సెరికల్చల్‌ అంటే పట్టుపురుగుల పెంపకం. మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉన్న సాగు పట్టుపురుగుల పెంపకం. కిలో పట్టుగూళ్లు రూ.450 నుంచి రూ.500 వరకు పలుకుతుంది. డిమాండ్‌ ఎంత ఎక్కువ ఉంటే.. దాని ప్రకారం మరింత అధిక ధర వస్తుంది. ప్రతి 22 రోజులకు ఒక పంట తీయవచ్చు. అలా ఏడాదిలో కనీసం 8 పంటలు తీసుకోవచ్చు. ఒక్కో పంటకు ఖర్చులన్నీ పోగా కనీసంలో కనీసం 30 నుంచి 40 వేల రూపాయల లాభం కళ్ల జూడవచ్చు. పట్టుపురుగులు పెంచే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చక్కని సబ్సిడీ అందజేస్తుంది. ఉద్యానవనశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చక్కని సూచనలు, సలహాలు ఇస్తూ రైతన్నలకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటారు.ఇందుకు ముందుగా మనం చేసుకోవాల్సింది ఒక యూనిట్‌కు 50 అడుగుల పొడవు 25 అడుగుల వెడల్పు ఉన్న షెడ్‌ నిర్మించుకోవాలి. అంతకు ముందు కనీసం రెండున్నర నుంచి 3 ఎకరాల్లో మల్బరీ ఆకుతోట పెంచుకోవాలి. పట్టుపురుగులను షెడ్‌లోని బెడ్స్‌పై వదిలే ముందు పది పదిహేను రోజుల పాటు షెడ్ అంతా డిస్ ఇన్ఫెక్ట్‌ చేసుకోవాలి. అన్నింటి కంటే ముఖ్యంగా పట్టు పురుగులను బెడ్స్‌పై వదిలినప్పటి నుంచి 540 గంటల పాటు ప్రతి క్షణమూ కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కష్టపడే తత్వం ఉండాలి. పెట్టుబడి పెట్టి, రిలాక్స్‌ అయిపోతే.. లాభాల సంగతి అటుంచితే నష్టం కూడా వచ్చే ప్రమాదం ఉంది. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అంటారు కదా అలా అన్నమాట. రంగారెడ్డి జిల్లా గట్టిప్పలపల్లిలో మూడేళ్లుగా విజయవంతంగా సెరికల్చర్‌ చేసి, లాబాలు ఆర్జిస్తున్నయువరైతు సయ్యద్‌ రఫీ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం.ముందుగా సయ్యద్ రఫీ చెబుతున్న జాగ్రత్త ఒకటి ఉంది. సగం సగం తెలుసుకుని సెరికల్చర్ సాగులోకి రావద్దని రఫీ చెప్పారు. పట్టుపురుగుల పెంపకం గురించిన పూర్తిగా అవగాహన చేసుకుని, ఉద్యానవన శాఖ అధికారుల నుంచి, ఇంతకు ముందే పట్టుపురుగులు పెంచుతున్న రైతుల వద్ద ఒక వారం, పది రోజులు ప్రాక్టికల్‌ శిక్షణ తీసుకుని పట్టుపుగుల పెంపకం చేపడితే మంచిదంటారు. ఒకటికి పది సార్లు ఆలోచించుకుని, కష్టపడే గుణం ఉంటేనే ఈ రంగంలోకి రావాలని చెప్పారు. లేదంటే పది, పదిహేను లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోవద్దని, సమయం వృథా చేసుకోవద్దని రఫీ సలహా ఇచ్చారు.

