ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు నెమరువేసే జీవాలని పిలుస్తారు. ముందుగా అవి మేత గబ గబా తినేసి, ఆ తర్వాత తీరికగా నెమరు వేయడం ద్వారా దాన్నుంచి పిండిపదార్థాలు లేదా శక్తిని, మాంసకృత్తులను, గ్లూకోజ్‌ను పొందుతాయి. వాటిలో మళ్లీ పాలు ఇచ్చే ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు కొందరు రైతులు వాటి ఆహారంగా నానబెట్టిన బియ్యం లేదా ఉడికించిన బియ్యాన్ని ఆహారంగా ఇస్తుంటారు. అయితే.. పాలిష్డ్ రైస్ పశువులకు మరీ ముఖ్యంగా పాలిచ్చే వాటికి పెట్టడం వల్ల ఉపయోగం లేకపోగా నష్టం ఉంటుందని పశు వైద్య నిపుణులు డాక్టర్ మదన్ కుమార్ హెచ్చరించారు. పశువులు తిన్న తర్వాత ఉబ్బే గుణం ఉన్న బియ్యం వల్ల వాటికి అజీర్తి చేయడం, పొట్ట ఉబ్బడం లాంటి ఇబ్బందులు తలెత్తుతాయని మదన్ కుమార్ చెప్పారు. అయితే.. బీయ్యాన్ని ఓ మోతాదు వరకు ఇవ్వొచ్చని, అవి కూడా ముందుగా వాటికి పచ్చిగడ్డి, ఎండుగడ్డి తిన్న తర్వాత తాను సూచించిన మోతాదులో మాత్రమే తెల్లబియ్యం ఇవ్వొచ్చని చెప్పారు.అదెలాగో చూద్దాం.. ఎలాంటి పోషకాలు లేని ఎండుగడ్డి లాంటి వాటిని తిని పోషకాలు, శక్తిని పొందే గుణం నెమరువేసే పశువులకు ఉంటుంది. అయితే.. పాలు ఇచ్చే పశువులకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి, పాల అధిక దిగుబడి కోసం, వాటి ఎదుగుదల, పునరుత్పత్తి కోసం సమతుల దాణా ఇవ్వాలన్నారు. పాలు ఇచ్చే ఆవులు, గేదెలయు రోజుకు 30 కిలో పచ్చిగడ్డి, 8 నుంచి 10 కిలోల ఎండుగడ్డి రెండు పూటలా సమానంగా ఇవ్వాలని మదన్‌కుమార్ తెలిపారు. ఆవు నుంచి ప్రతి 3 లీటర్ల పాలు కోసం కిలో దాణా, గేదెలకైతే 2 నుంచి 2.50 లీటర్ల పాల దిగుబడి కోసం కిలో దాణా ఇవ్వాలని చెప్పారు. ఏ పశువునైనా దాని శరీర బరువులో 3 శాతం పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ మేతగా ఇవ్వడం సహజసిద్ధమైన పద్ధతి. ఈ విధంగా పాడి పశువులకు మేత ఇస్తే మనం అనుకున్న దిగుబడి ఫలితాలు సాధించవచ్చు.
పాడిపశువులకు శక్తి ఇచ్చే దాణాలో ప్రతి 100 కేజీల్లో 30 శాతం దాన్యాలు లేదా చిరు ధాన్యాలు, 20 శాతం తవుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 50 పశువులకు శక్తిని ఇస్తాయి. పశువులకు ప్రోటీన్ అందించేందుకు నూనె గింజల చెక్క లేదా పత్తిచెక్క, వేరుసెనగ చెక్క లాంటి ఆయిల్ కేక్‌ను 20 శాతం, 30 శాతం పప్పు ధాన్యాలు పొట్టు ఇవ్వాల్సి ఉంటుంది. వాటికి అవసరాన్ని బట్టి మినరల్ మిక్సర్, 60 గ్రాముల ఉప్పు ప్రతిరోజూ ఇవ్వాలని డాక్టర్ మోహన్ కుమార్ వివరించారు.
