బారామాసీ మ్యాంగో.. అంటే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే మామిడిరకం. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రామ్‌ విలాస్‌ సింగ్‌ రూపొందించిన ‘ది గ్రేస్‌ ఆఫ్‌ గాడ్‌ నర్సరీ’లో బారామాసి మ్యాంగోతో పాటు పనస, నేరేడు, పీచ్‌ అంటే అత్తిపండు, కమలా, లిచీ, గ్రీన్‌ యాపిల్‌ లాంటి వెరైటీ పండ్లు విజయవంతంగా పండిస్తున్నారు. వాటితో పాటుగా బోగన్‌విల్లా, మోగ్రా, గులాబీ, శీతాకాలంలో పూచే రకరకాల పుష్పజాతులను ఆర్గానిక్‌ విధానంలో పెంచి, ఔత్సాహిక రైతులకు సరసమైన ధరల్లో అందిస్తుంటారు. ఇంకా రామ్‌ విలాస్‌ సింగ్‌ నర్సరీలో అశ్వగంధ, అజ్వైన్‌, బ్రాహ్మి, ఎనిమిది రకాల తులసి, దాల్చినచెక్క, ఓరెగానో లాంటి పలు రకాల ఔషధ మొక్కలను తయారు చేసి అందజేస్తుంటారు.రామ్‌విలాస్‌ సింగ్‌ తొలుత కర్నాల్‌లోనే ఉపాధ్యాయుడిగా 13 ఏళ్ల పాటు విద్యార్థులకు పాఠాలు బోధించారు. 2006లో భవన నిర్మాణ రంగం వేగం పుంజుకోవడంతో టీచర్‌ ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ రంగంలో అడుగుపెట్టారు. 2006 నుంచి 2020 వరకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అనేక భవనాలు నిర్మించారు. 2020లో కరోనా మహమ్మారి కారణంగా తాను ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని రామ్‌విలాస్ సింగ్‌ తెలిపారు. ఆ సమయంలో తాను టెర్రస్‌ గార్డెనింగ్‌ని హాబీగా మార్చుకునే అవకాశం వచ్చిందన్నారు. నిజానికి రామ్‌విలాస్‌ సింగ్‌కు టెర్రస్ గార్డెనింగ్‌ హాబీ 1997 నుంచీ మొదలైంది. అప్పుడు కేవలం 8 మొక్కలతో ప్రారంభమైన టెర్రస్ గార్డెనింగ్‌ క్రమ క్రమంగా మొక్కలను పెంచుతూ వచ్చినట్లు చెప్పారు. కోవిడ్‌ సమయంలో రామ్‌విలాస్‌ తన టెర్రస్‌ గార్డెన్‌ను బాగా విస్తరించారు. టెర్రస్‌పై పెంచుతున్న మొక్కలతో తాను ఉన్నప్పుడు ప్రకృతి చికిత్స అందిస్తున్నట్లు ఉండేదన్నారు. మొక్కలు మనకు ఫలాలు ఇస్తాయి. కూరగాయలు, పువ్వులు అంతకు మించి మనం బతికేందుకు అత్యంత ముఖ్యమైన ఆక్సిజన్‌ను కావాల్సినంత అందజేస్తాయి. వాతావరణంలో కలిసి ఉన్న కార్బన్‌ డై ఆక్సైడ్‌ను మొక్కలు తీసుకుని మనకు ఉపశమనం కలిగిస్తాయి.