పండ్లు, కూరగాయల పంట సాగును సాధారణంగా చేయడం అందరికీ తెలిసిందే. మనం పండించాలనుకున్న పంట విత్తనాలు తెచ్చి, పొలాన్ని బాగా దుక్కి దున్ని సాళ్లలో విత్తనాలు నాటి సాగు చేయడం సాధారణ విషయం. పండ్ల మొక్కల్ని అంటుకట్టి పెంచే విధానం గురించి చాలా మంది రైతులకు తెలిసే ఉంటుంది.  అయితే.. కూరగాయల మొక్కల్ని కూడా అంటు కట్టే విధానం గురించి తెలుసుకుందాం. ఈ క్రమంలో వంగమొక్క మొదలుపై టమోటా మొక్క పెంచడం, ఎక్కువకాలం అధిక దిగుబడి సాధించే పద్ధతి ఏమిటో చూద్దాం.వంగమొక్క మొదలుపై టమోటా పంట సాగు వల్ల ప్రయోజనం గురించి ముందుగా తెలుసుకుందాం. టమోటా మొక్కలు మామూలుగా వర్షం ఎక్కువ కురిసినప్పుడు మొదళ్లు కుళ్లిపోతాయి. పంట దిగుబడి ఉండదు. మరి వంగమొక్క అయితే.. అధిక నీటిని తట్టుకోగలుగుతుంది. మొదలు దృఢంగా ఉండి చాలాకాలం బతికి ఉంటుంది. వంగ, టమోటా మొక్కల సహజసిద్ధమైన అంశాలను కలగలిపి టమోటా సాగుచేయాలనే ఆలోచన అధిక ఫలసాయాన్ని అందిస్తోంది. అదే ఎక్కువకాలం దృఢంగా ఉంటే వంగమొక్క మొదలుపై తక్కువ జీవనకాలం ఉండే టమోటా మొక్కను అంటు కట్టి సాగుచేయడంలో ఎక్కువ ఆదాయం, ఎక్కువ లాభాలు పొందవచ్చని బాపట్ల జిల్లా రైతు శ్రీనివాసరావు నిరూపించారు.బాపట్ల జిల్లా అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి రైతు ప్రత్తిపాటి శ్రీనివాసరావు ఎకరం పొలంలో రెండేళ్లుగా వంగ-టమోటా అంటు కట్టిన పంట సాగుచేస్తున్నారు. గ్రాఫ్టింగ్‌ విధానంలో టమోటా మొక్కలు బాగా ఏపుగా ఎదుగుతాయని, జీవితకాలం కూడా పెరిగిందని, తద్వారా పంట దిగుబడి ఎక్కువగా వస్తోందని శ్రీనివాసరావు వెల్లడించారు. నలభై ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న ఆయన ముందు పత్తి, వరి పండించేవారు. ఇప్పుడాయన వంగమొక్కపై టమోటా మొక్క సాగు చేస్తున్నారు.వంగ- టమోటా అంటుకట్టిన మొక్కల్ని తాను కుప్పం నుంచి తెప్పించుకుని తమ పొలంలో సాగుచేస్తున్నట్లు శ్రీనివాసరావు వివరించారు. అంటుకట్టిన ఒక్కో మొక్కకు తనకు చేరేసరికి రవాణా అన్ని ఖర్చులు కలిపి రూ.8 పడిందని వెల్లడించారు. ఒక ఎకరం నేలలో 7 వేల టమోటా మొక్కలు నాటుకున్నారు. భూమిపై మల్చింగ్‌ పేపర్‌ వేసుకుని, మొక్కల్ని జిగ్‌ జాగ్‌ గా నాటుకున్నట్లు చెప్పారు. మామూలు వరసల్లో వేసుకుంటే 4 వేల మొక్కలే ఎకరం నేలతో పెట్టుకోవచ్చు. అదే జిగ్‌ జాగ్‌ గా అయితే 7 వేల మొక్కలు వేసుకోవచ్చు. సాలుకు సాలుకు మధ్య మూడు అడుగుల దూరం ఉంచుకుని, మొక్కకు మొక్కు మద్య 40 అంగుళాల ఎడం ఉండేలా నాటుకోవాలని శ్రీనివాసరావు వివరించారు. ఈ విధంగా అంటుకట్టిన టమోటా మొక్కలు నాటుకోవడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుందని అన్నారు.