తండ్రి పశువుల వ్యాపారి. కూతురు ఫిజిక్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. తల్లి గృహిణి. కొడుకు చిన్నవాడు. ఇదీ శ్రద్ధా ధావన్‌ కుటుంబ. శ్రద్ధ తండ్రి సత్యవాన్ గేదెలను కొని అమ్మే వ్యాపారి. అలా సత్యవాన్ నెలకు రూ.30 నుంచి 40 వేల ఆదాయం సంపాదించేవాడు. శ్రద్ద చిన్నప్పటి నుండే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. శ్రద్ధకు 11 ఏళ్ల వయస్సు వచ్చినప్పటి నుంచి తమ వినియోగానికి మించి ఉన్న గేదె పాలను సమీపంలో పాల కేంద్రాలకు సరఫరా చేసేది. ఇందు కోసం శ్రద్ధ సైకిల్‌ నేర్చుకుంది. ఉదయంపూల కేంద్రాలకు పాలు సరఫరా చేస్తూనే సమయానికి స్కూలుకు వెళ్లేది. స్కూలు నుంచి వచ్చిన తర్వాత మిగతా పనులు చేసేది. ఇలా రోజంతా చదువు, ఇంటి పనితో బిజీగా ఉంటూనే శ్రద్ధా ధావన్‌ ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ చేసింది. ఇప్పుడామే తన తండ్రి గేదెల వ్యాపారాన్ని పాల వ్యాపారంగా మార్చి కోటి రూపాయల టర్నోవర్‌కు తీసుకొచ్చింది.గ్రామీణ పారిశ్రామికవేత్తగా తాను ఎదగడం వెనుక చిన్నప్పటి నుంచి చేసిన కృషే కారణం అని శ్రద్ధ చెబుతుంది మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా నిగోజ్‌ గ్రామానికి చెందిన శ్రద్ధా ధావన్‌. తమ వద్ద ఎప్పుడూ ఉండే రెండు గేదెల నుంచి 80 గేదెలకు పెంచింది. ప్రతిరోజు 350 లీటర్ల పాలు విక్రయిస్తోంది. దాంతో పాటు డెయిరీ ఫార్మ్‌లో వర్మీ కంపోస్టు తయారు చేసి అమ్మడం ద్వారా నెలకు రూ.2.40 లక్షల ఆదాయం సంపాదిస్తోంది. అహ్మద్‌నగర్‌లో ‘శ్రద్ధా ఫార్మ్స్‌’ పేరిట డెయిరీ ఫార్మ్‌ నిర్వహిస్తూ నలుగురికి స్ఫూర్తిగా నిలిచింది.చిన్నప్పటి నుంచీ పాల కేంద్రాలకు పాలు సరఫరా చేస్తూనే గేదెల వ్యాపంలో మెళకువలను శ్రద్ధా తన తండ్రి సత్యవాన్ నుంచి అడిగి తెలుసుకునేది. గేదెల వ్యాపారానికి సంబంధించి తన తండ్రిని తాను ఎన్నో ప్రశ్నలు వేసిదాన్నని శ్రద్ధ చెప్పింది. గేదెల వ్యాపారంలో బేరసారాల తీరు గురించి సత్యవాన్‌ తన కుమార్తెకు చెబుతుండేవాడు. అలా శ్రద్ధకు 13 నుంచి 14 ఏళ్లు వచ్చే సరికే గేదె వ్యాపారం గురించి, పాడి గేదెలు, పాల సరఫరా వరకు అనేక విషయాలపై శ్రద్ధ అవగాహన పెంచుకుంది.

ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ పూర్తి చేసిన తర్వాత శ్రద్ధ పూర్తిస్థాయి గ్రామీణ వ్యాపారవేత్తగా అవతారం ఎత్తింది. తొలుత తమకు ఉన్న రెండు గేదెలను పెరట్లోని చెట్ల కింద కట్టి ఉంచేవారు. తాను వ్యాపారంలోకి దిగిన అనంతరం శ్రద్ధ వాటిని 22 గేదెలకు, 2017లో 30కు పెంచింది. ప్రస్తుతం 80 గేదెలకు పెంచింది. గేదెల కోసం రెండు అంతస్థుల షెడ్‌ కూడా నిర్మించింది. అయితే.. పశువుల కొట్టంలో పనిచేసేందుకు పనివారిని పెట్టుకోలేదు. తెల్లవారుజామున 4 గంటలకు శ్రద్ధ లేచి, గేదెల పాలు పిండి, సమీపంలోని డెయిరీలకు పోసేది. ఆ తర్వాత కాలేజికి వెళ్లేది. కాలేజి నుంచి వచ్చిన తర్వాత డెయిరీ ఫామ్‌లో మిగతా పని చేసేది. పని వత్తిడి వల్ల శ్రద్ధకు పెళ్లిళ్లు, ఫంక్షన్లకు వెళ్లే సమయం ఉండేది కాదు. సమయం ఉండేది కాదనే కంటే వాటిని శ్రద్ధ స్వయంగా వదిలిపెట్టిందనే చెప్పాలి. పాలు సరఫరా చేయడం కోసం ముందుగా సైకిల్ నేర్చుకున్న శ్రద్ధ వ్యాపారం పెరిగేసరికి కారు, టెంపో కూడా నడుపుతోంది.తండ్రి గేదెల వ్యాపారాన్ని డెయిరీ ఫార్మ్‌గా అభివృద్ది చేసేందుకు శ్రద్ధా ధావన్‌ ఒక్క రూపాయి కూడా రుణం తీసుకోలేదు. 2017లో తమ ఫార్మ్‌లో ఉన్న 30 గేదెలతో నెలకు రూ.3 లక్షల వరకు ఆదాయం కళ్లచూసేది. ఖర్చులు పోగా కొంత లాభం ఉండేది. లాభాలు ఎలా పెంచాలో అప్పట్లో తనకు అంతగా తెలిసేది కాదని శ్రద్ద నిజాయితీగా చెప్పింది. లాభాలు పెంచాలనే ఆలోచన వచ్చినప్పటి నుంచీ తాను పాల నాణ్యత పెంచడం దృష్టి సారించానని పేర్కొంది. పాల ధర ఫ్యాట్ శాతాన్ని బట్టి ఉంటుంది. 6 శాతం కన్నా గేదెపాలలో వెన్న శాతం ఉంటే ఆవు పాల కన్నా తక్కువ ధర వస్తుంది. గేదెలకు బలవర్ధకమైన ఆహారం అందించడం ద్వారా పాలలో వెన్నశాతం పెంచవచ్చని తెలుసుకున్న శ్రద్ధ ఆ దిశగా అడుగులు వేసింది. లాభాలు పెంచేందుకు ముందుగా ఖర్చులు తగ్గించింది. పశువుల దాణా ఎప్పుడు తక్కువ ధరకు లభిస్తే అప్పుడు ఖరీదు చేసి నిల్వపెట్టేది. దాంతో పాటుగా అవసరాల కోసం అత్యవసరంగా ఎవరైనా రైతులు తమ గేదెలను తక్కువ ధరకు అమ్మినప్పుడు వాటిని కొనుగోలు చేసేది. అలా శ్రద్ధ తమ డెయిరీ ఫాంలో ఖర్చు తగ్గిస్తూనే పాల ఉత్పత్తి కూడా పెరిగేలా చూసుకుంది. దాంతో పాలలో వెన్నశాతం అధికంగా ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది.ఇక తమ ఫార్మ్‌లో వర్మీ కంపోస్టు తయారు చేయడం మూడేళ్ల నుంచి మొదలు పెట్టింది. వానపాములు, కుళ్లిన ఆహార పదార్థాలతో వర్మీకంపోస్ట్‌ ఎరువు తయారు చేసే వ్యాపారం ప్రారంభించింది. తమ డెయిరీ ఫార్మ్‌లోని గేదెల పేడతలో 32 బెడ్లతో వర్మీ కంపోస్ట్‌ తయారు చేస్తోంది. తామ ఫార్మ్‌లో తయారు చేసిన వర్మీకంపోస్ట్‌ ఎరువును కిలో రూ.8 చొప్పున రైతులకు విక్రయిస్తోంది. దాంతో పాటు శ్రద్ధా ధావన్‌ కరెంట్ ఖర్చులు తగ్గించుకునేందుకు ఫార్మ్‌లో ఒక బయోగ్యాస్ ప్లాంట్‌ ఏర్పాటు చేసింది. డెయిరీ ఫార్మ్‌లోని గేదెల మూత్రం, వృథా నీటితో తమకు కావలసిన విద్యుత్‌ తయారు చేసుకుంటోంది. తద్వారా కరెంట్ బిల్లు కట్టే పనిలేకుండా నెలకు రూ.10 వేలు ఆదా చేస్తోంది.డెయిరీ ఫార్మ్‌లో తాను గడించిన అనుభవాలు, కీలక విషయాల గురించి ఇతర రైతులకు అవగాహన, చైతన్యం కలిగించేందుకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది శ్రద్ధ. రెండు రోజులు ఇచ్చే శిక్షణలో గేదెల వ్యాపారం, పాడి పారిశ్రమ, గేదెలకు దాణా విషయాలు, వర్మీ కంపోస్ట్‌ తయారీ, బయోగ్యాస్, విద్యుత్ ఉత్పత్తిపై చక్కని శిక్షణ ఇస్తోంది. ఇలా ఒక ఏడాదిలో శ్రద్ధ కోటి రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తోంది. పాల అమ్మకం ద్వారా 60 శాతం ఆదాయం వస్తుంటే.. మిగతా ఆదాయం వర్మీ కంపోస్ట్‌ విక్రయం ద్వారా సంపాదిస్తోంది.

శ్రద్ధా ధావన్‌ సక్సెస్ స్టోరీ ఇతర పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here