ముఖేష్‌ మంజూ.. నేషనల్ సెక్యూరిటీ గార్డ్‌ విభాగంలో కమాండోగా పనిచేసి 2018లో వాలంటరీగా రిటైర్మెంట్‌ తీసుకున్నాడు. కౌంటర్‌ హైజాక్‌ ఆపరేషన్స్‌లో ముఖేష్‌ నిష్ణాతుడు. వృద్ధులైన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని, కుటుంబంతో కలిసి ఉండాలని వాలంటరీగా ఉద్యోగ బాధ్యతల నుంచి రిటైర్‌ అయ్యాడు. ముఖేష్‌ అభిప్రాయంలో రైతు అంటే చదువులేనివాడు, పేదరికంతో మగ్గిపోయేవాడు అనే పదాలకు నిర్వచనం కాదు. ముఖేష్‌ అభిప్రాయంలో రైతు అంటే సుసంపన్నుడు, మంచి విధానాల్లో వ్యవసాయం చేస్తూ.. మరే ఇతర వృత్తిదారులకైనా ఒక రోల్‌ మోడల్‌. సకాలంలో సరైన పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే అన్నదాత రైతన్న అంటాడు ముఖేష్‌ మంజూ. రైతు పట్ల ఈ సమాజంలో ఉన్న చిన్నచూపును తొలగించాలని, వ్యవసాయం లాభసాటి అని నిరూపించాలని నిర్ణయించుకోవడం కూడా ముఖేష్‌ వాలంటరీగా రిటైర్ తీసుకోవడానికి మరో కారణం. తన తాత తండ్రులు వ్యవసాయంలో చేస్తున్న కష్టాన్ని చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగాడు ముఖేష్‌.రాజస్థాన్‌లోని పిలానీలోని బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్‌ (బిట్స్ పిలానీకి కేవలం కిలోమీటర్‌ దూరంలో 20 ఎకరాల పొలంలో ఆర్గానిక్ విధానంలో ఖర్జూర, ఆలివ్‌, బత్తాయి, కిన్నో ఇతర అనేక ఫలజాతులను సమృద్ధిగా సాగుచేస్తున్నాడు. ఐదు ఎకరాల్లో ముఖేష్‌ ఖర్జూర పంట సాగుచేస్తున్నాడు. ముఖేష్‌ వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్‌ విధానంలో పండిస్తున్న తాజా ఫలాలను కొనుగోలు చేసేందుకు వందలాది మంది విద్యార్థులు, బిట్స్ పిలానీ అధ్యాపకులు తదితరులు వస్తుంటారు. ఎందుకంటే ముఖేష్‌ పండించే పండ్లలో ఎలాంటి రసాయన పదార్థాలు మచ్చుకు కూడా కనిపించవని వారంతా ఎగబడుతుంటారు.ఎన్‌ఎస్‌జీ నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ముందుగా ముఖేష్‌ జైసల్మేర్‌ జిల్లా సాగర-భోజ్కాలో ఉన్న సెంటర్‌ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ ఫర్ డేట్‌ పామ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఆ సమయంలో రాజస్థాన్ ప్రభుత్వం ఇజ్రాయేల్ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకుని ఖర్జూర మొక్కలను పంపిణీ చేస్తోంది. రూ.3,600 ఖరీదైన ఒక్కో మొక్కను కేవలం వెయ్యి రూపాయలకే ఔత్సాహిక రైతులకు అందిస్తోంది. ఆ క్రమంలో ముఖేష్‌ ఖునేజి రకానికి చెందిన 100 ఖర్జూర మొక్కలను కొనుగోలు చేసి, తమ వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ విధానంలో పెంచడం ప్రారంభించాడు. ఆ తర్వాత 2019లో 150 బర్హి రకం ఖర్చూర మొక్కలు కూడా క్షేత్రంలో నాటినట్లు చెప్పాడు. బర్హిరకం ఖర్జూర పండు పసుపు రంగులో ఉంటుంది. తియ్యగా క్రీమ్‌ రుచిలో ఉంటుంది. ఖునేజి రకం ఎరుపు రంగులో ఉంటుంది. ఈ రెండు రకాల ఖర్జూర పండ్లలోనూ పీచుపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఎకరం నేలలో ముఖేష్‌ 40 నుంచి 45 ఖర్జూర మొక్కలను నాటాడు. మొక్కలను 4 అడుగుల లోతు, వెడల్పు ఉన్న గొయ్యిలో పాతుకున్నాడు. ఎందుకంటే ఖర్జూర మొక్కల వేళ్లు భూమిలోపల చాలా లోతుగా చొచ్చుకుపోతాయి కనుక అంత లోతు, వెడల్పు గొయ్యి తవ్వడం అవసరం అంటాడు. దాంతో పాటు అంత లోతు, వెడల్పు ఉన్న గొయ్యిలో ఆర్గానిక్‌ ఎరువులు ఎక్కువ మొత్తంలో నింపడం వల్ల పంట దిగుబడి కూడా అంతే మొత్తంలో అధికంగా వస్తుందంటాడు ముఖేష్‌. ఖర్జూర మొక్కకు మొక్కకు మధ్య దూరం 25X25 అడుగుల దూరంలో పాతుకు సరిగా మెయింటెనెన్స్ చేస్తే.. నాలుగో ఏట నుంచి దిగుబడి ఇస్తుంది. ఆర్గానిక్ విధానంలో సాగుచేసిన బర్హి రకం ఒక్కో ఖర్జూర మొక్క నుంచి ఏడాదికి 150 నుంచి 200 కిలోల పంట వస్తుంది. ఒక కిలో ఖర్జూర పండ్లకు రూ.100 రూపాయల ధర పలుకుతుంది. ఒక్కో మొక్క నుంచి అతి తక్కువగా 150 కిలోల ఖర్జూర పండ్లు దిగుబడి వచ్చినా ఏటా రూ.15000 ఆదాయం తప్పకుండా వస్తుందని ముఖేష్‌ వివరించాడు.

