వరి సాగు చేసే రైతులు అధిక దిగుబడి సాధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పుకుందాం. నారు నాటిన కొద్ది రోజుల నుంచి వరి మొక్కలకు కొత్త వేళ్లు పుడతాయి. అవి భూమిలోపలికి చొచ్చుకు పోయి, భూసారాన్ని గ్రహించి ఎదగడం మొదలవుతుంది. తర్వాత కొద్ది రోజులకు కొత్త పిలకలు వస్తాయి. కొత్తగా వచ్చిన పిలకలతో వరిమొక్క దుబ్బుగా మారుతుంది. వరి మొక్కకు ఎంత ఎక్కువగా పిలకలు వస్తే.. అంత అధికంగా దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి.అయితే.. వరినారు నాటిన తర్వాత కొత్త వేళ్లు త్వరగా పుట్టకపోడానికి, వరిమొక్క ఏపుగా ఎదగకపోడానికి, పిలకలు రాకపోవడానికి కారణాల గురించి ముందుగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏయే లోపాల కారణంగా వరి మొక్కలు అనుకున్న స్థాయిలో ఎదగడం లేదో చూద్దాం. భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం సరైన మోతాదులో లేనప్పుడు వరి మొక్కకు పిలకలు ఎక్కువగా రాకపోవడానికి ప్రధాన కారణం. రెండోది చౌడు భూముల్లో వేసిన వరిలో పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండదు. అసలు చౌడు నేలలు ఏర్పడడానికి కారణాలు తెలుసుకుని చౌడు నివారణ చర్యలు తీసుకుంటే వరిలో పిలకలు అధికంగా వచ్చేలా చేసుకోవచ్చు. మూడోది.. భూమిలో జింకు లోపం ఉన్నప్పుడు కూడా వరిలో పిలకలు ఎక్కువ వచ్చే అవకాశం ఉండదు. నాలుగో కారణం ఏమిటంటే.. వరి పొలంలో నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం, ఆరుతడి పద్ధతి పాటించకపోవడం వల్ల కూడా పిలకలు అధికంగా వచ్చే అవకాశం ఉండదు. ఐదో అంశం చూస్తే.. ముదిరిన వరినారు నాటడం వల్ల కూడా పిలకలు రావడం తగ్గిపోతుంది. అంటే విత్తనాలు మడిలో వేసిన రోజు నుంచి 20 నుంచి 25 రోజుల్లోపల నారు తీసి, పంటచేలో నాటుకోవాల్సి ఉంటుంది. ఇక 30 రోజులు దాటిన తర్వాత తీసిన నారు నాటుకుంటే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం తక్కువైపోతుంది. సరైన సమయంలో ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించకపోయినా పిలకలు తక్కువగా వస్తాయి. వరినారు కోసం రైతు ఎలాంటి విత్తనం ఎంచుకోవాలనే దానిపైన కూడా సరైన అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా ఏదో ఒక విత్తనం వేసేస్తే పోలా.. అనుకుంటే.. పిలకల శాతం పెరిగే ఛాన్సులు తగ్గిపోతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.వరి మొక్కలకు అధిక పిలకలు సాధించాలంటే ఏమి చేయాలో, ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో తెలుసుకుందాం.