కుప్పంలో మనం చెప్పి సాధారణ విధానంలో నారు పోయించుకోవాలంటే.. సమయం, డిమాండ్‌ ను బట్టి నాలుగు నుంచి ఐదు రూపాయల దాకా మొక్కల్ని అందజేస్తారు. డిమాండ్‌ పెద్దగా లేనప్పుడు రెండు రూపాయలకు కూడా మొక్కలు దొరుకుతాయన్నారు. కింద వంగ మొదలు ఉంటే వర్షాలు ఎక్కువ పడినా మొక్కలు ముంపు దెబ్బతినవు. అదే టమోటా మొక్కను నేరుగా భూమిలో నాటుకుంటే.. వర్షాలు ఎక్కువ పడినప్పుడు మునక దెబ్బ తింటాయి. వంగ మొదలు దృఢంగా ఉండడం వల్ల మొక్క కుళ్లిపోదన్నారు. వంగ మొక్క మొదలు దృఢంగా ఉండడమే కాకుండా దాని వేర్లు కూడా భూమి లోపలికి బాగా ఎక్కువగా చొచ్చుకుపోతాయి కనుక వర్షానికి కుళ్లిపోయే ప్రమాదం ఉండదు. అంటుకట్టిన వంగ మొదలుకు చిగుళ్లు వస్తే వాటిని ఎప్పటికప్పుడు కోసేయాలి. లేదంటే.. పైన పెరిగే టమోటా మొక్క ఏపుగా ఎదిగే అవకాశం ఉండదు. వంగ చిగుళ్లు మొక్క సారాన్ని లాగేసుకుంటాయి కనుక ఆ ఇబ్బంది లేకుండా వంగ చిగుళ్లను కోసేయాలి. గ్రాఫ్టింగ్‌ మొక్క ఉన్న నేలలో చెమ్మ తగ్గినప్పుడల్లా నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది. మెట్టభూముల్లో అయితే.. వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాలి.ఎకరం పొలంలో అంటుకట్టిన టమోటా మూడు నెలల్లో 20 టన్నుల దాకా దిగుబడి వచ్చిందని రైతు శ్రీనివాసరావు వెల్లడించారు. మామూలుగా చేసే టమోటా సాగులో దిగుబడి తక్కువ వస్తుందని, అంటు కట్టిన విధానం వల్లే తనకు 20 టన్నులు వచ్చిందని శ్రీనివాసరావు చెప్పారు. మామూలు విధానంలో అయితే.. టమోటా పంట ఒక కాపుతో పూర్తయిపోతుంది. అంటు కట్టు విధానంలో టమోటా సాగు ఒకసారితో కాకుండా మళ్లీ చిగుర్లు వచ్చి, మళ్లీ పంట వస్తుందన్నారు. ఇలా అంటుకట్టిన విధానంలో టమోటా పంట కాపు వచ్చిన తర్వాత నాలుగు నెలల వారకు దిగుబడి వస్తూనే ఉంటుంది.టమోటా ధర నిలకడగా ఉండదు. మార్కెట్‌ లో డిమాండ్‌ ను బట్టి, పంట లభ్యతను బట్టి దాని ధర నిర్ణయం జరుగుతూ ఉంటుంది. డిమాండ్‌ బాగా ఉన్నప్పుడు కిలోకు 40 రూపాయల వరకు ధర ఉంటుందని, లేదంటే.. ధర తగ్గుతూ ఉంటుందనే విషయం గమనించాలి. టమోటా కాయలను రైతు కోసినప్పడు ధర బాగుంటే.. లాభాల పంట పండుతుంది. ధర తగ్గే కొద్దీ రైతుకు రాబడి, లాభం తగ్గుతూ ఉంటుందనేది తెలుసుకోవాలి.

అంటుకట్టిన విధానంలో టమోటా సాగు కోసం పొలంలో కర్రలు పాతుకుని, క్లిప్పులు పెట్టుకోవాల్సి ఉంటుంది. అందు కోసం 21 టన్నుల కర్రలు అవసరం అవుతాయి. ఆపైన రవాణా చార్జీలు, కూలీల ఖర్చు, క్లిప్పులకు అన్నీ కలిపి ఎకరానికి సుమారు లక్షన్నర రూపాయల వరకు ఖర్చు రావచ్చని రైతు శ్రీనివాసరావు వివరించారు. ఒక కిలో టమోటాలు పండించి, కోసి, మార్కెట్‌ కు పంపేసరికి రైతుకు ఐదు రూపాయల దాకా ఖర్చు అవుతుందని చెప్పారు. మార్కెట్లో కిలోకు 20 రూపాయలు లభిస్తే.. రైతుకు ఎక్కువ లాభం ఉంటుందన్నారు.గ్రాఫ్టింగ్ విధానంలో పంట దిగుబడి పెరుగుంది కానీ.. తెగుళ్లు, చీడ పీడల సమస్యలు మామూలు పంటకు వచ్చినట్టే వస్తుంటాయి. వాటి నివారణకు మందులు వాడాల్సి ఉంటుంది. అయితే.. గ్రాఫ్టింగ్ మొక్కలు బలంగా ఉంటాయి కనుక చీడపీడల ఇబ్బంది కాస్త తక్కువ ఉంటుందనే చెప్పాలి. మార్కెట్‌ లో రేటు కాస్త తక్కువ ఉన్నా.. దిగుబడి ఎక్కువ వస్తుంది కనుక రైతు పెట్టిన ఖర్చులు, కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here