుకోసం ఏమి చేయాలి? ఎలా చేయాలి లాంటి అనేక ప్రశ్నలతో ఇంజనీరింగ్‌ కాలేజి నుంచి దినేష్‌ బయటికి వచ్చాడు. సొంతూరికి వెళ్లి ప్రకృతి సేద్యం చేయాలని నిర్ణయించుకున్నాడు.తన నిర్ణయం చెప్పిన వెంటనే దినేష్‌ కుటుంబం అస్సలు ఒప్పుకోలేదట. అయినప్పటికీ తన ఆలోచనను అమలులో పెట్టేందుకు దినేష్‌ విస్తృతంగా పర్యటించి, రకరకాల మనుషులను కలిశాడు. ఆ క్రమంలోనే దినేష్‌ ఆర్గానిక్‌ వ్యవసాయం మీద తన అభిరుచిని వదిలిపెట్టకుండా అనేక మంది సేంద్రీయ వ్యవసయం చేస్తున్న రైతుల్ని కూడా దినేష్‌ కలుసుకున్నాడు. తద్వారా ఆహారంతో, స్థిరమైన సమాజాన్ని తయారు చేయాలనే దానిపై దినేష్‌ దృష్టి సారించాడు. ఆరోగ్యం, పోషకాహారం లభ్యత విషయంలో సవాళ్లను దినేష్‌ అర్థం చేసుకున్నాడు. రసాయనాలతో పండించే పంటలు మనిషి శరీరాన్ని, ఈ సమాజాన్ని ఎంతలా దెబ్బతీస్తున్నాయో దినేష్‌కు అర్ధం అయింది. మనిషి మనుగడకు పోషకాహారం తప్పనిసరి అని గ్రహించాడు.దీంతో ఓ చిన్న పట్టణంలో పెరిగిన దినేష్‌ తన తండ్రి ప్రతిరోజూ 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి తమ గ్రామంలో వ్యవసాయం చేస్తున్న వైనాన్ని గమనించాడు. ఆ వ్యవసాయమే తమ కుటుంబం చక్కగా బ్రతకడానికి, తన తండ్రికి మంచి గౌరవం రావడానికి ఉపయోగపడుతోందని దినేష్‌ బాగా నమ్మాడు. దాంతో తమ గ్రామంలో పోషకాలతో కూడిన పెసలు, మినుము పంటలు సహజ విధానంలో పండించడం 2016లో ప్రారంభించాడు. దాంతో పాటు పాండిచ్చేరిలో ఓ చిన్న గదిలో ప్రకృతి పంటల విక్రయ దుకాణాన్ని కూడా ప్రారంభించాడు. ప్రకృతిసిద్ధ విధానంలో రైతులు పండించే సహజ పంటలను విక్రయించేందుకు ‘సమర్పణం’ పేరుతో స్టోర్‌ ఏర్పాటు చేశాడు. సమర్పణం స్టోర్‌కు వినియోగదారుల నుంచి ఆదరణ పెరగడంతో దాన్ని మరో గదికి కూడా విస్తరించాడు. ఇప్పుడు సమర్పణం సంస్థ దినేష్‌ ఇంటిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ మొత్తంలో విస్తరించింది. దినేష్‌ సమర్పణం స్టోర్‌లో సేంద్రీయ విధానంలో పండించిన తాజా పండ్లు, కూరగాయలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. తాజా కూరగాయలు, పండ్లు వారంలో రెండుసార్లు సమర్పణం స్టోర్‌లో లభిస్తాయి. మిగతా పప్పుదినుసులు, ఇతర ప్రకృతి పంట ఉత్పత్తులు అయితే.. వారం పొడవునా దొరుకుతున్నాయి. దినేష్ ఆలోచన కారణంగా ఆరోగ్యం కోరుకునే వినియోగదారులు దూరం వెళ్లి, డబ్బులు ఎక్కువ ఖర్చుపెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వారి దగ్గర్లోనే, సరసమైన ధరలకు లభిస్తున్నాయి.ప్రకృతి సిద్ధంగా పండించే పంటలను తమ సమర్పణం స్టోర్‌ ద్వారా విక్రయించడం ద్వారా ఉత్పత్తిదారుడు వినియోగదారుల మధ్య మంచి సానుకూల సంబంధాలు కలుగుతాయని దినేష్‌ విశ్వాసం. ప్రకృతి విధానంలో పంటలు పండించడం వల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది. లాభమే ఎక్కువగా వస్తుంది. సమర్పణం స్టోర్‌ ద్వారా ప్రకృతి పంటల రైతులు, వినియోగదారుల్లో మంచి గుర్తింపు వచ్చిన దినేష్‌ ఇప్పుడు తమ గ్రామంలోని యువకులు, పిల్లలకు కూడా ఆర్గానిక్‌ పంటలపై అవగాహన కల్పించడంలో బిజీగా ఉన్నాడు.సమర్పణం స్టోర్‌లో పలువురు యువతీ యువకులకు దినేష్‌ ఉపాధి కల్పిస్తున్నాడు. తన స్టోర్‌ను మరింత విస్తరించాలని దినేష్‌ కృషిచేస్తున్నాడు. తద్వారా పోషకాలతో కూడిన పంట ఉత్పత్తులను మరింత అధిక సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. నేలతల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. మానవాళి కూడా ఆరోగ్యంగా ఉంటుందని దినేష్‌ ప్రగాఢ విశ్వాసం. ప్రకృతి విధానంలో సేద్యం చేసినప్పుడు నేల ఆరోగ్యంగా ఉంటుందని, ఆ నేలలో పండే పంటలు వినియోగించిన ప్రతిఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని దినేష్‌ చెబుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here