రామ్‌విలాస్ తన ది గ్రేస్ ఆఫ్ గాడ్‌ నర్సరీలో మొక్కలను ఆర్గానిక్ విధానంలోనే పెంచుతారు. నర్సరీలోని మొక్కలకు కావాల్సిన ఆర్గానిక్‌ ఎరువులు, పురుగుమందులను తమ క్షేత్రంలోనే స్వయంగా తయారు చేసుకుంటారు. అందు కోసం రామ్‌విలాస్ ఏడాదికి సరిపడినంత ఆర్గానిక్‌ ఎరువును ఎండిపోయి చెట్ల నుంచి రాలిపోయిన ఆకులతో తయారుచేస్తారు. ఇదే రామ్‌విలాస్‌ విజయానికి ప్రధాన కారణం అనిచెబుతారు. చెట్ల ఆకులు రాలే శరదృతువు సమయంలో ఆయన సుమారు 125 ట్రాలీల ఎండు ఆకులను సేకరిస్తారు. హర్యానా అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఇతర చోట్ల ఉండే చెట్ల నుంచి రామ్‌విలాస్ ఆకులు సేకరించి ఏడాదికి సరిపడా ఆర్గానిక్‌ ఎరువు తయారు చెస్తారు. చెట్ల ఆకులతో పాటు సహజసిద్ధంగా ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాష్‌తో పాటు ఇతర సూక్ష్మపోషకాలు లభించే అరటి ఆకులు, అరటి తొక్కలు, అరటి చెట్టు మొదళ్లను కూడా రామ్‌విలాస్‌ సేకరిస్తారు. చెట్ల ఆకులు, అరటి సంబంధ పదార్థాలను బాగా కుళ్లబెట్టి,  పోషకాలను బాగా గ్రహించేందుకు 88 రకాల బ్యాక్టీరియాలను కలుపుతారు. చెట్ల ఆకులు, అరటి ఆకులు, బ్యాక్టీరియాలు కలిపి, మొక్కలకు 98 శాతం పోషకాలు అందించేలా తయారు చేసిన ఆర్గానిక్‌ ఎరువును రామ్‌విలాస్‌ కిలో రూ. 40కి విక్రయిస్తారు. అలాగే.. 98 రకాల బ్యాక్టీరియాలు కలిపిన వేపనూనె, నీటిలో కలిసిపోయే వేపనూనె, గోమూత్రం, కుళ్లిపోయిన యాపిల్‌ పండ్ల గుజ్జుతో కలిపి బయో పెస్టిసైడ్‌ తయారుచేస్తారు. ఇలా తయారు చేసిన బయోపిస్టిసైడ్‌ మొక్కలను అనేక రకాల రోగాలు రాకుండా సహజసిద్ధంగా కాపాడుతుంది. ఈ బయో పెస్టిసైడ్‌ను లీటరు రూ.200 చొప్పున విక్రయిస్తానని రామ్‌విలాస్‌ తెలిపారు.ఆర్గానిక్‌ టెర్రస్ గార్డెనింగ్‌లో రామ్‌విలాస్‌కు ఆయన భార్య, కాలేజిలో చదువుతున్న ఇద్దరు కుమారులు కూడా చేదోడువాదోడుగా ఉంటారు. ఆర్గానిక్‌ మొక్కలు, ఎరువులు, పెస్టిసైడ్స్‌ అమ్మకాలతో పాటు ఆన్‌లైన్‌లో వచ్చే ఆర్డర్లను కుమారులు చూసుకుంటారు. రామ్‌విలాస్‌ భార్య తమకు వచ్చే ఆర్డర్లను పంపించడంతో పాటు వాట్సాప్ ద్వారా వచ్చే ప్రశ్నలకు స్పందిస్తారు.  రామ్‌విలాస్ ది గ్రేస్‌ ఆఫ్ గాడ్‌ నర్సరీలో కాల్షియం పౌడర్‌, వేపగింజలతో తయారుచేసిన నీమ్‌ కేక్‌, సీతాఫలం గింజలతో రూపొందించిన కేక్‌, స్టోన్ డస్ట్‌, ఐరన్‌ డస్ట్‌, వర్మీ కంపోస్ట్‌, ఆవు పేడతో తయారు చేసిన ఎరువు, వివిధ రకాల మొక్కలకు వినియోగించే పాటింగ్ మిక్స్‌ కూడా లభిస్తాయి.

