భారతీయుల మదిని మరీ ముఖ్యంగా దక్షిణ భారతదేశ ప్రజల మనసును మరింతగా దోచుకున్న కాయగూరల్లో మునగకాయ ఒకటి. మునగకాయలో మనకు కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. మునగలో విటమిన్‌ ఏ, సీ, కాల్షియం, పొటాషియం చాలా ఎక్కువగా లభిస్తాయి. మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగలో ఉంది. మునగకాయ సూప్‌ తాగితే జలుబు, జ్వరం నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా, బలంగా ఉంచేందుకు మునగ బాగా ఉపయోగపడుతుంది. రక్త శుద్ధిలో మునగ చేసే సాయం అంతా ఇంతా కాదంటారు వైద్యులు. మునగలో యాంటీ బ్యాక్టీరియా ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లైంగిక సామర్ధ్యాన్ని పెంచడంలో మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. మూత్రాన్ని పరిశుభ్రం చేసి, అతి వేడి వల్ల మూత్రనాళంలో వచ్చే మంట, ఇన్ఫెక్షన్‌ ను మునగ తగ్గిస్తుంది. మునగకాయ రసం కీళ్లనొప్పుల్ని నివారిస్తుంది.ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే మునగసాగు రైతన్నకు పెద్దగా శ్రమ, ఖర్చు కూడా లేకుండానే ఆదాయం, లాభం తెచ్చిపెడుతుంది. అలాంటి మునగ సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం పెనుమాకలో రెండు దశాబ్దాలుగా హైబ్రీడ్‌ మునగ సాగు చేస్తున్న రైతు బండి గోవిందరెడ్డి అనుభవాలేంటో చూద్దాం.

1995 నుంచి పీకే 1, పీకే 2 హైబ్రీడ్‌ మునగ రకాలను గోవిందరెడ్డి పండిస్తున్నారు. ముందుగా తాము ఈ విత్తనాలను మద్రాసు నుంచి కొని తెచ్చుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు మునగ విత్తనాలు తానే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఇతర రైతులకు కూడా విత్తనాలు విక్రయిస్తుంటారు. ఎకరం నేలలో 400 గ్రాముల మునగ విత్తనాలు నాటుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.మునగ మొక్కల మధ్య దూరం రెండు గజాల దూరం ఉండేలా విత్తనాలు నాటుకోవాలని గోవిందరెడ్డి చెప్పారు. సాళ్ల మధ్య దూరం రెండున్నర గజాలు ఉండేలా విత్తనాలు వేసుకోవాలన్నారు.  ఒక పాదులో ఒకటే విత్తనం నాటుకోవాలని, ఒకవేళ రెండు విత్తనాలు పడి, మొలిచినప్పుడు ఒకదాన్ని పీకేసుకోవాలన్నారు. విత్తనాన్ని అక్టోబర్‌ నెలలో నాటితే.. ఏప్రిల్‌ రెండో వారం నుంచి పంట దిగుబడి మొదలవుతుంది. మే నెల వచ్చేసరికి పంట దిగుబడి ముమ్మరంగా ఉంటుంది.

కాపు వచ్చిన తర్వాత మునగకాయలు ఒక్కో చెట్టు నుంచి ఒక్కో కోతకు 20 నుంచి 30 కాయలు వస్తాయి. ఒక్కో చెట్టు నుంచి 50 నుంచి 100 కాయలు కూడా తెంపుకురు అవకాశం ఉంది. ప్రతి చెట్టు నుంచి నాలుగైదు రోజులకు మునక్కాయలు కోసుకోవచ్చు. అలా రెండు నెలల పాటు ప్రతి చెట్టు నుంచీ కాయలు కోతకు వస్తాయి. ఒక సీజన్‌ లో ఒక మునగమొక్క నుంచి 150 నుంచి 200 కాయలు కచ్చితంగా తెగుతాయని గోవిందరెడ్డి చెప్పారు. మునగకాయకు డిమాండ్ బాగా ఉంటుందన్నారు. విజయవాడ మార్కెట్‌ లో, స్థానికంగా కూడా తాము పండించే మునక్కాయల్ని కొనేందుకు వ్యాపారులు ముందుకు వస్తారన్నారు. మునగకాయలకు మార్కెటింగ్‌ కష్టమే ఉండదని గోవిందరెడ్డి చెప్పారు.హైబ్రీడ్‌ మునగ చెట్లను వర్షాలు మొదలయ్యే జులై రెండో వారం ముగిసే ట్రాక్టర్‌ కట్టర్‌ వేసి తీసేస్తామని గోవిందరెడ్డి వెల్లడించారు. మునగచెట్లను తీసేసిన వెంటనే అంతరపంటగా ఉల్లి పంట వేస్తామని చెప్పారు. పొలంలో ఉల్లి ఉండగానే మునగ మొక్కలు కూడా నాటుకుంటామని తెలిపారు. తొంబై రోజుల్లోనే ఉల్లి పంట చేతికి వచ్చేస్తుందన్నారు. ఒకవేళ ఉల్లి ఉండగా మునగమొక్క బాగా ఏపుగా ఎదిగితే.. దాని ఆకులు తుంచేస్తామని గోవిందరెడ్డి చెప్పారు. ఆకును తుంచేసినా మునగ మొక్కకు నష్టం ఉండదన్నారు.