ముందుగా చెప్పుకున్నట్లు భూమిలో సేంద్రీయ కర్బన పదార్థం ఏ మోతాదులో ఉందో తెలుసుకోవాలి. భూమిలో కర్బన పదార్థం తక్కువగా ఉంటే.. జీలుగ, పిల్లిపెసర, జనుము లాంటి పచ్చి రొట్టను దుక్కిలో ఎరువుగా వినియోగించాలి. లేదా పశువుల ఎరువు  చల్లాలి. ఈ రెండింటిలో ఏది చేసినా భూమిలో సేంద్రీయ కర్బనం కావాల్సిన మోతాదులో వరి మొక్కలకు అందుతుంది. పశువుల ఎరువుగా ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు లేదా కోళ్ల పెంటను సరైన మోతాదులో వేసుకోవచ్చని వ్యవసాయ అధికారులు, అనుభవం ఉన్న రైతులు వివరిస్తున్నారు. కర్బనం సరైన మోతాదులో ఉంటే.. వరి మొక్కల వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. తద్వారా మొక్కలు ఏపుగా ఎదగడమే కాకుండా సకాలంలో ఎక్కువగా పిలకలు వస్తాయి. రసాయన ఎరువులు అధికంగా వాడితే.. భూమి లోపల భాస్వరం నిల్వలు పెరిగిపోయి, చౌడు భూమిగా మారిపోతుందనే విషయం రైతులు తెలుసుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పచ్చిరొట్టను ఎరువుగా వినియోగిస్తే.. భూమిలో వరి మొక్కలకు కావాల్సిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా సకాలంలో అధిక పిలకలు రావడం, ఏపుగా మొక్కలు ఎదగడం, ఎక్కువ  దిగుబడి సాధించవచ్చని వివరిస్తున్నారు.ఇక భాస్వరం నిల్వలు ఎక్కువశాతం ఉండిపోయి, కరగనినేల చౌడుభూమిగా మారుతుంది. భాస్వరం నిల్వలను తగ్గించేందుకు చౌడు స్థితిని నివారించేందుకు పీఎస్‌బీ ఫాస్పేట్‌ సొల్యుబుల్‌ బాక్టీరియా లాంటివి సరైన మోతాదులో అందిస్తే.. భాస్వరం కరిగి ఆ నేలలో వేసి వరికి ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. వేసవికాలం పంటలకు జింకు లోపం వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. జింకులోపం ఉండే భూమిలో వేసిన ఏ మొక్క అయినా గిడసబారిపోయి ఉంటుంది. మొక్క ఎత్తు పెరగదు. పిలకలు రావు. పొలం ఎర్రబారినట్లు ఉంటుంది. ఈ సమస్యలు అంతకు ముందు వేసిన పంటల్లో గమనిస్తే.. అది జింకు లోపం అని గుర్తించాలన్నారు. నేలలో జింకు లోపాన్ని రైతులు ముందుగానే గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆఖరి దుక్కిలో జింక్ సల్ఫేట్‌ చల్లుకుంటే జింకు లోపం సమస్య తొలగిపోతుందని, చక్కని ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. జింకు లోపం తొలగిపోతే.. వరి మొక్కలకు పిలకలు అధికసంఖ్యలో వస్తాయి. తద్వారా దిగుబడి కూడా పెరుగుతుంది.ముదిరిన నారు నాటు వేయడం వల్ల కూడా పిలకలు సకాలంలో ఎక్కువగా రావని చెప్పుకున్నాం కదా.. 20 నుంచి 25 రోజుల లోపల నారు తీసి నాటుకుంటే.. 30 రోజుల్లోగా మొక్క కోలుకుంటుంది. నాటు వేసిన 40 రోజుల్లోపల పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. వరి నారు నాటిన 40 రోజులు వచ్చే సరికి మొగి పురుగు, కాండం తొలిచే పురుగు లాంటి చీడ పీడల నివారణకు గుళిక మందులు చల్లుకుంటే మేలు అని వ్యవసాయ రంగ నిపుణులు సలహా ఇస్తున్నారు. గుళికలు మొక్కలకు రక్షణగా ఉండి, ఆరోగ్యంగా ఉంచేందుకు బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. గుళికలు 15 నుంచి 20 రోజుల పాటు రక్షణగా ఉంటాయి కనుక మొక్కలు ఆరోగ్యంగా ఉండి, ఎక్కువగా పిలకలు రావడానికి దోహదం చేస్తాయంటున్నారు. రైతు ఎంచుకునే వరి విత్తనం కూడా ఎక్కువ పిలకలు కారణం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. సాధారణ వరి రకం, రీసెర్చ్‌ వరి రకాలతో పోలిస్తే.. హైబ్రీడ్‌ రకం విత్తనాల వినియోగిస్తే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది.మొత్తం మీద భూమిలో సూక్ష్మ, స్థూల పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పుడు వరి మొక్కలకు అధికంగా పిలకలు వస్తాయి. ఏపుగా ఎదుగుతాయి. సస్య రక్షణ చర్యలు చేపడితే పైరు పచ్చగా ఎదుగుతుంది. దిగుబడి కూడా అదే రీతిలో అధికంగా వస్తుందని రైతులు గ్రహించాలని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. వరి నారును నాటిన 20 నుంచి 40 రోజుల లోపుగానే కొత్త పిలకలు వస్తాయి. 20 నుంచి 40 రోజుల మధ్యలో రైతులు రెండు దఫాలుగా ఎరువులు వేసుకుంటే.. ఎక్కువ పిలకలు రావడమే కాకుండా.. బలమైన, పొడవాటి కంకులు వస్తాయని చెబుతున్నారు. పైన చెప్పుకున్న అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. రైతుకు అధిక దిగుబడి, అధిక ఆదాయం.. అదే క్రమంలో లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here