హైదరాబాద్‌లో నెట్‌వర్కింగ్ జాబ్ చేసే రఫీ సెరికల్చర్‌ చేయాలనే ఆలోచన రావడంతో అనంతపురం జిల్లా హిందూపూర్‌, కర్ణాటక, షాద్‌నగర్‌లోని కొందరు సెరికల్చర్‌ రైతుల వద్దకు వెళ్లి పట్టుపురుగుల పెంపకానికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. అలాగే సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారుల నుంచి కూడా సెరికల్చర్‌పై షఫీ కీలక సమాచారం తీసుకున్నారు.సెరికల్చర్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలంటే 3 నుంచి 4 ఎకరాలు తప్పకుండా ఉండాలని షఫీ చెప్పారు. షెడ్డును 60 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో నిర్మించుకోవాలన్నారు. రెండు నుంచి 3 ఎకరాల్లో మల్బరీ తోట పెట్టాలన్నారు. ఎకరం భూమిలో 5,500 మల్బరీ మొక్కలు నాటుకోవచ్చన్నారు. సాలుకు సాలుకు మధ్య 4 అడుగులు, మొక్కకు మొక్కకు మధ్య 2 అడుగుల దూరంలో తాను మల్బరీ మొక్కలు నాటినట్లు చెప్పారు. ఈ విధంగా మొక్కలు నాటుకుంటే రెండు క్వింటాళ్ల వరకు మల్బరీ ఆకు దిగుబడి వస్తుందన్నారు. రెండు క్వింటాళ్ల మల్బరీ ఆకు 2 డీఎఫ్‌ఎల్‌ అంటే డిసీజ్‌ ఫ్రీ లేయర్‌కు ఆహారంగా సరిపోతుంది. సెరికల్చర్‌ డిపార్ట్‌మెంట్‌ మనకు డీఎఫ్‌ఎల్‌ గుడ్లను సరఫరా చేస్తుంది. ఒక్కో గుడ్డులో 50 వేల నుంచి 60 వేల రోగరహిత పట్టుపురుగులు ఉంటాయి. రెండు డీఎఫ్‌ఎల్‌ గుడ్లను తీసుకొచ్చి ప్రతిరోజూ ఉదయం ఒకసారి, సాయంత్రం మరోసారి ఫీడింగ్‌ ఇవ్వాలి. ఇలా 16 నుంచి 17 రోజులు పెంచాలి. ప్రతి మూడు రోజులకు ఒకసారి పట్టుపురుగు తన సైజును పెంచుకుంటుంది. తొలిసారి పట్టుపురుగును తెచ్చినప్పుడు అది బియ్యపు గింజ సైజులో ఉంటుంది. పట్టుపురుగు 22 రోజుల్లో 70 రెట్లు తన సైజు పెంచుకుంటుంది.షెడ్డు 60X25 అడుగులు ఉంటే 300 నుంచి 350 డీఎఫ్‌ఎల్‌ పెంచుకోవచ్చు. చిన్న పట్టుపురుగులను తెచ్చినప్పటి నంచి 22 రోజులు జాగ్రత్తగా పెంచుకుంటే.. ప్రతి నెలా 90 నుంచి 95 శాతం దిగుబడి వస్తుంది. షఫీ ఇప్పటి వరకు ఒక్క పంట కూడా విఫలం కాకుండా దిగుబడి సాధించినందుకు 2022లో తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ రైతు అవార్డు ఇచ్చింది. షఫీ తన యూనిట్‌లో 200 డీఎఫ్‌ఎల్‌ పెంచితే 190 కిలోల సిల్క్‌ దిగుబడి వచ్చిందన్నారు. గతంలో కిలో పట్టు ధర 700 నుంచి 770కి కూడా షఫీ అమ్మారు. ఇప్పుడు అది రూ.450 నుంచి రూ. 500 పలుకుతోందన్నారు. ఇలా 22 రోజుల పట్టుపురుగుల పెంపకానికి ఒక యూనిట్‌లో రూ.90 నుంచి 95 వేలు ఆదాయం వచ్చింది. పట్టుపురుగులను 22 రోజులు పెంచడానికి డీఎఫ్‌ఎల్‌కు రూ.10 వేలు అవుతుంది. కూలీలకు రూ.15 వేలు ఖర్చు వస్తుంది. పురుగులకు రోగాలు రాకుండా, ఫంగస్‌ సోకకుండా నివారించేందుకు విజేత పౌడర్‌ను నీటిలో కలిపి ప్రతి మూడు రోజులకొకసారి చేతులతో చల్లుకోవాలి. ఈ మందుకు మరో రూ.2 వేలు అవుతుంది. ఇలా రూ.30 నుంచి 35 వేలు ఖర్చు అయినా కూడా ఒక యూనిట్ నుంచి రూ.60 నుంచి రూ.65 వేలు లాభం వస్తుందని షఫీ తెలిపారు.