పాల పుట్టగొడుగులలో అతి తక్కువ క్యాలరీలు ఉంటాయి. పీచుపదార్థం కావలసినంత లభిస్తుంది. ప్రోటీన్‌ ఎక్కువగా ఉంటుంది. చక్కని ఆరోగ్యాన్నిస్తుంది మష్రూమ్స్‌తో చేసే ఆహారం. పుట్టగొడుగులు అచ్చమైన శాఖాహారమే కానీ నాన్‌ వెజ్‌ ఆహార ప్రియులకు ఆల్టర్‌నేటివ్‌ అని నిపుణులు చెబుతారు. మిల్కీ మష్రూమ్స్‌లో మాంసాహారంలో ఉండే బీ12 తో పాటుగా డీ, బీ, నియాసిన్‌ వంటి విటమిన్లు, కాల్షియం, సెలీనియం, పొటాషియం, సోడియం లాంటి ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. బీ 12 విటమిన్ కేన్సర్‌ రాకుండా చేస్తుంది. కేన్సర్‌ను నయం చేస్తుంది కూడా. క్రమం తప్పకుండా పుట్టగొడుగులను ఆహారంగా తీసుకుంటే చర్మ సమస్యలు తగ్గుతాయి. బీపీ నియంత్రణలో ఉంటుంది. పీచు పదార్థం ఎక్కువగా ఉన్నందున ఊబకాయం సమస్య తగ్గుతుంది.ఎండబెట్టిన పుట్టగొడుగుల పొడితో జావ చేసుకుని తాగినా, నానబెట్టుకుని కూరగా వండుకుని తిన్నా విటమిన్ డీ లోపం తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగులు మనలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కలుగుతుంది. రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు రాకుండా కాపాడతాయి. పుట్టగొడుగులలోని రెండు ప్రధాన యాంటీ ఆక్సిడెంట్లు ఎర్గో థైరాన్‌, గ్లూటాతియోన్‌ మెదడులోని రక్తకణాలను పరిరక్షిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. పుట్టగొడుగులలోని విటమిన్‌ డీ, కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎముకలను బలంగా ఉంచుతాయి. దీంతో ఎముకల వ్యాధులు, ఎముక నొప్పిని తగ్గించుకోవచ్చు. పుట్టగుడుగుల్లో ఉండే అధిక నీటి శాతం జీర్ణక్రియ మెరుగు అవుతుంది.మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే మిల్కీ పుట్టగొడుగులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ కూడా ఉంది. అలాంటి మిల్కీ మష్రూమ్స్‌ (కాలోసైబ్‌ ఇండికా శాస్త్రీయ నామం) సాగు గురించి తెలుసుకుందాం.

అధిక ఉష్ణోగ్రత అంటే 30 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడి ఉండే ప్రాంతాలు మిల్కీ గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరుకు చెందిన రాయపాటి ప్రసన్న మిల్కీ మష్రూమ్‌ సాగుచేస్తున్నారు.  వైట్‌ మష్రూమ్‌ పంట సాగుకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. రైతులకు ఏడాది పొడవునా ఆదాయం ఇస్తుంది. అందుబాటులో ఉన్న అతి తక్కువ వనరులతో కూడా వైట్‌ మష్రూమ్‌ పంట సాగుచేయవచ్చని ప్రసన్న తెలిపారు. మిల్కీ మష్రూమ్‌ను ఎవరైనా సరే ఇంట్లోనే పెంచుకోవచ్చు. దీని సాగు కూడా చాలా సులువుగా ఉంటుంది.మిల్కీ మష్రూమ్ సాగుకోసం గడ్డి, గోధుమ గడ్డి, బార్లీ గడ్డి, మొక్కజొన్న, జొన్న, బజ్రాకాడ, వేరుశనగ గింజాలు, చెరకు బగాస్‌, గోధుమ ఊక, పత్తి వ్యర్ధాలను ఉపయోగించిన పాల పుట్టగొడుగుల పెంపకం చేపట్ట వచ్చు. వీటన్నింటిలో వరిగడ్డి అత్యుత్తమం అంటారు నిపుణులు, ఒక సంచిలో పుట్టగొడుగులు పెంచేందుకు కిలో ఎండుగడ్డి అవసరం అవుతుంది. 