మంచి మొక్కను ఎంపికచేసుకోవడం దగ్గర నుంచి వాటర్ మేనేజ్మెంట్, డిసీజ్ మేనేజ్మెంట్, పెస్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, మరీ ముఖ్యంగా కలుపు నివారణ మేనేజ్మెంట్ సరిగా చేస్తే ఆర్కసవి గులాబీ అధిక లాభాలు అందిస్తుంది. గులాబీ తోటలో కలుపు నివారణకు ప్రధానంగా ఒకసారి వీడ్ మేట్స్ వేసుకుంటే ఐదేళ్ల వరకు అవి పనిచేస్తాయి. కలుపు నివారిస్తే.. ఆర్కసవి గులాబీ సాగులో 60 శాతం విజయం సాధించినట్లే అని తమిళనాడులోని హోసూర్ రైతు మంజునాథ్ చెప్పారు. ఆర్కసవి గులాబీ దిగుబడిపై రైతులు అపోహలు పెట్టుకోవద్దని, సాగు మేనేజ్మెంట్ సరిగా చేసుకుంటే.. ఎకరం గులాబీ తోటలో 30 టన్నుల దిగుబడి కచ్చితంగా వస్తుందని మంజునాథ్ అన్నారు.ఆర్కసవి గులాబీ సాగు మంచి మొక్కల ఎంపిక నుంచే సక్సెస్ మొదలవుతుందని మంజునాథ్ చెప్పారు. మంచి దిగుబడి సాధించాలంటే.. నాణ్యమైన మొక్కలు తీసుకోవడం మొదటి మెట్టు అన్నారు. ప్రతి ఆరోగ్యవంతమైన ఆర్కసవి గులాబీ మొక్కకు కనీసం 250 గ్రాముల మొగ్గలు ఉంటాయన్నారు. ఎకరాకు 30 టన్నులు దిగుబడి వస్తుందన్నారు. అయితే.. రైతు కనీసం 10 టన్నుల కష్టమైనా పడాలి కదా? అంటారు మంజునాథ్. మంచి మొక్క నాటి.. సాగు మేనేజ్మెంట్ సరిగా చేయకుండా దిగుబడి రాలేదనడం సరికాన్నారు. హోసూర్ ప్రాంతంలో మంజునాథ్ 12 ఎకరాల్లో ఆర్కసవి గులాబీ సాగు విజయవంతంగా చేస్తున్నారు.ఆర్కసవి గులాబీ ఆకు చాలా వెడల్పుగా ఉంటుంది. మిగతా గులాబీ రకాల కన్నా దీని ఆకు పెద్దగా ఉంటుంది. మొక్క నాటిన తర్వాత రైతులు వేరు వ్యవస్థ, ఆకు వ్యవస్థపై ఎక్కువగా దృష్టిసారించాలి. ఈ రెండు వ్యవస్థల్ని సరిగా చూసుకుంటే దిగుబడి కచ్చితంగా ఆశించిన విధంగా వస్తుంది. అయితే.. గులాబీ మొక్కకు కావాల్సినంత బలాన్నిచ్చే ఎరువు వేసినా, కలుపు ఉంటే కష్టం మిగులుతుంది. మనం ఇచ్చే బలంలో 95 శాతం కలుపుమొక్కలు లాక్కుంటాయి. ఐదు శాతం మాత్రమే గులాబీ మొక్కకు అందుతుంది.ఆర్కసవి గులాబీ మొక్క నాటిన ఐదు నుంచి ఆరు నెలల్లో పువ్వులు పూస్తాయి. ఏడాది వరకు ఎకరం గులాబీ తోటలో 5 నుంచి 12 టన్నుల దిగుబడి మాత్రమే ఆశించవచ్చు. రెండో ఏడాది నుంచి 12 నుంచి 20 టన్నుల మధ్యలో దిగుబడి ఉంటుంది. ఆర్కసవి గులాబీలో మూడో ఏట నుంచి దిగుబడి బాగా ఎక్కువగా వస్తుంది. మొక్క వయస్సు పెరిగేకొద్దీ దిగుబడి ఎక్కువ అవుతుంది. ఒక ఆర్కసవి గులాబీ మొక్కకు కిలో ఆవుపేడ వేస్తే.. 5 నుంచి 6 కిలోల వరకు దిగుబడిని ఇస్తంది. మొక్కకు మనం ఇచ్చే బలం పరిమాణంపైన కూడా దాని దిగుబడి ఆధారపడి ఉంటుంది.ఆర్కసవి గులాబీ మొక్కకు ప్రతిరోజూ 5 నుంచి 7 లీటర్ల నీటిని తప్పకుండా సరఫరా చేయాలి. నీటి సరిగా ఇవ్వకపోతే.. గులాబీ మొగ్గ విచ్చుకోవడం, సరైన షేప్ రావడం కష్టం అవుతుంది. వర్షం పడినప్పుడు నీటి సరఫరా చేయకపోయినా పరవాలేదు. ఇక డిసీజ్, పెస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే.. వర్షాకాలంలో డౌనీ మిల్యూడ్యు, చలికాలంలో పౌడరీ మిల్యూడ్యు వస్తుంది. దీంతో ఆర్కసవి మొక్క వత్తిడికి గురై ఆకులు రాలిపోతాయి. క్రమపద్ధతిలో మనం ఫంగస్ మేనేజ్మెంట్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది రాదు. ఆర్కసవి గులాబీకి ఇతర రోగాలేవీ పెద్దగా ఉండవని మంజునాథ్ వివరించారు. వేసవి కాలంలో అయితే.. త్రిప్స్, మైట్స్ ఇబ్బంది వస్తుంది. త్రిప్స్ వచ్చినప్పుడు మొక్క మీద పురుగుమందు స్ప్రే చేయాలని రైతులు అపోహ పడుతుంటారు. ఆ ఆలోచన పూర్తిగా తప్పు అంటారు మంజునాథ్. త్రిప్స్ గుడ్లు నేలమీద ఉంటాయి. పురుగుమందు కొట్టినప్పుడు త్రిప్స్ నేల మీదకు దిగిపోయి, గుడ్లు పెట్టి సంతానాన్ని పెంచుకుంటాయని, అవి మళ్లీ మొక్క మీద దాడి చేస్తాయన్నారు. త్రిప్స్ దాడి నుంచి గులాబీ మొక్కను రక్షించేందకు బవేరియా బాసియానా, నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలన్నారు. పౌర్ణమికి, అమావాస్యకు ముందు రోజు త్రిప్స్, మైట్స్ గుడ్లు పెడతాయి. అందుకే పౌర్ణమి, అమావాస్యకు ఒకటి రెండు రోజుల ముందు బవేరియా బాసియానా, నీమ్ ఆయిల్ బాగా కలిపి గులాబీతోటలో నేలమీద స్ప్రే చేస్తే త్రిప్స్, మైట్స్ వృద్ధిని నివారించవచ్చు.పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నిక్స్ విషయం చూద్దాం.. ఆర్కసవి గులాబీ మొక్క నుంచి పువ్వును తెంపిన తర్వాత రూం టెంపరేచర్లో పెడితే ఐదు నుంచి ఏడు రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది. సాంకేతికంగా, శాస్త్రీయంగా రూపొందించిన కొన్ని స్ప్రేలు వినియోగిస్తే.. 30 నుంచి 32 రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు. గులాబీ పువ్వులను చక్కగా ప్యాకింగ్ చేయడం, క్రేట్లలో జాగ్రత్తగా పెట్టి మార్కెట్కు పంపితే మంచి ధర పలుకుతుందని మంజునాథ్ వివరించారు. గులాబీ పువ్వులు మంచి షేప్లో, చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటేనే వినియోగదారులు ధర ఎక్కువకైనా కొంటారు. మార్కెట్కు గులాబీలను పంపించేటపుడు చాలా మంది రైతులు సంచుల్లో కూరేస్తారు. అంటే రైతు తాను పండించిన గులాబీపువ్వు క్వాలిటీని తానే పాడుచేస్తున్నాడని చెప్పాలి. ఆర్కసవి గులాబీ ప్రీమియం క్వాలిటి. దాని ప్యాకింగ్ కూడా అదే స్థాయిలో చేస్తేనే ధర ఎక్కువ వస్తుంది. ఆర్కసవి గులాబీలను ఏడాది పొడవునా తాము చెన్నై, కోయంబత్తూరు, మదురై హోల్సేల్ మార్కెట్లకు కిలో రూ.160 చొప్పున విక్రయిస్తామని మంజునాథ్ తెలిపారు.రోజా ఇండియా రూట్ స్టాక్ తో బడ్డింగ్ చేసిన ఆర్కసవి గులాబీ మొక్కల నుంచి దిగుబడి బాగా వస్తుందని మంజునాథ్ చెప్పారు. వేరే రూట్ స్టాక్ తో చేసిన బడ్డింగ్ లో మ్యుటేషన్ జరిగితే దిగుబడి సరిగా లేదని తమ పరిశీలనలో తేలిందన్నారు. మంజునాథ్ నర్సరీలో ఒక్కో ఆర్కసవి గులాబీ మొక్క రూ.60కి లభిస్తుంది. ఎకరం నేలలో 2,500 ఆర్కసవి గులాబీ మొక్కలు నాటుకోవాలన్నారు. మొక్కకు మొక్కకు 3 అడుగులు, వరసకు వరసకు 6 అడుగుల దూరంలో ఆర్కసవి గులాబీ మొక్కలు పెట్టాలని చెప్పారు.