పశువులకు 30 శాతం ఇచ్చే ధాన్యాలు, చిరుధాన్యాల విషయానికి వస్తే.. ఎక్కువగా 30 శాతం మొక్కజొన్నలు, బియ్యం, బార్లీ, ఓట్స్ వాడతారు. కోస్తా ప్రాంతంలో, రాయలసీమలో రైతులు సజ్జలు, జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు పెడుతున్నారని డాక్టర్ మోహన్‌కుమార్ తెలిపారు. కానీ పశువులకు పాలిష్డ్ బియ్యం ఆహారంగా ఇవ్వొచ్చని ఏ ఫార్ములాలోనూ లేదని చెప్పారు.
పశువులకు తెల్లబియ్యం ఎందుకు పెట్టొద్దనే దానిపై డాక్టర్ మోహన్‌కుమార్ వివరణ ఇచ్చారు. అధికంగా వరి పంట పండించే రైతులు మిగిలిపోయిన బియ్యాన్ని పశువులకు మేతగా ఇస్తే ఏంటనే ధోరణిలో ఉన్నారని అన్నారు. అయితే.. పాడి పశువులకు ఆహారంగా బియ్యం ఇవ్వాలంటే ఎంత మోతాదులో, ఏ రూపంలో ఇవ్వాలో అనే చాలా ముఖ్యమైన అంశం అని డాక్టర్ మోహన్ శాస్త్రీయంగా వివరించారు. నెమరువేసే పశువులు అంటే గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెల్లో సూక్ష్మజీవుల ద్వారా అరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి పీచు పదార్థం పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. పాలిష్డ్ బియ్యంలో చాలా తక్కువ పీచుపదార్థం ఉండి, కేవలం శక్తిని పిండిపదార్థం మాత్రమే ఉంటుంది. కనుక పశువుల్లో అరుగుదలకు సూటవ్వదని చెప్పారు. పశువులకు బియ్యం ఆహారంగా ఇవ్వాలనుకుంటే ధాన్యం రూపంలో ఇవ్వొచ్చంటారు. బియ్యంపైన ఉంటే పొట్టు లేదా ఊక 20 శాతం, తవుడు, బియ్యం కలిపి 80 శాతం ఉంటాయి. పశువులకు వడ్లను దాణాలో ఒక భాగం చేస్తే మంచిదన్నారు. తర్వాత ముడిబియ్యంలో పైన ఉండే పొట్టు తీసేస్తారు, లోపల ఉండే తవుడు అలాగే ఉంటుంది కాబట్టి వాడవచ్చంటారు.
తెల్లబియ్యం ఉడకబెట్టి పశువులకు అనేక మంది రైతులు ఇస్తుంటారు. ఉడకబెట్టిన బియ్యం తిన్న పశువుల కడుపు ఉబ్బిపోతుంది. దాంతో పశువుకు అవసరమైన పచ్చి లేదా ఎండుగడ్డిని తినలేవు. దాంతో పశువుకు పోషకాలు అందవు. పాలదిగుబడి తగ్గుతుంది. పశువుల ఎదుగుదల కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకే తెల్లబియ్యంను ఏ రూపంలో అయినా ఇవ్వొద్దని డాక్టర్ మోహన్ కుమార్ సలహా ఇచ్చారు. ఒకవేళ పశువుకు బియ్యం ఆహారంగా ఇవ్వాల్సి వస్తే ఏ మోతాదులో ఇవ్వాలో కూడా మోహన్‌కుమార్ వివరించారు. పాడి పశువుకు ధాన్యం కిలో చొప్పున ఉదయం, సాయంత్రం ఇవ్వొచ్చన్నారు. గొర్రెలు, మేకలకైతే ఉదయం సాయంత్రం 100 నుంచి 200 గ్రాములు పెట్టొచ్చు. ముడిబియ్యం అయితే.. ఉదయం అరకిలో, సాయంత్రం అరకిలో ఇవ్వొచ్చు. గొర్రెలు, మేకలకు ఉదయం, సాయంత్రం 50 గ్రాముల చొప్పున ఆహారంగా ఇవ్వొచ్చు. ఇక తెల్లబియ్యం అయితే.. పశువులకు ఉదయం పావుకిలో, సాయంత్రం పావుకిలో గొర్రెలు, మేకలకు ఉదయం, సాయంత్రం 25 గ్రాముల చొప్పునపెడితే ఏ సమస్యా ఉండదన్నారు. అయితే.. పశువులకు బియ్యం ఆహారంగా పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని డాక్టర్ మోహన్‌కుమార్ స్పష్టంగా చెప్పారు. అది కూడా పశువులు పచ్చిగడ్డి, ఎండుగడ్డి తిన్న తర్వాత మాత్రమే వడ్లు కానీ, బియ్యం కాని ఇవ్వాలన్నారు. దాణాలో మొక్కజొన్న బదులు బియ్యాన్ని కలుపుతానంటే డాక్టర్ మోహన్ ‘నో’ అని చెప్పారు.