రామ్‌విలాస్ నర్సరీలో పెంచిన ఔషధ మొక్కలకు రూ.50 నుంచి రూ. 300 ధర పలుకుతుంది. పుష్పజాతి మొక్కలను రూ. 150 నుంచి రూ.400 మధ్య విక్రయిస్తారు. ఔషధ మొక్కలను తమ నర్సరీలో కటింగ్‌ అండ్ రూటింగ్ విధానంలో తయారు చేస్తామని రామ్‌విలాస్ తెలిపారు. ఔషధ మొక్కలకు ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా మొక్ల వేళ్లకు అలోవెరా జెల్‌ పూస్తామని చెప్పారు. అయితే.. సీతాకాలంలో పువ్వులు పూసే మొక్కల్ని మాత్రం విత్తనం నాటి పెంచుతామన్నారు. సహజసిద్ధమైన ఎరువులు వాడడం వల్ల మొక్కలు త్వరగా పువ్వులు పూస్తాయని, పెద్దసైజులో పువ్వులు అత్యధికంగా వస్తాయని చెప్పారు. ప్రతి ఏటా 60 నుంచి 70 రకాలకు చెందిన 50 వేల మొక్కల దాకా తాము ప్రతి ఏటా విక్రయిస్తామని రామ్‌విలాస్ వెల్లడించారు. మొక్కల విక్రయం ద్వారానే తమకు నెలకు లక్షా 75 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఆదాయం వస్తుందన్నారు.తమ నర్సరీలో పెంచిన బారామాసీ మ్యాంగో మొక్కను పూత దశలో తీసుకుని పెంచుకుంటే మూడు నెలల నుంచే రుచికరమైన ఫలాలు అందిస్తుందని రామ్‌విలాస్ తెలిపారు. ఒక్కో బారామసీ మ్యాంగో మొక్కను తాము రూ.300కు అమ్ముతామన్నారు. ది గ్రేస్ ఆఫ్‌ గాడ్‌ నర్సరీలో విత్తనాల ద్వారా పెంచిన కాయగూరలు మొక్కలు, విత్తనాలు కూడా అందుబాటులో ఉంటాయి. తమ వద్ద లభించే కాయగూరల మొక్కల్లో 50 శాతం మొక్కలు అతి తక్కువ స్థలంలో కూడా చక్కని దిగుబడి ఇస్తాయన్నారు. కనీసం 5 అడుగుల బాల్కనీలో కూడా పెంచుకోవడానికి తమ వద్ద తీసుకునే కూరగాయల మొక్కలు అనువుగా ఉంటాయన్నారు. 10 అంగుళాల ప్లాస్టిక్‌ పైప్‌కు 10 నుంచి 15 రంధ్రాలు చేసి, దానిలో పోషకాలు కలిగి ఉన్న ఎరువు నింపి, దానికి నీరు పోసి, కూరగాయల మొక్కలు ఆ రంధ్రల్లో పెడతామని రామ్‌విలాస్‌ తెలిపారు. ఈ విధానంలో కాయగూరల మొక్కలు పెంచడం వల్ల ఎలాంటి ఇబ్బందీ ఉండదని, పైగా చిన్న చిన్న స్థలాల్లో కూడా పెంచేందుకు చాలా అనుకూలంగా ఉంటుంది.టెర్రస్ మీద నర్సరీ ప్రారంభించిన 2020లోనే రామ్‌విలాస్ సింగ్‌ యూట్యూబ్ చానల్ కూడా స్టార్ట్ చేశారు. గార్డెనింగ్‌లో, ఫ్లోరీకల్చర్‌, హార్టీకల్చర్‌లో తన అనుభవాలు, ఇతర విషయాలను యూట్యూబ్ చానల్ ద్వారా పంచుకుంటున్నారు. రామ్‌విలాస్ యూట్యూబ్ చానల్‌కు మంచి ఆదరణ లభించింది. రామ్‌విలాస్‌ చానల్‌కు 13 ఏళ్ల పిల్లల నుంచి 86 ఏళ్ల వృద్ధుల వరకు ఇప్పుడు 4.87 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. యూట్యూబ్ చానల్ ద్వారా గార్డెనింగ్‌లో శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. చానల్‌ వ్యూయర్స్ నుంచి గార్డెనింగ్‌కు సంబంధించి వచ్చే రకరకాల అనుమానాలు, సందేహాలకు దాని ద్వారా రామ్‌విలాస్‌ చక్కని సమాధానాలు, పరిష్కారాలు చెబుతుంటారు. యూటూబ్ చానల్‌ ద్వారా కూడా రామ్‌విలాస్‌ ఆర్గానిక్‌ మొక్కల వ్యాపారం బాగా వృద్ధిచెందింది. దేశం నలుమూలల నుంచి రామ్‌విలాస్‌ నుంచి మొక్కల కోసం ఆర్డర్లు భారీగానే వస్తున్నాయి. ది గ్రేస్ ఆఫ్ గాడ్‌ నర్సరీ కస్టమర్లు, యూట్యూబ్‌ సబ్‌స్క్రైబర్లకు రామ్‌విలాస్‌ ఉచితంగా సూచనలు, సలహాలు ఇస్తుంటారు. దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా తనకు ఫోన్ కాల్స్ వస్తాయని, గార్డెనింగ్‌కి సంబంధించి వారు అడిగే వివిధ రకాల ప్రశ్నలకు రామ్‌విలాస్ ఓపికగా సమాధానాలు చెబుతుంటారు. అయితే.. వారికి గైడెన్స్ ఇచ్చినందుకు ఎలాంటి రుసుము వసూలు చేయనని రామ్‌విలాస్ స్పష్టం చేశారు.

1 COMMENT

  1. A person essentially assist to make seriously articles I’d state. This is the very first time I frequented your website page and so far? I amazed with the analysis you made to create this particular put up extraordinary. Magnificent job!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here