షెడ్డులో 50 అడుగుల పొడవు, 18 అంగుళాల వెడల్పుతో స్టాండ్‌లపై నాలుగైదు వరసల్లో పడకలు ఏర్పాటు చేసుకోవాలి. పడకల మీద పట్టు పురుగులను పెట్టి రోజు రెండుసార్లు చొప్పున మల్బరీ ఆకునే ఆహారంగా వేయాలి. మల్బరీ ఆకులను పట్టుపురుగులు చాలా ఇష్టంగా తింటాయి. పెరుగుతున్న పట్టు పురుగును బట్టి ఆహారం కూడా పెంచాలి. పట్టుపురుగు ఎక్కడ పెడితే అక్కడే ఉంటాయి. మరోచోటకు వెళ్లవు. పట్టుపురుగులు పడకల మీద పెట్టుకోవడానికి వారం పది రోజుల ముందే షెడ్డును ఫంగస్‌, వైరస్‌ లాంటివి లేకుండా మూడుసార్లు డిస్‌ ఇన్ఫెక్షన్ చేయాలి. బ్లీచింగ్‌తో ఒకసారి, అస్రాతో మరోసారి, డీ ఫోరెక్స్‌ అనే రోగ నివారణ మందులతో డిస్‌ ఇన్ఫెక్షన్ చేయాలి. ప్రతి మూడు రోజులకోసారి షెడ్డును పరిశుభ్రం చేయాలి. పడకల మీద పేపర్ వేసి, దానిపై పిల్లలను పెట్టుకోవాలి. షెడ్డును ఎంత పరిశుభ్రంగా ఉంటుకుంటే పట్టు పురుగు అంత ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పెరుగుతుంది. అదే స్థాయిలో పంట దిగుబడి కూడా వస్తందని షఫీ వివరించారు.  గతంలో సెరీకల్చర్‌ చేసేవారు మల్బరీ ఆకులను కోసుకొచ్చి ఆహారం వేసేవారు. దీంతో కూలీలకు చాలా ఖర్చు, శ్రమతో ఉండేది. ఇప్పుడు మల్బరీ కొమ్మలను ఆకులతో సహా కట్టచేసి పురుగులపై జాగ్రత్తగా పెడుతున్నారు. దీంతో ఖర్చు, శ్రమ చాలా తగ్గిపోయిందన్నారు. పురుగులపై మల్బరీ కొమ్మల్ని పెడితే వాసనను బట్టి అవి ఆకులను తింటాయి. పట్టుపురుగును తెచ్చి, పడకలపై పెట్టిన రెండో రోజు నుంచే మల్బరీ ఆకులను ఆహారంగా వేయాలి.పట్టుపురుగు ప్రతి మూడు రోజులకు ఒకసారి చర్మాన్ని వదిలేసి, సైజు పెంచుకుంటుంది కదా. మూడు రోజులు ఆకు తిని సైజు పెంచుకుంటుంది. పట్టు పురుగు నుంచి కుకూన్‌ మారడానికి ఐదు దశలు ఉంటాయి. పురుగు సైజు పెంచుకునే దశలు నాలుగు ఉంటాయి. ఐదోది స్పిన్నింగ్ దశ. అంటే కకూన్‌ను సిద్ధం చేసుకుంటుంది. సెరికల్చర్‌ విభాగం నుంచి డీఎఫ్‌ఎల్‌ తెచ్చుకుని దాన్నుంచి పురుగులను బయటికి తీసుకోవాల్సి వచ్చేది. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని. ఇప్పుడు సెరికల్చర్‌ విభాగం డీఎఫ్‌ఎల్‌ లను చాకీ సెంటర్‌కు ఇస్తున్నారు. చాకీ సెంటర్‌లోనే పట్టుపురుగుకు రెండు దశలు పూర్తయిపోతాయి. మూడు, నాలుగు దశలు రైతులు యూనిట్‌లో పెంచుకోవాల్సి ఉంటుంది. ఐదో దశకు వచ్చే సరికి ప్లాస్టిక్‌తో తయారు చేసిన జాలీలను బెడ్లపై పెట్టుకోవాలి. పట్టుపురుగు స్పిన్నింగ్ దశకు వచ్చినప్పుడు నోటి నుంచి సిల్క్‌ను బయటికి తీస్తుంది. ఆ సమయానికి ప్లాస్టిక్‌ జాలీలు ఏర్పాటు చేస్తే.. దానిలోపల అది 48 గంటల పాటు సిల్క్ తీసి కకూన్‌గా మారుతుంది. నాలుగైదు రోజుల తర్వాత కకూన్‌లను జాగ్రత్తగా తీసుకుని, గోనె సంచుల్లో జాగ్రత్తగా నింపుకుని మార్కెట్‌కు తరలించాలి.  నాలుగో దశలో పట్టుపురుగు ఆహారం చాలా ఎక్కువగా తింటుంది. కకూన్ దశలో పట్టు పురుగు ఆహారం తినదు.