బర్హి వెరైటీ ఖర్జూర సాగులో మెయింటెనెన్స్‌ చాలా తక్కువ ఉంటుంది. పంట దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది. ఒక్కో ఖర్జూర మొక్కకు ఆర్గానిక్‌ స్ప్రేలు, ఎరువులు, లేబర్‌ అన్నీ కలుపుకుని ఏడాదికి రూ.1,000 ఖర్చు అవుతుందని ముఖేష్‌ వెల్లడించాడు. ఒక్కో మొక్కకు ఈ కొద్దిపాటి పెట్టుబడితో ఎకరం ఖర్జూర తోట నుంచి ఏటా రూ.5 నుంచి రూ.6 లక్షల వరకూ లాభం వస్తుందన్నాడు. ఇక ఖునేజి రకం ఖర్జూరాలను ఒక్కో మొక్క నుంచి ఏటా 70 నుంచి 80 కిలోల దిగుబడి వస్తుందని, మార్కెట్లో కిలో రూ.100 ధర పలుకుతుందని చెప్పాడు. తద్వారా ఎకరం ఖునేజి ఖర్జూల సాగుతో ఏటా రూ.3.6 లక్షల ఆదాయం వస్తుందని తెలిపాడు.అతి తక్కువ ఖర్చుతో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టేది ఖర్జూర పంట సాగు అని, ఔత్సాహిక రైతులెవరైనా ఈ పంట పండించవచ్చని ముఖేష్‌ చెప్పాడు. బర్హి రకం ఖర్జూర చెట్లు ఎడారులు, ఉష్ణమండలాలు, ఉప ఉష్ణమండలాలు, మెడిటరేనియన్‌ వాతావరణాల్లో బాగా పెరుగుతుంది. బర్హి రకం ఖర్జ మొక్కలకు ప్రత్యేకించి ఇలాంటి నేల ఉండాలనేదీ ఉండదు. అయితే.. తేమను నిల్వచేసుకునే సామరథ్యం ఉండాలి. అలాగే సరైన నీటి పారుదల సౌకర్యం ఉంటే సరిపోతుంది. ఖర్జూర తోటలో అంతర పంటగా వాటర్ మిలన్‌ సాగు చేసుకోవచ్చు. ఖర్జూర మొక్కలకు ఇచ్చిన ఆర్గానిక్‌ ఎరువే వాటర్ మిలన్ మొక్కలకు సరిపోతుంది.

ముఖేష్ తన వ్యవసాయ క్షేత్రానికి అవసరమైన ఆర్గానిక్‌ ఎరువులు, క్రిమిసంహారకాలను స్వయంగా తయారు చేసుకుంటాడు. వర్మీ కంపోస్ట్ కూడా తన క్షేత్రంలోనే తయారు చేస్తాడు. ముఖేష్‌ క్షేత్రంలో ఆర్గానిక్‌ ఎరువులు, క్రిమిసంహారకాలు తయారు చేసేందుకు సాహివాల్‌, గిర్‌ జాతికి చెందిన 10 ఆవులను పెంచుతున్నాడు. ఖర్జూర మొక్కలకు వేసే ఆర్గానిక్‌ ఎరువులకు వేప ఆకులు కూడా కలుపుతాడు. సాగుచేసే నేలలో తగినంత వాయు ప్రసరణ కోసం వర్మీ కంపోస్ట్‌ వినియోగిస్తాడు. ఇందు కోసం ముఖేష్‌ ఒక్కో బెడ్‌లో 2 వేల కిలోల వర్మీ కంపోస్ట్‌ వచ్చేలా ఆరు బెడ్లను నిత్యం మెయింటెయిన్‌ చేస్తుంటాడు.ఖర్జూరపండు అంటేనే తియ్యదనానికి పెట్టింది పేరు. ఆ తియ్యదనానికి పక్షుల బెడద ఎక్కువగా ఉంటుంది. అందుకే పక్షుల నుంచి ఖర్జూర పండ్లను రక్షించేందుకు గెలలకు వలలు కడతాడు. ఖర్జూర సాగులో ముఖ్యంగా మాన్యువల్‌గా పాలినేషన్‌ చేయాలి. మాన్యువల్‌ పాలినేషన్ కోసం 100 ఫిమేల్‌ ఖర్జూర మొక్కలకు 6 మేల్‌ మొక్కలు అవసరం అవుతాయి. ఫిమేల్ మొక్కలకు ఫ్లవరింగ్‌ మొదలైన తర్వాత మేల్ మొక్కల పూత నుంచి పాలిన్‌ తీసుకుని ఆడమొక్కలపై స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఫిమేల్ మొక్కలకు పూత వచ్చే ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్య ఉదయం పూట మాత్రమే పాలినేషన్ చేయాలని ముఖేష్‌ వివరించాడు. జులై- ఆగస్టు నెలల్లో ఖర్జూరపంట చేతికి వస్తుందని అన్నాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఇచ్చే ఖర్జూర సాగు చేసుకుంటే రైతులకు మేలు అని ముఖేష్‌ సలహా ఇచ్చాడు.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here