ఆర్కసవి గులాబీ మొక్కకు ప్రతి సంవత్సరం ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. గులాబీమొక్క ప్రతి ఆకు కింద ఒక నాట్ ఉంటుంది. ఆ నాట్ను జాగ్రత్తగా చూసి కత్తిరించుకోవాలి. బాగా బలంగా ఉన్న గులాబీ కొమ్మ నుంచి పువ్వు రాదు, కాపు రాదని మంజునాథ్ తెలిపారు. పైగా మొక్కకు బలం కోసం ఇచ్చే ఆహారాన్ని ఆ కొమ్మలే ఎక్కువగా తీసుకుంటాయి. ఇలాంటి కొమ్మలను కత్తిరించేయాలి. అప్పుడే కొత్తగా వచ్చిన కొమ్మకు గులాబీ మొగ్గలు ఎక్కువగా వస్తాయి. మొక్క నాటిన 14 నుంచి 16 నెలల మధ్యలో ప్రూనింగ్ గురించి ఆలోచించకూడదని మంజునాథ్ హెచ్చరించారు. ప్రూనింగ్ ఇష్టం వచ్చినట్లు ఎలాబడితే అలా చేయకూడదన్నారు. అనుభవం ఉన్నవారితోనే ప్రూనింగ్ చేయించాలన్నారు.మొక్క నాటిన మూడేళ్లకు కొందరు రైతులు హార్డ్ ప్రూనింగ్ చేస్తుంటారు. అంటే గులాబీమొక్క మొదలు వరకు భూమి పైబాగంలో మొత్తం కత్తిరిస్తారు. తర్వాత మొదలు పైనుంచి మళ్లీ చిగుళ్లు మొలుస్తాయి. అయితే.. హార్డ్ ప్రూనింగ్ వేసవి కాలంలో, ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చేస్తే మొక్క చచ్చిపోతుంది. విపరీతమైన వర్షాలు ఉన్నప్పుడు ప్రూనింగ్ చేస్తే.. ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆర్కసవిలో హార్డ్ ప్రూనింగ్ కంటే థిన్ ప్రూనింగ్ చేయడమే మేలు అంటారు మంజునాథ్.ఆర్కసవి గులాబీ మొక్కలకు ప్రతి ఏటా రెండు సార్లు ఆవుపేడ గాని, వ్యవసాయ ఎరువులు గాని వేసుకోవాలి. ప్రతి మొక్కకు 15 రోజులకు ఒకసారి ఐదు నుంచి 8 గ్రాముల మధ్య డీఏపీ గాని, యూరియా గాని ఇస్తామని మంజునాథ్ తెలిపారు. డిసీజ్లు, పురుగు, కలుపు రాకుండా చూసుకుని, వాటర్ మేనేజ్మెంట్ సరిగా చేస్తే.. ఆర్కసవి 365 రోజులూ చక్కని దిగుబడి ఇస్తుంది. మేనేజ్మెంట్ సరిగా చేస్తే.. ఎంత ఎండ కాసినా, ఏ సీజన్ అయినా.. మంచి దిగుబడి వస్తుంది. ఊటీ, కొడైకెనాల్ లాంటి చల్లని ప్రాంతాల్లోనూ, నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లోనూ, రామగుండం, ఖమ్మం, అనంతపురం లాంటి ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతాల్లో కూడా ఆర్కసవి గులాబీ విజయవంతంగా సాగతువుతోంది. వేసవిలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉండే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా రైతులు ఆర్కసవి సాగు చేస్తున్నారు.గులాబీ సాగులో అత్యుత్తమ పరిజ్ఞానం అందించేందుకు, సమాచారం ఇచ్చేందుకు బెంగళూరులోని హెసర్గట్టలో ఉన్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హార్టీకల్చర్ రీసెర్చ్ సెంటర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో మంజునాథ్ ఆర్కసవి గులాబీ బ్రాంచ్ ఉంది. రైతు పృథ్వి వద్ద నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉంటాయి.ఆర్కసవి గులాబీ సాగుకు పూర్తి చౌడు నేలలు, పూర్తి బంకమట్టి నేలలు పనికిరావు. మరే ఇతర భూముల్లో ఆర్కసవి సాగు చేయవచ్చు. మేనేజ్మెంట్ పద్ధతులు తప్పకుండా పాటిస్తే.. ఆర్కసవి గులాబీ సాగులో మనం ఆశించిన స్థాయి కన్నా ఎక్కువు దిగుబడి వస్తుంది.

ఆర్కసవి గులాబీ సాగు చేయాలనుకునేవారు మొక్కలు, సాగు కోసం మరింత సమాచారం కావాలంటే రైతు మంజునాథ్ను 9459418999, 9459408999 నెంబర్లలో సంప్రదించవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here