కకూన్‌ను రీలింగ్‌ చేసేవారు వేడి నీటిలో వేసి, దారాన్ని మిషన్‌కి ఎక్కించి తీస్తారు. కకూన్‌లో ఎంత శాతం సిల్క్‌ ఉందో తెలుసుకోవాలంటే.. హైదరాబాద్‌ తిరుమలగిరి మార్కెట్‌లో అర కిలో కకూన్లు తీసుకెళ్తే, వారు దాన్ని కత్తిరించి, ప్యూపా ఎంత ఉంది? సిల్క్‌ ఎంత ఉందనేది నిర్ధారించి చెబుతారు. ఇలా చెక్‌ చేసినప్పుడు డిఫెక్ట్‌ అంటే పురుగు 5 శాతం లోపు ఉండాలి. సిల్క్ రేటు 20 నుంచి 22 శాతం ఉంటే దాన్ని నాణ్యమైన సిల్క్‌గా పరిగణిస్తారు. 22 శాతం సిల్క్‌ దారం ఉంటే దానికి అత్యధికంగా ధర వస్తుంది. 20 నుంచి 22 వరకు ఉంటే యావరేజి ధర పలుకుతుంది.పట్టుపురుగు నాలుగు రోజుల్లో సిల్క్‌ దారాన్ని కక్కేసి కకూన్‌గా మారిపోతుంది. ఐదు లేదా ఆరో రోజున కకూన్‌లను ప్లాస్టిక్ జాలీ నుంచి బయటికి తీసేయాలి. కకూన్‌ను బయటికి తీసిన 15 రోజుల లోగా మార్కెట్లు అమ్మేయాలి. ఆ తర్వాత కూడా అలాగే ఉంచితే.. కకూన్ నుంచి పురుగు దారాన్ని కత్తిరించుకుని, బయటికి వచ్చేస్తుంది. అప్పుడు పట్టుదారం పనికిరాకుండా పోతుంది. పట్టుపురుగుకు నరాలు ఉండవు. మెదడు ఉండదు. సూదితో గుచ్చినా పట్టుపురుగుకు ఏమీ కాదు. అప్పుడు కూడా ఆకులు తింటూనే ఉంటుంది. అంటే పట్టుపురుగుకు స్పర్శ తెలియదు.

పట్టుపురుగుల యూనిట్ పెట్టిన ప్రతి ఒక్కరూ సక్సెస్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయన్నారు షఫీ. అందుకు కారణం రైతే అవుతాడన్నారు. పట్టుపురుగుల పెంపకంపై బాగా అధ్యయనం చేయాలన్నారు. కనీసం వారం పదిరోజులైనా సెరికల్చర్‌ రైతుల వద్ద శిక్ష తీసుకోవాలన్నారు. ఆపైన చాలా జాగ్రత్తగా యూనిట్ మెయింటెనెన్స్‌ చేయాలి. మల్బరీ తోటను ఆరోగ్యంగా పెంచడంలోనే సెరికల్చర్‌లో 60 శాతం సక్సెస్‌ సాధించినట్లు అవుతుంది. మల్బరీ ఆకు బాగుంటే పంట సక్సెస్ అయినట్టే. ప్రతి పంటకు పురుగులను తీసుకొచ్చే పది రోజుల ముందు నుంచీ షెడ్డును పూర్తిగా డిస్ ఇన్ఫెక్షన్‌ చేయాలి. షెడ్డు లోపలకు ఎవరినీ రానివ్వకుండా తలుపులు మూసేయాలి. షెడ్డును మెయింటెయిన్‌ చేసేవారు కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. డిస్ ఇన్ఫెక్షన్‌ సరిగా చేయకపోయినా.. పురుగులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలించకపోయినా.. 540 గంటల పాటు జాగ్రత్తగా గమనించకపోయినా.. పురుగులు తింటున్నాయా? లేదా చూసుకోకపోయినా నష్టం వస్తుందన్నారు. పట్టుపురుగుకు సున్నంకట్టు రోగం, చాక్‌పీస్‌ రోగం వచ్చినప్పడు విజేత సప్లిమెంటరీ పౌడర్‌ నీటిలో కలిపి చల్లుకోవాలి. లేదని నిర్లక్ష్యం చేస్తే.. రోగం వచ్చిన పురుగు ఆకుల మీద ఉమ్మితే.. అది ఉన్న ఆకులను తిన్న మిగతా పురుగులకు కూడా రోగాల బారిన పడతాయని షఫీ చెప్పారు. వైరస్ సోకిన, రోగం వచ్చిన పురుగు సెపరేట్‌ ఉంటుంది. అలాంటి పురుగును ముందుగానే పడక నుంచి తీసేసి బయట పడేయాలి. షెడ్డును శుభ్రంగా ఉంచుకుంటే.. నాణ్యమైన ఆకును ఆహారంగా ఇస్తే పట్టుపురుగుకు ఎలాంటి రోగమూ రాదు.