60X40 సెంటీమీటర్ల పరిమాణంలో 100 గేజ్‌ మందం ఉండి, రెండు వైపులా తెరిచిన పాలిథిన్‌ సంచి పుట్టగొడుగుల పెంపకానికి అవసరం అవుతుంది.నాణ్యమైన వరిగడ్డిని ముందుగా స్టెరిలైజ్‌ చేసి, బాగా ఎండబెట్టాలి. ఆ గడ్డిని చాప్ కట్టర్‌తో 4 నుంచి 5 సెంటీమీటర్ల పరిమాణంలో కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకున్న గడ్డి ముక్కలను పరిశుభ్రమైన చల్లటి నీటిలో 6 గంటల పాటు నానబెట్టాలి. పుట్టగొడుగుల పెంపకానికి ఒక డార్క్‌ రూం, మరో లైట్‌ రూం కావాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ కరెక్ట్‌గా మెయింటెయిన్ చేస్తే.. పాల పుట్టగొడుగుల పెంపకం చాలా ఈజీ అవుతుంది. దిగుబడి వచ్చే మష్రూమ్‌ కూడా మంచి నాణ్యతగా ఉంటుంది. ముందుగా డార్క్‌రూంలో బెడ్స్‌ పెట్టుకున్న తర్వాత లైట్‌రూంలోకి మార్చాలి. అక్కడ బెడ్స్‌ను సగానికి కత్తిరించాలి. కట్‌ చేసిన బెడ్స్‌పై కేసింగ్ మట్టి వేయాలి. కేసింగ్ సాయిల్ వేసిన తర్వాత 10 రోజుల పాటు నీరు ఇవ్వాలి. మష్రూమ్‌ సాగులో క్వాలిటీ స్పాన్ చాల ముఖ్యం. మంచి క్వాలిటీ ఉన్న స్పాన్‌ కిలో రూ.120 రూపాయలకు ప్రైవేట్‌ ల్యాబ్‌లలో దొరుకుతుంది. అదే ఐఐహెచ్‌ఆర్‌లో అయితే.. రూ.80కే లభిస్తుంది.పాలిథిన్ కవర్‌ ఒక పక్కన దగ్గరగా మడతపెట్టి ఒక అంగుళం వదిలి టైట్‌గా రబ్బర్‌ బ్యాండ్‌ వేసుకోవాలి. బ్యాండ్ వేసిన తర్వాత కవర్‌ ముడి లోపలికి వెళ్లేలా రివర్స్‌ చేసుకోవాలి. అడుగు లేయర్‌ను స్పాన్ వేసుకోవాలి. దానిపైన మనం ముందే తయారు చేసున్న గడ్డిని 60 నుంచి 70 శాతం తేమ ఉండేలా చూసుకుని మూడు అంగుళాల ఎత్తు వచ్చేలా వేసుకోవాలి. అంతకన్నాఎక్కువ తేమ శాతం ఉంటే పచ్చగా మారి బెడ్ పాడైపోతుంది. దానిపైన రెండో లేయర్‌గా స్పాన్‌ను కవర్‌ చుట్టూరా, మధ్యలో కూడా వేసుకోవాలి. దానిపైన మరోసారి గడ్డి, దానిపై స్పాన్‌ లేయర్ వేయాలి. అలా కవర్‌ నిండే వరకు ఐదు లేయర్లుగా గడ్డి, స్పాన్ వేయాలి. కవర్‌ను మూసే ముందు కూడా స్పాన్ లేయర్ కచ్చితంగా వేయాలి. బెడ్‌లో ఉండే స్పాన్‌ మష్రూమ్‌గా తయారవుతుంది. స్పాన్‌కు గాలి అందేలా కవర్‌కు స్టెరిలైజ్‌చేసిన దబ్బళంతో రంధ్రాలు చేయాలి. బెడ్‌ తయారు చేసిన రోజు డేట్‌ను కవర్‌పై రాసుకోవాలి. తద్వారా బెడ్‌ తయారై 21 రోజులు పూర్తయ్యే సమయాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది. ఇలా తయారుచేసిన బెడ్‌ను డార్క్‌రూంలో పెట్టాలి. డార్క్‌ రూంలో పెట్టిన బెడ్‌కి రెండో రోజుకే కవర్‌లోపల చెమ్మ పడుతుంది. ఆ తర్వాల స్పాన్‌ మెల్లిగా విస్తరిస్తుంది. అలా 21 రోజులు పూర్తయ్యే సరికి బెడ్ అంతా స్పాన్‌ ఆవరిస్తుంది. దాన్ని లైట్ రూంకి తీసుకెళ్లి, బెడ్‌ను అడ్డంగా మధ్యలోకి కట్‌చేసి, కేసీంగ్ చేయాలి. డార్క్‌రూంలో ఉష్ణోగ్రత సరిగా మెయింటెయిన్ చేస్తే.. క్రాప్ ఎక్కువ వస్తుంది. హైజినిక్‌గా కూడా ఉంటుంది. డార్క్‌రూంలో ఉండగా బెడ్స్‌కు గ్రీన్‌ రంగు కానీ, నల్లరంగు కానీ కనిపిస్తే.. వెంటనే దాన్ని డార్క్‌రూం నుంచి తీసేయాలి. లేదంటే మిగతా బెడ్స్‌కు కూడా ఆ ప్రమాదం పాకే ప్రమాదం ఉంటుంది.