పర్పుల్‌, గ్రీన్‌, దసరా, బెంగళూర్, డబుల్‌ కలర్‌… ఇదేంటీ రంగులు, పండుగలు, ఊళ్ల గురించి చెబుతున్నారేంటి? అనుకుంటున్నారా? అదేమీ లేదండీ.. మనం చెప్పుకున్న పేర్లు చిక్కుడు కాయల్లోని రకాలు. ఇవన్నీ మిద్దెతోటలో ఎంచక్కా పెంచుకునే రకాలే.. గార్డెన్‌లో కూడా పెంచుకోడానికి వీలైనవే ఈ చిక్కుడు రకాలు. బెంగళూరులో స్థిరపడిన తెలుగు గృహిణి అరుణ బొడ్డేపల్లిది ఇలాంటి కొత్తకొత్త రకాలను సాగుచేయడంలో అందెవెసిన చెయ్యి.పర్పుల్‌ చిక్కుడు 365 రోజులూ గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తూనే ఉంటుంది. డబుల్‌ కలర్‌లో లాంగ్‌ చిక్కుడు. ఈ రకం చిక్కుడును ఏ సీజన్‌లో అయినా నాటుకోవచ్చు. ఒకసారి పంటగా డబుల్‌ కలర్‌ లాంగ్‌ చిక్కుడును పెంచుకోవచ్చు. ఒకసారి పంట తీసుకున్న తర్వాత కొన్ని కాయలన్ని విత్తనాల కోసం వదిలిపెట్టి మిగతావి కోసుకోవచ్చు. డబుల్‌ కలర్‌ లాంగ్ చిక్కుడు ఏ సీజన్‌లో అయినా 3 నెలలు మాత్రమే కాపు కాస్తుంది. ఆ తర్వాత మొక్కను తీసేసి మళ్లీ కొత్తగా విత్తనం నాటుకోవాలి.ఇక గ్రీన్‌ చిక్కుడు విశేషం ఏమిటంటే.. ఒక సారి మొక్క నాటితే నాలుగు ఐదు ఏళ్లపాటు మనకు కాపు ఇస్తూనే ఉంటుంది. కాకపోతే మొక్కకు మనం జాగ్రత్తగా రక్షణ కల్పించాల్సి ఉంటుంది. 365 రోజులూ విపరీతంగా కాపు కాస్తూనే ఉంటుంది. వేసవి కాలంలో ఈ రకం చిక్కుడు పూత రాలుతుంది. గ్రాన్‌ చిక్కుడు మొక్కను వర్షాకాలంలో కానీ, శీతాకాలంలో కానీ నాటుకుంటే మంచిదని అరుణ బొడ్డేపల్లి చెప్పారు.చిక్కుడులో ఇంకో రకం దసరా చిక్కుడు. కణుపు చిక్కుడు సైజులో ఇది కాస్తుంది. పర్పుల్‌, గ్రీన్‌, క్రీమ్‌ కలర్‌లో దసరా చిక్కుడు కాయలు ఉంటాయి. జూన్‌, జులై నెలల్లో మొక్క నాటుకుంటే దసరా సీజన్‌ నాటికి అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఇది కాయలు కాస్తుంది. దసర చిక్కుడులో విశేషం ఏంటంటే… ఒక బంచ్‌లో పావుకిలో చిక్కుడు కాయలు కాస్తాయి. ఈ చిక్కుడు కాయల్లో నాలుగు గింజలు ఉంటాయి. ఇక డబుల్ కలర్ చిక్కుడును చూద్దాం. దసరా చిక్కుడుకాయ రంగులోనే ఉంటుంది. కాకపోతే దానికన్నా డబుల్ కలర్‌ చిక్కుడు కాయ కాస్త ఎక్కువ పొడవు ఉంటుంది.బెంగళూరు చిక్కుడు మరో రకం. బెంగళూరు చిక్కుడు వెడల్పుగా, పెద్ద సైజులో కాస్తాయి. ఈ రకం చిక్కుడు నేలమీద పాకే తీగ రంకం. అయితే.. సపోర్ట్‌ ఇస్తే పైకి కూడా పాకుతుంది. బెంగళూరు చిక్కుడు తీగ పెద్దగా పాకదు. టెర్రస్‌ గార్డెన్‌కు అనుకూలంగా ఉంటుంది. మొక్క రెండో ఆకు తర్వాత పూత రావడం దీనిలో స్పెషాలిటీ. దీని పూలు తెల్లగా ఉంటాయి.చిక్కుడుకు సాధారణంగా ఎదురయ్యే సమస్య పేనుబంక. దాని నివారణకు పేనుబంక పట్టిన చోట ముందుగా నీరు స్ప్రే చేయాలని అరుణ బొడ్డేపల్లి సూచించారు. దాని మీద కొద్దిగా ఎండ వచ్చినప్పుడు బూడిద చల్లితే మంచిదన్నారు. బూడిద చల్లిన మరుసటి రోజు మంచినీళ్లు స్ప్రే చేయాలన్నారు. చిక్కుడు మొక్క నుంచి బూడిద అంతా రాలిపోయిన తర్వాత నీమ్‌ ఆయిల్‌ స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుందని అన్నారు. మళ్లీ ఆ మొక్కకు పేనుబంక సమస్య రాదని చెప్పారు. పేనుబంక నివారణకు బూడిద చాలా బాగా పనిచేస్తుంది.అరుణ బొడ్డేపల్లి తమ మిద్దెతోటలో ఇంకా వంగ, బెండ, బీర, పొడవు బీర, కాకర, తెల్లకాకర, చారల దొండ, బాటిల్‌ సొర, లంకదోస, టమాట, చెర్రీటమాట, కరెంట్‌ బల్బులా ఉండే ఎల్లో పీర్‌ టమాట, మిర్చి, బీన్స్‌, లాంగ్‌ బీన్స్‌, కరివేపాకు పంటలను చక్కగా ఆర్గానిక్‌ విధానంలో పండించుకుంటున్నారు. తమ మిద్దెతోటలో వచ్చే కూరగాయలు తమ అవసరానికి మించి వచ్చినప్పుడు చుట్టుపక్కల వారికి, చుట్టపక్కాలకు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. అరుదైన ఈ ఐదు రకాల చిక్కుడు విత్తనాలను ఔత్సాహిక గార్డెనర్లకు అరుణ బొడ్డేపల్లి ఉచితంగా అందజేస్తుంటారు. గూగుల్‌ఫాం ఫిల్‌ చేసిన వారికి అరుణ బొడ్డేపల్లి వీలు చూసుకుని విత్తనాలు పంపిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here