ఖర్చు చాలా అంటే చాలా తక్కువ. బంజరు భూముల్ని కూడా సారవంతం చేస్తుంది. మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకైతే ఇది అమృతం లాంటిదనే చెప్పాలి. తయారు చేసుకోవడం చాలా సులువు. శాస్త్రవేత్త ఖాదర్‌ వలీ రూపొందించిన ద్రావణం ఇది. దీని పేరు ‘అటవీ చైతన్య ద్రావణం’.అటవీ చైతన్య ద్రావణం తయారీ కోసం అడవిలోని భూమి కొద్దిగా తవ్వి మట్టిని సేకరించుకోవాలి. అడవి అంటే ఎక్కడో సుదూర ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. రసాయనాల వినియోగం లేని భూమి లోపలి మట్టి అయితే.. సరిపోతుంది.  చెట్ల కింద ఆకులు భూమి మీద పడి కుళ్లుతాయి. అక్కడి భూమి లోపల కోటానుకోట్ల మంచి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. వాటితోనే అడవుల్లోని చెట్లు ఏపుగా బలంగా ఎదుగుతాయి కదా.. ఇదే అటవీ చైతన్య ద్రావణం తయారీకి ప్రధానమైన వనరు అని తెలుసుకోవాలి. అలాంటి మట్టిలోని మంచి బ్యాక్టీరియాను మనం తెచ్చుకుని, మరింతగా అభివృద్ధిచేసి, మొక్కలకు ఇస్తే.. రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అటవీ చైతన్య ద్రావణం వాడిన నేల చక్కగా సారవంతం అవుతుంది. మొక్కలు నవనవలాడుతూ పెరుగుతాయి. మనం కోరుకున్న ఫలసాయాన్ని ఇస్తాయి. ఇందులోని సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకు, చెట్లకు కావాల్సినంత పోషక పదార్థాలను అందిస్తాయి.అటవీ చైతన్య ద్రావణం తయారు చేసుకోవడానికి మట్టి కుండా కొత్తది తీసుకోవాలి. మిద్దె తోటలోని మొక్కల కోసం అయితే.. మూడు నాలుగు లీటర్ల నీరు పట్టే కొత్తకుండ సరిపోతుంది. అదే ఎక్కువ పరిమాణంలో అంటే ఎకరాలకు ఎకరాలు సాగుచేసే రైతులైతే.. పెద్ద కుండలో ఇప్పుడు చెప్పుకునే పదార్థాల పరిమాణాన్ని పెంచుకుని తయారు చేసుకోవాలి. కొత్త కుండలో అడవి నుండి సేకరించిన మట్టి, టీ తాగే గ్లాసెడు మోతాదులో సెనగపిండి, లేకపోతే ద్విదళ పప్పులు అంటే కందిపప్పు, సెనగపప్పు, పెసర పప్పు లాంటిది ఏదైనా పెండి వేసుకోవాలి. ఏకదళ గింజల పిండి అంటే రాగి, మిల్లెట్స్‌ పిండి తీసుకోవాలి. కొత్త కుండలో ద్విదళ పిండి, రాగిపిండి ఒకే పరిమాణంలో వేసుకోవాలి. ఆపైన తాటిబెల్లం గానీ ఏ బెల్లం అయినా ఒక గుప్పెడు వేసుకోవాలి. వాటికి అడవి నుంచి తెచ్చుకున్న గుప్పెడు మట్టి కలుపుకోవాలి. వాటిపైన కుండ పైభాగంలో వంపు వరకు నీళ్లు పోసుకోవాలి.కుండలో వేసుకున్న సెనగపిండి, రాగిపిండి, బెల్లం పొడిని, అడవి మట్టిని నీటిలో బాగా కలుపుకోవాలి. అలా ఐదు రోజుల పాటు ప్రతిరోజు ఉదయం కర్రపుల్లతో బాగా కలుపుకోవాలి. అటవీ చైతన్య ద్రావణం తయారుచేసుకున్న మట్టి కుండను ఎండ ఉండని చోట మట్టితో కప్పిపెట్టాలి. ఇంటి పెరట్లో అయినా కుండను కప్పి పెట్టొచ్చు. నేల అందుబాటులో లేకపోతే, మిద్దెతోటలోనే ఓ మూల చిన్న మట్టి మడిని తయారు చేసుకోవాలి. అది కూడా అవకాశం లేకపోతే ఒక ప్లాస్టిక్ డ్రమ్ములో అయినా మట్టి పోసుకుని దాంటో అటవీ చైతన్య ద్రావణం కుండలో నీరు ఉన్నంత వరకు కప్పి పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే.. అటవీ చైతన్య ద్రావణంలో మంచి బ్యాక్టీరియా లక్షల సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది. ఐదు రోజులకు మట్టికుండలోని పదార్థాలన్నీ బాగా కలిసి చక్కగా ఫర్మెంట్‌ అవుతాయి. ఇలా తయారైన అటవీ చైతన్య ద్రావణం ఒక లీటర్‌కు 21 లీటర్ల నీటిని కలిపి మొక్కలకు వాడుకుంటే చక్కగా ఎదుగుతాయి. మంచి పంట దిగుబడిని ఇస్తాయి.ఈ అటవీ చైతన్య ద్రావణం 21 రోజుల వరకూ వాడుకోవచ్చు. ఐదు నుంచి 21 రోజుల వరకు అది ఇచ్చే ఫలితం ఒకే విధంగా ఉంటుంది.  21 రోజలు దాటితే మాత్రం ఈ ద్రావణంలోని సూక్ష్మజీవులు వాటికవే చనిపోతాయి. అందుకే దీన్ని 21 రోజుల లోపలే వినియోగించాలి. అయితే అటవీ చైతన్య ద్రావణాన్ని కొద్దిగా తీసుకుని మళ్లీ కొత్తది తయారు చేసుకోవచ్చు. ఈ ద్రావణం తయారు చేసుకునే ప్రతిసారీ వీలైతే కొత్త కుండనే వినియోగిస్తే మంచిది. ఎందుకంటే కొత్త కుండ ఎక్కువ ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. అవకాశం లేకపోతే పాత కుండనే మళ్లీ వాడుకోవచ్చు. మనం తయారు చేసుకున్న అటవీ చైతన్య ద్రావణం బాగా తయారైందనేందుకు సూచన దానిపై తెల్లని పొర ఏర్పడుతుంది. అలాగే.. కల్లు వాసన వస్తుంది. కుండలోని నీరు కొద్దిగా చిక్కబడినట్లు అయి, రంగు కూడా టీ రంగులోకి మారుతుంది. ఈ ద్రావణాన్ని సాయంత్రం పూట మాత్రమే చెట్లకు, మొక్కలు పై నుంచి కింది వరకు, మొక్క మొదట్లోని మట్టి కూడా బాగా తడిసేలా పోర్టబుల్ స్ప్రేయర్‌తో స్ప్రే చేసుకోవాలి. సాయంత్రం చల్లగా ఉంటుంది. ద్రావణంలోని సూక్ష్మజీవులు ఎక్కువగా ఇబ్బంది పడకుండా వెంటనే మట్టిలోపలికి వెళ్లిపోతాయి.ఎకరం భూమిలో పెంచుకునే మొక్కలు లేదా చెట్లకు అటవీ చైతన్య ద్రావణం 21 లీటర్లు ఇచ్చుకుంటే సరిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్త ఖాదర్ వలీ తెలిపారు. అంటే ఇది ఎంత శక్తివంతమైన ద్రావణమో చెప్పకనే చెబుతోంది. అటవీ చైతన్య ద్రావణం పూర్తిగా ఆర్గానిక్‌ విధానంలో తయారు చేసింది కాబట్టి స్ప్రే చేసేటప్పుడు మనం గాలి పీల్చినా ఎలాంటి ప్రమాదమే మనకు ఉండదు. బాగా పులిసిన ద్రావణం కాబట్టి మొక్కలపై ఉండే పురుగులు కూడా పారిపోయే చాన్స్ ఉంటుంది. అటవీ చైతన్య ద్రావణాన్ని మొదట్లో 15 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత తర్వాత నెలకు ఒకసారి ఇచ్చినా సరిపోతుంది. అప్పటికే మొక్క చుట్టూ ఉన్న మట్టి సారవంతం అవుతుంది. కాబట్టి మంచి ఫలితాలు ఇస్తుందని శివపార్వతి, సంపత్‌ అనుభవపూర్వకంగా తెలిపారు.ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ పంట దిగుబడి ఇచ్చేందుకు ఈ అటవీ చైతన్య ద్రావణం బాగా ఉపయోగపడుతోంది. ఔత్సాహిక మిద్దెతోట పెంపకం దారులు, పెద్ద మొత్తంలో సాగు చేసే రైతులు కూడా ఈ అటవీ చైతన్య ద్రావణాన్ని వినియోగించుకోవచ్చు.

వాట్సాప్‌ కాంటాక్ట్‌ నెంబర్: 9014541405

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here