వర్షాలు వచ్చినప్పుడు మునగచెట్టు నుంచి పూత రాలిపోతుంది. అందుకే వర్షాలు వచ్చే సరికి మునగచెట్లను తీసేస్తామన్నారు. మునగచెట్టుకు ఎక్కువ కాపు వస్తే.. ఆకు రాలిపోతుందని, చెట్టు కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. అందుకు ఎక్కువ కాపు వచ్చిన చెట్టును తీసేస్తామన్నారు.ఎకరం పొలంలో మునగ సాగు చేయడానికి దుక్కితో పాటు, కూలీలు, స్ప్రే మందుల ఖర్చు అన్నీ కలిపి 15 నుంచి 20 వేల రూపాయలు అవుతుందని గోవిందరెడ్డి చెప్పారు. ఆదాయం తక్కువలో తక్కువ వేసుకున్నా లక్షన్నర నుంచి 2 లక్షల రూపాయల వరకు ఒక సీజన్‌ లో కచ్చితంగా వస్తుందని తెలిపారు. ఒక మునగ కాయ ధర రైతుకు రెండు రూపాయలు వచ్చినా రైతుకు లాభమే అన్నారు. అంతకు మించి ధర పలికితే లాభం మరింత ఎక్కువ వస్తుందన్నారు.

ఎకరం పొలంలో నాటుకునే మునగ విత్తనాలకు కిలో సుమారు మూడు వేల రూపాయలు ఉంటుందని గోవిందరెడ్డి చెప్పారు. ఒక రోజులో ఇద్దరు మనుషులు ఎకరం పొలంలో మునగ విత్తనాలు నాటుతారు. మునగతోటలో మొదటి మూడు నెలలు అంతర పంటగా ఉల్లి ఉంటుంది. ఉల్లి తీసేసిన తర్వాత కలుపు వస్తే పీకేయాలన్నారు. ఎకరం పొలంలోని మునగమొక్కలకు ఒకటి నుంచి రెండు బస్తాల పిండి వేసుకుని, నీరు పెట్టి మొక్క చుట్టూ పాదు చేయాల్సి ఉంటుంది. మునగకాయ కోతకు వచ్చిన తర్వాత నీరు పెడితే.. తొందరగా కాయలు కోసేయాల్సి ఉంటుంది. మామూలు కన్నా ఒక రోజు ముందే కాయలు కోసుకోవాలి. ఎక్కువ పొడవు ఎదిగిన మునగకాయలను విత్తనాల కోసం ప్రత్యేకంగా ఉంచేస్తారు.మునగతోటలో బూదురు పురుగులు వేలాడుతుంటే.. నువాక్రాన్‌ అర లీటరు తైవాన్‌ మిషన్‌ తో స్ప్రే చేసుకుంటే సరిపోతు్ది. దాని ఖర్చు కూడా వెయ్యి రూపాయల లోపే ఉంటుంది. వర్షాలు ఎక్కువ పడినప్పుడు మునక్కాయను పెద్ద ఈగలు పొడుస్తాయని గోవిందరెడ్డి చెప్పారు. ఈగ కుట్టిన కాయ నుంచి జిగురు పదార్థం కారుతుందన్నారు. వర్షాలు కురిసినా ఒక్కో మునగ చెట్టు కాపు కాస్తుందని చెప్పారు. కాయలు కోసిన తర్వాత మునగచెట్టును అలాగే ఉంచేసినా జనవరిలో మళ్లీ కాపు వస్తుందన్నారు. మునగ కాయలకు జనవరి నెలలో ఎక్కువ ధర పలుకుతుందని గోవిందరెడ్డి పేర్కొన్నారు. జనవరిలో కోతకు వచ్చే మునగ కాయలు బాగా ఎక్కువ పొడవు ఉంటాయన్నారు. మునగ పంట సీజన్‌ లో కిలో 20 రూపాయలు ఉంటే.. జనవరిలో వచ్చే పంటకు కిలో 200 రూపాయల దాకా ధర వస్తుందన్నారు. అయితే.. జనవరిలో వచ్చే మునక్కాయలను విత్తనాల కోసం వినియోగించబోమన్నారు. మునగ విత్తనం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే తయారు చేసుకుంటే మేలు అన్నారు.మునగ చెట్లను తీసేయడం కూడా చాలా సులువు. ట్రాక్టర్‌ డోయర్‌ తోసేస్తూ ఉంటే.. కట్టర్‌ కట్‌ చేసేస్తుంది. గంట సమయంలో ఎకరం నేలలోని మునగచెట్లను ట్రాక్టర్‌ మొత్తం కోసేసి, భూమిలో కలిపేస్తుందన్నారు. అందుకు ట్రాక్టర్‌ కు మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే కిరాయి అవుతుందన్నారు. మొత్తం మీద మునగ సాగుకు ఖర్చు పెద్దగా ఉండదు. ఆదాయం ఎక్కువగా వస్తుంది. చీడ పీడల బాధ కూడా పెద్దగా ఉండదు. రసాయనాల వాడకం అంతగా ఉండదు. రసాయన ఎరువులు వేయాల్సిన పనిలేదు. మునగసాగుతో మంచి లాభాలు ఆర్జించవచ్చని గోవిందరెడ్డి తన స్వానుభవంతో చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here