పచ్చిగడ్డి, ఎండుగడ్డి తిన్న తర్వాత పశువుకు ధాన్యం గానీ, బియ్యం గానీ ఇస్తే పశువు కడుపులోని గడ్డితో కలిసిపోతుంది. పశువుకు కడుపు ఉబ్బడం లాంటి సమస్యలు ఉండవు. పోషకాలు కూడా మామూలుగానే అందుతాయన్నారు. అది కూడా పశువుకు బియ్యం గానీ, ధాన్యం గాని ఉడకబెట్టి గానీ, నానబెట్టి కూడా ఇవ్వొద్దని చెప్పారు. ఈ రెండు విధానాల్లోనూ బియ్యం, ధాన్యం పశువు కడుపులో ఉబ్బిపోయి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. బియ్యం వల్ల పాడి పశువులకు ఏ విధమైన లాభమూ లేదన్నారు. బియ్యం ఇస్తే పాల దిగుబడి పెరుగుతుందనో, జీవాలలో ఎదుగుదల ఉంటుందనో ఆశించి మాత్రం పశువులకు ఇవ్వొద్దన్నారు. పశువులకు ధాన్యం, బియ్యం ఊరికే ఇచ్చినట్లు అవుతుందని మోహన్‌కుమార్ చెప్పారు. పైగా పశువులకు చాలా కాలం పాటు బియ్యం ఇస్తే.. వాటిలో పునరుత్పత్తి సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు. క్రానిక్ ఎసిడిటీ సమస్య కూడా తలెత్తుతుందని హెచ్చరించారు.
ఒకవేళ రైతు తన పశువులకు ఉడకబెట్టిన అన్నం ఇవ్వాలనుకుంటే దాన్ని రెండు నుంచి మూడు రోజుల పాటు మజ్జిగనీళ్లలో పులియబెట్టి ఇస్తే అతి శ్రేష్టమైనదని డాక్టర్ మోహన్‌కుమార్ తెలిపారు. అందులో ఉండే మంచి బ్యాక్టీరియా అంతా పశువు కడుపులో ఆహారం అరుగుదలకు తోడ్పడుతుందని చెప్పారు. అందుకే పూర్వ రోజుల్లో రైతులు పశువులకు బియ్యం కడిగిన కుడితి, అన్నం తిన్న తర్వాత మిగిలిందంతా కుండలో పోసి, పులియబెట్టి ఇచ్చేవారని గుర్తుచేశారు. పులియబెట్టినప్పుడు మంచి బ్యాక్టీరియా లాక్టో బాసిల్లస్ పశువు కడుపులో అరుగుదల పెంచేదన్నారు. డాక్టర్ మోహన్ చెప్పిన క్వాంటిటీలో బియ్యం, అన్నం పులియబెట్టి ఇస్తే పరవాలేదు. ఇన్ని కష్టాలు, నష్టాలు పడుతూ పశువులకైనా, పాడి పశువులకైనా ముడిబియ్యం ఎందుకు ఇవ్వాలని డాక్టర్ మోహన్ కుమార్ ప్రశ్నించారు. పాలిష్డ్ బియ్యం అస్సలు ఇవ్వొద్దనే సలహా ఇచ్చారు.