రెండు ఎకరాల్లో మల్బరీ మొక్కలు 11 నుంచి 12 వేల మొక్కలు వేసుకోవచ్చు. ప్రతి మొక్కు డ్రిప్‌ వేసుకుని, రోడు విడిచి రోజు నీళ్లు సరఫరా చేయాలి. రెండు ఇంచుల బోరు ఉంటే రెండు ఎకరాల్లో మల్బరీ తోటకు నీరు సరిపోతుంది. మొక్కలు ఏపుగా ఎదిగేందుకు ప్రతి పంటకు ఒకసారి డీఏపీ 28 వేసుకోవచ్చు. మల్బరీ మొక్కలు నాటిన తర్వాత 120 నుంచి 150 రోజులకు తొలి పంట చేతికి వస్తుంది. అప్పటి నుంచి ప్రతి వారం మల్బరీ ఆకు కొమ్మలు కట్‌ చేసుకోవచ్చు. ఇలా 20 ఏళ్ల పాటు మల్బరీ తోట మనకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. మల్బరీ మొక్కలకు తెగుళ్లు సోకకుండా రోగర్‌ అనే మందు ఒకసారి, పోషణ్‌ అనే మందు రెండోసారి స్ప్రే చేసుకుంటే చీడ పీడలేవీ రావు. పురుగులు తీసుకు రావడానికి 20 రోజుల ముందే స్ప్రేయింగ్ పూర్తిచేయాలి. పురుగు మందు చల్లిన ఆకులు మేతగా వేస్తే పట్టుపురుగులు చనిపోతాయి. మల్బరీతోటకు పక్క పొలాల వారు పురుగుమందులు చల్లితే.. ఆ ఘాటు మల్బరీ మొక్కలకు సోకితే.. వెంటనే ఆకులన్నీ బాగా తడిసేలా నీళ్లు చల్లుకోవాల్సి ఉంటుంది. పక్కపొలంలోని మందు పడిన చోట కొమ్మలు పది రోజుల పాటు కత్తిరించకుండా మరో పక్క నుంచి ఆకులు మేతగా వేయాలి.

షెడ్డు 50X22 అడుగుల సైజులో వేసుకుని, రెండు ఎకరాల మల్బరీ తోట పెడితే.. గతంలో తనకు రూ. 2 లక్షలు సబ్సిడీ వచ్చిందని షఫీ తెలిపారు. తోటకు రూ.25 వేలు వచ్చిందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం రూ.3.50 లక్షలు సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్సిడీని తిరిగి ప్రభుత్వానికి చెల్లించనక్కర్లేదు. రైతుకు రూ.10 లక్షలు ఖర్చు అవుతుంది. మల్బరీ తోటకు వేసే డీఏపీ ఎరువు, విజేత, అస్రా, బ్లీచింగ్‌ పౌడర్‌, సున్నంతో కూడిన రూ.5 వేల ఖరీదు ఉండే కిట్‌ను తెలంగాణ ప్రభుత్వం 2,500కే ఇస్తోంది.

పట్టుకు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ప్రస్తుతం వస్తున్న దిగుబడికి రెట్టింపు సిల్క్‌ అవసరం ఉంది. అత్యంత జాగ్రత్తగా పట్టుపురుగుల యూనిట్ నిర్వహించుకుంటే మరే ఇతర పంట కన్నా లాభదాయకంగా ఉంటుంది. ఏమాత్రం అశ్రద్ధ కాని, సరైన నిర్వహణ కానీ చేయపోతే పెట్టుబడి నష్టం వస్తుంది. సమయం, కష్టం వృథా అవుతుంది. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటిస్తే.. పట్టుపురుగుల పెంపకంతో రైతు లాభాలు సంపాదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here