వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల వచ్చే అనర్థాలేంటో ఇప్పటికే ప్రపంచానికి తెలియవచ్చింది. ఆర్గానిక్‌ లేదా సహజ పంటల దిశగా కొన్ని గ్రామాల్నే మార్చడం అనే మాట చెప్పినంత తేలిక ఏమీ కాదు. ఇలాంటి కష్టసాధ్యమైన పని చేసి నిరూపించారు ఓ రిటైర్డ్‌ స్కూల్‌ టీచర్. ఆయన కృషి, పట్టుదల కారణంగా ఇప్పటికే 100 గిరిజన గ్రామాలు సహజ పంటలు పండించే సజీవ గ్రామాలుగా గుర్తింపు పొందాయి. ఆ విశ్రాంత పాఠశాల ఉపాధ్యాయుడే డొల్లు పారినాయుడు. ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి గ్రామవాసి పారినాయుడు. జస్టిఫైడ్‌ యాక్షన్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఫర్‌ ట్రైబల్‌ అప్‌లిఫ్ట్‌మెంట్‌ (జట్టు) ట్రస్ట్‌ ఏర్పాటు చేసిన పారినాయుడు గిరిజనులకు సహజసిద్ధ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి 100 గిరిజన గ్రామాలను సజీవ గ్రామాలుగా మార్చేశారు.

గిరిజన రైతులు, కౌలు రైతులను ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు, ఆహార భద్రత కోసం పారినాయుడు ‘అన్నపూర్ణ క్రాప్‌ మోడల్‌’ ను రూపిందించారు. అన్నపూర్ణ క్రాప్ మోడల్‌ ద్వారా ఒక్కొక్క గిరిజన రైతు సాలుసరి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. పారినాయుడు తన జట్టు ట్రస్టు ద్వారా గిరిజన రైతులకు విత్తనాలు నాటే, కలుపు తీసే, కోత కోసే యంత్రాలను అందజేస్తున్నారు. అంతే కాదు.. పారినాయుడు తన సొంతూరు తోటపల్లిలో ‘ప్రకృతి ఆదిదేవోభవ క్యాంపస్‌’ ఏర్పాటు చేశారు. అందులో వ్యవసాయ నమూనాలు, ఆర్గానిక్‌ ఎరువుల తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రదర్శనకు ఉంచారు. తద్వారా గిరిజన రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ వ్యవసాయం చేసేలా మార్పు తీసుకొచ్చారు. ఇలా 100 గిరిజన గ్రామాలను రసాయనాలు వాడకుండా సహజ వ్యవసాయం చేయడం ఆంధ్రప్రదేశ్‌లో తోటపల్లి గ్రామమే మొట్టమొదటిదిగా రికార్డులకెక్కింది. నేచురల్‌ ఫార్మింగ్‌ను ఆచరణలో పెట్టిండచడం కోసం, సహజ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి పారినాయుడు 32 వివరణాత్మక పుస్తకాలు రాశారు. సహజ వ్యవసాయమే ప్రధాన కథాంశంగా ‘అమృత భూమి’ అనే ఓ ఫీచర్‌ ఫిల్మ్‌ కూడా రూపొందించడం విశేషం. ఈ ఫీచర్ ఫిల్మ్‌ ఇంకా విడుదల కావాల్సి ఉంది.సహజ వ్యవసాయం వైపు గిరిజనులను ఆకర్షించే కృషిలో భాగంగా 1998లో ముందుగా తన ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వచ్ఛందంగా పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత జటపు, సవర, గదబ, కొండదొర గిరిజనులతో పాటు విజయనగరం జిల్లాలోని ఇతర వెనుకబడిన రైతులకు సహజ వ్యవసాయంలో సాయం చేయడం కోసం ‘జట్టు’ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. 1998 నుంచీ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ, నాబార్డ్‌, రైతు సాధికార సంస్థ, అజీం ప్రేమ్‌జీ దాతృత్వ సంస్థల ఆర్థిక సహకారంలో పారినాయుడు సహజ వ్యవసాయం చేయడంతో పాటు, గిరిజనులకు నేచురల్ ఫార్మింగ్‌లో బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. అలా సహజ వ్యవసాయంలో వందలాది అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవగాహనా కార్యక్రమాల్లో గిరిజన రైతులకు వర్మి కంపోస్ట్‌, జీవామృతం లాంటి ఆర్గానిక్‌ ఎరువుల తయారీ గురించి సోదాహరణంగా బోధిస్తున్నారు. అలాగే చిన్నారులను కూడా సహజ వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు ‘స్కూల్‌ టూ ఫీల్డ్‌’ అనే కార్యక్రమాన్ని పారినాయుడు నిర్వహిస్తున్నారు.

పారినాయుడి కృషి కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి సజీవ గ్రామంగా విజయనగరం జిల్లా కురుపాం మండలంలోని కొండబారికి గ్రామం నిలిచింది. అలాగే జిల్లాలోని మొత్తం 93 గ్రామాలు సజీవ గ్రామాలుగా మారాయి. మరో 7 గ్రామాలకు రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఏప్రిల్‌ 21న సజీవ గ్రామాలుగా గుర్తిస్తూ ప్రకటన చేశారు. విజయనగరం జిల్లాలో రిటైర్డ్ స్కూల్ టీచర్‌ డొల్లు పారినాయుడు చెప్పే పాఠాలు విన్న 37,699 మంది రైతులు కనీసం 41,438 ఎకరాల్లో సహజ పంటలు పండిస్తుండడం విశేషం. సహజ వ్యవసాయంపై రైతులకు బోధించడం కోసం పారినాయుడు రైతు సాధికార సంస్థ సహాయంతో వివిధ రకాల షార్ట్‌ ఫిల్మ్‌లు, డాక్యుమెంటరీలు రూపొందించారు. పారినాయుడు నెలకొల్పిన ‘అమృత భూమి’ ద్వారా రూపొందించిన ఆడియో, వీడియో పాటలను గవర్నర్‌ హరిచందన్‌ ఇటీవలే విడుదల చేశారు. పారినాయుడు తాను తీసిన ఫిల్మ్‌ను సీఎం జగన్మోహన్‌రెడ్డి చేత రిలీజ్ చేయించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లో 14 పాటలను ఉత్తరాంధ్రలోని ప్రసిద్ధ జానపద గాయకుడు దివంగత వంగపండు ప్రసాద్‌ రాయడం గమనార్హం.ప్రకృతి వ్యవసాయం దిశగా గిరిజనులను అడుగులు వేయించాలనే నిర్ణయం తాను తీసుకోవడం వెనుక ఓ కారణం ఉందని పారినాయుడు చెబుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏకి ఓఎస్‌డీగా తాను డిప్యుటేషన్‌పై వెళ్లినప్పుడు గిరిజన రైతుల దయనీయ పరిస్థితులను తాను కళ్లారా చూశానని, వారి కష్టాలు, కన్నీళ్లే తనను ప్రకృతి వ్యవసాయంలో వారికి ఎలాగైనా తర్ఫీదు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని పారినాయుడు చెప్పారు. గిరిజనుల జీవితాలను మెరుగుపరిచేందుకే తాను జట్టు ట్రస్ట్‌ ఏర్పాటు చేశానంటారు. కాలుష్యం లేని సమాజాన్ని మన భవిష్యత్ తరాలకు అందించడం కన్నా మనం ఇవ్వగలిగే మంచి బహుమతి ఇంకేముంటుందని పారినాయుడి ముక్తాయింపు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here