రాయపాటి ప్రసన్న తమ ఇంటిలోని 20X10 అడుగుల గదిలో మిల్కీ మష్రూమ్‌ సాగు చేస్తున్నారు. మూడు అడుగుల వెడల్పు, 10 అడుగుల పొడవుతో వెదురు గెడలతో రేక్స్‌ ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతోనే వెదురుగెడలతో రేక్స్‌ తయారు చేసుకోవచ్చు. తాను సాగుచేస్తున్న గదిలో 150 బెడ్స్‌ వరకు ఏర్పాటు చేశారు. ప్రతి బెడ్‌ నుంచి ప్రసన్న ఒక కిలో మిల్కీ మష్రూమ్‌ పంట దిగుబడి తీస్తున్నారు. 150 బెడ్స్ నుంచి ప్రతి రోజు తాను 3 నుంచి 4 కిలోల వరకు మష్రూమ్‌ పంట తీస్తున్నట్లు చెప్పారు. కిలో రూ. 300కు ప్రసన్న అమ్ముతారు. అంటే రోజుకు రూ.1000 నుంచి రూ. 1200 వరకు ఆదాయం వస్తుంది. తక్కువలో తక్కువ చూసుకున్నా ప్రసన్న నెలకు రూ.30 వేల ఆదాయం సంపాదిస్తున్నారు.ప్రసన్న 14X22 సైజ్‌ పాలిథిన్ కవర్లను ప్రసన్న వినియోగిస్తారు. ఒక్కో కవర్‌లో 200 గ్రాముల స్పాన్‌, 3 కిలోల ఎండుగడ్డి పడుతుందన్నారు. డార్క్‌ రూంలో బెడ్‌ ఫార్మ్‌ అయిన తర్వాత లైట్‌ రూంలోకి తీసుకొచ్చి పెడతారు. లైట్ రూంలో బెడ్స్‌ పెట్టిన తర్వాత 12 గంటల పాటు వెలుతురు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతిరోజూ రెండుసార్లు బెడ్స్‌కు నీరు ఇవ్వాల్సి ఉంటుంది. హ్యుమిడిటీ, ఉష్ణోగ్రత 32 నుంచి 35 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉండేలా చూసుకోవాలి. మష్రూం పంట సాగుచేయడమే కాకుండా మార్కెటింగ్ కూడా ప్రసన్న తాను చేసుకుంటున్నారు. ఈ పంట సాగుచేసేవారు సమీపంలో ఉండే రెస్టారెంట్లు, ఆర్గానిక్‌ స్టోర్స్‌ వద్ద ముందుగాను ఆర్డర్స్‌ తీసుకుంటారు. ప్రసన్న తాను పండించే మష్రూమ్స్‌ని 200 గ్రాముల చొప్పున ప్యాక్‌ చేసి, సప్లై చేస్తుంటారు. హెల్త్ బెనిఫిట్స్‌ ఎక్కువగా ఉన్నందున మిల్కీ మష్రూమ్స్‌కి డిమాండ్‌ కూడా బాగా ఉందని ప్రసన్న చెప్పారు.మిల్కీ మష్రూమ్స్‌ సాగును జాబ్ లేనివారు, గృహిణులు ఎవరైనా చేయవచ్చని ప్రసన్న అన్నారు. అయితే.. మష్రూమ్‌ కల్టివేషన్ ప్రారంభించే ముందే సమీపంలోని మష్రూమ్‌ శిక్షణా కేంద్రానికి వెళ్లి శిక్షణ తీసుకుంటే మంచిదన్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని మష్రూమ్‌ సాగులో దిగితే మేలు అన్నారు. క్వాలిటి మష్రూమ్‌ పంట తీసి.. మార్కెటింగ్ సరిగా చేసుకుంటే 150 బెడ్స్ నుంచి నెలకు సులువుగా రూ.30 నుంచి రూ.40 వేల వరకు ఆదాయం సంపాదించవచ్చని ప్రసన్న తెలిపారు.ఓవరాల్‌గా మష్రూమ్‌ తొలి క్రాప్‌ తీయడానికి 45 రోజుల సమయం పడుతుందని చెప్పారు. క్రాప్‌ సైకిల్ పూర్తవడానికి 60 రోజులు పడుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here